top of page
Original.png

పొలిమేర దాటిన ప్రేమ

#MRamya, #Mరమ్య, #PolimeraDatinaPrema, #పొలిమేరదాటినప్రేమ #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Polimera Datina Prema - Telugu Love Story | M. Ramya - పొలిమేర దాటిన ప్రేమ - తెలుగు ప్రేమ కథ | M. రమ్య

Published in manatelugukathalu.com on 16/03/2026 


“కడప జిల్లా, రామాపురం గ్రామంలో మా ప్రేమ కథ మొదలైంది. మతాలకు అతీతంగా మా ప్రేమ నిలిచింది.

1945 సంవత్సరం నాటికి, మన స్వాతంత్య్రం  కూడా రాలేదు రా మనవడా..


అప్పటిలో నేను సుభాష్ చంద్రబోస్ గారి అభిమానిని. ఆయన నడిచిన దారిలోనే నేను నడవాలని అనుకున్నాను.


మీ అమ్మమ్మ గాంధీ గారి అభిమాని. మా ఇద్దరికీ ఎప్పుడూ పడేది కాదు.”


“అంతా అబద్ధం రా మనవడా! మీ తాతయ్య సుభాష్ చంద్రబోస్ గారి పేరు చెప్పి, నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు.”


“అవునా సుబ్బు, అయితే మీది ప్రేమ వివాహం అన్నమాట!”


“అవునురా మనవడా,” అంటూ నవ్వుతూ ఉన్నాడు రసూల్.


“తాత, మీ ప్రేమను పెద్దలు ఒప్పుకున్నారా? అంటే పాతకాలం కదా, అందుకే అడుగుతున్నా...?”


“లేదురా మనవడా, మాది పెద్దలను మాత్రమే ఎదిరించి పెళ్లి చేసుకున్న బంధం కాదు. మేమిద్దరం చాలాసార్లు ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నాము.”


“అయితే తాత, నాకు మీ లవ్ స్టోరీ చెప్పు. నేను షార్ట్ ఫిల్మ్ తీస్తాను. నా కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుంది” అని అడుగుతూ ఉన్నాడు చక్రవర్తి.


సుబ్బలక్ష్మి నవ్వుతూ, "ఇన్నాళ్లకి మన ప్రేమ కథ ఒక సినిమాగా మారుతుంది!"


"అవును అమ్మమ్మా!" అని పలికాడు చక్రవర్తి.


“తాతయ్యా, అప్పట్లో అమ్మమ్మ ఎలా ఉండేది?”


రసూల్ గుండెల మీద చేయి వేసుకుని, కళ్ళు మూసుకుని...

“పెద్ద పెద్ద కళ్లతో, పెద్దవాలు జడతో, గుండ్రని మొహం, చిన్ని పెదాలు, పెదవిపై మరో చిన్ని పుట్టుమచ్చతో వయ్యారంగా నడుస్తూ వెళ్తూ ఉండేది.


నేను ప్రతిరోజు తన వెంటపడేవాడిని. నన్ను అస్సలు పట్టించుకునేదే కాదు. నేను ఎదురైతే తలదించుకుని పరిగెడుతూ ఉండేది. ఎన్ని ప్రేమలేఖలు రాసినా నా ముందే చించి, నా మనసును గాయపరుస్తూ ఉండేది.


చాలా బాధనిపించింది. కల్లు దుకాణంలో కల్లు తాగుతూ, నా స్నేహితులతో చెప్పుకుని బాధపడేవాడిని. అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. నేను వెంటపడ్డా పట్టించుకునేదే కాదు.


‘మనకు స్వాతంత్య్రం  వచ్చింది సుబ్బలక్ష్మి.. ఇప్పటికైనా నా ప్రేమను అంగీకరించు’ అని ఎన్నోసార్లు బ్రతిమిలాడేవాడిని. నేను ఆ బాధతో మందుకు బానిస అయ్యాను. రోజు తనని చూస్తూ ఉంటే, నా బాధ మరింత పెరిగిపోయింది.


అనుకోకుండా ఒక రోజు తన స్నేహితురాలు వచ్చి, ‘నువ్వు ఇలా తాగుతూ ఉంటే సుబ్బలక్ష్మికి నచ్చడం లేదట’ అని చెప్పి పరిగెత్తి పారిపోయింది.


