top of page

గరుడాస్త్రం - ఎపిసోడ్ 6


'Garudasthram Episode 6' New Telugu Web Series

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.


కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది. ప్రణవి, ల్యాబ్ దగ్గరకు వచ్చి శ్రీహర్షను కలుస్తుంది. తన బర్త్ డే షాపింగ్ కి అతన్ని తోడు రమ్మని కోరుతుంది.

ముందుగా ఇద్దరూ బీచ్ లో కొంత సమయం గడుపుతారు.


బర్త్ డే సందర్భంగా ఆమె ఇంటి డెకరేషన్ లో సహాయ పడతాడు.

ఒకరోజు కరుణాకరన్ గారు శ్రీహర్షని పిలిచి కోనసీమలో జరిగే ఒక పెళ్ళికి తన కూతురికి తోడుగా వెళ్ళమంటాడు. ప్రణవితో కలిసి అక్కడికి వెళతాడు శ్రీహర్ష.పెళ్లి కూతురి పక్కనే కూర్చుని ఉన్న ప్రణవి సౌందర్యానికి ముగ్ధుడవుతాడు.


శ్రీ హర్షతో పాపికొండలు చూసి వెళదామంటుంది ప్రణవి. ఇద్దరూ కార్లో కచ్చలూరు వెళ్లి, అక్కడినుంచి కాలినడకన వెళ్తారు. కొద్దిసేపు జలపాతం దగ్గర గడిపి, ఇంటికి బయలుదేరుతారు.


ఇక గరుడాస్త్రం ఆరవ భాగం చదవండి..


సాయంత్రం ఐదు గంటలైంది - కాలేజీలో హైడ్రాలిక్ లేబొరేటరీలో శ్రీ హర్ష ప్రాజెక్ట్ విషయమై కొన్ని ప్రయోగాలు చేసి అప్పుడే బయటకు వచ్చాడు.


కొద్ది సేపటికి ప్రణవి కారు వచ్చి అతని దగ్గర ఆగింది. శ్రీ హర్ష కారు ఎక్కగానే బయలుదేరింది. వాతావారణం ఆహ్లాదకరంగా ఉంది..


ఇంకో రెండు నెలల్లో మీ చదువు పూర్తతుంది. తరువాత ఏం చెయ్యాలనుకుంటున్నారు?” శ్రీహర్షని అడిగింది ప్రణవి.


“కాలేజీ స్టడీస్ అయితే పూర్తైంది. ఇప్పుడు మేము ప్రాజెక్టు వర్క్ చేస్తున్నాము. అది ఈ వారంతో పూర్తవుతుంది . ఆ తరువాత పరీక్షలు.. నాకైతే మిలట్రీలో చేరి దేశానికి సేవ చేయ్యాలనుంది. అంటే యుద్ధాలను చెయ్యడం కాదు.. రక్షణ శాఖకు శాస్త్రీయంగా ఉపయోగ పడాలని వుంది. అంటే సైంటిఫిక్ గా ఏదైనా చెయ్యాలనుంది..” అన్నాడు శ్రీ హర్ష


"సైంటిఫిక్ గా అంటే ఎలా?” ప్రణవి ఆసక్తిగా అడిగింది.

“అంటే జెట్ విమానాలు, విక్రాంత్, విరాట్ లాంటి నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్స్ ని అభివృద్ధి చెయ్యటం, అలాగే సబ్ మరైన్స్ కొత్తవి తయారు చెయ్యటం.. ఇలాంటి వన్నమాట.. అలాగే మిసైల్స్, గన్ షిప్స్.. ఇటువంటివి అభివృద్ధి చేస్తే దేశానికి రక్షణ శక్తి పెరుగుతుంది” అన్నాడు.


“మీరు చెప్పినవన్నీ మానవ వినాశనానికి కారణం అవుతాయి కదా?”


