కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Ventade Nida Episode 9' Written By Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో
కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి శంకరశాస్త్రి ఇంటికి వస్తాడు. 'ఆయన కోసం ఒక ప్రత్యేకమైన విభూది తెచ్చాను అనీ, దాన్ని ఆయనకు వాసన చూపించి నొసటన రాయ'మనీ చెబుతాడు. ఆ వ్యక్తి తన పేరు 'గోవర్ధన స్వామి' అని చెబుతాడు.
ఇక చదవండి...
అతను ఇచ్చిన విభూదిని తీసుకొని భర్త ఉన్న గదిలోకి వెడుతుంది పార్వతమ్మ. ఎప్పుడూ లేని విధంగా నిద్రలో కూడా భర్త ముఖం చికాకుగా ఉండటం గమనించింది.
'పాపం! ఇందాక కలిగిన భ్రమ వల్ల చికాకు పడ్డట్లు ఉన్నారు' అనుకొని సాధువు తనకు ఇచ్చిన విభూది పొట్లం తెరిచింది. ఆ విభూదిని భర్తకు వాసన చూపించి నొసటికి రాస్తే ప్రశాంతంగా నిద్ర పోతారని భావించింది. పొట్లం తెరవగానే ఆ విభూది వాసన ఏదో తేడాగా అనిపించింది ఆమెకి. ఇందాక తనకు వాసన చూపించిన విభూది ఇది కాదని గుర్తించింది. పొట్లాన్ని తన ముక్కు దగ్గర వుంచుకొని వాసన చూడగానే ఆమెకు స్పృహ తప్పి, 'ఏమండీ!' అని అరుస్తూ కింద పడిపోయింది.
నిద్రలో ఉన్న శంకర శాస్త్రికి తనకు ఇందాక కనిపించిన వికృతమైన ఆకారం మళ్లీ కనిపించింది. ఈసారి ఆ ఆకారం కాషాయ వస్త్రాలు ధరించి తన ఇంటి వైపు వస్తోంది. నిద్రలోనే అసహనంగా అటూ ఇటూ కదిలాడు శంకర శాస్త్రి. ఇంతలో భార్య పెట్టిన కేకకు అతనికి మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి తన మంచం పక్కన నేల మీద అచేతనంగా పడి ఉంది అతని భార్య పార్వతమ్మ. ఆమె చేతిలో నుంచి జారిపడ్డ పొట్లం లోని విభూది నేల మీద చెల్లాచెదురుగా పడి ఉంది. దూరం నుండే ఆ విభూది నుండి వింత అయిన తియ్యటి వాసన వస్తోంది. క్షణాల్లో విషయం గ్రహించాడు ఆయన. ముక్కు మూసుకుని తన ఉత్తరీయంతో కిందపడ్డ విభూదిని తుడిచి, దూరంగా విసిరేశాడు. తరువాత ఫ్రిజ్ లోంచి చల్లటి నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు.
కానీ ఆమెలో చలనం లేదు.
వేగంగా ఇంట్లోకి వెళ్లి ఒక ఉల్లిపాయను అడ్డంగా కోసి ఆమె ముక్కు వద్ద ఉంచాడు. ఆ ఘాటుకు ఆమెలో స్వల్పంగా కదలిక వచ్చింది.
'హమ్మయ్య! ఇక ప్రమాదం లేదు. స్పృహ రావడానికి మరి కొన్ని గంటలు పట్టవచ్చు. కానీ ప్రాణాపాయం అయితే లేదు' అని నిశ్చయించుకున్నాడు. తరువాత కళ్ళు మూసుకొని తీక్షణంగా ఆలోచించాడు. ఇంత వరకూ ఇది కేవలం దయ్యం చేసే పనిగానే భావించాడు కానీ ఇప్పుడు ఆ దయ్యానికి మనుషుల సహకారం కూడా ఉన్నట్లు అతని ఆలోచనకు అందుతోంది. కాసేపు అలాగే ఆలోచించి ఉంటే అతనికి జరుగుతున్న విషయాల పట్ల స్పష్టత వచ్చేది.
