ఉమ్మడి బంధాలు
- Peddada Sathyanarayana
- Jul 31
- 4 min read
#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #UmmadiBandhalu, #ఉమ్మడిబంధాలు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Ummadi Bandhalu - New Telugu Story Written By - Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 31/07/2025
ఉమ్మడి బంధాలు - తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“అమ్మా, టొరొంటోలో మా స్నేహితులంతా నేను చాలా అదృష్టవంతురాలని అంటారు” అని చెబుతుంది సుకన్య, తల్లి కమలతో.
"ఎందుకే?" అని అడుగుతుంది కమలమ్మ.
"పుట్టింటివాళ్లు మరియు అత్తింటివారు భాగ్యనగరంలో ఉన్నారని, హాయిగా ఉన్న ఊళ్ళోనే నెలరోజులు గడుపుతానని అంటారు."
"నిజమే కదా! మాకు నీవు ఒక్కగానొక్క కూతురివి. అదే విధంగా నీకు ఆడపడుచులు, మరుదులు లేరు. అత్తామామలు కూడా నిన్ను కూతురు మాదిరే చూసుకుంటారు. నీవు ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు," అంటుంది కమలమ్మ.
"అమ్మా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నా మిత్రురాలి తల్లిదండ్రులు వరంగల్‌లో, అత్తగారు తిరుపతిలో ఉంటారు. ఇరవై రోజులు తల్లిదగ్గర, పదిరోజులు అత్తామామల దగ్గర ఉండి తిరిగి టొరొంటో వెళ్లిపోతారు.
అదే నా విషయంలోకి వస్తే, అందరూ హైదరాబాద్‌లో ఉన్నారని మాటే గానీ వాస్తవానికి సంతోషం లేదు. అత్తయ్యవాళ్లు ఉప్పల్‌లో, మనం తెల్లాపూర్‌లో ఉంటున్నాం. కనీసం కారులో రెండు గంటలు ప్రయాణం చేస్తే గాని ఉప్పల్ వెళ్లలేము.
నాలుగు రోజులకోసారి నేను పిల్లలను తీసుకు వెళ్లడమో, లేక ఆయన రావడమో జరుగుతోంది. సెలవులంతా అటు ఇటు తిరగడముతోనే సరిపోతుంది.
ఈ ప్రయాణం వలన పిల్లలకు జలుబు, దగ్గులు రావడం, ఆసుపత్రుల చుట్టూ తిరగడం సర్వ సాధారణం అయిపోతోంది," అని తన బాధను చెబుతుంది తల్లితో.
"సరే, నీవు కూడా పదిహేను రోజులు ఇక్కడ, మిగిలిన రోజులు అక్కడ ఉండొచ్చుకదా?" అంటుంది తల్లి.
"అమ్మా, ఒకే ఊర్లో ఉంటూ ఆ విధంగా ఉండేందుకు మనసొప్పదు కదా!" అంటుంది.
"మేము కూడా విజయవాడలోనో, లేక విశాఖలో ఉండాలని నీ ఉద్దేశమా?" అని అనుమానం వ్యక్తం చేస్తుంది కమలమ్మ.
"అబ్బా, అదేమీ కాదు!" అని జవాబిస్తుంది సుకన్య.
ఇంతలో డోర్‌బెల్ మోగుతే, సుకన్య తలుపు తీస్తుంది.
"రండి! కనీసం కాల్ చేయకుండా వచ్చారేంటి? అంత క్షేమమేనా?" అని అడుగుతుంది భర్త మనోహర్ని.
"సుకన్యా, నిన్న రాత్రి నాన్నకి గుండె నొప్పి వచ్చి ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. ఇంకా అత్యవసర వార్డులోనే ఉన్నారు. అమ్మ అక్కడే ఉంది," అని చెబుతాడు.
"మీరు స్నానం చేసి రండి. ఈలోపల నేను తయారై వస్తాను. ఇద్దరం వెళ్దాం," అంటుంది.
ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లి పరిస్థితి తెలుసుకుని, సుకన్య రాత్రంతా అక్కడే ఉంటుంది. "నీవు అమ్మని ఇంటికి తీసుకెళ్ళు," అని భర్త అంటాడు.
మరుసటి రోజు తండ్రికి నయం అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్తాడు. సుకన్య కూడా పిల్లలతో అత్తగారి ఇంటికి వెళ్తుంది.
నెలరోజులు గడిచిన తర్వాత టొరొంటోకు తిరిగి వెళ్తారు. "ఏమండీ, నెలరోజుల సెలవులు తెల్లాపూర్, ఉప్పల్, ఆసుపత్రుల చుట్టూ తిరగడముతోనే సరిపోతుంది. మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలి."
మనోహర్ తండ్రి రైల్వేలో, సుకన్య తండ్రి బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. తమ తాహతుకు తగినట్టు రెండు గదుల ఫ్లాట్ కొనుక్కున్నారు.
సంవత్సరం తర్వాత మనోహర్ కుటుంబంతో హైదరాబాద్‌కి ప్రయాణమవుతారు. "ఏమండీ, ఈసారి మనం అనుకున్నట్టు పదిహేను రోజులు మీ ఇంట్లో, మిగిలిన రోజులు మా ఇంట్లో ఉండదామా?" అంటుంది.
"సరే, అలాగే ఉండదాం," అంటాడు.
మనోహర్ తండ్రి ఇంట్లో రెండు గదులు, హాలు ఉన్న కారణంగా ఎవరు ఇంటికి వచ్చినా అందరికి ఇబ్బంది కలిగేది. అదే విధంగా సుకన్య పుట్టింట్లో కూడా ఇల్లు చిన్నదయినందువల్ల అసౌకర్యంగా ఉండేది.
