top of page

విశ్వరూప దర్శన యోగం

#RCKumar #శ్రీరామచంద్రకుమార్ #విశ్వరూపదర్శనయోగం, #ViswarupaDarsanaYogam, #TeluguDevotionalArticle

ree

భగవద్గీతలో విశ్వరూప దర్శన యోగం అంతరార్థం


Viswarupa Darsana Yogam - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 20/09/2025

విశ్వరూప దర్శన యోగం - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


 భగవద్గీతలోనే అత్యంత ప్రాముఖ్యం కలిగిన విశ్వరూప దర్శన యోగం వివరణల్లోకి వెళ్లే ముందు శ్రీకృష్ణుడు తన దివ్యమైన విశ్వరూపాన్ని ఎన్నిసార్లు, ఏ ఏ సందర్భాల్లో ప్రదర్శించాడో తెలుసుకోవాలి. భారత భాగవతాల్లో నాలుగుసార్లు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ‌ 


మొదటిసారి బాల్యావస్థలోనే పెంపుడు తల్లి యశోదకు చిన్ని కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ‘మన్ను తిన్నావా?' అని దండించ బోయినప్పుడు నోరు తెరిచి తన నోటిలోనే అండపిండ బ్రహ్మాండాన్ని చూపించాడు.


ఉద్యోగపర్వంలో అయిననూ వెళ్ళవలె హస్తినకు అంటూ రాయబారం కోసం ధృతరాష్ట్రుని కొలువుకు వెళ్లినప్పుడు కౌరవులు శ్రీకృష్ణుణ్ణి బంధించాలని ప్రయత్నించారు. తనేమిటో చూపించి వారిని హెచ్చరించటానికి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.


కురుక్షేత్ర యుద్ధసమయంలో భగవద్గీతను బోధిస్తూ అర్జునుడి కోరిక మేరకు నిజస్వరూపాన్ని ప్రదర్శింప జేయడం మనకు తెలిసిందే.


ఇక చివరిసారి మహా భారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్రను తీసుకుని ద్వారకకు బయల్దేరాడు. మార్గమధ్యంలో అష్టసిద్ధులు సాధించిన ఉదంకుడు అనే రుషి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. యుద్ధం విషయం తెలియని ఆ మహర్షి కౌరవుల క్షేమ సమాచారాలు అడిగాడు. వారందరూ యుద్ధంలో చనిపోయారని శ్రీకృష్ణుడు చెప్పగా విని ఉదంకుడు అతడిపై ఆగ్రహించాడు. 'కృష్ణా ! నీకు యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా! ఆపలేదు' పాండవ పక్షపాతివి నువ్వు అంటూ శపించబోయాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 'ఓ మునివర్యా ! అనవసరంగా నీ తపోశక్తిని వృథా చేసుకోవద్దు. నేను ధర్మపక్షపాతిని, సర్వాంతర్యామిని అంటూ తన విశ్వరూపాన్ని చూపాడు. 


విశ్వరూప సందర్శన యోగాన్ని మొదటిసారి అధ్యయనం చేసినప్పుడు కొందరికి కొన్ని సందేహాలు కలిగే అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఈశ్వర విభూతి అయినప్పుడు పదవ అధ్యాయంలో మళ్ళీ ఒక్కొక్క విభూతి గురించి చెప్పే అవసరం ఏమిటి ? అసలు విశ్వరూపాన్ని ప్రదర్శించమని అర్జునుడు ఎందుకు అడిగాడు ? భగవంతుడి విభూతులకు, విశ్వరూపంలో చూపే మహిమలకు తేడా ఏమిటి ? విశ్వరూపాన్ని చూసిన మొదట్లో అర్జునుడికి ఏం జరిగింది ? అటు పిమ్మట వీరాధివీరుడు సవ్యసాచి అయిన అర్జునుడికి భయం ఎందుకు కలిగింది ? విశ్వరూప ప్రదర్శనలో శ్రీకృష్ణుడు నాలుగు రకాలుగా తన రూపాలను దశల వారీగా ప్రదర్శించడం ఎందుకు ?