ఇంతలో వాకిట్లోంచి 'భవతీ భిక్షాందేహి' అన్న కేక వినపడింది. వచ్చింది ఎవరో అర్థమయింది శంకరశాస్త్రికి. ఒకసారి పూజ గది లోకి వెళ్లి ఆంజనేయస్వామికి దండం పెట్టుకొని నిర్భయంగా తలుపు తెరిచాడు. ఇందాక తనకు కలలో.. ఊహలో కనిపించిన వికృతమైన ఆకారం ఎదురుగా నిలుచుని ఉంది.
"మహారుద్రుడి మీద ఆన! నీకేం కావాలి? నిజం చెప్పు" అన్నాడు శంకరశాస్త్రి.
వికృతంగా నవ్వాడు ఆ వ్యక్తి.
"నాకు ఆ సుమంత్ గాడి ప్రాణం కావాలి. అతన్ని కాపాడాలనుకున్న విశాల్ ప్రాణం కూడా కావాలి. తాటాకు మంత్రాలతో నన్ను అడ్డుకోవాలి అనుకునే నీ ప్రాణాలు కూడా కావాలి" అంటూ భయంకరంగా నవ్వాడు ఆ అగంతకుడు.
"పరమేశ్వరుని కటాక్షం ఉన్న వ్యక్తిని నేను. నా పుట్టుకే ఒక శివాలయ ప్రాంగణంలో జరిగింది. నన్ను నువ్వు ఏమీ చేయలేవు. అంతేకాదు. సుమంత్ ను కాపాడకుండా ఆపలేవు" అన్నాడు శంకరశాస్త్రి.
వికటాట్టహాసం చేశాడు ఆ వ్యక్తి.
"ముందు నీ భార్య ప్రాణాలు కాపాడుకో. తరువాత దేశాన్ని ఉద్ధరించుదువు లే. అన్నట్లు కాలేజీకి వెళ్ళిన నీ కూతురు దీక్ష క్షేమంగానే ఉందా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కో" అని చెప్పి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డుకు రెండు వైపులా చూసిన శంకరశాస్త్రి కి అక్కడ ఎవరూ కనిపించలేదు. వెంటనే ఇంట్లోకి వచ్చి తన కూతురికి ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ 'స్విచాఫ్' చేసినట్లుగా వస్తోంది.
మిన్ను విరిగి మీద పడ్డా నిబ్బరంగా ఉండే స్థితప్రజ్ఞుడు అయిన శంకరశాస్త్రి ఆ క్షణంలో ఉద్వేగానికి లోనయ్యాడు.
***
ఇక్కడ మామిడి తోట దగ్గర...
అచేతనంగా పడి ఉన్న భర్త ఒక వైపు.. బయటనుండి కేకలు పెడుతున్న గోవర్ధన్ ఒకవైపు.. వీటికి తోడుగా హోరుగాలి.. వర్షం.
భర్త గుండెలపై చేయి వేసి చూసింది సావిత్రి. గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటోంది. ఆమె కళ్ళు నుంచి నీళ్ళు జలజలా రాలాయి. స్వతహాగా డాక్టర్ కావడంతో క్షణాల్లోనే తమాయించుకుంది. భర్తకు తనే సి పి ఆర్ చేయడం ప్రారంభించింది. ముందుగా అతని చుబుకాన్ని పట్టుకుని తల కాస్త వెనక్కి వాల్చింది. తన రెండు చేతులను కలిపి పట్టుకుని అతని ఛాతీ మధ్యలో బలంగా నొక్క సాగింది. అలా నిర్విరామంగా రెండు నిమిషాల పాటు చేయడంతో అతను ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు. ధైర్యం వచ్చింది ఆమెకు.
ఇంతలో బయట నుంచి గోవర్ధన్ "మొగుణ్ణి అయితే బతికించుకున్నావు. మరి ఐసీయూలో ఉన్న నీ కూతురు సంగతి ఏమిటో" అంటూ అరిచాడు. తరువాత అతను దూరంగా వెళ్లిపోయినట్లు అడుగుల శబ్దాన్ని బట్టి అనిపించింది ఆమెకు.
రెండు చేతులతో ముఖాన్ని కొట్టుకొని, బిగ్గరగా ఏడ్చేసి 'భగవంతుడా! ఎందుకు మాకు ఈ కష్టాలు? ఎవరికీ ఏ అపకారం చేయలేదే! ఎవరు మమ్మల్ని ఇలా వెంటాడుతున్నారు ?..." అంటూ ఆక్రోశించింది.
