నిక్ నేమ్
- Peddada Sathyanarayana

- 12 hours ago
- 3 min read
Telugu family story, Telugu humorous story, Telugu marriage story, Telugu emotional comedy story, Telugu short story

Nick name - Telugu Comedy Story | - Peddada Sathyanarayana
నిక్ నేమ్ - తెలుగు హాస్య కథ | పెద్దాడ సత్యనారాయణ
Published In manatelugukathalu.com On 20/05/2026
పాత కాలపు పెళ్లిచూపులు, పెద్దల మాట, సంప్రదాయ కుటుంబ వాతావరణం… వీటన్నింటి మధ్య ఒక చిన్న “నిక్ నేమ్” వల్ల జరిగిన అపార్థం ఎలా పెళ్లిని almost ఆపేసిందో హాస్యంతో చెప్పే మధురమైన తెలుగు కథ ఇది. చివర్లో వచ్చే ట్విస్ట్ పాఠకుడి ముఖంలో చిరునవ్వు తెప్పిస్తుంది.
“చాలా రోజుల తర్వాత పార్కుకి వచ్చావు, ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళావు?” అని రాజారాం కృష్ణమూర్తిని అడుగుతాడు.
“అనుకోకుండా మా రెండో అమ్మాయికి సంబంధము వస్తే చూసేందుకు భీమవరం వెళ్లవలసి వచ్చింది. అక్కడ దగ్గరలో మా అక్క కూతురు పాలకొల్లులో ఉంటే చూసి వచ్చాను.”
“అలాగా? సంబంధము కుదిరిందా?”
“మీకు తెలియనిదేముంది, ఈ రోజుల్లో అమ్మాయిలని, అబ్బాయిలని అర్థము చేసుకోవటం మన వాళ్ళకు అవటం లేదు. వారికి ఏది తోస్తే అది సరయినదని భావిస్తూ, మన మాటలకి విలువ ఇవ్వటం లేదు.”
“నిజమే. మన రోజుల్లో తల్లిదండ్రులు చెప్పిందే వేదము అన్నట్టు మసలుకునే వాళ్ళము. పెద్దవాళ్ళు అన్ని విధాలా ఆలోచించి మరియు వాకబు చేసుకొని వివాహాలు జరిపించేవారు” అన్నాడు రాజారామ్.
“రాజారామ్ గారు, మీది పెద్దలు కుదిర్చిన సంబంధము కదా? మీ పెళ్లిచూపుల్లో జరిగిన సంగతులు చెప్పగలరా?”
“తప్పకుండా. దాదాపు నలభై సంవత్సరాల క్రితము సంప్రదాయరీతిలో మా పెద్ద వాళ్లతో సంబంధాలు చూసేందుకు వెళ్ళేవాడిని. రెండు సంబంధాలు జాతకాలు కుదరలేదని తప్పిపోయాయి. మూడో సంబంధము కుదిరింది. మా మావగారి ఇల్లు రెండువందల గజాల స్థలములో నాలుగు గదుల ఇల్లు, చుట్టూ ప్రహరీ గోడ మరియు మొక్కలతో ఉంది. యధావిధముగా పెళ్లిచూపులు జరిగిన పిదప మేమందరము గేటు తీసుకొని బయటకి వచ్చి ప్రతి నమస్కారాలు చెప్పి బయలుదేరాము.
కొంచము దూరము వెళ్లిన తర్వాత రెండుసార్లు తల వెనక్కి తిప్పి పెళ్లికూతురుని చూసాను. మూడోసారి తల వెనక్కి తిప్పబోతే నా పక్కన ఉన్న పెద్దమ్మ నా భుజము గిల్లి వారించింది. నేను బుద్ధిగా వాళ్ళని అనుసరించాను.
జాతకాలు కుదిరాయని నాన్నగారు మధ్యవర్తి ద్వారా కబురు పంపారు. నెల రోజులు గడిచినా ఆడపెళ్ళివారి నుంచి జవాబు రాలేదు. ఒకరోజు మధ్యవర్తి మా ఇంటికి వచ్చి, "ఆడపెళ్ళివారు మీ వాడి గురించి వాకబు చేస్తే, సత్యనారాయణ
అనే వ్యక్తి మీరు చెప్పిన కార్యాలయములో లేడని తెలిసింది. అందుకే ఆడపెళ్ళివారు వారు మీకు సమ్మతి తెలుపలేదు."
మా నాన్నకి చాలా కోపము వచ్చింది. కోపము తమాయించుకొని మధ్యవర్తిని పంపించి, నన్ను పిలిచి జరిగిన సంగతి చెప్పారు.
"నాన్న, నేను మా ఆఫీసులో ఏమి జరిగిందో కనుక్కొని మీకు చెప్తాను."
నేను మరుసటి రోజు రిసెప్షన్ రూమ్ కి వెళ్లి, “నా గురించి గత వారము రోజుల్లో ఎవరైనా వచ్చారా” అని అడిగాను.
రిజిస్టర్ చెక్ చేసి, "పోయిన శుక్రవారము, రాజు అనే వ్యక్తి వచ్చి సత్యనారాయణ అనే అతనిని కలవాలని అడిగారు. మా కార్యాలయములో సత్యనారాయణ అనే పేరుగల వ్యక్తి లేరని చెప్తే వెళ్లిపోయారు" అని వివరముగా చెప్పాడు రిసెప్షనిస్ట్ సుందర్.
"కొంప ముంచావు కదా సుందర్!" అన్నాను.
"ఏమైంది సతీష్?" అని అడిగాడు సుందర్.
"సుందర్, నా అసలు పేరు సత్యనారాయణ కానీ అందరు నన్ను సతీష్ అని నిక్ నేమ్ తో పిలవడము అలవాటు."
"ఈ రోజు దాకా నీ పేరు సత్యనారాయణ అని నాకు తెలియదు, ఇంతకీ ఏమైంది?" అని అడిగాడు సుందర్.
జరిగిన పెళ్లి చూపుల గురించి చెప్పాను. "సుందర్, వచ్చినవాళ్ళ ఫోన్ నెంబర్ రాసావా?" అని అడిగితే, రిజిస్టర్ చెక్ చేసి
ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
"సుందర్, నీవు వెంటనే రాజుగారికి ఫోన్ చేసి అసలు సంగతి వివరముగా చెప్పు."
"ఓకే" అని సుందర్ చెప్పాడు.
తర్వాత ఆడపెళ్ళివారు మా ఇంటికి వచ్చి సంబంధము ఖాయము చేసుకొని వివాహము జరిపించారు. ఆ విధముగా మా వివాహము జరిగింది.”
"పెళ్లిళ్లు స్వర్గములో జరుగుతాయి అనే మాట నిజమేనేమో” అని ముగిస్తాడు రాజారామ్.
***
పెద్దాడ సత్యనారాయణ గారి కొన్ని ఇతర రచనలు:
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.









Comments