నాకు ఒక్కసారిగా తాగిన మత్తు అంతా దిగిపోయింది. ‘ఏంటి?’ అంటూ తన వెనక పరిగెత్తి, మార్గమధ్యంలో పడిపోయాను.


మరుసటి రోజు నేను లేచి చూసేసరికి మా ఇంట్లో మంచం మీద ఉన్నాను. నేను కల అని అనుకుని మళ్లీ మందు తాగాను.


అప్పుడు మీ అమ్మమ్మ ఒక్క చూపు చూసింది. ఆ చూపు ఇప్పటికే నా గుండెలో ఉండిపోయింది.


దెబ్బకు మందు బాటిల్ కింద పడేసి, తన వెనుక వెళ్లాను. నన్ను చూడగానే పారిపోయే తను, ఈసారి పరిగెత్తడం లేదు. ఇద్దరం నెమ్మదిగా నడుస్తున్నాము. తన స్నేహితురాళ్లు అందరూ ముందుకు వెళ్లిపోయారు.


"నీ పేరేంటి?" అని నెమ్మదిగా అడిగింది నా సుబ్బు.


"ఏంటి, ఇన్నాళ్లు నా పేరు కూడా తెలీదా నీకు?" అని ఆశ్చర్యంగా అడిగాను.


"నా స్నేహితురాలు ఒకరు నీ పేరు రఫీ అని, మరొకరు నబి అని, మరొకరు రసూల్ అని చెప్పారు" అని సమాధానం చెప్పింది.


నేను నవ్వుకుంటూ, "నా పేరు నబి రసూల్" అని సమాధానం చెప్పాను.


"నువ్వు నా పేరు తెలుసుకోవాలంటే నన్ను అడిగితే సరిపోతుంది కదా! నీ స్నేహితురాళ్లను ఎందుకు ఇబ్బంది పెట్టావు?"


"అమ్మో నాన్నా!" అంటూ మళ్లీ నా సుబ్బు పరుగు తీసింది.


ఇక అంతే! నా మనసు గాల్లో తేలి ఆడింది. ఆ రోజంతా నేను చాలా సంతోషంగా ఉప్పొంగిపోయాను.


అలాగే నాతో కొంచెం కొంచెం మాట్లాడుతూ ఉండేది. ఒక రోజు రాత్రి అకస్మాత్తుగా నా ఇంటి దగ్గరికి వచ్చి, "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగింది.


నేను ఇంక ఏమీ ఆలోచించలేదు. తన మాటకి గౌరవం ఇచ్చి, "ఇప్పుడే గుడికి వెళ్లి పెళ్లి చేసుకుందామా?" అని అడిగాను.


"ఇప్పుడు కాదు, రేపు మనం పెళ్లి చేసుకుందాం. పక్క ఊరి శివాలయంకి వచ్చేసేయ్" అని అంది. "ఈ విషయం ఎవరికీ చెప్పకు" అని చెప్పి వెళ్ళిపోయింది.


నేను మరుసటి రోజు శివాలయం దగ్గరికి వెళ్లి నిలబడి ఉన్నాను.


అప్పటికే అక్కడ చాలామంది సందడిగా తిరుగుతున్నారు. ఎవరిదో పెళ్లి అవుతుందన్నట్టుగా నాకు అనిపించింది.


సుబ్బలక్ష్మి స్నేహితురాళ్లు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో కనుక్కుని రమ్మని నా స్నేహితుడిని అక్కడికి పంపాను.


వాడు వెళ్లి, కొన్ని నిమిషాల్లోనే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, "ఒరేయ్! అక్కడ సుబ్బలక్ష్మి పెళ్లి జరుగుతుంది రా" అంటూ చెప్పాడు.


నాకు విపరీతమైన కోపం వచ్చింది. కోపంతో సుబ్బు దగ్గరికి వెళ్లాను. అప్పటికి సుబ్బలక్ష్మిని వాళ్ల నాన్న గట్టిగా కొడుతూ ఉన్నాడు.


నాకు కోపం వచ్చి సుబ్బలక్ష్మి నాన్నను పక్కకి నెట్టాను. తను వచ్చి నా వెనక నిలబడింది. సుబ్బలక్ష్మి నాన్న పైకి లేచి, నన్ను కొట్టడానికి మీదకి వచ్చాడు.


ఇంతలో నా కుటుంబ సభ్యులు, మత పెద్దలు అందరూ అక్కడికి చేరుకుని, సుబ్బలక్ష్మి నాన్నతో గొడవ పడుతూ ఉన్నారు.


కొద్దిసేపటికి గ్రామం మధ్యలో మమ్మల్ని నిలబెట్టి పంచాయితీ పెట్టారు.


మా ఇద్దరికీ 'మీ మతాలు వేరు' అని నచ్చజెప్పడానికి చూశారు.


‘మాకు మా ప్రేమే ముఖ్యం’ అని తెగేసి చెప్పాము.


‘అయితే మీరు ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలి’ అని చెప్పారు.


మేమిద్దరం కట్టుబట్టలతో ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని, అక్కడి నుండి బయలుదేరాము. నా సుబ్బు తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి తన అమ్మ చేతిలో పెట్టింది.


ఇద్దరం అలా మొట్టమొదటిసారి ఊరు దాటాము. పొలిమేర దాటిన దగ్గర నుండి సుబ్బు బాగా ఏడవడం మొదలుపెట్టింది.


‘నేను నా వాళ్ళని చూడకుండా ఉండలేను’ అని ఏడుస్తూ ఉంది.


ఊరు బయట ఉన్న పాడుబడిన ఒక ఇంట్లో మేము ఆ రోజంతా ఉన్నాము.


మరుసటి రోజు అక్కడికి ఒక పెద్దాయన వచ్చి మాకు అండగా నిలబడ్డాడు.


‘నాకు ఇక్కడ 20 ఎకరాల పొలం ఉంది. మీరు దాన్ని సాగు చేసుకోండి’ అని చెప్పారు. మా ఇద్దరికీ కూడా ఆయన సమక్షంలోనే పెళ్లి అయ్యింది.”


"ఆ తర్వాత సమస్యలు ఏమీ రాలేదా తాత?" అని అడిగాడు చక్రవర్తి.


"అసలు సమస్యలు ఇప్పుడే మొదలయ్యాయి. మా ఇద్దరికీ పొలం పనులు చేయడం రాదు. ఏదో ప్రయత్నం చేసేవాళ్లం. చాలా దెబ్బలు తగులుతూ ఉండేవి. సుబ్బు చేతులు కందిపోవడం చూసి నేను అస్సలు తట్టుకోలేకపోయాను."


"మరి మన సుబ్బు కోసం ఏం చేశావు తాతయ్యా?" అని అడిగాడు చక్రవర్తి.


నేను మాకు ఆశ్రయం ఇచ్చిన పెద్దాయన దగ్గరికి వెళ్లాను. "అయ్యా, నేను పొలం పనులు చేస్తాను. మా సుబ్బు పిల్లలకు చదువు చెబుతుంది. కాస్త ఎవరైనా పిల్లలను పంపండి" అంటూ అడిగాను.


"ఏంటి, మీ ఆవిడ చదువుకుందా? నువ్వు కూడా చదువుకున్నావా?" అని అడిగారు ఆ పెద్దాయన.


"ఇద్దరం చదువుకున్నాము" అని నేను సమాధానం చెప్పాను.


"మీ ఇద్దరూ పీయూసీ వరకే చదివారు కదా?" అని చక్రవర్తి నవ్వుతూ పలికాడు.


"అప్పట్లో అదే చాలా ఎక్కువ రా మనవడా" అని రసూల్ అన్నాడు.


"ఆ తర్వాత ఏమైంది తాతయ్యా?"


ఆయన లేచి, గబగబా కండువా భుజం మీద వేసుకుని, నా చేయి పట్టుకుని ఊరిలో ఉన్న ఒక పెంకుటింటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు.


అక్కడ కొంతమంది పిల్లలు ఆడుతున్నారు.


"నువ్వు ఈ పిల్లలకు చదువు చెప్పు చూద్దాం" అని అన్నారు.


నేను ముందు వెళ్లి పిల్లల ముందు నిలబడ్డాను. "నమస్తే పంతులుగారు!" అంటూ వాళ్ళు అందరూ పలకరించారు. నేను కూడా నమస్తే చెప్పి, ముందుగా అక్కడ ఉన్న పిల్లల పేర్లు ఒక్కొక్కరిని అడిగి మరీ తెలుసుకున్నాను.


అక్కడ బోర్డు మీద ఒక పద్యం రాసి, దాన్ని చదివి, దాని గురించి వివరంగా చెప్పాను.


ఆ తర్వాత గాంధీ గారి గురించి, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారి గురించి కూడా చెప్పాను. కొద్దిసేపటికి బడి గంట మోగింది, పిల్లలందరూ కూడా వెళ్లిపోయారు.


పెద్దాయన మాత్రం చమరుస్తున్న కళ్ళతో నన్ను కౌగలించుకున్నాడు.


"ఏమైంది పెద్దాయనా?" అని అడిగాను.


"వీళ్లంతా అంటరాని వాళ్ళు. వీళ్ళకు చదువు చెప్పను అని ఇక్కడకు వచ్చిన పంతుళ్లు అందరూ వెళ్లిపోతున్నారు.


ఏ పంతులు వచ్చినా ముందు కులం గురించి అడిగి పిల్లల్ని ఇబ్బంది పెట్టేవారు. పిల్లలకు కులం గురించి తెలియకపోయినా, నాకు తెలుసు కదా, అందుకే నాకు చాలా బాధ అనిపించేది.


నాకు చదువు రాదు కానీ, తాతల ఆస్తి వల్ల నేను సుసంపన్నుడిని. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరబోతోంది.’


నేను, నా సుబ్బు పాఠశాల బాధ్యతలన్నీ తీసుకున్నాము. కొన్ని రోజులకే ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాము. నా సుబ్బు పాఠాలతో పాటు సంగీతం, నాట్యం నేర్పుతూ ఉండేది. ఆడవాళ్లకు కుట్లు, అల్లికలు, పిండి వంటలు నేర్పి తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తూ ఉండేది.


అలా రాను రాను మతాంతర, కులాంతర వివాహాలు చేసుకుని మా ఊరిలో ఉండడం మొదలుపెట్టారు.


రోజు ఏదో ఒక ప్రేమ వివాహం జరుగుతూ ఉండేది. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఊరిలోనే ఏదో ఒక పని చేసుకుంటూ స్థిరపడడం మొదలైంది. అలా ఊరి జనాభా సంఖ్య పెరుగుతూ వచ్చింది.


వాళ్ళను పలకరించి పోదామనే చుట్టాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అప్పటి నుండే మళ్లీ మా ఊరిలో కుల, మత గొడవలు పెరిగాయి.


అప్పుడు అందరం కలిసి ఊరిలో జాతర చేద్దాం. ‘అప్పుడు మాత్రమే చుట్టాలు రావాలి. మిగిలిన సమయంలో రాకూడదు’ అని ఒక ఒప్పందానికి వచ్చాము.


‘ఎలాంటి కష్టం వచ్చినా ఊరిలో ఉన్న మనమే ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి’ అని మాట్లాడుకున్నాం.


కొంతమంది గొడవ చేశారు, కానీ మొత్తానికి ఒప్పుకున్నారు. మరి కొంతమంది ఊరు వదిలి వెళ్లిపోయారు. అలా మాకు పుట్టిన పిల్లలు కూడా ఈ పద్ధతి పాటించారు.


రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా, ఈ పద్ధతిని మార్చము అని అందరూ జాతరలో ప్రతిజ్ఞ చేస్తారు.


తరువాతి రోజుల్లో విజ్ఞాన రంగంలో కూడా ప్రగతి సాధించింది మన ఊరు. ఇప్పుడు మన ఊరు దేశానికే ఆదర్శంగా నిలిచింది మనవడా.”


"ఓహో! అందుకేనా తాతయ్యా మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది!"


"మరి ఎందుకని విదేశీ అమ్మాయిలు ఇక్కడ ఎక్కువగా ఉంటున్నారు?" అని నవ్వుతూ అడిగాడు చక్రవర్తి.


"అందుకు కారణం మీ నాన్న చేసిన పనే రా. మీ నాన్న విదేశీ వివాహం చేసుకుని, ఇక్కడ విదేశీయులకు కూడా స్థానం కల్పించాడు" అని గట్టిగా నవ్వుతూ రసూల్ సమాధానం ఇచ్చాడు.


"బాగుంది తాతా! నువ్వు మతాంతర వివాహాలు మొదలుపెడితే, మా నాన్న దేశాంతర వివాహాలు మొదలుపెట్టారు" అని గట్టిగా నవ్వుతూ పలికాడు చక్రవర్తి.


"దేశాలు, మతాలు, కులాలు కంటే ప్రేమ గొప్పది. కలిసి ఉండటం అంతకంటే గొప్పది" అని రసూల్ పలికాడు.

ముగింపు


M. రమ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: M. రమ్య


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page