"ఊరుకోండమ్మా. అయ్యగారికేమీ కాదు" అంటూ ధైర్యం చెప్పాడు షణ్ముగం.
అతని భార్య చంద్రిక సావిత్రి భుజం మీద తడుతూ "అమ్మగారూ! మీరు భయపడకండి. ఇదంతా ఆ గోవర్ధన్ గాడి దయ్యం చేసిన పనే. తెల్లారగానే ఈ తోటలో ఉన్న గంగమ్మ రాయికి దండం పెట్టుకోండి. ఇక వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. మేము కూడా ఆ తల్లి దయతోనే ఇక్కడ ఉండగలుగుతున్నాము. లేకపోతే మమ్మల్ని ఎప్పుడో చంపేసేవాడు" అని చెప్పింది. ఏమీ మాట్లాడకుండా భర్తలో కదలిక రావాలని భగవంతుడిని ప్రార్థిస్తూ అతని వంకే చూస్తోంది సావిత్రి.
కొంతసేపటికి వర్షం ఉధృతి తగ్గింది. కరెంట్ కూడా వచ్చింది. స్వల్పంగా కదిలాడు శ్యామలరావు.
ఇంతలో ఆమె ఫోన్ మోగింది.
చూస్తే వికాస్.
వెంటనే ఫోన్ తీసిన సావిత్రి "అల్లుడుగారూ! అమ్మాయికెలా ఉంది?" అని అడిగింది.తన భర్త పరిస్థితి చెప్పి అతన్ని మరింత టెన్షన్ కు గురి చెయ్యడం ఆమెకు ఇష్టం లేదు.
"నువ్వెప్పుడూ ఇంతేనా? అవతల మాట్లాడేది ఎవరో తెలుసుకోవా?" అంటూ వికృతమైన గొంతు వినపడింది అవతలి వైపు నుండి.
ఉలిక్కిపడింది సావిత్రి.
ఆ గొంతు తను ఎక్కడో వినింది...
"ఇందాక డాక్టర్ గోవర్ధన్ అని చెప్పింది నువ్వే కదూ? మరి ఇంతసేపూ ఇక్కడ మామిడి తోటలో కేకలు పెట్టిన గోవర్ధన్ ఎవరు? " అని అడిగిందామె.
"మొత్తానికి ఆ పేరుతో మీ కుటుంబానికి చాలామంది శత్రువులు ఉన్నారన్న మాట. అదంతా నాకెందుకు గానీ నీ కూతురు మాత్రం ఐ సి యూ లో ఉంది. చచ్చిందో బతికిందో తెలీదు" అని వికృతంగా నవ్వుతూ ఫోన్ పెట్టేసాడు అతను.
కళ్ళు గిర్రున తిరిగాయి సావిత్రికి.
కానీ వెంటనే తమాయించుకుంది.
'ఇలాంటి పరిస్థితుల్లోనే తను ధైర్యంగా ఉండాలి. ముందు భర్తను బతికించుకోవాలి' అని నిశ్చయించుకొని అతన్ని కదిపింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు శ్యామలరావు.
పక్కనే ఉన్న భార్యను, ఎదురుగా ఉన్న షణ్ముగం, చంద్రికలను చూసాడు.
ఇందాక అతను వాళ్ళను చూసి దయ్యాలుగా భావించి స్పృహ కోల్పోవడం గుర్తుకు వచ్చింది సావిత్రికి.
వెంటనే భర్త గుండెల మీద నెమ్మదిగా రాస్తూ, "ఏమండీ! వీళ్ళు దయ్యాలు కాదు. వీళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు" అని చెప్పింది.
"ముందు వీళ్ళను చూసి భయపడ్డ మాట నిజం. కానీ చంద్రిక తోటలోంచి వస్తూ ఉంటే, వెనకే ఒక వికృతమైన ఆకారం నీడలాగా ఆమె వెనకే వస్తూ కనపడింది. హఠాత్తుగా ఆ నీడ గాల్లోకి ఎగిరి మనవైపు వస్తున్నట్లు అనిపించింది. ఆ ఆకారానికి మనకు గోవర్ధన్ గా పరిచయం చేసుకున్న మనిషి పోలికలు కనిపించాయి. అప్పుడే నాకు స్పృహ తప్పింది" అని చెప్పాడు శ్యామల రావు.
