మమతానురాగాల హరివిల్లు
Telugu family emotional story, Telugu family values story, Telugu mother emotional story, Telugu relationship story, Telugu moral story

Mamathanuragala Harivillu - Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 20/05/2026
మమతానురాగాల హరివిల్లు - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
“ఏమే! సావిత్రి! కాలేజీ నుంచి దివ్య ఇంకా రాలేదే? ఆలస్యంగా వస్తానని ఏమైనా చెప్పిందా?” అడిగాడు రామ్మూర్తి భార్యను.
“నాతో ఏంచెప్పలేదే? ఎందువలన ఆలస్యమైందో? ఏమిటో? నేనూ అదే ఆలోచిస్తున్నాను” అంది సావిత్రి.
కాసేపటికి దివ్య ఇంటికి రావడంతో వాళ్ల మనసు కాస్త కుదుటపడింది. అందరూ కలిసి వేడి టీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.
ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రామ్మూర్తి మధ్యతరగతి కుటుంబీకుడే అయినా అభిమానం ఆభరణంగా బతుకుతున్నాడు.
ఆయన చాలా క్రమశిక్షణ గలవాడు. భార్య సావిత్రి, ఇద్దరు కొడుకులు అర్జున్, కిరణ్, ఒక కూతురు దివ్యలతో సంతోషంగా ఉంటున్నారు.
వాళ్ల ఇల్లు పెద్దది కాదు, కానీ ప్రేమాప్యాయతలతో ఆ ఇల్లు నిండిపోయి ఉంది.
సావిత్రి ఉదయం లేవగానే అందరికీ కాఫీ పెట్టేది. పిల్లలు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. చాలా కష్టపడి పిల్లలను పెంచి మంచి చదువులు చెప్పించారు రామ్మూర్తి దంపతులు.
“మన దగ్గర డబ్బు తక్కువైనా, మనం ప్రేమానురాగాలతో కలిసుంటే చాలు” అని రామ్మూర్తి చెప్పేవాడు. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించేవారు.
అర్జున్ పెద్దవాడు. స్వతహాగా చాలా తెలివి గలవాడు. కష్టపడి చదివి ఇంజనీర్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించాడు.
కిరణ్ కొంచెం అల్లరి, కానీ మనసు బంగారం. చదువును అంత శ్రద్ధగా తీసుకోక ఆడుతూ పాడుతూ డిగ్రీ చదువుతున్నాడు. ఆ ఇంట్లో దివ్య అంటే అందరికీ ప్రాణం. దివ్య ఇంటర్ చదువుతోంది.
కాలం హాయిగా గడిచిపోతోంది. చూస్తూండగానే కిరణ్, దివ్యల చదువులు పూర్తయి వాళ్లు ఉద్యోగాలలో సెటిలయ్యారు.
అర్జున్ కి తను ప్రేమించిన అమ్మాయి మాధవితో పెళ్లి చేశారు సావిత్రమ్మ దంపతులు. మాధవి మొదట్లో అందరితో బాగా కలిసిపోయింది.
సావిత్రి ఆనందంగా, “ఇక మా ఇంటికి ఇంకో కూతురు వచ్చింది” అనుకుంది.
కానీ జీవితం సినిమా కాదు కదా… కొంతకాలానికి ఆ ఇంట్లో చిన్న చిన్న మార్పులతో, చిన్న చిన్న అపార్థాలు మొదలయ్యాయి.
ఒకరోజు సావిత్రి వంటగదిలో వంట చేస్తోంది. మాధవి వచ్చి, “అత్తయ్యా! ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నారు? బయట నుంచి ఆర్డర్ చేద్దాం” అంది.
సావిత్రి నవ్వి, “ఇంట్లో చేసిన భోజనం రుచి వేరు అమ్మా” అంది.
అది సాధారణ మాటే. కానీ మాధవికి అది తన మాటను అత్తగారు పట్టించుకోలేదన్న భావన కలిగింది. ఇలాంటివే మరికొన్ని జరిగాయి. ఆ రోజు నుంచి ఆమె అత్తగారితో కాస్త దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఆ రాత్రి అర్జున్ తో, “ఈ ఇంట్లో నా మాటకి విలువ లేదు” అంది.
