top of page

బ్రహ్మ రాతలో ఒక పేజీ


'Brahma Rathalo OKa Peji' - New Telugu Story

Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

'బ్రహ్మ రాతలో ఒక పేజీ' తెలుగు కథ

కథా పఠనం: మల్లవరపు మనోజ్ కార్తీక్


‘యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా’


సరస్వతీ స్తోత్రాన్ని మధురంగా ఆలపిస్తోంది మహాలక్ష్మి.

ఆమె వయస్సు యాభై ఆరేళ్ళు.


ఆరేళ్ళ వయసులో తన తాత దగ్గర నేర్చుకున్న స్తోత్రాన్ని ఇప్పటి వరకు క్రమం తప్పకుండా పాడుతోంది. ఆమె గాత్రంలో మాధుర్యంతో పాటు భక్తి కూడా నిండి ఉందని విన్నవారెవరికైనా యిట్టే తెలిసిపోతుంది.హైస్కూల్ రోజుల్లో ప్రతిరోజూ ఆమె చేతే ప్రేయర్ లో సరస్వతీస్తోత్రం పాడించేవాళ్ళు.పెళ్లి చూపుల్లో ఏదైనా పాట పాడమంటే సరస్వతీస్తోత్రం పాడింది మహాలక్ష్మి.


ఆమె పాట మొదలుపెట్టగానే 'ఇదేమిటి? ఏదైనా మంచి సినిమా పాట పాడుతావనుకుంటే...' అనబోయింది ఆమెకు కాబోయే అత్తగారు.


కానీ భక్తి పారవశ్యంతో పులకించి పోతూ పాడుతున్న మహాలక్ష్మి గాత్ర మాధుర్యానికి ముగ్ధులైపోయారు. పాట పూర్తి కాగానే అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు. ఇక వేరే ప్రశ్నలు, కట్న కానుకల గురించిన బేరసారాలు ఏవీ లేకుండా ఆమె వివాహం కృష్ణమూర్తితో జరిగిపోయింది.


ఇక అత్తగారింట్లో ఆమెకున్న భక్తిని చూసిన మామగారు పూజ చేసే బాధ్యతను ఆమెకే అప్పగించారు.


అందరు దేవుళ్లనూ పూజించే మహాలక్ష్మి, సరస్వతీదేవిని మరింత ప్రత్యేకంగా పూజించేది. ఆమె పూజల ఫలితమేమో... సరస్వతీ కటాక్షం పిల్లలకు ప్రాప్తించింది. పిల్లలిద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికాలో సెటిల్ అయ్యారు.


***

అది బ్రహ్మ లోకం.


గతంలో తన దినచర్య ఏమిటోగాని ఇప్పుడుమాత్రం ఉదయం ఐదింటికి భూలోకంలో మహాలక్ష్మి చేసే ప్రార్ధనను ప్రతి రోజూ శ్రద్ధగా విని, ఆనందిస్తుంది సరస్వతీ దేవి.


ఆ తరువాతే బ్రహ్మ చెంతకు చేరి ముచ్చటిస్తుంది. ఎప్పటిలాగే ఆ రోజుకూడా మహాలక్ష్మి చేసే పూజకోసం ఎదురు చూస్తోంది జ్ఞాన ప్రదాయిని భారతీ దేవి . యధాప్రకారం ఆ రోజూ ఉదయం నాలుగింటికే నిద్ర లేచింది మహాలక్ష్మి. కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి శుచిగా దేవుడి గదిలోకి అడుగు పెట్టింది. దేవుడి పటాలకు పూలు అలంకరిస్తూ ఉండగా, ఆమె గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది. వెంటనే హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చుండి పోయింది. ఒక ఐదు నిముషాలకు నొప్పి కాస్త తగ్గినట్లు అనిపించింది. తిరిగి దేవుడి గదిలోకి వెళ్ళింది.


అన్ని పటాలనూ అందంగా అలంకరించి దీపం వెలిగించబోతుండగా హఠాత్తుగా వెన్నులో నొప్పి మొదలైంది. చేతులు లాగుతున్నట్లు అనిపించింది. వెన్నులో మొదలైన నొప్పి గుండెలకు పాకి మెలిపెడుతోంది. గట్టిగా కేక పెట్టి భర్తను పిలవాలనుకొంది. కానీ నోరు పెగల్లేదు. తను మరణిస్తున్నట్లు అర్థమైంది ఆమెకు. శక్తినంతా కూడదీసుకుని చివరిసారిగా సరస్వతీ దేవికి నమస్కరించింది. తరువాత ఒక్కసారిగా దేవుడి గదిలోనే కుప్పకూలిపోయింది మహాలక్ష్మి.