మొదట్లో అనంతమైన ముఖాలు, దివ్యమైన ఆభరణములు, పూల మాలలు, సుగంధ పరిమళ భూరితమై గుబాళించే ఆకృతితో, తర్వాత అసంఖ్యాకంగా ఉన్న అవయవాలు, కరాళ దంస్ట్రాలతో భయంకర రూపంతో, క్రమంగా శంఖ, చక్ర, గదా, పద్మములతో విరాజిల్లే చతుర్భుజ రూపంలో, చివరగా సుకుమారమైన మరియు రమ్యమైన రెండు భుజముల స్వరూపంలో. భగవద్గీత లోని పదకొండవ అధ్యాయాన్ని కాస్త లోతుగా పరిశీలించి విశ్లేషించుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. 


యుద్ధంలో ప్రచండ భీకరంగా విజృంభించి విశ్వరూపం చూపించడం, ఆఫీసులో సిబ్బందిపై అమితమైన కోపం వచ్చినప్పుడు పై అధికారి తన విశ్వరూపాన్ని చూపించడం అనే మాటలు మనం వింటుంటాం. ఇటువంటి అర్థాలలో వాడే విశ్వరూపం వేరు, విశ్వరూప దర్శన యోగంలో సాక్షాత్తు భగవంతుడే ప్రదర్శించే రూపం వేరు.


భగవద్గీతలో ప్రతి అధ్యాయాన్ని యోగం అంటాం. యోగం అంటే కలయిక, జీవుడు దేవుడితో కలయిక. జీవాత్మ పరమాత్మతో ఐక్యత. అదే మోక్షానికి దారి. పరమాత్మ సన్నిధికి చేరాలని కోరుకొని, ఆ దిశగా సాధన చేసే ప్రతి ఒక్కరూ యోగులే. విశ్వం యొక్క సమగ్ర రూపమే విశ్వరూప దర్శనం, సమస్త జగత్తును భగవంతుడి రూపంగా చూపించడమే భగవద్గీతలోని విశ్వరూప దర్శన యోగ ఆంతర్యం. ‌


భగవంతుడు ఒక్క రూపానికో, ఆకారానికో పరిమితం కాడు. ఈ చరాచర ప్రపంచంలో ఉండే ప్రతి రూపానికీ ఆయనే ఆధారం. "ఈశావాస్యమిదం సర్వం" ఈశావాస్య ఉపనిషత్తులోని గొప్ప మంత్రం ఇది. "ఈ జగత్తు అంతా ఈశ్వరునితో నిండి ఉంది. అందుకే అతను సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు. సృష్టి, స్థితి, లయ కారకుడిగా ఆయన్ని గుర్తించే దైవదర్శనమే విశ్వరూప దర్శన యోగం. 


పదవ అధ్యాయం వరకు కృష్ణ పరమాత్మ తన మహిమలతో, ఆధ్యాత్మిక విషయాలతో ఉపదేశాలు చేసి, అర్జునుడి అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా భగవంతుడు తన విభూతులు, మహిమలను గురించి విస్తారంగా తెలపడం జరిగింది. 

అసలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఈశ్వర విభూతే అయినప్పుడు, మళ్లీ ఒక్కొక్క విభూతి గురించి చెప్పే అవసరం ఏమిటి ? సర్వం జగన్నాథం అంటున్నాం కదా !


దీనికి సమాధానం ఏమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా స్మరించుకోవాలి అని గతంలో అడిగాడు. దానికి సమాధానంగానే తన వైభవములు (విభూతులు) పరమాత్మ వివరించటం జరిగింది. మన మనస్సు రొటీన్ గా చూసే వాటిని, వినే వాటిని పెద్దగా గుర్తు పెట్టుకోదు. వైవిద్య భరితమైన రూపం కనబడితే, ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన ఏదైనా జరిగితే సహజంగానే మన చూపు దాని మీద నిలబడిపోతుంది.


అపురూపమైన వాటి వైపు మనం సహజంగానే ఆకర్షించబడుతాము. మరి భగవంతుడి విభూతులు (వైభవాలు, మహిమలు) అన్నీ అపురూపమైనవి, వైవిద్య భరితమైనవే కదా ! అందుకే భగవంతుడు తన వైభవంలో ఉన్న ప్రత్యేకతలను విభూతి యోగం ద్వారా అర్జునుడికి అర్థం అయ్యేలా విడివిడిగా తెలియపరిచాడు. 


ప్రపంచంలో జన్మించే నాలుగు రకాల జీవజాలానికి మూలం ‌తానే అని విస్పష్టంగా తెలియజేస్తున్నాడు పరమాత్మ. అవి ఏమిటంటే, 

1) అండజాలు — గుడ్లనుండి జన్మించేవి, పక్షులు, పాములు, బల్లులు వంటివి; 

2) జరాయుజాలు — తల్లిగర్భము నుండి జన్మించేవి, అంటే మనుష్యులు, జంతువులు. (ద్విపాదులు, చతుష్పాదులు)

3) స్వేదజాలు — చెమట లేక చెమట వంటి తేమ వాతావరణంలో పుట్టే జీవులు. పేలు, సూక్ష్మక్రిములు వంటివి

4) ఉద్భిజాలు — భూమి నుండి పుట్టేవి. చెట్లు, తీగలు, ధాన్యాలు వంటివి. 

వీటన్నిటికీ మూలమైన ఉత్పాదక బీజాన్ని నేనే అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంటే సర్వ భూతముల సృష్టికి మూల ఉత్పత్తి స్థానం కృష్ణ పరమాత్మే తప్ప మరొకరు కాదు. 


స్పీకర్లో కరెంటు ప్రవహిస్తుంది. ఆ కరెంటు నుండి మనందరికీ వినిపించే విధంగా శబ్దం ధ్వనిస్తుంది. కానీ, అది ఎలా పనిచేస్తుందో దాని వెనుక ఉన్న సూత్రం ఏమిటో తెలియనివారు ఏమనుకుంటారు ? స్పీకరే ఆ ధ్వనిని సృష్టిస్తోందని అపోహ పడవచ్చు. అది విద్యుత్ ప్రవాహం ద్వారా వచ్చే ద్వని. మనం చూసేవి, వినేవి, అనుభవించేవి కొన్ని అత్యద్భుతంగా గోచరించవచ్చు. వాటి సృష్టికర్త భగవంతుడే అని గ్రహించాలి.


ఏదేని విశేష సంఘటన మనలను ఆశ్చర్యచకితులను చేసి, పారవశ్యంతో అమితానందాన్ని కలుగజేస్తే, అది భగవంతుని వైభవము యొక్క తళుకు మాత్రమే అని తెలుసుకోవాలి. ఉదాహరణకు లాటరీ టికెట్ తగిలినా, నీలి నీలి ఆకాశంలో ఇంద్రధనుస్సు వంటి భౌగోళిక అద్భుతాలు జరిగినా అవన్నీ భగవదానుగ్రహాలే. జాన్సన్ అండ్ నికల్సన్ అనేఒక పెయింట్ కంపెనీ వ్యాపార ప్రకటన ఏమని ఉండేదో తెలుసా, ‘Whenever you see colors think of us. ’ అంటే, ‘మీకు రంగులు కనిపించినప్పుడల్లా మమ్మల్ని తలచుకోండి’. అదేవిధంగా మనం అద్భుతమైన అనుభవాన్ని పొందినప్పుడల్లా భగవంతుని తలుచుకోవాలి. ఆయనను తెలుసుకోవాలంటే మన దృష్టిని విశ్వవ్యాప్తంగా విస్తరించాలి. ఒక చోట పరిమితం చేయకుండా ప్రతి చోట ఆయనను గుర్తించాలి. 


విశ్వరూప దర్శన యోగం అర్జునుడికేనా ? మనకి కూడా కలగితే బాగుంటుంది కదా అని కోరుకునే వాళ్లు భగవద్గీతలోని పదకొండవ అధ్యాయాన్ని నిష్టతో తదేక దీక్షతో పారాయణం చేసి ఆ సారాన్ని గ్రహిస్తే మనోనేత్రంతో అంచలంచెలుగా విశ్వరూపాన్ని దర్శించుకోవచ్చు. గత అధ్యాయంలో ఇలాంటి విభూతుల గురించి సంపూర్ణంగా విని అర్థం చేసుకున్నట్టు ఒప్పుకుంటూ అర్జునుడు కృష్ణ పరమాత్మ తేజవంతమైన దివ్యరూపాన్ని చూపించమని ప్రార్థిస్తాడు. ‌ సహజంగానే శ్రవణం తర్వాత దృశ్యాన్ని కోరుకుంటారు కదా. ఆ దివ్య రూపాన్ని చూడడానికి నేను అర్హుడిని అని భావిస్తేనే చూపించమని కూడా వినయంగా వేడుకుంటాడు.


విశ్వరూపాన్ని చూడడానికి అర్హత, యోగ్యత ఉండాలి. దీనికి అంతఃశుద్ధి, భక్తి మరియు చైతన్యం అవసరం. ‌అర్జునుడు కేవలం యోధుడే కాదు శ్రద్ధగల భక్తుడు, జిజ్ఞాసి కూడా. అందువల్లే భగవంతుడు తన దివ్యరూపాన్ని అతనికి చూపించాడు. నిజానికి అంత క్రితం చెప్పబడిన విభూతులు కూడా విశ్వరూపానికి సంబంధించిన మహిమలే. కానీ విభూతుల కన్నా పై స్థాయిలో విశ్వరూప దృశ్యాలను చూడాలి అనుకుంటున్నాడు అర్జునుడు. భక్తిశ్రద్ధలు గల సాధకుడు చూడాలనుకుంటే శ్రీకృష్ణుడు చూపించకుండా ఉంటాడా. 70 MM స్క్రీన్ లో కాదు ఆకాశమంత స్క్రీన్ లో దివ్య దృష్టిని ప్రసాదించి మరీ చూపించారు. 


అర్జునా ! నాలోపలే ద్వాదశాదిత్యులు (అదితి పుత్రులు పన్నెండుగురు), అష్ట వసువులను (ఎనిమిది మంది), ఏకాదశ రుద్రులను (పదకొండు), అశ్వినీ కుమారులను (ఇద్దరు), అంతే కాక మరుత్తులను చూడగలవు అని చెప్తూ, ఎప్పుడు చూడని అపూర్వమైన, ఆశ్చర్యకరమైన రూపాలను కూడా చూస్తావని విశ్వరూపానికి తెర తీశాడు పరమాత్మ. భగవంతుని విశ్వరూపంలో కేవలం భూలోకంలో ఉన్న అద్భుతాలే కాక దేవతలతో సహా పైలోకాల్లో ఉన్న అద్భుతాలను కూడా చూడొచ్చని చెప్పకనే చెప్పారు. ఒక్కచోటే కూడిఉన్న సమస్త చరాచర జగత్తును, విశ్వ రూపాన్ని నాయందే దర్శించమని అంటూ, ఇంకా ఏదైనా చూడదలుచుకున్నా వాటని కూడా నా విశ్వ రూపమందే చూసుకొమ్మని చెప్పుకొచ్చారు.


తలచుకున్న ప్రతీది చూడొచ్చని దాని అర్థం. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూడగానే అర్జునుడికి ఆశ్చర్యం, భక్తి, గౌరవం, భయం కలుగుతుంది. సమస్త బ్రహ్మాండములు కృష్ణ పరమాత్మ లోనే ఇమిడి ఉన్న అనంతమైన విశ్వ రూపం అది. రకరకాల రూపాలతో, రంగులతో ఆకృతులతో గల అలౌకిక రూపం. సామాన్యులు ఎవరూ దర్శింపలేని, దర్శింపజాలని రూపం. ఒకే చోట కనిపించే సమస్త చరాచర జగత్తు అది. వెయ్యి సూర్యుల కాంతి ఒక్క సారిగా ఆకాశములో వెలిగితే వచ్చే కాంతి కంటే తేజోవంతముగా ఉంది. ఆ దర్శన భాగ్యం కలిగిన అర్జునుడికి సంభ్రమాశ్చర్యాలతో వెంట్రుకలను నిక్కబోడుచుకునేలా చేసింది. 


ఆ విరాట్ స్వరూపంలో అర్జునుడు సకల దేవతలనూ, ఎన్నెనో ప్రాణికోటి సమూహములను దర్శించాడు. ‌ కమలంలో కూర్చుని ఉన్న బ్రహ్మ దేవుడిని, మహాదేవుడైన శంకరుణ్ణి, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూసాడు. అనంతమైన ముఖాలు మరియు కనులను చూస్తాడు. ఆ మొఖాలు ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను, ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ శరీరం అనేక మాలలతో దివ్య సుగంధ పరిమళ భూరితమై గుబాళిస్తున్నది. మహాద్భుతమైన, అనంతమైన, ఆశ్చర్యకరమైన రూపంతో పరమాత్మ తనను తాను ఆవిష్కరించుకున్నాడు.


బాహువులు, ఉదరము, ముఖము, నేత్రములు అసంఖ్యాకంగా కనబడుతున్నాయి. ‌ సినిమాల్లో మల్టీమీడియా ద్వారా ఒకే వ్యక్తి రూపాన్ని అసంఖ్యాకంగా చూపించడం మనకు అనుభవమే. "నాంతం న మధ్యం న పునస్తవాదిం" నువ్వు ఆది, మధ్యం, అంతం లేని వాడవని కీర్తిస్తూ నీ దివ్య రూపం ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంతమైందో తెలుసుకోలేకుండా ఉన్నాను అంటాడు అర్జునుడు. మనం భగవంతుడికి ఆపాదించే సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామి వంటి లక్షణాలన్నీ ఇక్కడ విశ్వరూపం ద్వారా గోచరిస్తున్నాయి. అండపిండ బ్రహ్మాండమంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్న దృశ్యాన్ని చూసిన అర్జునుడు సంభ్రమాశ్చర్యాలతో ఒళ్లంతా పులకించిపోయి భక్తిశ్రద్ధలతో సాష్టాంగ ప్రమాణం చేస్తాడు. ఈ వివరణలు శ్రద్ధగా ఆకళింపు చేసుకుంటే మనకు కనిపించని ఆ విశ్వరూపానికి ఉన్నఫళంగా రెండు చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. 


ఇక్కడితో ముగ్ధ మనోహరమైన అపురూపమైన ఆకృతి మారిపోయి కరాళ దంస్ట్రాలతో (భయంకరమైన పళ్ళు, ‌కోరలతో) ఉన్న పరమాత్మ మొఖం ప్రళయాగ్ని జ్వాలల లాగా మండిపోతూ కనిపిస్తుంది. ఆకాశాన్ని అంటుతూ, ఎన్నెన్నో రంగులతో ప్రకాశిస్తూ, పెద్దగా తెరిచిఉన్న నోర్లతో, అగ్ని గుండాల వంటి కన్నులతో ఉన్న విశ్వరూపాన్ని చూసేసరికి అర్జునుడి గుండె భయంతో కొట్టుకోవడం మొదలైంది.


పురుగులు వేగంగా మంటలోకి వెళ్ళి పడిపోయి భస్మమైపోతునట్టు ధృతరాష్ట్రుడి పుత్రులైన దుర్యోధనాదులు, దుష్ట చతుష్టయాలు, భీష్మ ద్రోణాదులు అందరూ భయంకరమైన కోరలతో ఉన్న కృష్ణుడి ముఖంలోకి అతివేగంగా ప్రవేశిస్తున్నారు. వారందరి తలలు కోరలు, పళ్ళ మధ్య చిక్కుకొని నుగ్గు నుగ్గు అయిపోతున్నాయి. ఒక దశలో ఆ విశ్వ రూపాన్ని చూడలేక భయంతో తన మానసిక ప్రశాంతత పోయిందని మొరపెట్టుకుంటాడు అర్జునుడు. అందుకే దయయుంచి నీ ప్రసన్నమైన రూపంలోకి రావయ్యా అని వేడుకుంటాడు అర్జునుడు. 


యోధానుయోధుడు సవ్యసాచి అయిన అర్జునుడికి భయం ఎందుకు అని అనుమానం కలుగచ్చు. ఈ సృష్టిలో మనిషి ఎప్పుడూ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చే దాన్ని మాత్రమే చూడాలని అనుకుంటాడు, సంతోషాన్ని కలిగించే మాటలే వినాలని అనుకుంటాడు. అయితే అవన్నీ కలిపి ఒకేసారి అత్యధికంగా కనబడినా కూడా తట్టుకోలేరు. ఉదా || నీళ్లలో గడపడం అంటే ఇష్టమైన ఒక వ్యక్తికి ఒక చిన్న కొలను చూపిస్తే సంతోషంగా ఈత కొడతాడు, ఒక నది చూపిస్తే దూరం నుండి ఆనందం పొందుతాడు, మహా అయితే పడవ మీద చక్కర్లు కొడతాడు.


కానీ ఒకేసారి పెద్ద సముద్రం ముందు నిలబెడితే ఎగసిపడి ముందుకు వస్తున్న అలలను చూసి భయపడతాడు. ఇక్కడ కూడా అంతే. ఈ సృష్టి మొత్తాన్ని తనలో నింపుకుని కనబడే పరమాత్మ రూపం చూసేసరికి అర్జునుడు భయపడిపోయి ఈ మహోన్నత స్వరూపం నిజానికి ఎవరిదో తెసుకోవాలనుకుంటాడు, ఎందుకంటే ఈ రూపానికీ తనకు తెలిసిన గురువు మరియు సఖుడైన కృష్ణునికి ఏమాత్రం పోలిక లేదు. 


అడగడం నీ వంతు, వద్దనడం నీ వంతేనా అని అనుకున్నాడేమో కృష్ణపరమాత్మ తన విశ్వరూపాన్ని ఇంకొంచెం విపులంగా అర్జునుడి మనస్సులో గోచరింపజేస్తూ అంటాడు. నేనే కాల రూపంలో ముల్లోకాలను నాశనం చేసే లయ కర్తని. భీష్ముడు, ద్రోణుడు, జయద్రథడు (సైంధవుడు), ‌ కర్ణుడు వంటి యుద్ధ వీరులు, కౌరవ మహాయోధులందరూ తనచే ఇదివరకే సంహరింపబడ్డారు. ఇక నువ్వు చేసేది భౌతిక కర్మ కాబట్టి లేచి యుద్ధం చేయమని అర్జునుడితో అంటాడు. నువ్వు యుద్ధం చేసినా, చేయకున్నా ప్రతిపక్షాన నిలిచి ఉన్న ఈ యోధులు ఎవ్వరూ మిగలరు.


ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే కృష్ణ పరమాత్మ తన అవతరణ యెక్క ఉద్దేశం నెరవేరబోతోందని పరోక్షంగా చెప్తున్నారు. మొదటిది ధర్మసంస్థాపన, రెండవది యుగాంతానికి తెర తీయడం. భగవంతుడు చేసే పనిలో అర్జునుడిని ఒక పనిముట్టుగా ఉండమంటున్నాడు. అన్నింటినీ భగవంతుడే నేరుగా చేయడు. ఎంపిక చేయబడిన కొంతమంది ద్వారా వెనక ఉండి ఆ పని జరిపిస్తాడు. 


