'Puli Mida Swari' New Telugu Story
Written By Gannavarapu Narasimha Murthy
పులి మీద స్వారీ తెలుగు కథ
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆ రోజు మాధవ్ ఆఫీసుకొచ్చేసరికి ‘సర్కిల్ ఇనస్పెక్టర్ గౌతమ్ ని ఎవరో దారుణంగా హత్యచేసా’రన్న పిడుగు లాంటి వార్త తెలిసింది. మాధవ్, గౌతమ్ ఇద్దరూ పోలీసు శాఖలో ఒకేసారి ఎస్సైలుగా చేరారు. ఇద్దరూ ఒకే కాలేజీలో డిగ్రీ చదివారు. గౌతమ్‌కు పోలీసు శాఖలో చాలా స్ట్రిక్ట్ పోలీసు ఆఫీసర్ అన్న పేరుంది..
మాధవ్ వెంటనే డీయస్పీ రఘుని కలిశాడు.
"చాలా ఘోరం జరిగిపోయింది మాధవ్.. ఇలా జరుగుతుందని మేమెవ్వరం అనుకోలేదు" అన్నాడు రఘు.
"సార్ ! మీరెవ్వరూ అనుకోలేదు గానీ మా బేచ్‌లోని వాళ్ళంతా అతని ప్రాణానికి ముప్పు ఉందని అనుకుంటునే ఉన్నాము" అన్నాడు మాధవ్.
"మీ కెందుకొచ్చిందా అనుమానం.. ? అలాంటప్పుడు ఎస్పీ గారికి గాని, నాకు గానీ ఆ విషయం ఎందుకు చెప్పలేదు" అన్నాడు రఘు.
"సార్! మీరు 20 సంవత్సరాల నుంచి పోలీసు శాఖలో పనిచేస్తునారు. ఇక్కడ సమస్యలన్ని మీకు తెలుసు. మొన్నటి దాకా గౌతమ్ ఎన్నో సెన్సిటివ్ పోస్ట్‌లలో పనిచేసాడు. కొన్నాళ్ళు ఏంటీ నక్సల్ స్వాడ్‌లో, కొన్నాళ్ళు సీఐడీలో, మరి కొన్నాళ్ళు టౌన్ సీఐగా, కొన్నాళ్ళు లా అండ్ ఆర్డర్లో పనిచేసాడు. అతని ముక్కు సూటితనం, ఎవరికీ తలవంచని మనస్తత్వాలవల్ల ఎందరికో శత్రువయ్యాడు; ఏసీబీలో ఉన్నప్పుడు అవినీతి పరుల గుండెల్లో నిద్రపోయాడు.
టౌన్ సీఐగా ఉన్నప్పుడు రౌడీలు, ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలను అణిచివేసి కటకటాల్లోకి నెట్టాడు. అంతర్రాష్ట దొంగల భరతం పట్టాడు. కాలేజీ అమ్మాయిలను ఏడిపించే వాళ్ళను నగర బహిష్కరణ చేయించాడు. స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణిచివేసాడు. ఈ చర్యల వల్ల ఎందరో శత్రువులను మూటకట్టుకున్నాడు. అటువంటి వాడిని ప్రభుత్వం ఒక్కసారిగా ఆఫీసులో వేసి అతని అధికారమనే కోరల్ని పీకేసింది.. దాంతో శత్రువులు కక్ష గట్టి అతన్ని హత్య చేశారు;" అన్నాడు మాధవ్.
"నువ్వు చెబుతున్నది ఆశ్చర్యంగా ఉంది. అతన్ని ఆఫీసులో వెయ్యడానికీ, హత్యకూ సంబంధం ఏంటి? నువ్వు బోడిగుండుకీ, మోకాలికీ ముడిపెడుతున్నావు" అన్నాడు రఘు.
"సార్! నేను సరిగ్గానే చెప్పాను. మీకు అర్ధం కాలేదో లేక అర్థంకానట్లు నటిస్తున్నారో తెలియటం లేదు.. అతను 10 సంవత్సరాలుగా ఎందరో సంఘ విద్రోక శక్తులు, రౌడీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొని వాళ్ళకి కొరకరాని కొయ్యిగా తయారయ్యాడు;ఇన్నాళ్లూ ఫీల్డ్ పోస్ట్‌లో వున్న రక్షణ వల్ల వాడిని ఎవ్వరూ ముట్టుకునే సాహసం చెయ్యలేదు.. ఎప్పుడైతే వాడిని ఆఫీసులో వేసారో వాడికి రక్షణ కరువైంది. ఒక్కసారిగా అడవిలోంచి బయటకొచ్చిన పులిలా తయారైంది వాడి పరిస్థితి. అందుకే ఈజీ టార్గెట్ అయ్యాడు" అన్నాడు మాధవ్.
"నీ ఉద్దేశ్యంలో ఆఫీసుకి ఎవ్వర్ని బదిలీ చెయ్యకూడదా? ఇదెక్కడి న్యాయం" అన్నాడు రఘు .
"సార్.. చెయ్యొచ్చు. మాధవ్ లాంటి స్టిక్ట్ ఆఫీసర్లను మన పోలీస్ శాఖ సంవత్సరాలకు సంవత్సరాలు రౌడీలు, స్మగ్లర్లు లాంటి సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించడానికి బాగా వాడుకుని ఆ తరువాత వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తుంది. అలా కాకుండా ప్రతీ రెండేళ్ళకు ట్రాఫిక్‌లోనో, ఆఫీసులోనే పోస్ట్ చేస్తే అప్పుడీ సమస్య ఉండదు. నేను చెప్పిన విషయం అర్థం అయిందనుకుంటాను" అన్నాడు మాధవ్.
"అర్థం అయింది మాధవ్.. నువ్వు చెప్పింది వింటే నిజమే ననిపిస్తోంది. బదిలీ చేసే ముందు ఇవన్నీ ఆలోచించాలి లేకపోతే మనం మరింత మంది మంచి ఆఫీసర్లను కోల్పోయే ప్రమాదం ఉంది" అన్నాడు రఘు.
"సార్! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమిటి ఉపయోగం.. ? ఇప్పుడతనికి ఇద్దరు ఆడపిల్లలు.. ఇద్దరూ డిగ్రీ చదువుతునారు. అతను నిజాయితీ అన్న పేరు తప్పా ఇంకేమి సంపాదించుకోలేదు.. ఇప్పుడా కుటుంబం అతని మరణంతో వీధిన పడుతుంది. అలా జరగకుండా మన శాఖ ఆదుకోవాలి.. అతని భార్య డిగ్రీ చదువుకుంది. ఆమెకు వుద్యోగం ఇచ్చి, ఆ పిల్లల్ని మన డిపార్ట్‌మెంట్ చదివిస్తే అతని ఆత్మ శాంతిస్తుంది" అని చెప్పాడు మాధవ్.
"తప్పకుండా మాధవ్.. ఎస్పీ గారికి నేనీ విషయాలన్నీ చెబుతాను. మీరందరూ కూడా అతన్ని కలిసి చెప్పండి. అతని కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుందాం" అన్నాడు రఘు.
ఆ తరువాత మాధవ్ వెళ్ళిపోయాడు.
***
వారం తరువాత ఎస్పీ సక్సేనా గారి దగ్గర్నుంచీ మాధవ్‌కి తనని కలవాలని కబురొచ్చింది. ఆ సాయంత్రం అతని ఛాంబర్‌కి వెళ్ళి కలిసాడు మాధవ్;
ఎస్పీ అప్పుడు ఛాంబర్లో వంటరిగా ఉన్నారు .
అతను చిన్నవాడు. ఆరేళ్ళ క్రితం సివిల్స్ రాసి ఐపీయస్ అయ్యాడు. ఎవరికీ తలవంచని వాడన్న పేరుంది. ఇంతలో ఎటెండెంట్ వచ్చి టీలు తెచ్చాడు. మాధవ్ టీ తాగుతూ ఎందుకు తనని ఎస్పీగారు పిలిచారోనని ఆలోచించ సాగాడు.
ఇంతలో ఎస్పీగారు టీ కప్పుని టేబుల్ పై పెట్టి "మాధవ్! నిన్నెందుకు పిలిచానో తెలుసా?" అని అడిగాడు.
మాధవ్ తలఎత్తి అతని వైపు ఆశ్చర్యంగా చూసాడు.
"మనది ఒడిషాకి బోర్డర్ జిల్లా కాబట్టి ఈ మధ్యన గంజాయి స్మగ్లింగ్ బాగా పెరిగిపోయింది. మొన్న ముఖ్యమంత్రి గారు డిజీపీ గారిని పిలిచి దాన్ని ఎట్టి పరిస్థులుల్లోనూ అరికట్టమనీ చెప్పారు. ఇప్పటికే మన రాష్ట ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలతో పాటు మీడియా వాళ్ళంతా గంజాయిని అరికట్టలేదని ఆరోపిస్తున్నారు.. అది రాష్ట ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అందుకే డీజీపీ గారు ఆ గంజాయి స్మగ్లింగ్‌ని అరికట్టడానికి మంచి డైనమిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను పోస్ట్ చెయ్యమన్నారు. మన జిల్లాలో అటువంటి వాళ్ళు నలుగురే ఉన్నారు. అందులో నువ్వొకడవి కాబట్టి నిన్ను అక్కడికి పోస్ట్ చేస్తున్నాను. నువ్వు వెంటనే ఛార్జి తీసుకొని దాన్ని అరికట్టే పని మొదలెట్టు" అని చెప్పాడు..