"అమ్మా, మేమందరం వస్తే మీకు మరియు పిల్లలకు కూడా ఇబ్బంది అనిపిస్తోంది. నీవే చెప్పు, ఏమి చేస్తే అందరికీ సమంజసం గా ఉంటుంది?" అని అడుగుతుంది సుకన్య.
"అమ్మా, హైదరాబాద్‌లో నాలుగు గదుల విశాలమైన ఇల్లు అద్దెకు తీసుకొని, మేమందరం ఒకచోట ఉండదాం. మేము సెలవులకు వచ్చిన రోజుల్లో వంటమనిషి మరియు పనిమనిషి ఉండే ఏర్పాటూ చేద్దాం అని అనుకుంటున్నాం."
"ఇదేమి విడ్డూరమే వియ్యపురాలు! వియ్యంకులు ఒకే ఇంట్లో ఉండటం నాకు నచ్చదు," అని జవాబిస్తుంది తల్లి.
"అమ్మా, నీవు చెప్పింది నిజమే. ఇదివరకు ప్రతి కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉండేవారు. కోడళ్లూ, అల్లుళ్లు, అనేక మంది బంధువులు ఉండేవారు. ఏదైనా అవసరమైతే ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఉమ్మడి కుటుంబంలో నియమ నిబంధనలు ఉండేవి.
ప్రస్తుతం ఒక్క సంతానంతో సరిపెట్టుకుంటున్నారు. అందుకే భార్యాభర్తలకు మూడో వ్యక్తి తోడు ఉండే అవకాశం ఉండటం లేదు. మనం అరుగురం ఒకే ఇంట్లో ఉంటే, అందరం కలిసి యాత్రలకు వెళ్లే అవకాశం, మనుమలతో సరదాగా గడిపే అవకాశం, ముఖ్యంగా అవసరమైనప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండే అవకాశం ఉంటుంది. మేము తిరిగి టొరొంటో వెళ్లిన తర్వాత మీ ఇష్టం ప్రకారమే ఉండవచ్చు," అని చెబుతుంది.
"మీరు ఉన్న నెలరోజులే కదా. మాకు మీతో పాటు ఉండేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీ అత్తామామలు మనతో ఉండేందుకు ఒప్పుకున్నారా?" అని అడుగుతుంది కమలమ్మ.
"మీ అల్లుడు వాళ్ల అమ్మానాన్నలకు నచ్చజెప్పుతాడన్న నమ్మకం నాకు ఉంది," అని జవాబిస్తుంది సుకన్య.
మనోహర్ కూడా తల్లితండ్రులను తమతో పాటు ఉండేందుకు ఒప్పిస్తాడు. అనుకున్న విధంగా రెండునెలల సెలవులు తీసుకొని మనోహర్, సుకన్య పిల్లలతో అద్దె ఇంటిలో తల్లితండ్రులు, అత్తామామలతో ప్రవేశిస్తారు.
ఒక వారంరోజుల తర్వాత మనోహర్ చెబుతాడు: "నాకు ఆఫీస్ మీటింగ్‌లు ఉన్నాయి. సుకన్య మిత్రురాలి చెల్లెలి వివాహం కూడా ఉంది. మేము పది రోజులు ఢిల్లీకి వెళ్తున్నాం. వంటమనిషి, పనిమనిషి అన్నీ చూస్తారు. ఏదైనా అవసరం ఉంటే మాకు కాల్ చేయండి."
పది రోజులు తర్వాత మనోహర్ ఇంటికి వస్తే, వంటమనిషి తప్పా ఎవ్వరూ కనిపించరు. "యాదమ్మ, అందరూ ఎక్కడికి వెళ్లారు?" అని అడుగుతాడు.
"అయ్యా, ఆసుపత్రికి వెళ్లారు," అని సమాధానం ఇస్తుంది.
సుకన్య పిల్లలకు చెప్పి ఆసుపత్రికి వెళ్తాడు. "ఏమయిందమ్మా?" అని తల్లిని అడుగుతాడు.
"నీ అత్తయ్య గారికి కాటరాక్ట్ కంటి ఆపరేషన్ అయ్యింది. సాయంత్రానికి అందరం ఇంటికి వచ్చేస్తాం," అని అంటుంది.
"మాకు చెప్పొద్దా?" అని తండ్రిని అడుగుతాడు.
"చిన్న ఆపరేషన్ కదా! మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పలేదు," అంటాడు తండ్రి.
"సరే నాన్న, నేను ఇంటికి వెళ్తాను. మీరంతా సాయంత్రం రండి," అని వెళ్తాడు.
రెండునెలల తర్వాత మనోహర్ కుటుంబంతో టొరొంటో వెళ్లేందుకు సిద్ధమవుతారు. "అమ్మా, మావయ్యా – మీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉండండి," అని చెబుతాడు.
నూతన సంవత్సరంలో మళ్ళీ హైదరాబాద్‌కు వచ్చి అత్తామామలు, తల్లితండ్రులు ఇంట్లోకి ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. రెండు రోజుల తర్వాత ఇద్దరు తండ్రులు తమ ఇళ్ల దస్తావేజులు చూపిస్తూ, "మేము ఇల్లు అమ్మడం నిర్ణయించుకున్నాం. ఇకపై అందరం ఇక్కడే కలిసి ఉండాలని అనుకుంటున్నాం," అంటారు.
"ఇంతకంటే మంచి నిర్ణయం ఇంకేముంటుంది!" అని మనోహర్, సుకన్య ఇద్దరూ సంతకం పెడతారు.
***
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
Comments