నిజానికి కౌరవయోధుల బలాబలాలు అసామాన్యం. వారి పక్షాన ఉన్న చాలా మంది యోధులు ఇప్పటివరకూ యుద్ధములో అజేయులే. జయద్రథుడికి (సైంధవుడు) ఒక వరము ఉంది; ఎవరైనా ఆయన తల భూమిపై పడేటట్టు చేస్తే, తక్షణం అలా చేసిన వారి తలే ముక్కచెక్కలై పోతుంది. కర్ణుడికి ఇంద్రునిచే ఇవ్వబడిన ‘శక్తి’ అనే అస్త్రము ఉంది; దాన్ని ఎటువంటి వారిపై ఉపయోగించినా అది వారిని సంహరిస్తుంది.


కానీ, ఒక్కసారి మాత్రమే దానిని ఉపయోగించాలి, కాబట్టి కర్ణుడు దానిని అర్జునుడిపై పగ తీర్చుకోవటానికి దాచుకున్నాడు. ద్రోణాచార్యుడు అన్ని రకాల అస్త్రశస్త్రాల జ్ఞానాన్ని, వాటిని నిర్వీర్యం చేసే ఉపాయాలని, భగవత్ అవతారమైన పరుశరాముని నుండి నేర్చుకున్నాడు. భీష్ముడికి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వచ్చేటట్టు వరం ఉంది. ఎన్ని ఉన్నా సరే, భగవంతుడు వారందరూ మరణించాలి అని సంకల్పిస్తే, మరేదీ వారిని కాపాడజాలదు. 


నీవు నా సఖుడవు (మిత్రుడవు) అనుకుంటూ, అతి చనువుతో నిన్ను, ‘ఓ కృష్ణా’, ‘ఓ యాదవా’, ‘ఓ మిత్రమా’ అని తొందరపాటుతో పిలిచాను. నీ మాహాత్మ్యం తెలియక, నిర్లక్ష్యముగా, అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించి ఉన్నట్లయితే తన అపరాధాలను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు అర్జునుడు.


తమ సుదీర్ఘ మైత్రిలో తను ఎప్పుడైనా కృష్ణుడిని పొరపాటుగా సామాన్య మానవునిగా భావించి చనువుతో ఎక సెక్కాలు ఆడి ఉంటే ఆయన మనస్సు నొప్పించేట్టు ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని ప్రార్థిస్తాడు. ఓ పరమాత్మా ! అనంతమైన శక్తిసామర్థ్యములు కల నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక నుండి అన్ని వైపులనుండీ నమస్కరిస్తున్నాను! నీవు అనంతమైన పరాక్రమము కలిగినవాడివై జగత్తంతా వ్యాపించి ఉన్నావు కాబట్టి నాకు కనిపించే అన్ని రూపాలు నీవే అంటూ శరణాగతి చేస్తాడు. 


చివరగా అర్జునుడు కోరుకున్న చతుర్భుజిగా మారి, ముగ్ధ మనోహర విష్ణు రూపంలో కనబడి అర్జునుడికి ధైర్యం చెప్పి, తన శంఖ చక్ర గదా, పద్మములతో విరాజిల్లే చతుర్భుజ రూపంతో పరమాత్మ దర్శనమిస్తారు. ఆ సందర్భంగా కృష్ణ పరమాత్మ ఇలా అంటాడు.. ఓ అర్జునా ! నా ఈ చతుర్భుజరూపం యొక్క దర్శన భాగ్యం కలగడం ఇతరులకు అత్యంత దుర్లభం. దేవతలు సైతం ఈ రూపాన్ని దర్శించడానికి ఎల్లప్పుడూ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు.


