top of page
Original.png

అశ్వత్థాగ్ని

5 hours ago
4 min read

అశ్వత్థాగ్ని తెలుగు కథలో అడవిలో రాతిపై కూర్చున్న రాజకుమారుడు, వృద్ధ సాధువు మరియు పులి రహస్యాన్ని ప్రతిబింబించే దృశ్యం

Aswathagni - Telugu Devotional Story | Bhattu Venkata Rao

అశ్వత్థాగ్ని - తెలుగు ఆధ్యాత్మిక కథ | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 19/10/2026


“అశ్వత్థాగ్ని” భట్టు వెంకటరావు రచించిన ఉత్కంఠభరితమైన తెలుగు జానపద సాహసకథ. మనిషిలో దాగి ఉన్న అంతర్గత శక్తి, ధైర్యం, సంకల్పం, వృద్ధ సాధువు వెనుక ఉన్న అద్భుత రహస్యం ఈ కథలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.


(1)


అశ్వత్థ వృక్షంలో అగ్ని దాగి ఉంటుందని పెద్దలు చెబుతారు కదా; నిజానికి అశ్వత్థ వృక్షం అనే కాదు, ఏ వృక్షంలోనైనా — అశ్వత్థ వృక్షంలో దాగి ఉన్నంత పరిమాణంలో కాకపోయినా — ఎంతో కొంత పరిమాణంలో అగ్ని దాగి ఉంటుంది.


అది ప్రకృతి ధర్మం. అయితే, అలా దాగి ఉండే అగ్ని ప్రత్యక్షంగా కంటికి కనపడదు. చెట్టులో అగ్ని దాగి ఉందని గొడ్డలితో నరికి చూస్తే లోపల దాగి ఉన్న అగ్ని కనపడుతుందా? కనపడదు. దేన్నయినా ఎలా చూడాలో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో చూస్తేనే కనపడుతుంది. చెట్టులో ఉండే అగ్ని కూడా అటువంటిదే. ప్రతి చెట్టులోనూ అగ్ని ఉంటుందన్నది కాదనలేని నిజం.


అలాగే ప్రతి మనిషిలోనూ ఒక జ్వాల ఉంటుంది. చెట్టులో అగ్ని వలెనే చూడడానికి కనిపించే జ్వాల కాదది. మనిషి మాట్లాడే మాటలలోను, చేసే చేతలలోను కనపడుతుంది ఆ జ్వాల. అసలు తమ లోపల ఉన్నట్లుగానే తెలియదు ఆ జ్వాల కొందరికి.


అది వాళ్ల తప్పు కాదు. మనుషులలో ఉండే జ్వాల నైజమే అంత. అదేపనిగా మండదు ఆ జ్వాల. గుప్తంగా ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు భగ్గున మండుతుంది. ఆ అవసరం ఎప్పుడు వస్తుంది? అన్నది ఒక్కొక్కరి జీవితం మీద, జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది.


(2)


"చీకటి పడుతోంది. అలిసిపోయి ఉన్నాం. ఇంక ముందుకు ప్రయాణించలేం. ఇక్కడే పలకల్లా చదునుగా పరుచుకుని ఉన్న ఈ పెద్ద బండరాళ్లపై ఈ రాత్రికి విశ్రమిద్దాం. ఈ ప్రదేశానికి దగ్గరలోనే అడవి ఉంది కాబట్టి ఇద్దరమూ ఒకేసారి నిద్రపోలేం. ఆదమరచి కూడా నిద్రపోలేం.


కొంతసేపు నేను, కొంతసేపు నీవు, వంతులు వేసుకుని ఈ రాత్రంతా మేల్కొని గడపాల్సిందే. తెల్లవారి లేచి మళ్లీ ప్రయాణం కొనసాగిద్దాం. ముందు నేను మేల్కొంటాను. నాకు నిద్ర ముంచుకు రాగానే నిన్ను లేపుతాను. ప్రస్తుతానికి నీవు విశ్రమించు!"


వారిద్దరిలో ఒకరు రాజకుమారుడు, మరొకరు మంత్రికుమారుడు. ఇరువురూ మంచి మిత్రులు.


రాజకుమారుడి ఆలోచన మంత్రికుమారుడికి బాగా నచ్చింది. రాజకుమారుడి కోరిక మేరకు మొదట మంత్రికుమారుడు విశ్రమించాడు.


రాజకుమారుడు మేల్కొని ఉన్నాడు. ఆలోచనలు కర్తవ్యం వైపుకు మళ్లాయి. రేపు సాయంత్రానికి రాజధాని నగరంలో ప్రవేశించాలి. తాను లేకుండా చూసి, పరరాజుల ప్రలోభాలకు లోబడి, వాళ్లతో చేతులు కలిపి సేనాపతి పన్నిన కుతంత్రాన్ని సాగకుండా చేయాలి.


తల్లిదండ్రులను బంధవిముక్తులను చేయాలి. రాజ్యం పరహస్తగతం కాకుండా కాపాడుకోవాలి. అది తలచుకోగానే రాజకుమారుడి అంతరంగం ఆవేశంతో నిండిపోయింది. కంటికి కనుపించని జ్వాల అతడి శరీరంలో మండసాగింది.


