top of page
Original.png

శిక్ష

22 minutes ago
5 min read

శిక్ష తెలుగు కథలో కరాటే నైపుణ్యంతో తనను తాను రక్షించుకున్న ధైర్యవంతురాలు నీరజ

Shiksha - Telugu Social Story | B. N. Satyanarayana

శిక్ష - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 12/10/2026


“శిక్ష” బి. ఎన్. సత్యనారాయణ రచించిన ఉత్కంఠభరితమైన తెలుగు సామాజిక సందేశ కథ. కరాటేలో నైపుణ్యం సాధించిన నీరజ తనపై జరిగిన దాడిని ధైర్యంగా ఎదుర్కొని ఆత్మరక్షణ ప్రాముఖ్యతను చాటుతుంది. మహిళల భద్రత, ఆత్మవిశ్వాసం, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఈ కథలో ప్రధానాంశాలు. ప్రతి మహిళకు ఆత్మరక్షణ శిక్షణ ఎంత అవసరమో తెలియజేసే ఈ తెలుగు కథను చదవండి.


రామారావు, జానకిల ముద్దుల పట్టి నీరజ. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమెను ఎంతో గారాబంగా, అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.


ఆమె ఎప్పుడు ఏమి కోరితే దాన్ని అభీష్టానికి తగినట్లు అప్పటికప్పుడు సిద్ధపరుస్తూ, ఆమెకు ఆనందం కలుగజేస్తూ, ఆ ఆనందాన్ని చూస్తూ మురిసిపోతూ ఉండేవారు.


రామారావు స్థితిపరుడు, వ్యాపారి. పోలీసు వారి సూచనల మేరకు ఇంటిలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాడు. నీరజ ఆకర్షణీయంగా, అణకువగా ఉంటుంది. ఆమె చదువులోనూ ముందే ఉంటుంది.


ఆమె బ్రూస్ లీ వంటి వారి చిత్రాలు చూస్తూ వారి పోరాటపటిమకు ఆశ్చర్యపోతూ, ఆనందిస్తూ తాను కూడా ఒక కరాటే యోధురాలిగా మారాలని అనుకుంది.


తండ్రిని ఒప్పించి కరాటేలో శిక్షణ తీసుకుంది. కోరుకున్న విద్య కాబట్టి అందులో ఆమె ప్రావీణ్యత సాధించి బ్రౌన్ బెల్ట్ కైవసం చేసుకోగలిగింది. ఆమె వయసులోనూ, విద్యలోనూ ఎదుగుతుండటంతో కరాటే శిక్షణ అంతటితో ఆపివేయవలసి వచ్చింది.


ఇంజినీరింగ్ విద్యలో ఉండగానే ఆమె క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక ఎంఎన్‌సీ (MNC) కంపెనీకి ఎంపికైంది. చదువు పూర్తికాగానే ఆ ఉద్యోగంలో చేరింది.


రామారావు, జానకిలు కూతురిని చూస్తూ ఆనందిస్తూ, గర్వపడసాగారు. కూతురు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగస్తురాలు కావడంతో ఆమె వివాహానికై వారు ఆలోచనలు చేయసాగారు.


అదే విషయాన్ని కూతురుతో ముచ్చటించాలని, ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవాలని తలంచి, ఒక ఆదివారం నాడు కూతురుతో ఆ విషయమై మాట్లాడుతూ తమ ఆశను ఆమెకు వెల్లడించారు.


అయితే నీరజ తల్లిదండ్రుల ఆలోచనలను సున్నితంగా తిరస్కరిస్తూ, తాను అప్పుడే సంసార జంజాటంలో పడదలచుకోలేదని చెబుతూ, కొంతకాలం ఇలానే ఆనందించాలని అనుకుంటున్నానని, ఆశపడుతున్నానని, కాబట్టి పెళ్లి విషయాలు ప్రస్తుతానికి పక్కన పెట్టేయమని కోరింది.


ఆమె మాటను ఎప్పుడూ కాదనని తల్లిదండ్రులు కొంత అసంతృప్తి చెందినా, కూతురి అభిప్రాయాన్ని కాదనలేక ఆమె కోరినట్లుగా కొంత సమయం వేచి చూసేందుకు అంగీకరించారు.


ఆమె ఆఫీసులోనూ తన ప్రతిభ కనబరుస్తూ, సహోద్యోగులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.


తరచుగా తన స్నేహితురాళ్లతో విహారయాత్రలు చేస్తూ ఆనందంగా జీవితాన్ని గడపసాగింది. కంపెనీ వారు ప్రొవైడ్ చేసిన క్యాబ్‌లో రోజూ ఆమె ఆఫీసుకు రాకపోకలు సాగిస్తూ ఉండేది.


క్యాబ్ డ్రైవర్ రాము రోజూ ఆమెను గమనిస్తూ ఆమె పట్ల దురాలోచన చేయడం మొదలుపెట్టాడు. సమయం కోసం నక్కలా వేచి చూడసాగాడు.


ఒకమారు నీరజ తల్లిదండ్రుల బంధువుల ఇంట జరిగే ఒక శుభకార్యానికి వెళ్లవలసి వచ్చింది. కూతురిని కూడా తమతో రావలసిందిగా అడిగారు.


అయితే నీరజ ఆ రోజుల్లోనే ఆఫీసులో అత్యవసరమైన పనులు ఉన్నాయని, అందువలన తాను రాలేనంటూ వారినే వెళ్లి రావలసిందిగా చెప్పింది.


అమ్మాయిని అలా ఒంటరిగా వదిలి వెళ్లడానికి వారి మనస్సులు అంగీకరించకపోయినా, ఫంక్షన్‌కు అటెండ్ కావడం తప్పనిసరి కావడంతో నీరజకు అన్ని జాగ్రత్తలు చెప్పి వారు ఊరికి బయలుదేరి వెళ్లారు.


రోటీన్ పనిలో క్యాబ్ డ్రైవర్ రాము నీరజను ఆఫీస్‌కు పికప్ చేసుకుంటూ, డ్యూటీ ముగిసిన పిదప ఆమెను ఇంటి వద్ద విడిచిపెట్టేవాడు.


ఆ రోజు నీరజ తాళంచెవి తీసి డోర్ తెరిచి ఇంటి లోపలికి వెళ్లడాన్ని గమనించాడు. ఇంటిలో ప్రస్తుతం ఆమె ఒక్కతే ఉన్నట్లు గ్రహించి, అది తనకొక మంచి అవకాశంగా భావించుకున్నాడు. దాంతో అతడిలోని మృగం మేల్కొంది.


మరుసటి రోజు యథావిధిగా ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేస్తూ — "ఏమిటి మేడమ్? మీ అమ్మగారు వాళ్లు లేరా? మీరే తలుపులు, తాళాలు తీస్తున్నారు" అంటూ క్యాజువల్‌గా అడిగినట్లు అడిగాడు.


దానికి ఆమె తన తల్లిదండ్రులు నాలుగు రోజుల కొరకు ఊరు వెళ్లారని జవాబు ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చేసాడు.


మరుసటి రోజు తన ప్రణాళికను అమలు పరచాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఆ రోజు యథావిధిగా ఆఫీసు అయిపోయిన తర్వాత, రాము నీరజను ఇంటి దగ్గర విడిచిపెడుతూ... నీరజ ఇంటి తాళం తెరిచి లోపలికి పోతుండగా, "మేడమ్! నా బాటిల్‌లో మంచి నీళ్లు అయిపోయాయి.


"దాహంగా ఉంది, కొద్దిగా మంచినీళ్లు ఇస్తారా?" అంటూ అడిగాడు.


అందుకు ఆమె "తెస్తానుండు" అంటూ లోపలికి పోయి, ఫ్రిజ్ నుండి మంచినీళ్లు తెచ్చేందుకు కిచెన్ వైపు వెళ్లగా... ఆమెనే గమనిస్తున్న రాము క్యాబ్ దిగి తొరతొరగా ఇంట్లోకి ప్రవేశించి నెమ్మదిగా తలుపులు మూసివేశాడు.