అర్జున్ ఆశ్చర్యపోయాడు. “ఏమైంది?” అని అడిగాడు.
“మీ అమ్మకి నేనేం చేసినా నచ్చదు.”
అర్జున్ మధ్యలో చిక్కుకున్నాడు.
ఒకవైపు భార్య, మరోవైపు తల్లి. కొంతకాలంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారాయి. సర్దుబాటు చేద్దామన్నా సావిత్రి ఏనాడు తన కోడలిని తప్పుబట్టే పని చేయలేదు సరికదా! కొడుకుతో నేరాలు చెప్పేది కాదు. అన్నిటికీ సర్దుకుంటూ మాధవి పట్ల ప్రేమగా ఉండసాగింది. కానీ మాధవికి ఎందుకో ఆవిడ నచ్చేది కాదు.
మరో రెండేళ్ల తర్వాత కిరణ్, దివ్యల పెళ్లి కూడా చేశారు రామ్మూర్తి దంపతులు. కిరణ్ భార్య సుమ కాపురానికి వచ్చింది. దివ్య వేరే ఊరిలో అత్తవారింటికి భర్తతో వెళ్లింది.
మాధవి, సుమలు అన్యోన్యంగా ఉంటూ సమయం దొరికితే అత్తగారి మీద ఆక్షేపణలు, నేరాలు, గుసగుసలు చెప్పుకునేవారు. వాళ్ల ప్రవర్తన సావిత్రికి చూచాయగా అర్థమవుతున్నా వాళ్లు తనకి దివ్య లాంటి వాళ్లే కదా! నిదానంగా వాళ్లే తనను అర్థంచేసుకుంటారని తన మనసుకి సర్దిచెప్పుకుని వాళ్లిద్దరినీ ప్రేమగా చూసుకునేది.
ఒకరోజు భోజనం సమయంలో గొడవ పెద్దది అయింది.
మాధవి కోపంగా, “మనం వేరే ఇంట్లో ఉంటే బెటర్” అంది తన భర్తతో.
ఆ మాట విన్న సావిత్రి చేతిలో ఉన్న గిన్నె జారి పడింది.
రామ్మూర్తి నిశ్శబ్దంగా ఉన్నాడు.
అర్జున్ కూడా కోపంతో, “అమ్మా! మనం కొంత కాలం విడిగా ఉంటే అందరికీ మంచిదేమో” అన్నాడు.
ఆ మాట విన్న సావిత్రి కళ్లలో నీళ్లు.
“ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రేమగా పెంచింది ఇది వినడానికా?” అనుకుంది మనసులో.
కొన్ని రోజులకే అర్జున్, మాధవిలు వేరే ఇంటికి వెళ్లిపోయారు.
ఆ ఇల్లు పెద్దగా ఉన్నా ఖాళీగా, శూన్యంగా అనిపించింది. కిరణ్ తన ఉద్యోగం బదిలీ చేసుకుని భార్యతో వేరే ఊరెళ్లాడు. అక్కడ వాళ్లు హాయిగా కాపురం చేసుకుంటున్నారు.
కొడుకులిద్దరి వేరు కాపురాలను చూసి సావిత్రమ్మ, రామ్మూర్తి దంపతులకు బాధ కలిగినా పెద్దమనసుతో తమ మనసులకు సర్దిచెప్పుకుని బతుకుతున్నారు.
కొన్ని నెలల తర్వాత రామ్మూర్తికి హార్ట్ ఎటాక్ వచ్చింది. సావిత్రి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆయన్ని హాస్పిటల్ లో చేర్చింది. డాక్టర్లు వైద్యం చేసి బతికించారు. ‘హమ్మయ్య’ అని సావిత్రి ఊపిరి పీల్చుకుంది. ఆవిడ తన కొడుకులకు, కూతురికి కబురు చేసింది.