“మనమేమీ ఏ దేశం తోనూ యుద్ధం చెయ్యము. కాకపోతే ప్రతీవారికి ఆత్మ రక్షణ ముఖ్యం.. చీకట్లో వెళ్తున్నపుడు టార్చీ లైట్, కర్ర పట్టు కెళ్ళడం లాంటిది.. ఆత్మరక్షణ లేకపోతే శత్రువు మనల్ని దాడి చేసే అవకాశం ఉంటుంది.. అదే మన దగ్గర ఆయుధాలుంటే దాడి చేసే సాహసం చెయ్యలేరు ; చేతిలో కర్ర ఉన్న వాడిని కరవడానికి కుక్క కూడా భయపడుతుంది.. అందుకే మనం ఆధునిక రక్షణ వ్యవస్థని సమకూర్చుకోవాలనీ నా అభిప్రాయం “అన్నాడు హర్ష.


“మీరు చెప్పిన ఆయుధాలను దేశంలో ఎవరు, ఎక్కడ తయారుచేస్తారు?” ఉత్సుకతతో అడిగింది ప్రణవి.


“మన రక్షణ పరిశోధనలన్నీ డీఆర్డివో అంటే రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థలో జరుగుతాయి. అగ్ని, నాగ్ లాంటి క్షిపణులను ఆ సంస్థ శాస్త్రవేత్తలే రూపొందించారు.. ఇక నేవీ విషయాన్ని కొస్తే దాని పరిశోధనలను నేవల్ సైన్స్ అండ్ టెక్కాలాజికల్ లేబొరేటరీస్ లో జరుగుతాయి. ఇప్పటి దాకా మనదేశం సబ్ మెరైన్స్ ని రష్య నుంచి దిగుమతి చేసుకుంటున్నాది. ఈ మధ్యనే ఇండిజీనియస్ గా మనవాళ్ళు కూడా సబ్ మెరైన్స్ ని తయారు చేస్తున్నారు. నాకు డీఆర్డియల్ గానీ, నేవల్ లేబొరేటరీస్ లో గాని ఉద్యోగం చేసి పరిశోధనలు చెయ్యాలనీ ఉంది. అందుకే ఇంజనీరింగ్ పూర్తి చేయ్యగానే వాటికి సంబంధించిన పరీక్షలు వ్రాసి ఉద్యోగం సంపాదించే ప్రయత్నాలు చేస్తాను” అన్నాడు శ్రీ హర్ష.


“ప్రపంచంలో రక్షణ రంగంలో ఏయే దేశాలు మనకంటె బలమైనవి?”


“ఈ విషయంలో అమెరికా మొదటిది, దాని దగ్గర గొప్ప ఆయుధ సంపద ఉంది. వాషింగ్టన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ కేరయర్ షిప్ ప్రపంచంలో కెల్లా చాలా గొప్పది ;అది న్యూక్లియర్ పవర్ ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ ;ఇది చాలా ఆధునిక నేవల్ షిప్. దీని మీద 90 హెలీకాప్టర్స్ ఉంటాయి. అలాగే ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాలు; యుద్ధ ట్యాంకులు, లెక్కలేనన్ని సబ్ మెరైన్లు.. ఇలా ఎన్నో ఉన్నాయి అమెరికా మిలటరీ దగ్గర.


దాని తరువాత రష్యా.. ఆ తరువాత చైనా, మనదేశం నాలుగవ పెద్ద మిలటరీ వ్యవస్థ కలిగి ఉంది.. మనకు ఐ ఎన్ ఎస్ విరాట్, విక్రాంత్ అనే రెండు ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్స్ ఉన్నాయి. ఒక దేశాన్ని జయించాలంటే ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్స్, ఫైటర్ జెట్ విమానాలు చాలా ముఖ్యం. అలాగే దొంగ యుద్ధం చెయ్యడానికి సబ్ మెరైన్స్.. ప్రతీ ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ షిప్ మీద కనీసం పది విమానాలు, అన్నే హెలికాప్టర్స్ లేండింగ్ అయ్యే వీలు ఉంటుంది.