నీపై గల అనుగ్రహంతో, నాయోగ శక్తి ప్రభావంతో నా విరాట్ రూపాన్ని నీ ముందు ప్రదర్శించాను అని చెప్పి తన సుకుమారమైన మరియు రమ్యమైన రెండు భుజముల స్వరూపం లోకి వచ్చేస్తాడు. ఈ విరాట్ రూపం పూర్తయిన తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక్క విషయాన్ని నొక్కి చెప్తాడు. ‌ ఎలాంటి భక్తులు పరమాత్మను చేరుకోగలరో విశదీకరిస్తూ ఐదు లక్షణాలు గల అనన్య భక్తులకి మాత్రమే అటువంటి అవకాశం ఉందని స్పష్టం చేశారు. భగవంతుడి పట్ల ఉండవలసిన ఆ ఐదు లక్షణాలు ఏమిటో తెలుసుకుంటే మనం కూడా అనన్య భక్తులుగా మారి ఆయనను చేరుకోవచ్చు. 


1) చేసే అన్ని పనులను భగవంతుడి కోసమే చేయాలి. నిజమైన భక్తులు తాము చేసే పనులు ప్రాపంచిమా, ఆధ్యాత్మిమా అని చూడరు. ప్రతి పనినీ భగవంతుని ప్రీతి కోసమే చేస్తూ అన్నీ ఆయనకే సమర్పిస్తారు. ఈ సందర్భంగా సంత్ కబీర్ ఏమంటున్నాడంటే జహాఁ జహాఁ చలూ, కరూ పరిక్రమా, జో జో కరూ సో సేవా | జబ సోవూ దండవత్, జానూ దేవ న దూజా ||


నేను నడుస్తున్నప్పుడు ఆ భగవంతునికి ప్రదక్షిణ చేస్తున్నానని భావిస్తాను, నేను పని చేస్తున్నప్పుడు, ఆ భగవంతునికి సేవ చేస్తున్నానని అనుకుంటాను, నేను పడుకున్నప్పుడు ఆ భగవంతునికి ప్రణామం అర్పిస్తున్నానని భావిస్తాను. ఈ విధంగా, ఆయనకు నివేదించకుండా నేను ఏ పనీ చేయను. 


2) భగవంతుడి మీదే పూర్తిగా ఆధారపడాలి. కర్త కర్మ క్రియ అన్ని భగవంతుడే అని భావించి అతని మీదే ఆధారపడాలి. 


3) భగవంతుడి పట్ల భక్తివిశ్వాసాలతో ఉండాలి. భక్తులు ఏ ఆధ్యాత్మిక సాధనలు చేసినా తమ ప్రియతమ భగవంతుడి మీద భక్తి విశ్వాసాలతో చేయ్యాలే కానీ మొక్కుబడిగా యాంత్రికంగా చేయకూడదు. 


4) మమకారాసక్తి రహితంగా ఉండాలి. ప్రాపంచిక విషయాల నుంచి మనస్సుని దూరం చేసి, స్థిర చిత్తంతో భగవంతుని ధ్యానించాలి. 


5) సర్వ ప్రాణుల యందు సద్భావన కలిగి ఉండాలి. అనన్య భక్తులు ఎవరి మీద కూడా చెడు భావనతో ఉండరు, తమకు హాని చేసిన వారిపట్ల కూడా ద్వేషం పెంచుకోరు. అంతేకాక, భగవంతుడు సర్వ భూతముల హృదయంలో ఉన్నాడని విశ్వసిస్తూ, అన్ని వ్యవహారాలు కూడా ఆయన నుండే జనిస్తున్నాయని భావిస్తూ, అపకారికి కూడా ఉపకారం చేస్తారు. 


కాబట్టి ఈ ఐదు లక్షణాలు గల అనన్య భక్తులు మాత్రమే పరమాత్మను పొందగలరని మనం కూడా గ్రహించి, అనన్య భక్తులుగా మారి ఆయనను చేరుకునే ప్రయత్నం చేద్దాం..


స్వస్తి.. 


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments


bottom of page