మా పండు బాబయ్య పెళ్ళి
Ma Pandu Babayya Pelli - Telugu Family Comedy Story | Varanasi Sudhakar
మా పండు బాబయ్య పెళ్ళి - తెలుగు కుటుంబ హాస్య కథ | వారణాసి సుధాకర్
Published in manatelugukathalu.com on 12/10/2026
పాతకాలపు తెలుగు పెళ్లిళ్ల సందడి, ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు, బంధువుల చమత్కారాలు గుర్తుకొస్తే మనసు మధురమైన జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది. వారణాసి సుధాకర్ రచించిన “మా పండు బాబయ్య పెళ్లి” కథ 1960ల నాటి కాకినాడలో జరిగిన ఒక మరపురాని వివాహ వేడుకను మన కళ్లముందు నిలుపుతుంది.
మా పండుబాబయ్య పెళ్లి సంఘటన తలుచుకున్నప్పుడల్లా...
"ఏటో వెళ్లిపోతుంది మనసు..."
అంత సరదా, సందడి ఉన్న పెళ్లి మళ్లీ నా జీవితంలో నేను చూడలేదు!
ఇప్పుడెన్ని రకాల ఆధునిక సౌకర్యాలు, రంగుల హంగులు, పెద్ద పెద్ద కల్యాణ మంటపాలు, ఖరీదైన బ్యూటీ పార్లర్ అలంకారాలు, భోజనాలు, సూటు-బూట్లు, చీరలు-నగలు, ఫోటోలు-వీడియోలు, సీసీ టీవీలు, కార్లకు అలంకారాలు, బాణాసంచాలు ఎన్ని చూసినా... ఎందుకో ఆ చిన్నప్పటి జ్ఞాపకాలే తియ్యటి అనుభవాలుగా మిగిలిపోయాయి.
అది బాల్యంలో ఉన్న మహిమో, ఎన్ని ఉన్నా ఇప్పటి బుర్రకు ఆనందించడం తెలియదో... తెలియదు!
నాకు పదేళ్లు ఉన్నప్పుడు, మా పండు బాబయ్య పెళ్లి జరిగింది. మా బాబయ్య ఎర్రగా, బుర్రగా ఉంటాడని 'పండూ' అని ముద్దుపేరుతో పిలిచేవారు.
అందుకని, మాకు "పండు బాబయ్య", కొందరికి "పండు మావయ్య" అయ్యాడు! ఆయన అసలు పేరు మాకు చాలా రోజుల దాకా తెలియదు... "సూర్యనారాయణ"...ట!
మా తాతగారికి ఐదుగురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు. ఒక నిర్దిష్టమైన ప్రోగ్రామ్ ప్రకారం అన్నట్లు — ఆడ-మగ, ఆడ-మగ — అలా పుట్టారు! 5️⃣ ఆయన లక్కీ నంబరు కాబోలు!
అందుకే, కూతుళ్లందరికీ 5️⃣ రోజుల పెళ్లిళ్లు చేసేసి, దత్తత ద్వారా వచ్చిన 'యాభై' ఎకరాలను 5️⃣గా మార్చి, కొడుకులు 5️⃣ గురికీ తలో ఎకరం ఇచ్చారు.
ఆఖరువాడైన మా పండుబాబయ్యకి పెళ్లి నాటికి 24 ఏళ్లట. అప్పటికే బాగా లేటైపోయిందని ఇంటిల్లిపాదీ తెగ బాధపడిపోయేవారు.
అటువంటి లేట్ మేరేజీకి, ఆ రోజుల్లో — మేమెవరూ పుట్టకముందే 12 ఏళ్ల లోపే పెళ్లిళ్లు అయిపోయిన — ఐదుగురు మేనత్తలు, వాళ్ల భర్తలు, పిల్లలు, వాళ్ల పిల్లలు, మేము, మా బాబయ్యల పటాలం... మొత్తం ఆరు క్రికెట్ టీముల దాకా పెళ్లికి వారం ముందే కాకినాడ చేరుకున్నాం.
వేసవికాలం సెలవులు కూడా కలిసిరావడాన్నే "కాలం కలిసిరావడం" అంటారు!
1960 ప్రాంతంలో... "కాకినాడ" అంటే మా దృష్టిలో స్వర్గానికి పక్క ఊరే!