సముద్ర గర్భంలో ఆ షిప్ కి లంగరు వేసి అక్కడ నుంచి మొత్తం యుద్ధాన్ని చెయ్యవచ్చు.. దానిలో 5000 మంది వరకు సిబ్బంది, సైన్యం ఉంటారు” అని వివరంగా చెప్పేడు శ్రీహర్ష.


“మిలటరీ గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే మీరు కూడా సబ్ మెరైన్ మీద రీసెర్చి చేసి తయారు చేస్తారన్నమాట” అంది నవ్వుతూ..


“అది నా కోరిక! నెరవేరుతుందో లేదో కాలమే చెబుతుంది.. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను” అన్నాడు శ్రీహర్ష..


ఇంతలో కారు ఇల్లు చేరుకుంది.. శ్రీహర్ష గేటు దగ్గర దిగగానే ” శ్రీహర్షగారూ! మీ పరీక్షలు ఎప్పుడు” అని అడిగింది.


“ఇంకా నెలరోజుల సమయం ఉంది. బాగా ప్రిపేరు కావాలి “అని చెప్పి దిగిపోయాడు. ఆ తరువాత కారు ఇంటి వైపు వెళ్ళిపోయింది.


వారం తరువాత శ్రీహర్ష ప్రాజెక్ట్ ని పూర్తి చేసి హెడ్ ఆఫ్ ది సెక్షన్ కి అందచేసాడు. ఆ తరువాత శ్రీహర్ష చదువులో మునిగిపోయాడు. అతనికి ఇప్పటి వరకు 80% పైగా మార్కులున్నాయి. ఆఖరి సెమిస్టర్లో కూడా 80% దాటితే యూనివర్సిటీ ఫస్ట్ రావచ్చు. ఇప్పటికీ అతనిదే ఎక్కువ శాతం.. అందుకే అంత పట్టుదలగా చదువుతునాడు. ప్రణవి కూడా పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఆమె కూడా చదువులో పడిపోయింది. పది రోజుల తర్వాత ఆమె పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అందువల్ల ఆమెతో మాట్లాడటం కుదర్లేదు.


ఆమె పరీక్షలు పూర్తవగానే శ్రీహర్ష పరీక్షలు మొదలయ్యాయి. దాంతో ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటమే కుదర్లేదు.


పరీక్షలన్నీ బాగానే వ్రాసాడు శ్రీహర్ష. ప్రాజెక్ట్ వైవా కూడా బాగా జరిగింది. ప్రొఫెసర్ల బృందం అడిగిన వాటన్నింటినీ బాగా సమాధానాలు చెప్పటంతో మంచి మార్కులు వేసారని హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు ప్రొఫెసర్ మూర్తిగారు చెప్పారు. ఆఖరి పరీక్ష రోజున ఇంటికి వచ్చి అన్ని సర్దుకున్నాడు. మర్నాడే అతను తన ఊరు వెళ్ళాలి.


అందుకే సాయంత్రం పూట కరుణాకరం గారితో చెప్పడానికి వాళ్ళింటి వైపు వెళ్ళాడు. ఆ సమయంలో కరుణాకరం గారు ఏదో పని మీద బయటకు వెళుతునారు.. శ్రీహర్షని చూసి అతను కారు ఆపు చేసారు. శ్రీహర్ష అతనికి నమస్కారం పెట్టి “సార్! ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి. అన్నీ బాగా వ్రాసాను. మీరు నాకు చేసిన సహాయం వల్లే నా చదువు పూర్తైంది. లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడేవాడిని; రేపు మా ఊరు వెళ్ళిపోదా మనుకుంటునాను. అది చెబుదామనే వచ్చాను” అని చెప్పాడు.


“చాలా సంతోషం హర్ష.. ఇందులో నేను చేసిన సహాయం ఏముంది చెప్పు.. మా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది కాబట్టి నీకు ఇచ్చాను. అయినా నువ్వేం పరాయి వాడివి కాదు కదా.. నా బాల్య స్నేహితుడి కొడకువి. అలాగే వెళ్ళు, నే వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఉదయాన్నే డ్రైవర్ నిన్ను స్టేషన్లో డ్రాప్ చేస్తాడు” అని చెప్పి అతను వెళ్ళిపోయాడు.


