top of page
Original.png

కోడలు తెచ్చిన కొత్తావకాయ

May 27
3 min read


Kodalu Thechhina Kotthavakaya Telugu Comedy Story | Varanasi Sudhakar

కోడలు తెచ్చిన కొత్తావకాయ - తెలుగు హాస్య కథ | వారణాసి సుధాకర్

Published in manatelugukathalu.com on 27/05/2026

“ఆవకాయ కోసం ప్రాణం పెట్టే భర్త… BP కోసం భయపడే భార్య!” 

వారణాసి సుధాకర్ గారి, 'కోడలు తెచ్చిన కొత్తావకాయ' రుచి చూద్దాం. 


"ఇదిగో...కోడలు పిల్ల తెచ్చిన కొత్తావకాయ్ కొంచెం వడ్డిస్తావా ?"


"అదిగో...అదే మరి...ఇలాగే...ఉప్పు, నూనెల్లో ఊరేసిన ఊరగాయల కోసం కక్కుర్తి పడద్దని మన డాక్టర్ గారు చెప్పాడుగా...?"


"డాక్టర్లు అలాగే చెప్తారు...చెప్పాలి కూడా...ఊరికే...

రుచి చూడ్డానికే...కొత్త ఊరగాయ్ ఇంట్లో వుంటే, దాని తస్సాదియ్యా, దాన్ని రుచిచూడకపోతే, మహాపాపం వస్తుందని...గిరీశం అనుకుంటా...మహాప్రస్థానంలో చెప్పాడుగా ?"


"అదేదో సినిమాలో అల్లు రామలింగయ్య అంటాళ్ళెండి, 'పరిత్రాణాయ సాధూనాం..సర్వాంగే హరిచందనం' అని ! అలా వుంది, మీ సాహిత్య పరిజ్ఞానం !


గిరీశం - 'కన్యాశుల్కం' లో...చుట్టల గురించి, వితంతువుల గురించి చెప్పాడు కానీ, నాకు తెలిసి, ఊరగాయల ఊసెత్తలేదు !"


"గిరీశం కాకపోతే, కామేశమో... సోమేశమో...

చెప్పేవుంటారుగా ? ఆ మధ్య ఎర్రటి కొత్తావకాయమీద, పజ్జాలు రాసి, ప్రతి ఏడూ ఊరగాయల సీజన్లో ఫేసు బుక్కు లోనూ, వాట్సాప్ లోనూ తెగ తిప్పుతున్నారుగా ?"


"కవులదేవుంది, అన్నింటిమీదా రాయగల్రు, పజ్జాలు !

మీ బట్టతల మీద కూడా రాశారుగా... ?"

'తల నూనె రాసెడు తగులాటముండదు,

క్షౌరశాలకు వెళ్ళు ఖర్మలేదు...

.........

పర వనితలు వెంట పడుట కల్ల'... అంటూ...చివర్న...

'బట్టతలగలవాడెపో...భాగ్యశాలీ...ఈ..ఈ' అని దీర్ఘం కూడా తీశారుగా ?"


"నేను అందమైన ఆవకాయ గురించి రొట్టలేయించే పజ్జాల గురించి అంటుంటే, నువ్వేమో...మోకాలికీ - బోడిగుండుకీ ముడెట్టే పజ్జాల గురించి తగులుకుంటావేం?"


"మరి పజ్జాలు - పంగనామాలూ...

అనుకుంటూ మీరేగా...కవితాగోష్టి మొదలెట్టారు ? కానివ్వండి...ఎవరికెంత సాహిత్య పరిజ్ఞానం వుందో తేల్చుకుందాం !"


"నువ్వేంటే...ఇలాంటి దిక్కుమాలిన చర్చలు పెట్టి, నా దృష్టిని ఆవకాయ మీదనుంచి మళ్ళించాలని

చూస్తున్నావ్ ? అయితే సరే...కాసుకో..."

'శాకంబరీ దేవి ప్రసాదం...

ఆంధ్రశాకం...గోంగూరయ్యా...గోంగూర...

అదిలేనిదే ప్రభువులు ముద్దకూడా ముట్టరు...తెలుసా ?' అనే డైలాగు ఎవరు, ఎక్కడ, ఎవరితో అన్నారో చెప్పు, చూద్దాం..."


"ఓస్..ఇంతేనా...తెలుగువాళ్ళైన వాళ్ళెవళ్ళూ ఆ డైలాగు మర్చిపోరు...మర్చిపోయిన వాళ్ళు తెలుగువాళ్ళే కాదు !"


"ఆన్సర్ టు మై పాయింట్"


"మాయాబజార్ - పింగళి - శాస్త్రీ - శర్మా - చిన్నమయ - లంబు - జంబు...చాలా, ఇంకా కొన్ని డైలాగులు కావాలా ?"


"అబ్బో ! గట్టిదానివే ! సరే కానీ...అసలు మన పెళ్ళైన దగ్గర్నించీ...ఊరగాయ లేకుండా, ఒఖ్ఖ రోజైనా

నేను భోంచేశానా ? అందులోనూ..ఈ ఊరగాయల

సీజన్లో ?"


"అందుకే కామోసు, వివిధ రంగాల్లో వున్న నిష్ణాతులతో బాటు, ఊరగాయ రంగంలో మీకు 'పద్మశ్రీ' ఇవ్వాలని చూస్తోందిట, మన ప్రభుత్వం ! కొత్త పంచి, సిల్కు లాల్చీ, జరీ కండువా కొనుక్కోండి !"


"ఇంతకీ కొత్తావకాయ్ వేస్తున్నావా, లేదా ?"


"వెయ్యకపోతే, బతకనిస్తారా, ఇదిగో..పట్టండి !"


"ఇదేవిటే...మన వెంకటేశ్వర సామి గుళ్ళో పూజారి గారు  ప్రసాదం పెట్టినట్టు, ఇంతే వేశావ్ ?"


"ఇప్పటికే ఇద్దరం...ఈడూ - జోడూ గా ముప్పొద్దులా బీపీ టాబ్లెట్లు మింగుతున్నాం...చాలట్లేదా ?"


"అన్నిటికీ మందులు కనిపెట్టడం వాళ్ళ డ్యూటీ...వాటిని కొనుక్కు తిని, మందుల షాపుల వాళ్ళని, డాక్టర్లనీ పోషిస్తూ, బతికెయ్యడం మన 'బతుకు - బతకనీ' పాలసీ...తెలిసిందా ?.....రానీ..."


"అలాగే అనుకుంటూ, వాయిలు - వాయిలు లాగిద్దాం...రేప్పొద్దున్న చెరో మంచం ఎక్కి మూలుగుదాం..."


"మనకేం కాదే...వజ్రకాయాలు, మనవి !


అమ్మాయీ...మీ అమ్మగారిచ్చిన కొత్తావకాయ్ భేషుగ్గా వుందమ్మా...రాత్రికి కొత్త మాగాయ్ రుచి చూసి చెబుతానులే !...బ్రేవ్...."


              ***


వారణాసి సుధాకర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

అందరికీ నమస్కారం.

నా పేరు వారణాసి సుధాకర్.

పుట్టినది, పెరిగినది, తణుకు పట్టణంలో...


హైస్కూలు దశలో చదువుతో పాటు, వివిధ కళలలో, ఆటలలో, చురుకుగా పాల్గొని, వందల బహుమతులు పొందాను.


కాలేజీ విద్యార్థి దశనుంచి, విజయచిత్ర లాంటి సినిమా పత్రికలలో రచనలు చేసి, బహుమతులు పొందాను.


LIC లో సీనియర్ మేనేజర్ గా పనిచేసి, విశ్రాంత జీవితం గడుపుతూ, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ, ప్రజలకు ఎంతో కొంత ఉపయోగించే విషయాలను తెలియజేసే కథలు రాస్తూ, వివిధ ఫేస్ బుక్ గ్రూపుల్లో సుమారు వందకు పైగా కథలు రాశాను, ఇంకా రాస్తున్నాను.


ప్రస్తుతం పిల్లలు, మనవలతో అమెరికాలో వుంటున్నాను.


ఇదీ క్లుప్తంగా నా పరిచయం.

🙏


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page