top of page
Original.png

పరివర్తన

40 minutes ago
3 min read

పరివర్తన బాలల కథలో అహంకారాన్ని విడిచి స్నేహితుడితో కలిసి ఆనందంగా ఉన్న రమేష్

Parivarthana - Telugu Childrens Moral Story | Thokala Rajesham

పరివర్తన - తెలుగు బాలల నైతిక కథ | తోకల రాజేశం

Published in manatelugukathalu.com on 05/11/2026


‘పరివర్తన’ ఒక బాలల నైతిక కథ. అహంకారం మనిషిని ఎలా వెనక్కి నెడుతుందో, వినయం మరియు మంచితనం జీవితాన్ని ఎలా మార్చుతాయో రమేష్ కథ ద్వారా తెలియజేస్తుంది.


మైలారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రమేష్ 10వ తరగతి చదువుతున్నాడు. 


అతనికి తానే అందరికన్నా తెలివైనవాడిని అనే అహంకారం ఉండేది. మిగిలిన పిల్లలతో పోలిస్తే కొంచెం బాగానే చదువుతాడు కాబట్టి ఉపాధ్యాయులు అతణ్ణి మెచ్చుకునేవారు. 


ఇది కూడా తన పొగరుకు ఒక కారణంగా మారింది. దీనితో పాఠశాలలో ఉపాధ్యాయుల ముందు అణకువను నటిస్తూ బయట అందరితో దురుసుగా ప్రవర్తించేవాడు. 


రమేష్‌కి వ్యతిరేకంగా మాట్లాడితే ఉపాధ్యాయులు ఏమంటారోనన్న భయంతో విద్యార్థులు ఎవరూ కూడా ఈ విషయం గురించి ఉపాధ్యాయులతో చర్చించేవారు కాదు. 


అందుకే రమేష్ బయట ఎలా ఉంటున్నాడో ఉపాధ్యాయులకు ఎవరికీ తెలిసేది కాదు.


ఇలా కొన్ని రోజులు గడిచాక మొదటి సమ్మేటివ్ పరీక్షలు వచ్చాయి. విద్యార్థులందరూ పరీక్షలు రాశారు. 


పరీక్షల అనంతరం వెంటనే దసరా సెలవులు రావటంతో ఉపాధ్యాయులు పేపర్లు దిద్ది ఫలితాలు ప్రకటించలేకపోయారు. 


సెలవులు గడిచాక సమ్మేటివ్ ఫలితాల్లో ఎలాగూ నేనే మొదటి స్థానంలో ఉంటానన్న సంతోషంతో ఎవరినీ లెక్కచేయకుండా తన చేష్టలతో తోటి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ బడికి చేరుకున్నాడు రమేష్.


తరగతి ఉపాధ్యాయుడు శ్రీమూర్తి పరీక్షా ఫలితాలు ప్రకటించాడు. ఆశ్చర్యం! ఎప్పుడూ మూడవ స్థానంలో ఉండే సంతోష్ మొదటి స్థానంలో, మొదటి స్థానంలో ఉండే రమేష్ రెండవ స్థానంలోకి వెళ్లిపోయారు. ఈ ఫలితాలు ఉపాధ్యాయులను కూడా ఆశ్చర్యపరిచాయి. 


కానీ పదవ తరగతిలోని మిగిలిన విద్యార్థులకు మాత్రం ఆనందాన్ని కలిగించాయి. ఆరోజు సాయంత్రం బడి విడిచాక పిల్లలందరూ ఇంటి బాట పట్టారు. 


తోవలో రమేష్ నిప్పుతొక్కిన కోతిలా సంతోష్ వెంట పడ్డాడు. మోసం చేసి మొదటి స్థానం దక్కించుకున్నావని, చూసి రాశావని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. 


గొడవ పెద్దది కావటంతో తెల్లారి ఈ పంచాయితీ ప్రధానోపాధ్యాయుని దగ్గరికి చేరింది. గొడవ గురించి వాకబు చేస్తే రమేష్ గురించి, అతని ప్రవర్తన గురించి చాలా ఫిర్యాదులు అందాయి. 