కారు గేటు దాటిన తరువాత శ్రీహర్ష తన అవుట్ హౌస్ వైపు వెళ్తుంటే “శ్రీహర్షగారూ! ఉండండి” అంటూ ప్రణవి వస్తూ కనిపించింది.


శ్రీహర్ష ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ “మీరు ఇంట్లో లేరేమో ననుకున్నాను. లేకపోతే వచ్చేవాడినే.. పరీక్షలు ఈ రోజుతో అయిపోయాయి; రేపు ఉదయాన్నే మా ఊరు వెళ్ళి పోతున్నాను. ఆ విషయం నాన్నగారితో చెబుదామనే మీ ఇంటికి వచ్చాను” అన్నాడు హర్ష.


"కంగ్రాట్స్! మొత్తానికి ఇంజనీరింగ్ పూర్తి చేసేసారు. ఇక నుంచి మీరు ఇంజనీరు” అంది నవ్వుతూ..


“ఉద్యోగం రావాలి కదండీ! మొన్ననే డీఆర్డియల్లో సైంటిస్టు ఉద్యోగాలు పడితే ఎప్లై చేసాను. రెండు నెలల తరువాత పరీక్ష, అది రాయడానికి వచ్చినపుడు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ” అన్నాడు శ్రీ హర్ష.


“నేను కూడా పరీక్షలు బాగా రాసాను. అన్నట్టు ఒక విషయం మీతో చెప్పాలి. నాకు పదిరోజుల్లో 'పెళ్ళిచూపులు’.. నేను వద్దంటున్నా నాన్నగారు ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి అమెరికాలో పనిచేస్తున్నాడు. నాన్నగారికి వాళ్ళు బాగా తెలుసు” అని చెప్పింది.

ఆమె మాటలు శ్రీహర్షకి ఆశ్చర్యం కలిగించాయి. కొద్దిసేపు అతను మౌనం వహించాడు. అకస్మాత్తుగా పెళ్ళిచూపుల విషయం చెప్పగానే ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకో ఆమె చెప్పిన ఆ కబురు అతనికి ఆనందం కలిగించలేదు.. ఒక్కసారిగా అతని ముఖంలో నిరాశ కనిపించింది.


అయినా అవేమి ఆమెకు కనిపించకుండా మామూలుగా ఉండటానికి అతను ప్రయత్నించ సాగేడు. కానీ ఆ బాధని కప్పిపుచ్చటం అతని వల్ల కావటం లేదు.


కొద్దిసేపటికి తేరుకొని "కంగ్రాచులేషన్స్ ప్రణవిగారూ! అయితే మీరు త్వరలో అమెరికా వెళ్ళిపోతారన్నమాట..” అన్నాడు..


అతను మాట్లాడుతుంటే అవి నూతిలోంచి వస్తున్నట్లు వినిపించసాగాయి..

ప్రణవి అవేమి పట్టించుకోకుండా” “ఇంకా బోలెడు తుంతు ఉంది.. ఇవి జస్ట్ పెళ్ళిచూపులే” అంది ప్రణవి..


“కుదిరితే నాకు ముందుగా కార్డు పంపండి. తప్పకుండా వస్తాను” అంటూ ఇంటి వైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు.


ఎప్పుడూ లేనిది అతను అంత త్వరగా వెళ్ళిపోవటం ప్రణవికి ఆశ్చర్యం కలిగించి అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడి పోయింది ప్రణవి.


ఆ రాత్రి శ్రీ హర్షకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అయినా ఆమె పెళ్ళి వార్త తనకెందుకు బాధ కలిగించిందోననీ అతను ఆలోచించసాగేడు.. ఆమె వివాహం ఎప్పుడో అప్పుడు జరగవలసిందే కదా తానెందుకు అంతగా ఆలోచిస్తున్నాడు.. తన మనసెందుకు ఆ వార్త వినగానే బాధపడుతోంది..