కొంతసేపు గడిచింది. చీకటి చుట్టూ దట్టంగా కమ్ముకుంది. రాజకుమారుడు అప్రమత్తంగా ఉన్నాడు. పక్కన మంత్రికుమారుడు గాఢనిద్రలోకి జారుకున్నాడు. రాజకుమారుడి కళ్లు చీకటికి అలవాటుపడిపోయాయి. చుట్టుపక్కల ఏమి జరుగుతున్నదీ అతడికి స్పష్టంగానే కనపడసాగింది.


మరికొంత సమయం గడిచింది. కొంతదూరంలో… నేలపై రాలిపడి ఉన్న ఎండుటాకులపై మనిషి అడుగులు పడితే వచ్చే శబ్దంతో… ఎవరో మనిషి నడుస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది రాజకుమారుడికి. అప్రయత్నంగానే, పక్కనే పెట్టుకుని ఉన్న పదునైన ఖడ్గం మీదికి రాజకుమారుడి చేయి పడింది.


ఖడ్గం పిడి మీద చేయి బిగించి పట్టుకుని, ఆ చప్పుడు వస్తున్న వైపుకు పరిశీలనగా చూశాడు. కొద్దిసేపటికి ఒక వృద్ధ సాధువు తామున్న ప్రదేశం వైపుకు రావడం చూశాడు రాజకుమారుడు. మరికొంతసేపటికి ఆ వృద్ధ సాధువు వారున్న చోటికి చేరుకుని, రాజకుమారుడికి కొంత దూరంలో నిలబడ్డాడు.


"నేను ఈ ప్రాంతాలలో సాధుజీవనం సాగిస్తూ బ్రతుకుతున్న మనిషిని. అడవికి అవతలివైపు నేను రాత్రి విశ్రమించే కుటీరం ఉంది. అక్కడికి నడిచి వెళుతూ చూశాను. దూరం నుంచి చూసినపుడు నీవు కూర్చున్న రాతి పలక మీద ప్రకాశవంతంగా మండుతున్న ఒక అగ్ని శిఖ, భోగి మంటలా మండుతూ కనపడుతూ ఉంది. ఆశ్చర్యం కలిగి, ఏమిటో తెలుసుకుందామని ఇటు వచ్చాను!" అన్నాడు ఆ వృద్ధ సాధువు.


రాజకుమారుడు స్థిమితపడి, తనను గురించి, తానున్న స్థితిని గురించి సంక్షిప్తంగా ఆ వృద్ధ సాధువుకు చెప్పాడు.


"నీలో మండుతున్న అగ్నియే నిన్ను కార్యసాధకుడిని చేస్తుంది నాయనా! అగ్నిదేవుడికి ఆశ్రయం ఇచ్చిన అశ్వత్థ వృక్షంలా కనిపిస్తున్నావు నువ్వు నా కళ్లకు. నీకు విజయం తప్పక సిద్ధిస్తుంది!" అని దీవెనలిచ్చి, "ఆ పక్కన నిద్రిస్తున్నది ఎవరు?" అని అడిగాడు ఆ వృద్ధ సాధువు.


“నా మిత్రుడు!” అని బదులిచ్చాడు రాజకుమారుడు.


“అతడు నిద్రపోతున్నాడు. నీవెందుకు మేల్కొని ఉన్నావు?” అని అడిగాడు ఆ వృద్ధ సాధువు.


కారణం చెప్పాడు రాజకుమారుడు.


"నీకు ఆ సందేహం అక్కరలేదు. ఎంత క్రూరజంతువు కూడా నీవున్న చోటికి అంత దూరంలోనే నిలిచిపోతుంది తప్ప, నీ వద్దకు రాదు. మండుతున్న అగ్నిని నీలో నింపుకుని అశ్వత్థ వృక్షంలా కనపడుతున్నావని చెప్పాను కదా, నా మాట అబద్ధం కాదు!" అన్నాడు ఆ వృద్ధ సాధువు.


"అలాగే స్వామీ, మీ వంటి పెద్దల మాటలను నేను నమ్ముతాను. ఇదిగో నేను కూడా విశ్రమిస్తున్నాను" అంటూ మంత్రికుమారుడి పక్కన విశ్రమించాడు రాజకుమారుడు.


వృద్ధ సాధువు వెనుదిరిగి వెళ్లాడు. అయితే, వెళ్తున్న వృద్ధ సాధువు వైపే చూస్తున్న రాజకుమారుడు, నాలుగు క్షణాల తరువాత ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యంతో రెప్ప వాల్చకుండా వృద్ధ సాధువు నడిచి వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు.


అలా ఆశ్చర్యంలో మునిగి రాజకుమారుడు కన్నార్పకుండా చూస్తుండగా, వృద్ధ సాధువు స్థానంలో ఒక పెద్ద పులి చీకటిలోకి అడుగులు వేస్తూ వెళ్లి, కనపడకుండా పోయింది.


(సమాప్తం)



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page