మా పటాలం హడావిడికి గాంధీనగర్, రామారావుపేటలు విడివిడిగానూ, ఉమ్మడిగానూ అదిరిపోయేవి. ఎందుకంటే, మా తాతగారిల్లు రామారావుపేటలో ఉంటే, ఇద్దరు మేనత్తలు, ఒక బాబాయి గాంధీనగర్‌ని దత్తత తీసుకున్నారు!
మా పిల్లకాయలమందరం కలిసి ఆ ఇంటికీ ఈ ఇంటికీ అరుచుకుంటూ పరుగెత్తడం ఒక పెళ్లి తంతుగా భావించేవాళ్లం.
"ఎండల్లో తిరక్కండి, నల్లబడిపోతారు, రేపు పెళ్లిలో అందరికీ అందంగా కనబడరు" అని మా నాయనమ్మ అంటుంటే 'కామోసు' అనుకునేవాళ్లం. చల్లబడ్డాక మళ్లీ 'గుయ్యో గుయ్యో' మామూలే!
మా మేనత్తలు, పిన్నులు కలిసి పెళ్లి పనులు చేసుకుంటూ నవ్వులు, హాస్యాలు, వేళాకోళాలు, వెటకారాలు, పాటలతో హడావిడి చేస్తుంటే, హాల్లో మా తాతగారు, నాయనమ్మ చెరో పడక్కుర్చీ వేసుకుని, తాటాకు విసనకర్రలతో విసురుకుంటూ అజమాయిషీ చేస్తుండేవారు.
మా నాన్న పెళ్లిపెద్ద కాబట్టి, ఒకరకమైన అధికార హోదా ప్రదర్శిస్తూ మనవళ్లెత్తిన అత్తయ్యలకు, బాబయ్యలకు ప్రేమపూర్వకంగానే ఆజ్ఞలు జారీ చేసేవారు. వాళ్లూ ఎంతో ఇదిగా పాటించేవాళ్లు.
ఎప్పటి నుంచో మా తాతగారింట్లో ఆస్థాన పాకశాస్త్ర విద్వాంసుడిగా వెలిగిపోతున్న అగ్నిహోత్రుడు గారు, ఆయన భార్య అన్నపూర్ణమ్మతో సహా చాలా బాధ్యతగా కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, వంటలూ-వార్పూ చూసుకుంటూ, మధ్యమధ్యలో ఖాళీ చార్మినార్ సిగరెట్ పెట్టెలు గాడిపొయ్యిలోకి విసిరేసేవాడు.
ఆ ఖాళీ పెట్టెలు మాకిస్తే ఎంచక్కా వాటితో బుట్టలు చేసుకునేవాళ్లం కదా అనుకునేవాళ్లం (కుర్రతనం!).
మేము మా తాతగారింటికి చేరేసరికే కొత్త ఊరగాయలు, అప్పడాలు, వడియాలు, సున్నుండలు, జంతికలు, అటుకులు, అరిశలు... ఇంకా మాకు పేర్లు కూడా తెలియని వాటితో పాటు అక్కడ "వివాహ భోజనంబు" సెట్టింగ్ రెడీగా ఉండేది.
పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వీధి వైపు, దొడ్డి వైపు వేయించి, పెద్ద పెద్ద కుండల్లో మంచినీళ్లు, కింద ఇసుక, చుట్టూ తడిగుడ్డలు, పైన మెరిసిపోయే రాగి చెంబులు పెట్టించేశారు!
వీధి గదిలో మా రైతులతో రకరకాల, రంగురంగుల మామిడిపళ్లు, కొబ్బరిబొండాలు తెప్పించి ఉంచేవారు. ఆ గది పక్కనుంచి వెళ్తుంటే ఆ వాసనకు అటొచ్చి-ఇటొచ్చి... కోతులు లాక్కుపోయినట్లు వచ్చి తినేసేవాళ్లం. 🥭🥭🥭🥭🐒🐒🐒🐒
పొద్దున్నే మా కిష్కింధ బ్యాచ్‌కి చద్దన్నాలు పెట్టడం మా సుగుణ పిన్నికి సరదా...
ఆవిడ ఓపికగా మాకు కొత్త ఊరగాయలు, మామిడిపళ్లతో చద్దన్నం పెడుతూ మంచి మంచి కథలు కూడా చెప్పేది. అందుకే మాకు సుగుణ పిన్నంటే ఇష్టం.