అంటే తాను ఆమెను బాగా ఇష్టపడ్డాడా? ఆమె ఇన్నాళ్ళూ తనతో బాగా చనువుగా మెలిగింది.. ఆ చనువుని తాను తప్పుగా అర్ధం చేసుకున్నాడా?


బహుశా ఆమె మనసులో తన పట్ల ఏ భావం లేదేమో.. అందరి స్నేహితుల్లాగే తనతో మాట్లాడిందేమో? తనే అనవసరంగా ఆమె మీద ఆశలు పెంచుకున్నాడా?” ఇలా అతని ఆలోచనలు పరిపరి విధాలుగా సాగిపోతున్నాయి..


“మనసున్న మనిషికి సుఖము లేదంటే” అన్న వాక్యం గుర్తుకొచ్చి అతను మనసు మరింత బాధపడింది. అలా ఆలోచిస్తూ ఎప్పుడో అర్ధరాత్రి నిద్రలోకి జారుకున్నాడు.


తెల్లవారక ముందే లేచి బట్టలు సర్దుకొని బయట కొచ్చి ఆటోలో స్టేషన్ కి బయలుదేరాడు.. ఆటో కదలగానే ఆ ఇంటి వైపు బాధగా చూసాడు. సంవత్సరం పాటు ఆ ఇంటితోనూ, ఆ ఇంటి వాళ్ళతో మరీ ముఖ్యంగా ప్రణవితో బాగా చనువు ఏర్పడింది.. ఒక్కసారిగా ఆ ఇంటికీ, వాళ్ళకీ దూరంగా అవడం అతనికి బాధ కలిగి కళ్ళు చెమ్మగిల్లాయి.. రాను రాను ఆటో ఆ ఇంటికి దూరం కావడంతో అతను బలవంతంగా ముఖాన్ని తిప్పకున్నాడు.


ఇప్పుడతను వాస్తవంలోకి వచ్చాడు. జీవితం చాలా చిన్నది. అందుకే ఎక్కువగా ఎవరితోనూ బంధాలు పెంచుకోకూడదు. పెంచుకుంటే మిగిలేది బాధే.. టికెట్ కొనుక్కొని ప్లాట్ ఫారం మీదకు వెళ్ళాడు. ట్రైన్ అప్పుడే వచ్చింది. అతను తన కోచ్ దగ్గరికి వెళ్ళి అందులోకి ఎక్కాడు ; అతనిది విండో సీటు. వెళ్ళి కూర్చున్నాడు.


ప్లాట్ ఫారం అంతా వచ్చిపోయే మనుషులతో రద్దీగా ఉంది. ఇంతలో పుస్తకాల బండి వస్తే కిటికిలోంచి రెండు పుస్తకాలు, పేపరు కొన్నాడు. వాటిని కాసేపు చూసాడు. కానీ మనసు వాటి మీద కేంద్రీకరించటం లేదు.. ఆలోచనలు.. మళ్ళీ మొదలయ్యాయి. ఈ ఆలోచనలకేమి పనుండదు.. ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ వుంటాయి..


ఆలోచనల హోరు .. ఇంకో పక్క మనుషుల గోల.. అతని మస్తిష్కం వేడిక్కిపోసాగింది.. రైలు కదిలే సమయం అవుతోంది. అయినా కదలలేదు. అతని కెందుకో రైలు త్వరగా కదిలి ఆ ఊర్ని వదిలెయ్యాలనిపిస్తోంది. అయినా ప్రణవి తనతో ఆమె పెళ్ళి చూపుల విషయం ఎందుకు చెప్పింది? ఐదు నిముషలు ఆలస్యం అయితే తను తన గదికి వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఆ విషయం వినే అవకాశం ఉండేది కాదు. వినకపోతే ఈ రోజు ఆనందంగా తన ఊరు వెళ్ళేవాడు.