అయినా ప్రధానోపాధ్యాయుడు రమేష్‌ను ఏమీ అనలేదు. సంతోష్ నిజాయితీగా పరీక్ష రాసి ఎలా మొదటి స్థానం సంపాదించుకున్నాడో సాక్ష్యాలతో సహా నిరూపించి, రమేష్‌ను సుతిమెత్తగా మందలించి ఇక నుంచి మంచి మిత్రులుగా ఉండాలని ఇద్దరికీ సూచించాడు. 


తాను బాగా చదువుతానన్న అహంకారమే తనను క్రింది స్థానంలోకి నెట్టింది అని గ్రహించలేకపోయాడు రమేష్ (కథలో సూచించినట్లు రెండవ/తక్కువ స్థానం). 


లోలోపల సంతోష్ అంటే కోపంగానే ఉంది. కానీ మునుపటిలా దాన్ని ప్రదర్శించకుండా లోలోపలే మదనపడుతూ ఉన్నాడు.


ఒక నెల తరువాత జిల్లా స్థాయిలో సైన్సు ఫెయిర్ ఉందని రమేష్‌ను సిద్ధంగా ఉండాలని ఆదేశించాడు ప్రధానోపాధ్యాయుడు. 


ఎందుకంటే అంతకు ముందే పాఠశాల స్థాయిలో రమేష్ ప్రాజెక్టు బహుమతిని గెలుచుకుంది. 


జిల్లా స్థాయిలో జరిగిన ఆ ప్రదర్శనలో తన ప్రాజెక్టుతో పాటు హాజరయ్యాడు రమేష్. 


తనతో పాటు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు లింగయ్య ప్రదర్శనలో జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి వచ్చిన ప్రాజెక్టులను చూపిస్తూ వాటి గురించి అడిగి తెలుసుకోమని చెప్పాడు. 


అక్కడ ప్రదర్శనకు వచ్చిన ప్రాజెక్టులను చూశాక రమేష్‌కి తన ప్రాజెక్టు చాలా చిన్నదిగా తోచింది. తోటి విద్యార్థుల సృజనాత్మకతా శక్తి భలే ఆశ్చర్యంగా తోచింది. 


రమేష్ వాటి గురించి ఆలోచనలో మునిగి ఉండగానే ఇతర పాఠశాలల ప్రాజెక్టులు మూడు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైనట్లు ప్రకటించారు. 


అక్కడే ఉన్న తన ప్రధానోపాధ్యాయుడు భుజం మీద చెయ్యి వేసి, "బాధపడకు" అన్నాడు. ఎన్నడూ ఓటమిని అంగీకరించని రమేష్ మొదటిసారి తన తప్పును ఒప్పుకున్నాడు. 


"నాకంటే వాళ్ళ ప్రాజెక్టులే మెరుగ్గా ఉన్నాయని, నేను బాగా కష్టపడి ఉండాల్సింది" అని అంటూ కళ్ళల్లో నీళ్ళు నింపుకున్నాడు. వెంటనే లింగయ్య సార్ రమేష్‌ను దగ్గరికి తీసుకున్నాడు. 


"చూశావా? నీ పాఠశాలలో నువ్వు ఒక్కడివే తెలివిమంతుడివి అనుకున్నావు. ఇక్కడ నీకన్నా తెలివిమంతులు చాలా మంది ఉన్నారు. జ్ఞానం అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒకడిని మించిన జ్ఞానవంతుడు ఇంకొకడు ఉంటాడు. 


ఎవరితోనూ ఈ విషయంలో లొల్లి పెట్టుకోకూడదు. అందరూ మన మిత్రులే అనుకోవాలి. మంచితనమే నిజమైన జ్ఞానం" అంటూ బయటకు తీసుకెళ్ళాడు.


మరునాడు లింగయ్య సారు భోజన విరామ సమయంలో పాఠశాల వెనుక ఉన్న మైదానంలో నిల్చున్నాడు. 


అటు పక్కగా సంతోష్ భుజం మీద చేయి వేసుకుని ఆనందంగా సైన్సు ఫెయిర్ ముచ్చట్లు చెప్తున్నాడు రమేష్. చుట్టూ చేరి ఆసక్తిగా వింటున్నారు మిగతావాళ్ళు. సారు పెదవుల మీద చిరునవ్వు మెరిసింది.


- తోకల రాజేశం


***










📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



తోకల రాజేశం

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.

తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page