"ఇంతకీ ఆ గోవర్ధన్ గురించి మీకేమైనా వివరాలు తెలుసా?" అడిగింది సావిత్రి.
"తెలుసమ్మా. ఆ దయ్యం గాడి గురించి పగలు చెప్పుకున్నా ఒళ్ళు వణుకుతాది. ఇప్పుడు వద్దులేమ్మా. మీరు హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు చెబుతాను" అన్నాడు షణ్ముగం.
"మీకు తిరిగి వెళ్లడం కూడా ఉందా?" అన్న మాటలు బయటనుండి వినపడ్డంతో భయపడింది సావిత్రి.
"ఎవరు మాట్లాడుతున్నది?" అని గట్టిగా అరిచింది సావిత్రి.
"ఏమైంది సావిత్రీ?" అని అడిగాడు శ్యామల రావు ఓపిక తెచ్చుకొని పైకి లేవబోతూ.
"మీరు లెయ్యవద్దు" అంది సావిత్రి.
తరువాత చంద్రిక వైపు తిరిగి "నీకేమైనా మాటలు వినిపించాయా?" అని అడిగింది.
లేదన్నట్లుగా తలలు ఊపారు చంద్రిక, షణ్ముగం ఇద్దరూ.
శ్యామల రావు, డ్రైవర్ వెంకటేష్ లు కూడా అదే మాట చెప్పారు.
"ఇక మనం బయలుదేరుదాం. అక్కడ అల్లుడుగారు హైరానా పడుతుంటారు. అన్నట్లు ఒకసారి ఫోన్ చేద్దామా?" అన్నాడు శ్యామల రావు.
"ఇందాకే చేసానండి. అమ్మాయికి బాగానే ఉందట. అల్లుడు బాగా అలిసిపోయి ఉన్నాడట. ఫోన్ చెయ్యవద్దన్నాడు" అంది సావిత్రి.
"సరే అయితే" అంటూ పైకి లేవబోయాడు శ్యామల రావు.
గబుక్కున అతనికి చెయ్యి అందించ బోయారు షణ్ముగం, వెంకటేష్ లు.
సున్నితంగా తిరస్కరిస్తూ తనే లేచి నిలబడ్డాడు శ్యామల రావు.
"నాకేం ఫరవాలేదు. ఇప్పుడు ఆ గోవర్ధన్ దయ్యం వచ్చినా భయపడను" అన్నాడు.
మళ్ళీ బయటనుంచి వికృతమైన నవ్వు వినపడింది.
అందరూ అదిరి పడ్డారు.
ముందుగా తేరుకున్న వెంకటేష్ మాట్లాడుతూ "మొరిగే కుక్కలు కరవవు అని అంటారు. నేను బయటకు వెళ్లి కారును ఇక్కడికే తీసుకొని వస్తాను. మీరెక్కుదురుగాని" అన్నాడు.
గుడిసె తలుపు తెరిచి బయటకు వెడుతూ షణ్ముగాన్ని గడియ పెట్టుకొమ్మన్నాడు.
"ఈ గుడిసె తలుపూ, దీనికున్న గడియ ఆ దయ్యాన్ని ఆపలేవు. మనం కూడా బయటకు వెడదాం. ఒక్కడినే ఇలా పంపడం నాకు నచ్చలేదు అన్నాడు శ్యామల రావు.
"ఎవ్వరూ బయటకు రాకండయ్యా. చిటికెలో కారు తెస్తాను" బయటనుంచి అరిచాడు వెంకటేష్.
కొద్ది క్షణాలకే అతడు కారు లోపలికి తేవడానికి వీలుగా గేట్ బాగా తెరిచాడు.
ఆ శబ్దం విన్న అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.
'గండం గడిచినట్లుంది' అనుకొని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సావిత్రి. మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది.
కానీ ఐదు నిముషాలు గడిచినా కారు స్టార్ట్ చేసిన శబ్దం వినపడలేదు.
అందరిలో మళ్ళీ ఆందోళన మొదలైంది.
మరో ఐదు నిముషాలు గడిచాక ఎవరో నలుగురైదుగురు వ్యక్తులు గుడిసెను సమీపిస్తున్నట్లు అడుగుల శబ్దం వినపడింది.
ఇంకా వుంది…
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments