చరవాణీయం
- Chilakamarri Rajeswari

- 3 hours ago
- 2 min read
#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #Charavaniyam, #చరవాణీయం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Charavaniyam - New Telugu Story Written By - Chilakamarri Rajeswari
Published in manatelugukathalu.com on 04/03/2026
చరవాణీయం - తెలుగు కథ
రచన: చిలకమర్రి రాజేశ్వరి
"ఏమండీ, ఏమండీ, లేవండి!" అంటూ హడావుడిగా రాకేష్‌ను నిద్ర లేపింది సుజాత.
"అబ్బా, ఏమిటే! ఆదివారం కూడా ప్రశాంతంగా నిద్ర పోనివ్వవు!" అంటూ విసుక్కున్నాడు.
"అది కాదండి. వీధిలో 'పాత చరవాణులు కొంటాం, అసలు పనిచేయనివైనా కొంటాం. రెండు చరవాణీలకు మీకు నచ్చిన ఒక చీర ఇస్తాం' అని కేక వినిపిస్తోంది. మన ఇంట్లో చాలా పాత, పనిచేయని చరవాణీలు ఉన్నాయి కదా! అవి ఇచ్చేద్దాం. సగం చెత్త వదులుతుంది, నాకు కొత్త చీరలు కూడా వస్తాయి. పిలవనా వాళ్ళని?" అని అంది సుజాత.
"అబ్బా! నా నిద్ర చెడగొట్టకు! నిన్న రాత్రి, నా ఆఫీసు పని అయి నేను పడుకునేటప్పటికి తెల్లవారుజామున నాలుగు గంటలు అయింది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నన్ను విసిగించకు, దయచేసి!" అంటూ ముసుగు కప్పేశాడు రాకేష్.
'అమ్మయ్య, నాకు ఇష్టం వచ్చింది చేసుకోమన్నారు గా' అని అనుకుంటూ వాళ్ళని పిలిచి ఇంట్లో ఉన్న చరవాణులు అన్నీ ఇచ్చేసింది.
నెమ్మదిగా పన్నెండు గంటలకు నిద్ర లేచాడు రాకేష్. "సుజాతా, కాఫీ ఇస్తావా?" అంటూ పిలిచాడు. "అమ్మయ్య, లేచారా! కాఫీ ఇస్తాను లేండి. ముందు ఒకసారి ఈ గదిలోకి రండి" అంటూ హుషారుగా పిలిచింది సుజాత.
గదిలోకి వచ్చిన రాకేష్ అక్కడ పరిచిన చీరలను చూసి మురిసిపోతున్న సుజాతను "ఏంటి ఇవన్నీ? ఎవరు ఇచ్చారు?" అని అడిగాడు.
"మన ఇంట్లో ఉన్న పాత చరవాణీలు అన్నీ అమ్మేశాను. చరవాణీలకు కొత్త చీరలు ఇస్తామని అన్నారుగా! చూశారా, నా కొత్త చీరలు ఎంత బాగున్నాయో!" ఎంతో సంతోషంగా చెప్పింది సుజాత.
"నీ చీరల గోల ఆపుతావా! ఇంతకీ నా రెండు చరవాణీలు ఎక్కడ పెట్టావు ముందు అది చెప్పు. అవి ఇచ్చి నాకు ముందు కాఫీ ఇవ్వు. తల
పగిలిపోతోంది!" అన్నాడు చిరాకుగా రాకేష్.
"దాని గురించే చెప్తున్నా. ఒక పట్టుచీర బాగా నచ్చింది. మీ రెండు చరవాణీలలో ఒకటి ఇస్తే, ఆ పట్టుచీర ఇస్తానని అన్నారు. అందుకని ఒకటి ఇచ్చేశాను" అని శాంతంగా చెప్పింది సుజాత.
"ఎంత పని చేశావు! దానిలో ఎంత సమాచారం దాచుకున్నానో నీకేం తెలుసు! నీ పట్టుచీర కోసం నా చరవాణి ఇచ్చేస్తావా? ఇప్పుడు అది నాకు ఎలా దొరుకుతుంది? నా చరవాణి నాకు కావాలి! నా చరవాణి నాకు కావాలి!" అంటూ అరిచాడు రాకేష్.
"ఏమండీ, ఎందుకు అలా కేకలు పెడుతున్నారు?" అంటూ తట్టి లేపింది సుజాత.
"ఏమిటి! ఇది కలా! నువ్వు నా చరవాణులను అమ్మేయలేదా వీధిలోకి పాత చరవాణులను కొని చీరలు ఇచ్చేవాడికి?" అంటూ విస్తుపోయాడు రాకేష్.
"భలే కల వచ్చిందే మీకు! ఇది నిజమైతే ఎంత బాగుంటుంది! నాకు బోలెడు కొత్త చీరలు వస్తాయి!" అంది సుజాత.
"హతవిధీ!" అంటూ తల పట్టుకున్నాడు రాకేష్.
***
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.




బాగుంది సరదాగా