మా రమత్తయ్య అయితే ఆడపిల్లలకు రకరకాల జడలు వేసి, వింత వింత మేకప్‌లు చేయడంలో దిట్ట! కాబట్టి ఆవిడకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ! 💅💅
డాబామెట్ల గది చాలా విశాలంగా ఉండేది. ఆ గదికి ఏసీ లెవెల్లో చల్లదనం తెప్పించి, సకల సౌకర్యాలతో "చతుర్ముఖ పారాయణం" (పేకాట) బ్యాచ్‌కి కావలసిన అన్ని హంగులు ఏర్పాటు చేసే బాధ్యత మా శీను బాబయ్య తీసుకున్నాడు.
'సెలవు' మీదున్న లేడీస్‌కి విశ్రాంతి గది ఎక్కడో... శ్రీలంకలో ఉండేది!
వాళ్లకు కావలసిన అన్నిరకాల కేటరింగ్ సర్వీసులు "టీనేజీ ఆడపిల్లల బాధ్యత" అని మా నాయనమ్మగారు జీవో పాస్ చేశారు.
"మధ్యాహ్న భోజన పథకం" కానిచ్చి, 'అర్హులైన' మగంగాలంతా వాళ్ల వాళ్ల మనీ పర్సులు తీసుకుని డాబామెట్ల గదికి చేరుకునేవాళ్లు.
అక్కడ సందడి ఉండేది... నవ్వులు, జోకులు, ఎక్కసెక్కాలు, బావా-బావమరుదుల వేళాకోళాలు, తోడల్లుళ్ల రిటార్టులు... అదొక హాస్య సమ్మేళనం!
మా పిఠాపురం మావయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమాలో కామెడీ ట్రాక్‌లు రాసేవాళ్లు ఆయన దగ్గరకు వస్తే వాళ్లకు కావలసినంత మెటీరియల్ దొరుకుతుంది. 'ఇలా కూడా జోకులు వేయొచ్చా' అనిపిస్తుంది!
తోడల్లుళ్లు, బావమరుదుల మీద ఆయన వేసే జోకులు అందరినీ మూకుమ్మడిగా ఘొల్లుమనిపించేవి.
పది నిమిషాలకు ఒకసారైనా 'ఘొల్లులు' తప్పవు! అన్ని రకాల జోకులు ఎలా వస్తాయని ఆశ్చర్యపోయేవాళ్లం. ఎవరు ఏమి మాట్లాడినా దానిమీద చటుక్కున ఒక 'పన్' వేసేవాడు.
నాలాంటి కుర్రసన్నాసులను "ఒరే పినాకపాణీ" అని పిలిస్తే, "పీనే కా పానీ" (మంచినీళ్లు) తెమ్మని...ట!
"ఒరే బావమరుదులూ, మీ నాన్న లక్కీ నంబరు 5️⃣. ఆయన పేరు నిలబెట్టండిరా" అనేవాడు (అంటే వాళ్లందరూ ఐదుగురేసి పిల్లలను కనాలిట!).
"మా నాన్న లక్కీ నంబరు 3️⃣. మేము మా నాన్న పేరు నిలబెట్టాం. ఇంకా నయం, ఆయన మంచివాడు కాబట్టి తన లక్కీ నంబరు 9️⃣ అనుకోలేదు" అనేవాడు.
మధ్యమధ్యలో కాఫీలు, టీలు తీసుకుని ఎవరైనా ఆడవాళ్లు డాబాగదికి వస్తే వాళ్లమీద ఒక జోకు పేల్చేసేవాడు. "మీ ఆయన నీకు చెప్పిన మాట వింటున్నాడామ్మా?" అనేవాడు... ఒక ఘొల్లు!
వాళ్లు ఆనందంగా నవ్వుకుంటూ కిందకు వెళ్లి అందరికీ చెప్పుకునేవాళ్లు.
కానీ, మా పిఠాపురం మావయ్య ఎప్పుడూ ఎవరినీ నొప్పించడం, కించపరచడం లాంటివి చేసేవాడు కాదు.
అందుకే అందరికీ రేలంగి లాగా ఆయనంటే ఇష్టం. ఆయన జోకులను ఎన్ని ఏళ్లయినా మర్చిపోయేవాళ్లు కాదు.
ఒక రోజు నన్ను పిలిచి, "ఒరేయ్, ఇందాక బజార్లో నీ బాపూ బొమ్మ కనపడిందిరా" అన్నాడు. నాకు అర్థం కాక మా అమ్మను అడిగాను.
"నువ్వు పండు బాబయ్య అంత అయ్యాక అర్థమౌతుందిలే" అంది.
నాకు పాతికేళ్లు వచ్చాక "బాపూ బొమ్మ" కనపడి అర్థమయ్యింది! 👩🦰
రోడ్డుమీద వీధికుక్కలు మొరుగుతుంటే మేము గాంధీనగర్ వైపునకు వెళ్లడానికి భయపడుతున్నాం. మా నాన్న "మొరిగే కుక్కలు కరవవులేరా" అన్నారు.
వెంటనే మా పిఠాపురం మావయ్య, "బావా! ఆ సంగతి మనకు తెలుసు, ఆ కుక్కలకు తెలుసో తెలియదో... నువ్వెళ్లి చెప్పు, మొరిగాక కరవకూడదని" అన్నాడు. అది జ్ఞాపకం వస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది! 🐕🐕🐕🐕
మా భాను బాబయ్య పేకాటలో "విన్నింగ్ హ్యాండ్" అని పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఎంతమందితో ఆడినా ఆయనకే డబ్బులు వచ్చేవి.
ఆయనకు డబ్బులు ఇచ్చుకుంటూ పిఠాపురం మావయ్య "అత్తవారిచ్చిన అంటు మామిడి తోట" అని పాడేవాడు. అందరూ ఘొల్లు!
"ఒరేయ్ బియ్యం (బావమరిదీ), నా చిత్రాడ ఆకుమడి పొలం నీకోసం కేటాయించానురా" అనేవాడు! (పేకాట బాకీ నిమిత్తంట!)
మా మావయ్య మా ఆస్థాన పురోహితుడు సుబ్రహ్మణ్యం గారి మీద తెగ జోకులు పేల్చేవాడు.
ఆయన ఎప్పటి నుంచో మా తాతగారింట్లో బారసాలల దగ్గర నుంచి ఒడుగులు, పెళ్లిళ్లు, పూజలు, నోములు, వ్రతాలు, తద్దినాలకు మంత్రాలు చదివీ చదివీ... మా తాతగారి యాభై ఎకరాల్లో సగం కొట్టేశాడట!
పెళ్లిళ్లు అయిన మరునాడు జరిపించే 'శుభకార్యాలకు' పుణ్యస్త్రీలు, కులస్త్రీలు ఆ గది అలంకారం చేశాక, తాము కూడా చక్కగా తెల్ల చీరలు ధరించి అలంకరించుకుని ఒక మూలకు చేరి వాళ్ల వాళ్ల తొలినాటి అనుభవాల ముచ్చట్లు చెప్పుకుని మురిసిపోతుంటే...
ఆ చీకట్లో అప్పటిదాకా అక్కడే ఎక్కడో అరుగుమీద పడుకుని నిద్రపోతున్న బ్రహ్మగారు వాళ్ల విశేషాలన్నీ సావకాశంగా విని, ఒక్కసారిగా లేచొచ్చి "బాగున్నాయమ్మా... మీ అనుభవాల ముచ్చట్లు" అని వెళ్లిపోయాడట! 😂😂😂
మా రాజమండ్రి "రైలు మావయ్య" మగపెళ్లివారి కోసం ప్రత్యేకంగా ఒక రైలుపెట్టె బుక్ చేశాడు. కాకినాడ నుంచి నెల్లూరు దాకా అందులో మేము చేసిన ప్రయాణం జీవితంలో మర్చిపోలేం. అందులోనూ ఆ వయసులో పొందిన ఆనందాలు, సరదాలు తర్వాత ఎన్ని చూసినా పొందలేవేమో!
మధ్యాహ్నం భోజనాలు చేసి రైలు ఎక్కి, లోపలి నుంచి తాళాలు బిగించుకుని, ఆ ప్యాసింజర్ రైల్లో కూర్చుని మా కజిన్స్‌తో చెప్పుకున్న కబుర్లు, ఆడుకున్న ఆటలు, అరుపులు, కేకలు... అబ్బో! అవన్నీ... "యమాతారాజభానసలగం!"
రైలు పెట్టెకు ఒక చివర 'పారాయణం' బ్యాచ్‌కి "ప్రత్యేక హోదా" లాగా కేటాయించుకున్నారు.
ఇంకో చివర పెద్దవాళ్లకు, ఆడవాళ్లకు, పురోహితుడు, భజంత్రీలు, పనివాళ్లకు కేటాయించారు. బాత్రూములకూ వాళ్లకూ ఉన్న అనుబంధం కోసంట!
మా కిష్కింధ బ్యాచ్‌ని మధ్యలో పెట్టారు... అటూ-ఇటూ పోకుండాట! 🐒🐒🐒🐒
మా భ్రమర పిన్ని ప్రయాణంలోకి కావలసిన జంతికలు, చేగోడీలు, లడ్డూలు, చిక్కీ, కొబ్బరి లౌజు లాంటి చిరుతిళ్లు, మంచినీళ్లు, మందులు... మేము ఆడుకోవడానికి అష్టా-చెమ్మా, వైకుంఠపాళి... పెద్దవాళ్లు చదువుకోవడానికి కొన్ని వార, మాస పత్రికలు, యద్దనపూడి, కోడూరి ఇంకా ఎవరెవరివో నవలలు... పిల్ల మేళానికి చందమామలు, బాలమిత్రలు ఏర్పాటు చేసింది.
విజయవాడలో మా పెళ్లివారు 70 మందికీ పెద్ద పెద్ద క్యారేజీల్లో వేడివేడిగా భోజనాలు వచ్చేశాయి. మా పెద్ద బాబయ్య విజయవాడలో పేరుమోసిన ప్లీడరు మరి! ఒక పెద్ద హోటల్ యజమాని ఆయన క్లయింటట. ప్లీడరా... మజాకా?
ఖాళీ క్యారేజీలు నెల్లూరు స్టేషన్లో ఎవరో వచ్చి తీసుకెళ్తారట!
అవన్నీ మాకెందుకు? హాయిగా క్యారేజీలు విప్పి, వేడిగా భోజనాలు వడ్డిస్తుంటే ఆబగా తినేయడమే మా తక్షణ కర్తవ్యం!
భోజనాలయ్యాక మళ్లీ మా పెళ్లి సందడి... అదే, ఆటలనబడే అల్లర్లు మామూలే!
మా పిల్లకాయల గోలలో రైలు 'చుక్ చుక్'లు వినిపిస్తేగా? 🚂 🚂
"అటు అమలాపురం... ఇటు పెద్దాపురం" అన్నట్లు...
అటు... (చతుర్ముఖ) పారాయణం...
ఇటు... (కబుర్ల) రామాయణం...
మధ్య... (పిల్ల) గోలాయణం...
అనుకుంటూ రైలు వెళ్తూనే ఉంది. మేము ఎక్కడ, ఎప్పుడు, ఎలా పడుకున్నామో... ఎవరికి తెలుసు? 😴😴😴
"ఆదిత్య 369" సినిమాలో లాగా ఒకసారి ఆ కాలంలోకి వెళ్లగలిగితే ఎంత బాగుణ్ణో!!!
– వారణాసి సుధాకర్ 💐💐💐💐💐💐
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
వారణాసి సుధాకర్ గారి కొన్ని ఇతర రచనలు:
వారణాసి సుధాకర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
అందరికీ నమస్కారం.
నా పేరు వారణాసి సుధాకర్.
పుట్టినది, పెరిగినది, తణుకు పట్టణంలో...
హైస్కూలు దశలో చదువుతో పాటు, వివిధ కళలలో, ఆటలలో, చురుకుగా పాల్గొని, వందల బహుమతులు పొందాను.
కాలేజీ విద్యార్థి దశనుంచి, విజయచిత్ర లాంటి సినిమా పత్రికలలో రచనలు చేసి, బహుమతులు పొందాను.
LIC లో సీనియర్ మేనేజర్ గా పనిచేసి, విశ్రాంత జీవితం గడుపుతూ, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ, ప్రజలకు ఎంతో కొంత ఉపయోగించే విషయాలను తెలియజేసే కథలు రాస్తూ, వివిధ ఫేస్ బుక్ గ్రూపుల్లో సుమారు వందకు పైగా కథలు రాశాను, ఇంకా రాస్తున్నాను.
ప్రస్తుతం పిల్లలు, మనవలతో అమెరికాలో వుంటున్నాను.
ఇదీ క్లుప్తంగా నా పరిచయం.
🙏










👌👌👌👌👌👌