విషయం విన్న అర్జున్, కిరణ్, దివ్యలు వెంటనే ఆసుపత్రికి వచ్చి తండ్రిని చూసి కన్నీరు పెట్టారు.
వాళ్లను చూసి రామ్మూర్తి బలహీనంగా నవ్వి, “మీరు మాత్రమే వచ్చారా బాబు…?” అన్నాడు అర్జున్, కిరణ్ లతో.
అర్జున్ తన తండ్రి చేతులు పట్టుకుని ఏడ్చాడు.
“నాన్నా… నన్ను క్షమించండి” అన్నాడు అర్జున్. కిరణ్ తలవంచి మౌనం వహించాడు. రామ్మూర్తికి వాళ్ల పరిస్థితి అర్థమైంది.
రామ్మూర్తి మెల్లగా, “కుటుంబం అంటే జీవితంలో గెలవడం కాదు. ప్రేమానురాగాలతో కలిసుండటం” అన్నాడు. ఇదంతా మౌనంగా గమనిస్తూ బాధగా చూస్తోంది సావిత్రి. ఆ మరుసటి రోజున రామ్మూర్తి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాడు.
తండ్రి మాట అర్జున్ హృదయాన్ని తాకింది. ఆ రోజు రాత్రి అర్జున్ చాలా ఆలోచించాడు. తల్లి తనని ఎంత ప్రేమతో పెంచిందో గుర్తొచ్చింది. ఆ మరురోజు ఉదయాన్నే మాధవిని తీసుకుని వెళ్లి సావిత్రి ముందు నిలబడ్డాడు.
“అమ్మా… తప్పు చేశాను.”
సావిత్రి ఒక్క క్షణం అతన్ని చూసి దగ్గరకు తీసుకుని ఏడ్చింది.
“నువ్వు సంతోషంగా ఉంటే చాలు రా” అంది.
కిరణ్ లో కూడా మార్పు వచ్చి ఇంటికి వెళ్లి సుమను వీరి వద్దకు తీసుకుని వచ్చాడు.
మాధవి క్షమాపణ అడిగింది.
“అత్తయ్యా! ఆరోజున నేను కూడా తొందరపడ్డాను. నన్ను క్షమించండి” అంది. మాధవి, సుమలు ఆవిడ పాదాలకు నమస్కరించారు. వాళ్లిద్దరినీ దగ్గరకు తీసుకొని ప్రేమగా హత్తుకుంది సావిత్రి. ఇదంతా చూస్తున్న రామ్మూర్తి సంతోషించాడు.
సావిత్రి నవ్వి, “ఇంట్లో వాళ్ల మధ్య క్షమాపణలు ఉండవు అమ్మా. మనమధ్యన ప్రేమ ఉంటే చాలు” అంది.
కొన్ని రోజుల తర్వాత అందరూ మళ్లీ కలిసి ఉండటం మొదలుపెట్టారు.
ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు, గలగల సందడి. ఇదంతా తెలిసి దివ్య చాలా సంతోషించింది.
ఒకరోజు భోజనం చేస్తూ రామ్మూర్తి
“మన ఇల్లు ఇటుకలతో కాదు… మన మనసుల ప్రేమానురాగాలతో కట్టుకున్నాం” అన్నాడు.
అందరూ నవ్వారు.
సావిత్రి దేవుడిని చూసి, “ఇంతకంటే పెద్ద సంపద మనకు లేదు. ఈ తృప్తి చాలు” మనసులో అనుకుంది.
కుటుంబంలో గొడవలు సహజం. కానీ అహంకారం పెరిగితే బంధాలు దూరమవుతాయి. ఒక అడుగు వెనక్కి వేసి మాట్లాడితే, విరిగిన బంధాలు కూడా మళ్లీ కలుస్తాయి.
ప్రేమ ఉన్న చోటే ఇల్లు ఉండి ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. మమతానురాగాల హరివిల్లు అవుతుంది.
నీరజ హరి ప్రభల గారి కొన్ని ఇతర రచనలు:
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link











Comments