ఆమె శ్వాస ఆగిపోయింది.


పూజగదిలో అచేతనంగా పడిఉన్న తన భక్తురాలిని చూసి సరస్వతీ దేవి హృదయం ద్రవించింది.


' అయ్యో! నా భక్తురాలికి అప్పుడే ఆయువు ముగిసిందా? ఇక నాకు ఈ భక్తురాలి స్త్రోత్రం వినపడదా!’ తలచుకొనే కొద్దీ ఆమెకు దుఃఖం పెరుగుతోంది.


‘ఈ విషయంలో తానేమీ చెయ్యలేదా? తన పతిదేవునితో చెప్పి ఆమె ఆయువును కాస్త పెంచలేదా? మొదటిసారిగా తన భర్తను ఒక కోరిక కోరబోతోంది. చతుర్ముఖుడు కాదనగలడా?’


అనుకున్నదే తడవుగా భర్త దగ్గరకు వెళ్ళింది.


ఆమె ముఖంలో విషాదాన్ని గమనించిన బ్రహ్మ " దేవీ! నీ ఈ విషాదానికి కారణం తెలుసుకోవచ్చా?" అని అడిగాడు.


"స్వామీ! సృష్టి కర్తలు మీరు. అందరి తల రాతలు రాసేది కూడా మీరే. భూలోకంలో నా భక్తురాలు మహాలక్ష్మి మరణించిన విషయం మీకు తెలియదా" కాస్త కోపం, బాధ నిండిన స్వరంతో అడిగింది సరస్వతి.


" ఇందులో బాధ పడవలసిన విషయం ఏముంది దేవీ? చావు పుట్టుకలు అనివార్యం కదా! ఆమె ఆయుర్ధాయం ముగిసింది. అందుకే మరణించింది " నిర్వికారంగా అన్నాడు బ్రహ్మ.


"అంత నింపాదిగా ఎలా వున్నారు స్వామీ! దయచేసి ఆమె ఆయుర్దాయం కాస్త పెంచండి" అభ్యర్థించింది సరస్వతి.


"మనం దేవతలం. రాగ ద్వేషాలకు అతీతంగా ఉండాలి. సాక్షాత్తు భగవంతుడే మనిషిగా అవతారం ఎత్తినప్పుడు, గడువు ముగిశాక ఆ అవతారం చాలిస్తాడు కదా! ఆ జన్మలో అతనికి ఏర్పడ్డ భార్యాబిడ్డలను ,బంధు మిత్రులను దుఃఖ సాగరంలో ముంచి తనువు చాలిస్తాడు కదా! ఇక మనుషులు ఆయుష్షు తీరాక మరణించడంలో ఆశ్చర్యం ఏముంది?" అన్నాడు బ్రహ్మ.


"నా భక్తురాలు అర్ధాంతరంగా మరణించింది. ఆమెను చిరంజీవిగా చేయమని నేను అడగడం లేదు. మరికొంత కాలం జీవించేలా చేయండి చాలు. ఆమెను కాపాడుకోలేక పోతే నాకు ఈ దైవత్వం ఎందుకు? ఆమెకు ప్రాణ హాని జరక్కుండా చూడండి. " అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సరస్వతి.


వెళ్లిన కొన్ని క్షణాలకే తాను పొరపాటు చేశానేమోననిపించింది సరస్వతీ దేవికి.


'బ్రహ్మ రాతను మార్చమని తను కోరడమేమిటి? ఎంత పొరపాటు! వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి క్షమాపణలు అడగాలి." అనుకొంది.


వెళ్లే ముందు దీనురాలైన తన భక్తురాలు మహాలక్ష్మి మృతదేహాన్ని ఒకసారి చూడాలనిపించింది. తన దృష్టిని భూలోకం వైపు మళ్లించింది.


ఆశ్చర్యం...


మహాలక్ష్మి హాస్పిటల్ లో జీవించే ఉంది. తల అటూ ఇటూ కదిలిస్తోంది.

అంటే తన పతి తన మొర ఆలకించాడన్నమాట. మనసులోనే విరించికి నమస్సులు అర్పించి, జరిగిన సంఘటనలను తన దివ్య దృష్టితో పరికించింది.


దేవుడి పూజకు పూలను అలంకరించింది మహాలక్ష్మి.

ఆమెకు ఏవిధమైన గుండె పోటూ రాలేదు

ఉత్కంఠతో చూస్తోంది సరస్వతి.


దీపం వెలిగించాలని అగ్గిపుల్లను గీచింది మహాలక్ష్మి.

అనుకోకుండా చెయ్యి జారి చీర పైన పడిందా అగ్గిపుల్ల.

క్షణంలో ఆమె చీర అంటుకుంది.

మంటలు పైకి ఎగిసి పడ్డాయి .


ఆమె కేకలు పెడుతూ పూజగది నుండి బయటకు వచ్చింది.


ఆమె కేకలు విన్న ఆమె భర్త కృష్ణమూర్తి పరుగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. అతి కష్టం మీద మంటల్ని ఆర్పాడు. వెంటనే అంబులెన్సు కి ఫోన్ చేశాడు.

ఆమెను హాస్పిటల్ లో చేర్చాడు.


దేహం దాదాపు సగం పైగా కాలిపోయి, హృదయ విదారకంగా కేకలు పెడుతోంది మహాలక్ష్మి.


“అమ్మా సరస్వతీ! ఈ బాధను భరించలేను. బ్రతికినా సగం కాలిన దేహంతో ఆనందంగా జీవించలేను. బ్రహ్మ దేవుడితో చెప్పి నా ఆయుష్షును ముగించు తల్లీ” అంటూ రోదిస్తోంది.

పైనుంచి ఈ దారుణాన్ని చూసిన సరస్వతీ దేవికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

ఆవేశంగా భర్త దగ్గరకు వెళ్ళింది.


"స్వామీ! ఒక్కటంటే ఒక్కసారి మీరు రాసిన రాతను మార్చమన్నాను. మరెప్పుడూ నేను అలా అడక్కుండా తగిన శాస్తి చేశారు. ప్రశాంతంగా దేవుని గదిలో తనువు చాలించాల్సిన నా భక్తురాలిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇందుకోసమా ఆమె ఆయుష్షును పెంచమని నేను మిమ్మల్ని కోరింది? ఆమెకు ఏ విధమైన హాని జరిగినా నా మనసు క్షోభిస్తుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను మీకు" అంటూ నీళ్లు నిండిన కళ్ళతో అక్కడినుంచి నిష్క్రమించింది.


తన ఏకాంత మందిరంలో కూర్చుని సాధారణ మానవ మహిళలాగా రోదించింది సరస్వతీ దేవి. సృష్టి కార్యంలో తల దూర్చి తనెంత పొరపాటు చేసిందో తెలిసి వచ్చింది ఆ తల్లికి.


తిరిగి భర్త వద్దకు వెళ్లి తన భక్తురాలి రాతను మార్చమని కోరాలా?

ఆలా కోరితే ఆయన ఏమనుకుంటాడో ..


ఏమైనా అనుకోని...


తనను కోపగించుకున్నా సరే.

భక్తురాలిని ఎలాగైనా కాపాడుకోవాలి.


అనుకున్నదే తడవు తన మందిరం నుండి బయటకు నడిచింది.

వెళ్ళేటప్పుడు తన భక్తురాలి దీన స్థితిని మరొక్కమారు చూడాలనుకుంది.


అప్పుడే కదా తనకు బ్రహ్మతో వాదించగలిగే శక్తి కలిగేది.

ఆమె దృష్టి భూలోకం వైపు మళ్లింది.


ఆశ్చర్యం...


పూజగదిలో మహాలక్ష్మి దీపాన్ని వెలిగించింది.


ఒకసారి అందరు దేవతల పటాలకు నమస్కరించి , పూజకు సిద్ధమైంది.

ఆమెకు గుండెపోటు రాలేదు. చీర అంటుకొని అగ్ని ప్రమాదం జరగలేదు.

చూస్తున్న సరస్వతీ దేవి మనసు ఆనందంతో పొంగిపోయింది.


మొత్తానికి బ్రహ్మ దేవుడు కూడా భార్య మాటలకు విలువనిచ్చి తాను రాసిన రాతను తానే మారుస్తాడన్నమాట.


సంతోషం నిండిన మనస్సుతో మరోసారి తన భక్తురాలి వైపు చూసింది.

పూజ ప్రారంభించ బోతున్న మహాలక్ష్మి దగ్గరకు పరుగున వచ్చాడు ఆమె భర్త కృష్ణ మూర్తి.

" లక్ష్మీ... లక్ష్మీ.. " అని కేకలు పెడుతూ.


"ఏమైందండీ. ఏంజరిగింది?" ఆందోళనతో భర్తను అడిగింది.


"మన పిల్లలు వస్తున్న ఫ్లైట్ కూలిపోయిందట. ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులందరూ చనిపోయి ఉండొచ్చని టి వి లో చెబుతున్నారు." చెబుతూనే కుప్పకూలి పోయాడు కృష్ణమూర్తి.


నోటమాట రాలేదు మహాలక్ష్మికి.


ఒకవైపు పిల్లల మరణ వార్త... మరో వైపు కళ్లెదుటే నేలకూలిన భర్త ...


కొద్ది క్షణాల్లోనే తేరుకొని భర్త వద్దకు వెళ్ళింది. అతని శ్వాస ఆగిపోయినట్లు గ్రహించి అతని శవం పైన పడి బిగ్గరగా ఏడుస్తోంది.


" అమ్మా! సరస్వతీ దేవీ! నీ భక్తురాలిని ఎందుకిలా శిక్షిస్తున్నావు? నేను ఏరోజూ నాకు దీర్ఘాయుష్షు కలిగించమని నిన్ను అడగలేదు. నా భర్త, పిల్లలు క్షేమంగా ఉండాలని మాత్రమే కోరుకున్నాను.


నన్ను ప్రాణాలతో ఉంచి వాళ్ళను తీసుకొని వెళ్లడం నాకు జీవిత శిక్ష విధించడమే" అని పైకి చూస్తూ ప్రశ్నిస్తోంది.


పైనుంచి చూస్తున్న సరస్వతీ దేవి జరిగిన సంఘటలకు చలించిపోయింది. తన గురించి కాకుండా భర్తా, పిల్లల గురించి ఆలోచిస్తోంది మహాలక్ష్మి.


స్త్రీల మనసులో అంతటి ఔన్నత్యాన్ని నింపింది బ్రహ్మ దేవుడే కదా!

అంతా తన పొరపాటు వల్లే జరిగింది.


బ్రహ్మ రాత విషయంలో తానెప్పుడూ కలుగజేసుకోనని చెప్పాలి. అనుకుంటూ అతని దగ్గరకు వెళుతోంది.


ఆ సమయంలోనే ఆమెకు నారద మహర్షి ఎదురయ్యాడు.


" అమ్మా! ప్రాతః సమయాన ఎప్పటి లాగా నీ భక్తురాలి పాట వినకుండానే భర్త సేవకు వెడుతున్నావా! అడుగుతున్నందుకు అన్యధా భావించొద్దు. బ్రహ్మ దేవుడి పైన ప్రేమ పెరిగిందా లేక భక్తురాలి మీద దయ తగ్గిందా?" నమస్కార బాణాలతోబాటు మాటల బాణాలు కూడా సంధించాడు మహర్షి.


ప్రతి నమస్కారం చేసి " మీకు తెలియనిదా నారద మహర్షివర్యా ! నా భక్తురాలు ఎన్ని బాధల్లో ఉందో తెలిసీ పరిహసిస్తున్నారా? " బాధగా అంది సరస్వతి.


"నా తల్లికి ఈ రోజెందుకో పరాకు కలిగింది. కాస్త మనసు పెట్టి వినవమ్మా ! నీ భక్తురాలి పాట నీ చెవిన పడుతుంది" అన్నాడు నారదుడు.


అప్రయత్నంగా భూలోకం వైపు చూసింది సరస్వతీ దేవి.

ఆశ్చర్యం!!!


ఎప్పటిలాగే తన శ్రావ్యమైన గొంతుతో "యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా" అంటూ తన స్త్రోత్రాన్ని ఆలపిస్తోంది మహాలక్ష్మి.


నమ్మశక్యం కాక అలానే చూస్తూ ఉండిపోయింది సరస్వతీ దేవి.

ప్రశాంత చిత్తం తో పూజ పూర్తి చేసింది మహాలక్ష్మి.


అమెరికా నుంచి ఆమె పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చారు.

అందరూ ఆనందంగా ఉన్నారు.


జరుగుతున్నదేదీ అర్థం కాలేదు సరస్వతీ దేవికి.

అంతా ఏదో మాయలాగా ఉంది.


" ఇదేమిటి మహర్షీ! ఏది నిజం? ఇంతకు ముందు నేను చూసినదేమిటి? ఒకవేళ బ్రహ్మ దేవుడే తన రాతను మార్చాడా?" అర్థం కాక ప్రశ్నించింది సరస్వతి.


"అమ్మా! నీ భక్తురాలికి ఏమీ జరగలేదు. అంతా తమకు కలిగిన భ్రమ మాత్రమే" అన్నాడు నారదుడు.


" ఇదేమిటి? నేను ఇంత సేపు భ్రమకు లోనయ్యానా? అదే నిజమైతే నేను జ్ఞాన దేవతను ఎలా అవుతాను? " ఆశ్చర్యంతో ప్రశ్నించింది సరస్వతి.


"ఎంతో సేపు కాదమ్మా 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఒక రోజు కదా. ఆ లెక్కన క్షణంలో కోటవ వంతు మాత్రమే మీకు భ్రమ కలిగింది. అదికూడా లోకోపకారం కోసమే" అన్నాడు నారద మహర్షి.


"లోకోపకారం కోసమా? కాస్త వివరించండి నారద మహర్షీ! " అని అడిగింది సరస్వతీ దేవి.


" తల్లీ వాగ్దేవీ! భూలోకంలో ప్రజలలో ఆశ్రిత పక్షపాతం పెరిగి పోతోంది. తన బంధువుల కోసం, అనుచరుల కోసం ప్రజలు ధర్మం తప్పుతున్నారు. తమవారి కోసం నియమాలకు తిలోదకాలిస్తున్నారు. తమవారు ఎన్ని ఘోరాలు చేసినా వెనకేసుకొస్తున్నారు.


కానీ ఊహలో కూడా సాక్షాత్తు సరస్వతీ దేవి కోరినా బ్రహ్మ దేవుడు తన ధర్మాన్ని తప్పలేదు. ఆలా తప్పివుంటే ఆ భక్తురాలికి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉండేది. ఇక వాస్తవంలో ఎవరి కోసమైనా సరే తన రాతలో ఒక పుటను( పేజీని) కూడా మార్చడు సృష్టికర్త బ్రహ్మదేవుడు.


అంతటి స్థిత ప్రజ్ఞత ఉంది కాబట్టే అయన ఆ పదవిలో ఉన్నాడు. ఈ కథాసృష్టి కోసమే మీకు ఆ భ్రమ కలిగింది. బ్రహ్మ కర్తవ్య పరాయణతను భూలోకంలో ప్రచారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను.


ఈ కలియుగంలో మనుషుల్లో అవలక్షణాలు పెరిగాయి. దేవుడికి కూడా తమ దుర్గుణాలని అంటగడుతున్నారు. తమ లాభం కోసం ధర్మాన్ని అతిక్రమిస్తున్నారు. ధనం ఖర్చు చేసి తమ కార్యాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. అదే గుణాన్ని దేవుడికి ఆపాదించి, ముడుపులతో తమ కోరికలు తీరుతాయని ఆశపడుతున్నారు.


భగవంతుడి ముందు ధనం, ఆభరణాలు గొప్ప కాదని తెలుసుకొని, వాటిని కానుకగా సమర్పించడమే నిజమైన భక్తి. అలాంటివారికి దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది. కానీ నీకిది, నాకది అనే రీతిలో సాగే భక్తి వ్యాపారమే కదా. అలాంటి వారిని దేవుడిలా అనుగ్రహిస్తాడు?


మహాలక్ష్మి లాంటి గొప్ప భక్తురాలి కోసమైనా సరే, బ్రహ్మ దేవుడు తాను రాసిన రాతను మార్చడు. నిజమైన భక్తులకు కేవలం కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రమే ఇస్తాడు భగవంతుడు” వివరించి చెప్పాడు నారద మహర్షి.


తరువాత ఇద్దరూ బ్రహ్మ దేవుడి చెంతకు చేరారు.


ఏవిధమైన ప్రలోభాలకూ లోను కాకుండా తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఆ చతుర్ముఖుడి వంక ఆరాధనగా చూసింది సరస్వతీ దేవి.


ఆ ఇద్దరికీ భక్తితో నమస్కరించాడు నారద మహర్షి.


***శుభం***


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).






















1,076 views1 comment

1 Comment


@kgangadhar6996 • 50 minutes ago

Sir super Story sir. Thanq

Like
bottom of page