మంచినీళ్లు తెస్తూ లోపలికి వచ్చిన రామును చూసి అవాక్కయిపోయింది నీరజ. దానితో పాటు తలుపులు మూసి ఉండటాన్ని గమనించి కీడును శంకించింది. రాము దురాలోచనను పసికట్టింది. "రామూ! తలుపులు ఎందుకు మూసావు? ముందు తలుపులు తెరు!" అని గట్టిగా అరిచింది.


రాము అప్పుడు అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేడు. పరుగెత్తుకుని ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. పక్కనే ఉన్న సోఫాలోకి ఆమెను నెట్టివేశాడు.


ఊహించని ఆ ఘటనతో ఆమె ఒక్క నిమిషం నిర్ఘాంతపోయింది. వెంటనే తేరుకుని మీద పడబోతున్న రాముని కాలితో ఒక్క తాపు తన్నింది. రాము ఆ ప్రతిఘటనను ఊహించలేకపోయాడేమో, ఆ దెబ్బకు అల్లంత దూరాన ఎగిరిపడ్డాడు. అప్పటికే అతడి చేతిలో ఇరుక్కుపోయిన ఆమె బ్లౌజ్ చిరిగిపోయింది.


అతడు గమ్మున లేచి నీరజ వైపు ఒక్క ఉదుటన రాబోయాడు. అంతే నీరజ తన చీర చెంగును ముడుచుకుని సివంగిలా మారిపోయింది. వస్తున్న వాడి ముఖంపై ఒక పంచ్ విసిరింది. దానితో వాడి తల తిరిగిపోయినట్లైంది, కళ్లు మూసుకుపోయాయి.


ఒక్కసారిగా ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుని బాధను తట్టుకోలేక గట్టిగా అరిచాడు. నీరజ ఉపేక్షించలేదు. వాడి దగ్గరకు దూకి వాడి రెండు భుజాలపై గట్టిగా నాలుగు పంచ్‌లు విసిరింది.


ఆ దెబ్బతో వాడి రెండు భుజాల ఎముకలు విరిగిపోయాయి. చేతులు చలనం కోల్పోయి చచ్చుబడిపోయాయి. దాంతో రాములో భయం పుట్టుకొచ్చింది. వణికిపోతూ భరించలేని బాధతో అరవడం మొదలెట్టాడు. నీరజకు కోపం చల్లారలేదు.


కాలితో ఒక్క తాపు తన్నింది. రాము వణికిపోతూ బాధను తట్టుకోలేక విలవిలలాడిపోతూ కింద పడిపోయాడు.


నీరజ ఆలస్యం చేయకుండా తన బాస్‌కు, సహోద్యోగులకు ఫోన్ చేసి వెంటనే తన ఇంటికి రావలసిందిగా కోరింది. తరువాత పోలీసు స్టేషన్‌కు ఫోను చేసి కంప్లైంట్ ఇచ్చి వారినీ త్వరగా రావలసిందిగా కోరింది.


ఇంతలో రాము కేకలకు, అరుపులకు ఇరుగుపొరుగు వారూ పరుగెత్తుకుంటూ రావడం మొదలుపెట్టారు.


నీరజ తలుపులు తెరిచింది. కొద్ది నిమిషాల్లోనే ఇరుగుపొరుగు వారితో పాటు తన ఆఫీసు వాళ్లు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి వస్తూనే ఏం జరిగిందంటూ పోలీసులు నీరజను ప్రశ్నించడం మొదలుపెట్టారు.


నీరజ అక్కడ మూలుగుతున్న రామును చూపించి జరిగిన విషయాన్ని వివరించి చెప్పింది. దాంతో పోలీసులు పడివున్న రాము దగ్గరకు పోయి చేతులు పట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నించారు.


అయితే వాడి చేతులు చచ్చుబడిపోవడంతో బాధతో మూల్గడంతో, ఇద్దరు పోలీసులు వాడిని పట్టుకుని లేపి జీపులో పడవేశారు. రాము స్థితిని చూసి, నీరజ కొట్టిన దెబ్బలను గుర్తించి వారు ఆశ్చర్యపోయారు.


విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు రామును తిడుతూ ఇటువంటి వెధవల్ని ఉరి తీయాలంటూ పోలీసులకు విన్నవించుకున్నారు.


పోలీసులు నీరజ వద్ద స్టేట్‌మెంట్ తీసుకుని, స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ రాసి ఇవ్వాల్సిందిగా చెప్పి రామును స్టేషన్‌కు తీసుకుపోయారు. మిగిలిన వారందరూ నీరజ చుట్టూ చేరారు.


నీరజ జరిగినదంతా అందరికీ వివరంగా చెప్పింది. అందరూ నీరజ ధైర్యాన్ని మెచ్చుకుంటూ, ఆమె కరాటే నిపుణురాలు అని తెలుసుకుని ఆనందపడుతూ జాగ్రత్తలు చెప్పి వెళ్లాడు.


తరువాత నీరజ లోపలి గదిలోకి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చి, సహోద్యోగులు తోడురాగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ రాసి ఇచ్చింది.


పోలీసులు రాముపై చట్టరీత్యా FIR నమోదు చేసి, "రేపు వాడిని కోర్టు వారి ముందు హాజరుపరుస్తాము, మీరు కూడా కోర్టుకు రావలసి ఉంటుంది" అని చెప్పడంతో సరేనని చెప్పి నీరజ అందరితో కలిసి ఇంటికి తిరిగి వచ్చేసింది.


ఆమె సహోద్యోగులు సరళ, జ్యోతికలు ఆ రాత్రి ఆమెకు తోడుగా ఆ ఇంట్లోనే ఉండేందుకు నిశ్చయించుకున్నారు.


నీరజ తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పకుండా వెంటనే రావలసిందిగా ఫోన్ చేసింది. తరువాత అందరికీ భోజనాలు సిద్ధపరిచింది. కలిసి భోజనాలు చేస్తూ జరిగిన దుస్సంఘటన గురించి చర్చించుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు.


ఉదయం కాగానే అందరూ లేచి ఫ్రెష్ అయ్యేటప్పటికి నీరజ తల్లిదండ్రులు వచ్చేసారు. గాభరా పడుతూ కూతురిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె సహోద్యోగులను ఏం జరిగింది అని అడుగుతూ ఆరా తీశారు.


తల్లిదండ్రులను ఆందోళన పడవద్దని చెబుతూ నీరజ జరిగిన విషయం అంతటినీ వారికి అర్థమయ్యేలా చెప్పింది. తండ్రి గాభరా చెందాడు, తల్లైతే భోరున విలపించసాగింది. ఆ స్థితిలో నీరజ సహోద్యోగులు ఆమెను సముదాయించారు.


పోలీసులు చెప్పిన ప్రకారం నీరజ సహోద్యోగులు, తల్లిదండ్రులు తోడురాగా కోర్టుకు వెళ్లింది. అక్కడ జడ్జి గారు కేసు వివరాలు తెలుసుకుని రాముని 14 రోజులు రిమాండుకు పంపుతూ ఆర్డర్ ఇచ్చారు. కేసును వాయిదా వేశారు.


ఆ వాయిదాకి కోర్టులో అన్ని సాక్ష్యాధారాలతో సీసీటీవీ ఫుటేజీతో సహా పోలీసులు ఫైల్ సమర్పించడంతో, రామును దోషిగా నిర్ధారిస్తూ జడ్జి గారు అతడికి మూడేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.


నీరజ రాముపై చేసిన దాడిని శీలరక్షణ కొరకు, ప్రాణరక్షణ కొరకు చేసిందిగానే నిర్ధారించి నీరజను నిర్దోషిగా ప్రకటించారు. రాముకు తగిన వైద్య సహాయం అందేలా చూడాలని పోలీసులకు ఆదేశించారు.


"ప్రతి అమ్మాయి నీరజలా తమ రక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ కూడా తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది" అని వ్యాఖ్యానించి ఆ కేసును ముగించారు.


~ సమాప్తం ~

***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page