అయినా అంత త్వరగా ఆ విషయాన్ని తనతో చెప్పవలసిన అవసరం ఏమిటి?.. కావాలనే ఆమె అలా చేసిందా లేక ఆమెతో తను చనువుగా వుంటున్నానన్న కోపంతో చేసిందా? లేక తనకి పెళ్ళికుదరబోతోందని అందువల్ల ఇక నుంచి తను ఆమెకు దూరంగా ఉండాలన్న తన కోరికను తెలియజేయడానికి ఆ విషయాన్ని అన్యాపదేశంగా చెప్పిందా?


మళ్ళీ ఆలోచనలు శ్రీహర్షని ముట్టడి చేస్తున్నాయి.. జనాల రద్దీ ప్లాట్‌ఫారం మీద తగ్గింది. దూరంగా ఉన్న బెంచీ మీద యువతీ యువకులిద్దరూ సన్నిహితంగా కూర్చొని నవ్వుకొంటూ మాటాడుకుంటున్నారు? ప్రపంచంలో తామిద్దరమే ఉన్నట్లు మిగతా ప్రపంచంతో తమకు పనిలేదన్నట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిన్నటి దాకా తను కూడా ప్రణవితో మాట్లాడుతున్నప్పుడు అలాగే అనుకునేవాడు.


కానీ ఈ రోజు.. తాను పాతాళంలోకి పడిపోతున్న భావన కలుగుతోంది. ఒక చిన్న కబురు తనలో ఇంత అశాంతిని రేపుతుందనీ అతనూహించలేదు.


“ప్రేమ ఎంత మధురం..

ప్రియురాలు అంత కఠినం..”

చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం "

ఆమెతో పరిచయ ఇంత అలజడి రేపుతుందనీ అతనూహించలేదు. అయినా ఆమె మనస్సులో ఏముందో తెలియకుండా తానెందుకు అంతగా బాధపడుతున్నాడు; ఆమె తనను ఒక స్నేహితుడిలాగే భావించిందా?..


మళ్ళీ ఆలోచనలు ముసురుకుంటున్నాయి.. కాలం గడిచిపోతోంది. రైలు ఇంకా కదలలేదు. అరగంట ఆలస్యం.. ప్లాట్ ఫారం నిర్మినుష్యంగా మారుతోంది. పక్క ప్లాట్‌ఫారం మీద ఎనౌన్స్మెంట్ వినిపిస్తోంది. అక్కడ జనాల రద్దీలు పెరుగుతోంది.. ఇంతలో రైలు కదలబోతోందన్న ప్రకటన..


అతనికిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎందుకో ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తోంది? ఇక్కడ ఉన్నంత సేపూ ప్రణవి గుర్తుకొస్తుంది. ఈ ఊరు దాటితే ఆమె ఆలోచనలు రావనీ అతని భావన.. కానీ అది తప్పని అరగంట తరువాత తెలిసింది. ఆమె గురించి మరిచిపోవాలని ప్రయత్నిస్తూ ఆమె గురించే ఆలోచించసాగేడు. ఇంతలో ట్రైన్ పక్క స్టేషన్లో ఆగింది. అతను ఆలోచనల్లోంచి బయటపడి ఒళ్ళు విరుచుకున్నాడు.


రాను రాను తన గమ్యం దగ్గర పడుతోంది. ఇది చేరేసరికి నాలుగవుతుంది. అతని ఊరు వెళ్ళవలసిన బస్సు ఐదు గంటలకు.. మరో అరగంట తరువాత స్టేషన్ చేరుకుంది. త్వరగా బేగు పట్టుకొని దిగి బయటకు వచ్చి ఆటోలో బస్టాండ్ కి చేరుకున్నాడు. అప్పటికే బస్సు ప్లాట్ ఫారం మీద వుంది . అతన్ని చూసి వాళ్ళ వూరి వాళ్ళు పలకరించి సీటిచ్చారు. అరగంట తరువాత బస్సు కదిలింది.

=================================================================

ఇంకా వుంది


=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


40 views0 comments

コメント


bottom of page