top of page

వెంటాడే నీడ - ఎపిసోడ్ 5

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link


'Ventade Nida Episode 5' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

గత ఎపిసోడ్ లో...

మామిడి తోట దగ్గర ఆగుతారు శ్యామలరావు దంపతులు.

అక్కడ గోవర్ధన్ అనే వ్యక్తి వీళ్లకు కనపడతాడు. ఆ తోట వాచ్ మాన్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతాడతను. శ్యామలరావు దంపతులు బయటకు వెడతారు. విశాల్ స్నేహితుల ఫోన్ నంబర్ల కోసం డ్రైవర్ వెంకటేష్ తిరిగి తోటలోకి వెడతాడు. అతన్ని ఒక వ్యక్తి కత్తితో పొడవడానికి తరుముకుంటూ వస్తూ ఉంటాడు. అతడు, చనిపోయాడని చెప్పబడ్డ తోటమాలి షణ్ముగం గా గుర్తిస్తాడు శ్యామల రావు.

ఇక చదవండి ...


ఇదేమిటి? కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న షణ్ముగం తిరిగి ఎలా వచ్చాడు?

భయంతో బిగుసుకు పోయిన గొంతును పెగుల్చుకొని "ఎవరు.. ఎవరు నువ్వు? " అని అడిగాడు శ్యామలరావు.


"అదేంటి సార్! నన్ను గుర్తు పట్టలేదా? నేను ఈ తోటమాలి షణ్ముగాన్ని" అన్నాడతను.


“గుర్తుకు వచ్చావులే. కానీ నువ్వు మా డ్రైవర్ ను ఎందుకు తరుముతున్నావు? మేము తోటలోకి వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఎందుకు లేవు?" అతని వంక భయంగా చూస్తూ అడిగాడు శ్యామలరావు.


అతను ఏదో చెప్పబోయేంతలో " ఇప్పుడవన్నీ ఎందుకండీ? ముందు మనం బయలుదేరుదాం" అంది సావిత్రి.


"సార్! ఇతను మీ డ్రైవర్ అని నాకు తెలీదు. ఆ చచ్చిన గోవర్ధన్ గాడిని పిలవడంతో కోపం వచ్చింది. వచ్చింది వాడి ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. ఆ గోవర్ధన్ చేసిన పని ఇంకా మర్చిపోలేదు. ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనే చంపేసేవాణ్ని" అన్నాడు షణ్ముగం.


"గోవర్ధన్ చనిపోవడం ఏమిటి? మేము ఇప్పుడే అతనితో మాట్లాడాము. నేను ఒక్కడినే కాదు, అందరం చూసాము” అన్నాడు శ్యామల రావు..

అంతే...!


షణ్ముగం చేతిలోని కత్తి జారి పడింది.

"ఏమిటీ? గోవర్ధన్ ను చూసారా!" భయంగా అన్నాడు షణ్ముగం.


ఇంతలో తోటలోంచి తెల్లని చీరలో జుట్టు విరబోసుకొని ఒక ఆకారం బయటకు వచ్చింది.

భయంతో స్పృహ తప్పి పడిపోయాడు శ్యామల రావు.

***

హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ గదిలో భార్య శ్రేయ పక్కనే ఉన్నాడు వికాస్.

తన చేతిని భార్య గట్టిగా నొక్కడంతో ఆమె బాగా టెన్షన్ పడుతోందని అర్థమైంది అతనికి.

"భయపడకు శ్రేయా! ఇంటి దగ్గర అమ్మానాన్నలు మన బాబును జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అత్తయ్య, మామయ్య విజయవాడనుండి బయలుదేరారు. విశాల్ కూడా వచ్చేస్తున్నాడు. రేపు ఉదయం డెలివరీ ఏ ఇబ్బందీ లేకుండా జరుగుతుందని డాక్టర్స్ చెప్పారు" అంటూ ధైర్యం చెప్పాడు వికాస్.


"నిజమే అనుకోండి. కానీ ఈసారి ఎందుకో కాస్త భయంగా ఉంది. అయినా మీరు దగ్గర వుంటే చాలు. కొండంత అండ ఉన్నట్లు ఉంటుంది. ఇక అమ్మ కూడా వస్తే నాకు ఈ కాస్త టెన్షన్ కూడా ఉండదు. విశాల్ ఎక్కడిదాకా వచ్చాడో కనుక్కున్నారా?" అడిగింది శ్రేయ.

విశాల్ ప్రస్తావన రాగానే వికాస్ మొహంలో రంగులు మారాయి.


విశాల్ ఏమయ్యాడో! ఫోన్ చేస్తే తియ్యడం లేదు. అతనూ కాల్ చెయ్యడం లేదు. కానీ ఈ విషయాలు చెప్పి శ్రేయను మరింత టెన్షన్ పెట్టకూడదు.

అందుకే " ఇందాకే విశాల్ కు కాల్ చేశాను. రేపు ఉదయానికి ఇక్కడికి వచ్చేస్తాడట" అన్నాడు వికాస్.


ఇంతలో లేడీ డాక్టర్ ఆండాళ్, నర్స్ తో కలిసి లోపలి వచ్చింది.

వికాస్ ను కాస్సేపు బయట ఉండమని చెప్పి, శ్రేయను చెక్ చేసింది.

తరువాత నర్స్, వికాస్ ను లోపలి రమ్మంది.


డాక్టర్ అతని వంక చూస్తూ " రేపు పొద్దున్న డెలివరీ చేస్తాము. ఈ లోగా నొప్పి తెలీకుండా ఉండటానికి ఒక ఇంజక్షన్ రాసిస్తాను" అంటూ ఒక ప్రిస్క్రిప్షన్ అతనికి ఇచ్చింది.


"నేను రౌండ్స్ పూర్తి చేసుకొని వస్తాను. ఈ లోగా ఇంజక్షన్ తెచ్చి ఉంచండి " అంటూ నర్స్ తో కలిసి బయటకు వెళ్ళింది డాక్టర్ ఆండాళ్.


"ఇప్పుడే వెళ్లి ఆ ఇంజక్షన్ తెస్తాను" అంటూ బయటకు వెళ్ళబోయాడు వికాస్. అప్పుడే అతని ఫోన్ మ్రోగింది.


శ్రేయ మదర్ సావిత్రి గారు కాల్ చేస్తున్నారు.


" నీ హెల్త్ గురించి కనుక్కోవడానికి అత్తయ్య కాల్ చేసినట్లున్నారు.. నువ్వే మాట్లాడు. ఆవిడకు కాస్త టెన్షన్ తగ్గుతుంది. నేను ఇప్పుడే ఇంజక్షన్ తీసుకొని వస్తాను" అంటూ ఫోన్ శ్రేయకు అందించి, బయటకు నడిచాడు వికాస్. లిఫ్ట్ వైపు వేగంగా వెడుతుండగా బాగా పొడవుగా ఉన్న ఒక వ్యక్తి అతనికి డాష్ ఇచ్చాడు.


వెంటనే అతనే "సారీ సర్. చూడలేదు. అన్నట్లు నా పేరు డాక్టర్ గోవర్ధన్.. మీరు పేషేంట్ తాలూకు బంధువులా?" సారీ చెబుతూనే పరిచయం చేసుకుంటూ, చెయ్యి జాపాడతను.


షేక్ హ్యాండ్ ఇస్తూ అతని వంక చూసిన వికాస్ ఉలిక్కిపడ్డాడు. ఆరడుగుల పైన పొడవున్న ఆ వ్యక్తి చూడడానికి చాలా వికృతంగా ఉన్నాడు. కానీ మాట తీరు చాలా మర్యాదగా ఉండడంతో, పైగా డాక్టరునని చెప్పడంతో " అవును డాక్టర్ గారూ! రూమ్ నంబర్ 305 లో మా ఆవిడ డెలివరీ కి అడ్మిట్ అయింది. ఐ యామ్ వికాస్. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ని. అర్జెంట్ పనిమీద మెడికల్ షాప్ కి వెడుతున్నాను. సి యూ అగైన్ " అన్నాడు వికాస్.


"అయితే మీతో జాగ్రత్తగా ఉండాలి. సీ యూ మిస్టర్ వికాస్" అంటూ ముందుకు వెళ్లాడతను.


వేగంగా లిఫ్ట్ వద్దకు చేరుకొని , గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాడు వికాస్.అక్కడ విజిటర్స్ కోసం కుర్చీలు వేసి ఉన్నాయి.ఎదురుగా టి వి లో న్యూస్ వస్తోంది. ఒక వైపు మెడికల్ షాప్ ఉంది. అక్కడ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి, యధాలాపంగా టి వి వంక చూసాడు వికాస్.


అందులో ఒక బ్రేకింగ్ న్యూస్ చెబుతున్నారు. నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఒక వ్యక్తి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారం చేసి, హత్య చేశాడట. టి వి లో పదే పదే ఆ యువతి శవాన్ని చూపిస్తున్నారు. అది చూడగానే వికాస్ కు ఒళ్ళు గగుర్పొడిచింది.


శ్రేయకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకున్నాడు. అంతలో అత్తగారి నుంచి వచ్చిన కాల్ అటెండ్ కమ్మని, శ్రేయకు తన ఫోన్ ఇచ్చి వచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. ఒక్క ఉదుటున పక్కనే ఉన్న రిసెప్షన్ వద్దకు వెళ్ళాడు. అక్కడ ఉన్నవాళ్లు కూడా టి వి లో వచ్చే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తనకు డాష్ ఇచ్చిన వ్యక్తి 'నా పేరు డాక్టర్ గోవర్ధన్' అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.


"ఎక్స్క్యూజ్ మీ! మీ హాస్పిటల్ లో డాక్టర్ గోవర్ధన్ అని ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు.


"నో సర్. ఆ పేరుతో ఎవరూ లేరు." చెప్పారు వాళ్ళు.


"అయితే వెంటనే థర్డ్ ఫ్లోర్ లో ఉన్న మీ వాళ్ళను అలర్ట్ చెయ్యండి. ఎమర్జెన్సీ అలారమ్ వుంటే మోగించండి. ఆ క్రిమినల్ ఇప్పుడు ఈ హాస్పిటల్ థర్డ్ ఫ్లోర్ లోనే ఉన్నాడు" అని అరుస్తూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాడు వికాస్. లిఫ్ట్ కిందికి రావడం ఆలస్యం అవుతుందని గ్రహించి , మెట్లమీద పైకి పరుగులు తీసాడు. కానీ అప్పటికే జరగవలసిన అనర్థం జరిగిపోయింది.

***

వికాస్ బయటకు వెళ్ళగానే ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రేయ. అటువైపు నుండి సావిత్రి "అల్లుడుగారూ.. అల్లుడుగారూ..." అని వగరుస్తూ పిలుస్తోంది.

"నేనమ్మా! " అంది శ్రేయ.

కానీ వినిపించుకునే స్థితిలో లేదు సావిత్రి.


"అల్లుడుగారూ! అర్జెంటుగా ఒక విషయం చెప్పండి. ఈ తోటకు సంబంధించి చనిపోయింది షణ్ముగం ఫ్యామిలీనా లేక గోవర్ధనమా?" అని ఆదుర్దాగా అడుగుతోంది.


ఇంతలో ఆ గదిలోకి డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి రావడంతో " అమ్మా! ఎవరో డాక్టర్ గారు వచ్చినట్లున్నారు. తరువాత మాట్లాడుతాను" అంటూ ఫోన్ పెట్టేసింది శ్రావ్య.


గదిలోకి వస్తున్న వ్యక్తి వంక చూసింది. ఆరడుగుల పైగా పొడవున్నాడు.మాస్క్ వేసుకొని ఉన్నా, మొహం చాలా వికృతంగా ఉందని తెలుస్తోంది.


అతను నిండు చూలాలిగా వున్న శ్రేయ వంక ఒక్క క్షణం పరిశీలనగా చూసాడు.

" ఈ టైం కి మీకు ఇంజక్షన్ చెయ్యాలి. అందుకోసం వచ్చాను" అన్నాడు.


'అదేమిటి? తనను చూస్తున్నది లేడీ డాక్టర్ కదా! ఇతనెందుకు వచ్చాడు?' అని మనసులోనే ఆలోచిస్తోంది శ్రేయ.


' డాక్టర్ ఆండాళ్ గారు ఇప్పుడే చూసి వెళ్లారు. రౌండ్స్ పూర్తి చేసుకొని వచ్చి , ఇంజక్షన్ వేస్తానన్నారు. మా వారు ప్రిస్క్రిప్షన్ తీసుకొని కిందికి వెళ్లారు" అని చెప్పింది శ్రేయ అతని వంక అనుమానంగా చూస్తూ.


"వికాస్ నా ఫ్రెండ్. అతను రిసెప్షన్ లో ఇన్స్యూరెన్స్ ఎలా క్లెయిమ్ చెయ్యాలా అని మాట్లాడుతున్నాడు. నన్ను ఈ ఇంజక్షన్ ఆండాళ్ గారికి ఇమ్మన్నాడు . తను రావడం ఆలస్యమవుతుందని, నన్నే ఇంజెక్ట్ చెయ్యమన్నారావిడ" అంటూ లోపలికి వచ్చాడతను.


"ఐ యామ్ డాక్టర్ గోవర్ధన్. మీ పేరు తెలుసుకోవచ్చా " డిస్పోసబుల్ సిరెంజిని కిట్ లోంచి బయటకు తీస్తూ అన్నాడతను.


ఆలోచిస్తోంది శ్రేయ. గోవర్ధన్ అనే పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది. వికాస్ ఎప్పుడూ ఆ పేరుతో ఫ్రెండ్ ఉన్నట్లు చెప్పలేదు. మరి ఆ పేరు తను ఎక్కడ వినింది?


"ఏమిటి? అనుమానిస్తున్నారా? మత్తు ఇంజక్షన్ ఇచ్చి మీ నగా నట్రా తీసుకొని వెళతాననుకున్నారా? చెప్పానుగా వికాస్ ఫ్రెండ్ నని" అన్నాడతను.


"అబ్బే ! అనుమానమేమీ లేదు " అంటూ అతను ఇంజక్షన్ చెయ్యడానికి వీలుగా తన చేతిని జాపింది శ్రేయ.


అతను ఒకచేత్తో ఆమె జబ్బను గట్టిగా పట్టుకొని , మరో చేత్తో ఇంజక్షన్ చెయ్యబోతున్నాడు..

అప్పుడు గుర్తుకు వచ్చింది శ్రేయకు, ఇందాక తన తల్లి ఆ పేరు చెప్పడం....

‘చనిపోయింది షణ్ముగమా లేక గోవర్ధనా?’ అంటూ ఆమె ఆందోళనగా అడగడం గుర్తుకు వచ్చింది.


భయంతో, తనకు ఇంజక్షన్ చెయ్యబోతున్న అతని వంక చూసింది శ్రేయ.

శ్రేయ వంక చిన్నగా నవ్వుతూ చూసాడతను. క్రమంగా ఆ నవ్వు వికృతంగా మారింది.

***

ఇక్కడ మామిడి తోట దగ్గర, చనిపోయాడనుకున్న షణ్ముగం కనపడటంతో ఖంగుతిన్న శ్యామలరావు, తోటలోంచి తెల్లని చీరలో, జుట్టు విరబోసుకొని ఆవేశంగా వస్తున్న షణ్ముగం భార్య చంద్రికను చూసి స్పృహ కోల్పోయాడు.


అది చూసిన సావిత్రి వెంటనే కారులోంచి వాటర్ బాటిల్ తీసి శ్యామలరావు దగ్గరకు వెళ్ళబోయింది. అప్పటికే షణ్ముగం శ్యామలరావు దగ్గరకు వెళ్లి అతన్ని కదిలిస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు సావిత్రికి. ఫ్యామిలీతో సహా షణ్ముగం ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు గోవర్ధనం. గోవర్ధనం చనిపోయాడని చెబుతున్నాడు షణ్ముగం.

వెంటనే తన అల్లుడు వికాస్ కు కాల్ చేసింది.


చనిపోయింది ఎవరో చెప్పమని అడిగింది. అటువేపునుంచి శ్రేయ ఫోన్ తీసి, మళ్ళీ మాట్లాడతానన్నది.

మరోసారి కాల్ చేస్తే...


అనుకున్నదే తడవుగా మళ్ళీ అల్లుడికి కాల్ చేసింది.

"ఎవరు కావాలి?" అంటూ ఒక మొగ గొంతు వినపడింది.

అది వికాస్ గొంతు కాదు.


"ఎవరు కావాలంటే మాట్లాడరేం? నా పేరు చెప్పలేదనా? ఐ యామ్ గోవర్ధన్" అంటూ వికృతంగా నవ్వాడతను.


ఆ నవ్వు ఫోన్ లో సైతం భయం కలిగించేలాగా వుంది.

కళ్ళు తిరిగి కింద పడబోయింది సావిత్రి.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).126 views0 comments

Comments


bottom of page