అతను చెప్పింది విని ఏం చెప్పాలో తెలియక మాధవ్ కొద్దిసేపు మౌనం దాల్చేడు. ఆ తరువాత తేరుకొని " సార్! దయచేసి నన్ను ఆ పోస్ట్‌లో వెయ్యొద్దు. నేను దానికి న్యాయం చెయ్య లేను" అని అన్నాడు.
అతని మాటలకు ఎస్పీ సక్సేనా ఆశ్చర్యపోయి ముందుకు వంగి "పోస్టు చెయ్యవద్దా? ఆశ్చర్యంగా ఉందే! ఇది నీ లాంటి మంచి ఆఫీసర్లు అనవలసిన మాట కాదు.. నువ్వు వద్దనటానికి కారణం?" అని అడిగాడు.
"సార్! వారం క్రితం నా కొలీగ్ గౌతమ్ హత్యకు గురయ్యాడు. అతన్ని గంజాయి స్మగ్లర్లో, రౌడీ షీటర్లో చంపి ఉండొచ్చు. ఇంకా కేసు పరిశోధనలో ఉంది కాబట్టి వాస్తవాలు తెలియవలసి వుంది;. ఏదైనా అతని వల్ల జైలు కెళ్ళిన నేరస్తులే హత్య చేసి ఉంటారన్నది నిష్టుర సత్యం. అతన్ని మన పోలీసు శాఖ అవసరమైనన్నాళ్లూ బాగా వాడుకొని తరువాత వదిలేసింది. పది సంవత్సరాలు అతను సబ్ఇన్‌స్పెక్టర్‌గా, సర్కిల్ ఇనస్పెక్టర్‌గా వివిధ శాఖల్లో పనిచేసి నేరస్థులకు చుక్కలు చూపించాడు.. నేరస్తులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే పోలీసు ఉద్యోగం అంటే పులి మీద స్వారీ లాంటిది. ఆ పోలీసు ఆ పులి బారిన పడకుండా ఉండాలంటే ఎప్పుడూ దానిమీద స్వారీ చేస్తుండాలి.. స్వారీ చేస్తున్నంతకాలం ఆ పులి అతన్ని ఏమి చేయ్యలేదు. కానీ పొరపాటున అతను ఆ పులి మీద నుంచి కిందకు దిగాడో దానికి ఆహారం అవక తప్పదు..
గౌతమ్ మన డిపార్టుమెంటు చేసిన బదిలీ వల్ల ఆ విధంగా కిందకు దిగీ నేరస్థులనబడే పులికి ఆహారం అయ్యాడు. పులి మీద అంటే అధికారం ఉన్న పోస్ట్‌లో ఉన్నంతకాలం అతన్నెవ్వరూ ఏమి చెయ్యలేక పోయారు. ఆ విధంగా ఆ పులి మీద అతను స్వారీ చేస్తూ ఇన్నాళ్ళూ గడిపాడు కానీ మనవాళ్ళు అతన్ని ఆఫీసులో పోస్ట్ చేసారు. దాంతో అతని అధికారం అనే రెక్కలు తెగిపోయిన జటాయువులా మారిపోయి నేరస్తులనే రావణుల బారిన పడి చనిపోయాడు" అని చెబూతూ ఆగాడు మాధవ్.
అతను చెబుతుంటే ఎస్పీ సక్సేనా శ్రద్దగా వింటున్నాడు.
"రేపు మీరు చెప్పినట్లు నేనా ఉద్యోగంలోకి చేరితే నా పరిస్థితీ అంతే.. నేను పదవీ విరమణ దాకా బతికి బట్టకట్టాలంటే నన్ను రక్షణ ఉండే పదవుల్లో కొనసాగించాలి. అలా కాకుండా ఏరు దాటగానే తెప్ప తగలేసినట్లు నన్ను ఆఫీసులో పడేస్తే గౌతమ్ లాగే ఆ పులులకి ఆహారం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అలాంటి హామీ ఇస్తే నేను ఆ ఉద్యోగంలో చేరతాను. లేకపోతే నేను ట్రాఫిక్ లోనే కొనసాగుతాను. దయచేసి ఇది అధికార ధిక్కారంగా భావించకుండా నా వైపు నుంచి ఆలోచించవలసిందిగా కోరుతునాను" అని చెప్పి బయటకొచ్చేసాడు మాధవ్.
రెండు రోజుల తరువాత ఎస్పీ సక్సేనా మాధవ్‌కి ఫోన్‌చేసి పాత పదవిలోనే కొనసాగమని చెప్పడంతో మాధవ్ ఆనందపడ్డాడు.
(సమాప్తం)
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments