top of page

అశ్వత్థామ హతః కుంజరః

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Aswatthama Hataha Kunjaraha' New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


మహా భారత యుద్ధంలో ధర్మరాజు వేరే అర్థం వచ్చేలా సత్యమే చెప్పాడు.

అది ధర్మాన్ని కాపాడటం కోసం.

కానీ ఈ నాయకుడు అడిగింది తన తప్పులను కప్పి పుచ్ఛమని.

అలాంటి వ్యక్తిని కాపాడటం ధర్మమా? నాన్నగారి నిర్ణయం, నా ఆలోచన సరైనవేనా?

మీరే చెప్పాలి.

మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం


ఉదయం వాకింగ్ కి వెళ్లిన మా నాన్నగారు ఇంకా తిరిగి రాలేదు.

నాతో పాటు ఇంటిల్లిపాదీ కంగారు పడుతున్నాం.

ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఉదయం ఐదున్నరకు వాకింగ్ కి వెళ్లారు మా నాన్నగారు.

మామూలుగా వాకింగ్ పూర్తి చేసుకొని ఏడు గంటలకు టంచనుగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు.

కానీ ఈ రోజు తొమ్మిదయినా తిరిగి రాలేదు.

ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దాంతో మాకు టెన్షన్ మొదలైంది.

నాన్నగారు రిటైర్డ్ తెలుగు పండిట్. భాష మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి.

సంస్కృతంలో కూడా ప్రావీణ్యత ఉంది. ఈ మధ్యనే ఒక అష్టావధానం కూడా చేశారు.

లోకల్ టివి లో ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు.

దాంతో ఆయనకు మా కాలనీలో మంచి పేరు వచ్చింది కూడా.

మా పై పోర్షన్ లో ఉండే రియల్టర్ గడ్డం బాబూరావు ఒకరోజు మా ఇంటికి వచ్చి నాన్నగారికి శాలువా కప్పి వెళ్ళాడు.

***

ఆలోచనల్లోనే మరో అరగంట గడిచింది.

ఇక ఆలస్యం చెయ్యకూడదని కారులో ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరాను.

ఆయన రోజు వాకింగ్ చేసే రూట్ నాకు తెలుసు.

ఆ రూట్ లో నెమ్మదిగా రోడ్ కు రెండు వైపులా చూసుకుంటూ వెళుతున్నాను.

ఓ కిలోమీటర్ వెళ్లేసరికి మా ఇంట్లో పాలు పోసే గోపాల్ అదే దారిలో సైకిల్ లో వెడుతూ కనిపించాడు. అతని పక్కగా కారు ఆపి హారన్ ఇచ్చాను.

నన్ను చూసిన గోపాల్ కిందికి దిగి, సైకిల్ స్టాండ్ వేసి కారు దగ్గరకు వచ్చాడు.

నాకు నమస్కారం పెట్టి "ఇదేంటి డాక్టర్ సార్? మా వూరి వైపు వస్తున్నారు? మీ నాన్నగారైతే రోజూ ఇటువైపు వాకింగ్ కి వస్తుంటారు. మీరు మా రూట్లో రావడం ఈ రోజే చూస్తున్నాను" అన్నాడు.

నేను పట్టణంలో పేరుమోసిన కార్డియాక్ సర్జన్ ని.

పోయే ప్రాణాన్ని కూడా నిలబెడతానని నాకు మంచి పేరు.


"నాన్నగారు ఈ రోజు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు గోపాల్. ఒకవేళ అలసట వల్ల దార్లో ఎక్కడన్నా కూర్చుండి పోయారేమోనని ఇలా వెతుక్కుంటూ వచ్చాను" అన్నాను.

మరోలా ఊహించుకోవడానికి కూడా నా మనస్సు అంగీకరించలేదు.

పైగా ఈ మధ్య నేను పనిచేసే కార్పొరేట్ హాస్పిటల్ లోనే ఆయనకు అన్ని టెస్ట్ లూ చేయించాను.

ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.


"నాన్నగారిని ఈ రోజు ఉదయం చూసాను బాబూ.." అన్నాడు గోపాల్.

"ఎక్కడ? ఎప్పుడు చూసావు?.." ఆతృతగా అడిగాను.

ముందు మీరు పరేషాన్ కాకండయ్యా. రోజూ నాన్నగారు మీ ఇంటి దగ్గర వాకింగ్ కి బయలుదేరే సమయానికి నేను కూడా మా ఇంటినుంచి సైకిల్ లో బయలుదేరుతాను. నేను టవున్ కి వచ్చేటప్పుడు రోజూ దార్లో ఆయన కనిపిస్తారు. ఈ రోజూ కూడా ఇదిగో...ఇక్కడే కనిపించారు. పక్కనే ఒక కార్ ఆగి వుంది. ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. తరువాత ఆయన కార్లో ఎక్కడం చూశాను" చెప్పాడు గోపాల్.

ఉలిక్కి పడ్డాను నేను.

ఇదేమిటి? నాన్నగారిని కారులో ఎవరు ఎక్కించుకొని వెళ్లారు?

వాకింగ్ నించి తిరిగి వచ్చి, స్నానం, పూజ ముగించిగానీ యెక్కడికీ వెళ్లరాయన.

పైగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది.

"ఆయన ఎవరితో మాట్లాడుతున్నారో చూశావా? వాళ్ళనెవరినైనా గుర్తు పట్టగలవా?" వణుకుతున్న గొంతుతో అడిగాను.

"లేదయ్యా! ఒకతన్ని మాత్రం మన పై ఇంట్లో ఉండే బాబూరావుతో ఒకసారి చూసినట్లు గుర్తు" చెప్పాడు గోపాల్.

కాస్త కుదుట పడ్డాను. తెలిసిన వాళ్ళతోనే వెళ్లాడన్న మాట.

కానీ అంతలోనే ఏదో అనుమానం.

గడ్డం బాబూరావు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తిరిగే వ్యక్తి.

అతనికి రాజకీయ నాయకుల అండ కూడా ఉంది.

అలాంటి వ్యక్తి కి నాన్నగారితో ఏంపని?

ఏమైనా అతన్ని కలిస్తేగానీ విషయం తెలీదు.

"నాన్నగారు కారులోకి ఆయనంతట ఆయనే యెక్కారా? వాళ్ళేమైనా బలవంతంగా ఎక్కించారా?" ఏదో అనుమానం వచ్చి గోపాల్ ని అడిగాను.

"అంతగా గమనించలేదయ్యా. అలాంటిదేమీ లేదనుకుంటానయ్యా" అన్నాడు గోపాల్.

"సరే. నువ్వెళ్లు గోపాల్. నేను కనుక్కుంటానులే" అన్నాను.

మరోసారి నమస్కరించి గోపాల్ వెళ్ళిపోయాడు.

వెంటనే నా ఫోన్ కాంటాక్ట్స్ చెక్ చేసాను. అదృష్టవశాత్తు గడ్డం బాబూరావు ఫోన్ నంబర్ ఉంది.

వెంటనే అతనికి కాల్ చేసాను.

"నమస్తే డాక్టర్ గారూ! ఏమిటిలా కాల్ చేశారు?" అడిగాడతను.

"మా నాన్నగారెక్కడ?" సూటిగా ప్రశ్నించాను.

"నాకేం తెలుసు?... వాకింగ్ నుంచి రాలేదా? నేను పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నాను..." బుకాయించబోయాడు.

"ఆపు బాబూరావు! నీకు తెలిసిన మనుషులు నాన్నగారిని కార్లో తీసుకొని వెళ్లినట్లు నాకు తెలుసు. ఎందుకు తీసుకొని వెళ్ళావ్? మా అపార్ట్మెంట్ తక్కువ రేటుకు అమ్మమని ఆయన్ను బెదిరించడానికా? లేకుంటే మా పొలాలు చీప్ గా కొట్టెయ్యాలనుకున్నావా? ఆయన ఒప్పుకోలేదని బెదిరిస్తున్నావా? సరిగ్గా జవాబు చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను" కోపంగా అన్నాను.


"అయ్యో...డాక్టర్ గారూ! అంత మాట అనకండి. మా బాస్… అదే.. మా లీడర్ దండపాణి గారికి నాన్నగారితో చిన్న పని పడిందట. అందుకోసం తీసుకొని వెళ్లారు. ముందు మీరు ఇంటికి రండి. మీ నాన్నగారి మీద ఈగ కూడా వాలదు. నాదీ పూచీ" అన్నాడు బాబూరావు.


ఆగమేఘాలమీద మా బిల్డింగ్ కి చేరుకున్నాను. మా ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా బాబూరావు ఉన్న అపార్ట్మెంట్ కి వెళ్లాను.

"రండి డాక్టర్ గారూ! కూర్చోండి.." అంటూ మర్యాదలు చెయ్యబోతున్న అతని వంక సూటిగా చూస్తూ "నాన్నగారెక్కడ?" అని ప్రశ్నించాను.

"ఒక్క క్షణం ఆగండి.." అంటూ ఎవరికో కాల్ చేశాడు.

తరువాత ఫోన్ నా చేతికిస్తూ "మీ నాన్నగారితో మాట్లాడండి" అన్నాడు.


ఆందోళనతో ఫోన్ చెవి దగ్గర ఉంచుకున్న నాకు నాన్న గొంతు వినగానే ఊరట కలిగింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

"నాన్నగారూ! ఏమైంది? ఎక్కడ ఉన్నారు? మిమ్మల్ని ఎవరు తీసుకొని వెళ్లారు?" అంటూ ఆదుర్దాగా అడిగాను.

"నువ్వు అనవసరంగా ఆందోళన పడవద్దు. ఏమీ కాలేదు. లీడర్ దండపాణిగారికి ఈ కవి సత్యనారాయణతో చిన్న పని పడిందట. అందుకని పిలిపించారు. మరో పది నిముషాల్లో ఇంట్లో ఉంటాను" అని చెప్పారాయన.


"అలాగే నాన్నగారూ" అని చెప్పి ఫోన్ బాబూరావుకు ఇచ్చేసాను.

"నేను చెప్పానుగా...చిన్న సహాయం కోసం తీసుకొని వెళ్లారు..." అని చెప్పబోతున్న బాబూరావును ఆపాను.


"సహాయం కావాలంటే ఇంటికి వచ్చి అభ్యర్థించాలి. అంతేగాని వాకింగ్ కి వెళ్లిన డెబ్భై ఏళ్ళ వ్యక్తిని.. అందునా ఒక కవిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళతారా?" కోపంగా అని బయటకు వచ్చేశాను.


సరిగ్గా మరో పది నిముషాలకు నాన్నగారు ఇంటికి వచ్చేసారు.

ఆయన్ను హత్తుకొని ఏడ్చేసాను. గదిలోకి తీసుకొని వెళ్లి, మంచం మీద కూర్చోబెట్టాను.

ఆయన స్థిమిత పడ్డాక జరిగిన విషయం పూర్తిగా వివరించారు.

***

ఎలెక్షన్ లు దగ్గరికి వస్తున్నాయి.

సిట్టింగ్ ఎం ఎల్ ఏ దండపాణి ఈ సారి కూడా పోటీ చేస్తున్నాడు.

గతంలో అయన పేదలకివ్వాల్సిన భూములు బినామీ పేర్లతో ఆక్రమించాడని ప్రతి పక్షాలు ఆరోపించాయి.

అందుకు సమాధానంగా అయన, తాను ఏ తప్పూ చేయలేదని గుళ్లో ప్రమాణం చేస్తానన్నాడు.

‘నేను తప్పులు చేసినట్లు మీరు ప్రమాణం చేస్తారా’ అని అవతలి వాళ్ళను ఛాలెంజ్ చేసాడు.

వాళ్ళు ఆ ఛాలెంజ్ కి సిద్ధపడటంతో ఈయన ఇరకాటంలో పడ్డాడు.


గుళ్ళోకి వెళ్లి అర్థం కాకుండా కొన్ని మాటలు మాట్లాడి వచ్చెయ్యాలనుకున్నాడు. కానీ ఆ ఉపాయం మరో వూళ్ళో వేరే నాయకుడు అమలు చేసాడు. ఆ నాయకుడు అసందర్భంగా మాట్లాడి, తన వ్యతిరేకులతో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. ఫలితంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు.


దాంతో ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కాలో ఈయనకు అర్థం కాలేదు. సరిగ్గా ఆ సమయంలో బాబూరావు నాన్నగారి అష్టావధానం చూడడం జరిగింది.

అందులో పృచ్ఛకులు ఇచ్చిన సమస్యను నాన్నగారు శ్లేష చమత్కృతితో చాలా చక్కగా పూరించారు. అంటే ఒక అర్థంతో సమస్య ఇస్తే, మరొక అర్థంతో దాన్ని పూరించడం అన్నమాట.

నాన్నగారు సమస్యాపూరణం చేసిన విధానం ప్రముఖ అవధానుల ప్రశంసలు పొందింది.

అక్కడ ప్రమాణం ఛాలెంజ్ నుండి ఏ విధంగా బయటపడాలా అని ఆలోచిస్తున్నాడు నాయకుడు దండపాణి. అసత్య ప్రమాణం చేద్దామంటే భార్యాపిల్లలకు ఏమవుతుందోనని భయం. ప్రమాణం చెయ్యక పోతే ప్రతి పక్షాల వాళ్ళు రచ్చ రచ్చ చేస్తారు.


సరిగ్గా ఆ సమయంలో నాన్నగారి గురించి ఆయనకు చెప్పాడు గడ్డం బాబూరావు.

గుళ్లో ఏ విధంగా ప్రమాణం చెయ్యాలో నాన్నగారి దగ్గర రాయించుకోవాలనుకున్నారు వాళ్ళు.

ఆ ప్రసంగ పాఠం పైకి ప్రమాణం చేసినట్లుగానే ఉండాలి.

కానీ అంతరార్థం అయన తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లుగా ఉండాలి.

అప్పుడు అసత్య ప్రమాణ దోషం ఆయనకు అంటదు.

అంటే ‘అశ్వత్థామ హతః కుంజరః ‘ అన్నట్లుగా ఉండాలన్నమాట.


ఇదీ వాళ్ళ ప్లాన్.

ఇందులో బాబూరావు కుత్సితం చాలా వుంది. లోగడ మా పొలాలు తక్కువ ధరకు అడిగితే నాన్నగారు ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళు అడిగినట్లు ప్రసంగ పాఠం రాసిస్తే, ఆ నాయకుడి దగ్గర బాబురావు విలువ అమాంతం పెరుగుతుంది. ఒకవేళ నాన్నగారు రాయనంటే ఆయనకు తమ నాయకుడి ద్వారా ఇబ్బందులు కల్పించవచ్చు. తద్వారా బాబురావు కక్ష తీరుతుంది.


ఎల్లుండే గుళ్లో ప్రమాణం చెయ్యాలి. ఆ నాయకుడు మా ఇంటికి వస్తే విషయం అందరికీ తెలుస్తుంది. అందుకని నాన్నగారు వాకింగ్ వెళ్లే దారిలో అటకాయించి, ఆ నాయకుడిని కలిసే ఏర్పాటు చేశారు. నాన్నగారిని వారికి అనుగుణంగా, చమత్కారంగా ప్రమాణ పాఠం రాసివ్వమని అడిగారు.

విషయమంతా విన్న నాన్నగారు ఆ నాయకుడిని ఒకే ప్రశ్న వేశారు, "మీరు దేవుణ్ణి నమ్ముతారా?" అని.

నమ్ముతాను. అందుకే తప్పుడు ప్రమాణం చెయ్యలేను. అందుకే మీ సహాయం అడుగుతున్నాను" అన్నాడు దండపాణి.


"మరి మీరు నమ్మే దేవుడిని ఏమార్చగలం అనుకుంటున్నారా?" తిరిగి ప్రశ్నించారు నాన్నగారు.

కొంతసేపు ఆలోచించాడు దండపాణి.


"మహా భారత యుద్ధంలో ధర్మరాజంతటి వాడు అశ్వత్థామ హతః కుంజరః అన్నాడట కదా! ఇక నేనెంత? మీరు నేను చెప్పినట్లు రేపటికల్లా రాసివ్వండి. ఎల్లుండే నేను గుళ్లో ప్రమాణం చెయ్యాల్సిన రోజు. ముందు ఎలక్షన్ గండంనుంచి గట్టెక్కాలి. తరువాత కావాలంటే దేవుడి కిరీటానికి బంగారపు తొడుగు చేయిస్తాను." అన్నాడు.


నాన్నగారు సమాధానం చెప్పలేదు.

"ప్రమాణం చేసేది నేను. పాప పుణ్యాలు నాకు. అసత్య దోషం మీకు అంటదు.

మీరు అవధానంలో సమస్య పూరించినట్లుగా అనుకోండి.

మీ టాలెంట్ ఉపయోగించి నేను అడిగినట్లుగా రాసివ్వండి.

మీవల్ల కాదంటే నేను నమ్మను.

ఒక విషయం గుర్తు పెట్టుకోండి.

నాకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోతానేమో గానీ, సహాయం చెయ్యని వాళ్ళను మాత్రం మర్చిపోను.

బెదిరిస్తున్నట్లు అనుకున్నా సరే! ఇది మాత్రం నిజం" హెచ్చరిస్తున్నట్లుగా చెప్పాడు దండపాణి.


తరువాత తన అనుచరులను పిలిచి "ఈయన్ని ఇంటి దగ్గర దిగబెట్టండి.మన కారులో వద్దు. వేరే వెహికల్ లో తీసుకొని వెళ్ళండి" అని పురమాయించాడు.

ఇదీ జరిగిన విషయం.

విషయమంతా విన్న నాకు రక్తం మరిగిపోయింది.

దండపాణికి ఏర్పడ్డది రాజకీయ సమస్య.

దాంట్లోకి నాన్నగారిలాంటి ఒక సామాన్యుడిని, డెబ్బై ఏళ్ళ వ్యక్తిని లాగడం ఎంతవరకు సమంజసం?

ఒక పండితుడిని అతనికి సంబంధం లేని విషయంలో బెదిరించాలనుకోవడం న్యాయమేనా?

వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాలన్నీ చెప్పాలనుకున్నాను.

అదే జరిగితే దండపాణి రాజకీయ జీవితం సమాధి అవుతుంది.


నా ఆలోచనలు పసిగట్టిన నాన్నగారు నన్ను వారించారు.

"ఆవేశపడొద్దు. ఇప్పటి వరకైతే అయన అడిగినట్లు రాసివ్వకూడదనే అనుకుంటున్నాను. రేపు సాయంత్రం వరకు సమయం ఉంది. అలోచించి నిర్ణయం తీసుకుందాం" అన్నారు నాన్నగారు.

నాన్నగారు దండపాణి బెదిరింపులు లెక్క చెయ్యరని నాకు తెలుసు. నా ఆలోచనల్లా తరువాత జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కొవాలనేదే.


ఆలోచనలతోనే ఆరోజు రాత్రి చాలాసేపటివరకు నాకు నిద్ర పట్టలేదు.

రాత్రి రెండు గంటలప్పుడు నిద్ర పట్టబోయే సమయంలో హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది.

దండపాణికి హార్ట్ అటాక్ వచ్చిందట. పరిస్థితి క్రిటికల్ గా ఉందట. మా హాస్పిటల్ లోనే చేర్చారు. ‘నేను వచ్చి సర్జరీ చెయ్యాలి’ అని చెప్పారు.


ఆలోచించకుండా వెంటనే హాస్పిటల్ కు బయలుదేరాను. నా గదిలో కూర్చొని రిపోర్ట్స్ పరిశీలించాను. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే సర్జరీ చెయ్యాలి.

అంతలోనే గడ్డం బాబూరావు నా గదిలోకి వచ్చాడు. అతడి మొహం పాలిపోయి ఉంది.

దండపాణిని అడ్డు పెట్టుకొని ఎన్నో రియల్ ఎస్టేట్ దందాలు చేసాడతను. ఆ క్రమంలో ఎంతోమందితో గొడవలు ఉన్నాయతనికి. ఛాన్స్ దొరికితే తొక్కేయాలని సొంత పార్టీ వాళ్లే కాచుకొని ఉన్నారు.ఇప్పుడు దండపాణి చనిపోతే బాబూరావు చిక్కుల్లో పడతాడు.


ఏమిటన్నట్లు అతని వైపు చూశాను.

" మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాము. మీరు అదేమీ మనసులో పెట్టుకోరని నాకు తెలుసు. నా తప్పుకు పరిహారంగా మన కాలనీ లో ఒక గుడి కట్టించాలనుకుంటున్నాను. మొత్తం ఖర్చులు నేనే భరిస్తాను. ఆ గుళ్లోనే ఒక మండపం కట్టిస్తాను. మీ నాన్నగారు అక్కడే అవధానాలు చేసుకోవచ్చు. ప్రవచనాలు కూడా చెప్పవచ్చు..." చెప్పుకుంటూ పోతున్న అతన్ని ఆపాను.


“నాతోపాటు దేవుడిని కూడా ప్రలోభ పెట్టాలనుకుంటున్నారా? మీలో మార్పు రాదా?" అతని వంక అసహ్యంగా చూస్తూ పైకి లేచాను.


ఇప్పుడు నేనేం చేయాలి?

ధర్మాన్ని కాపాడటం కోసం ధర్మరాజు అబద్ధం చెప్పాడు.

ఇప్పుడు దండపాణిని కాపాడటం ధర్మమా లేక శిక్షించడం ధర్మమా?

అతన్ని బతికిస్తే ప్రస్తుతానికి కృతజ్ఞుడిగా ఉండొచ్చేమో! కానీ కొద్దీ రోజులకే అతని అసలు బుద్ధి బయటకు వస్తుంది.

సర్జరీ చేసే సమయంలో తాను చిన్న పొరపాటు చేసినా, క్షణం ఏమరుపాటుగా ఉన్నా దండపాణి బతకడు.

కానీ డాక్టర్ గా నా ధర్మాన్ని నేను పాటించాలి కదా.

సరైన నిర్ణయం తీసుకొనే శక్తిని ఇవ్వమని భగవంతుడి ప్రార్థించాను.

ఇలాంటి పరిస్థితుల్లో నాన్నగారు ఏం చేస్తారో..అని ఆలోచించాను.

చిన్నప్పుడు అయన నేర్పిన వేమన పద్యం గుర్తుకు వచ్చింది.


చంపదగినయట్టి శత్రువు తనచేత

జిక్కినేని గీడు సేయరాదు

పొసగ మేలుచేసి పొమ్మనుటే చాలు

విశ్వదాభిరామ వినురవేమ.

శుభం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
880 views0 comments

Kommentarer


bottom of page