గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 5

Gouri Sankarula Samvadam - Part 5 - Telugu Devotional Story | Bhaskara Rao B. R. K. V.
గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 5 - తెలుగు ఆధ్యాత్మిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 11/10/2026
గౌరీ శంకరుల సంవాదం – పార్ట్ 5లో పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పరమేశ్వరుడు ధర్మబద్ధమైన జీవన విధానం, కర్మఫలం, పుణ్యకర్మలు, దానధర్మం, పితృకార్యాలు, శివారాధన గురించి వివరిస్తాడు. అన్నం, నీరు దానాలలో శ్రేష్ఠమైనవని తెలియజేస్తూ, పంచాక్షరీ మంత్రం, శివస్మరణ, నమస్కారం, శివలింగారాధన, భస్మ–రుద్రాక్ష ధారణల ప్రాముఖ్యాన్ని బోధిస్తాడు. అనంతరం శివుని కోరికపై పార్వతి తనకు తెలిసిన స్త్రీధర్మాలను వివరిస్తుంది. ఈ సంవాదాన్ని నారద మహర్షి శ్రీకృష్ణునికి వినిపించడంతో కథ ముగుస్తుంది.
గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 5 చదవండి.
"స్వామీ! జనులు జీవించే విధానాన్ని సెలవీయండి!" అని అడిగింది పార్వతి.
"అంబా! మనుష్య జన్మ సుఖదుఃఖాలకు నిలయమైనది. మనిషి ధన సంపాదన మార్గాలను యోచిస్తాడు. అయితే అది ధర్మపధంలో సాగాలి. చేసే పనులలో మోసం ఉండకూడదు. ఇతరుల ధనాన్ని, వనితలను దొంగిలించకూడదు. తల్లితండ్రులను, అతిధులను, దేవతలను గౌరవించి పూజించాలి. ఇది అందరూ ఆచరించదగ్గ జీవనవిధానం."
"నీలలోహిత! లోకంలో కొందరు ధనవంతులుగాను, మరికొందరు బీదవారిగా జీవించడానికి హేతువేది?" అని అడిగింది భవాని.
భవుడు, "దైవానికి ఒకరిమీద కోపం గానీ వేరొకరి మీద ప్రేమ గానీ ఉండదు. వారి పూర్వజన్మ కర్మ ఫలితంగా కష్టాలు, సుఖాలు లభిస్తాయి," అని కర్మ ఫలితాన్ని వివరించాడు.
"అంబికానాథా!! పుణ్యాలు అంటే ఏమిటి?"
"జగదాంబికా! ఓపమికం, నిరుపకరణం, సోపకరణం అని మూడు రకాలైన పుణ్యకర్మలు లోకంలో ఉన్నాయి.
ఓపమికం అంటే పాపాలు తొలగించేది. నరక భయంతో పాపాలు చేయకుండా ఉండటం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది.
నిరుపకరణం అంటే శుచిగా ఉండటం, నిజం మాట్లాడుతూ అహింసను పాటించడం.
అహింస, ఉపవాసం, స్త్రీసంగమవర్జనం, పుణ్యతీర్థసేవనం అనేవి సోపకరణం యొక్క అంగాలు."
"జటాధరా! దానం చేయగలిగిన వస్తువులేమిటో దయతో తెలుపండి."
"కదంబవనవాసినీ! జంతువులన్నిటికీ అన్నం, నీరు ప్రాణం వంటివి... కావున వాటిని దానం చేయడం దానాలన్నిటిలోకెల్లా శ్రేష్ఠమైనది. గోవు, బంగారం, తిలలు, విద్య, కన్య, దాసిజనం, గొడుగు, దీపం, ఓషధులు తరువాత స్థానాల్లో నిలబడి ఉత్తమ గతులను కలుగచేస్తాయి."
"ఓ మహానుభావా! పితృ సంబంధమైన విధులను తెలియజేయండి."
"మందార కుసుమ ప్రియా! విను. పితృకార్యాలు గయ, కురుక్షేత్రం, గంగ మొదలైన పుణ్యక్షేత్రాల్లో చేయడం శ్రేష్ఠం. మాఘమాసం, భాద్రపదమాసం గొప్పవి. ద్వాదశి, నవమి, అమావాస్య తిథులు ఉత్తమం. దర్భలు, నువ్వులు, మినుములు ప్రీతిపదార్థాలు. వేదవిదులు భోక్తలుగా వస్తే వారికి భోజనం పెట్టి పిండప్రదానం చేయడం పితృకార్య విధి. ఇలా చేయడం వల్ల శివుడు మెచ్చుకుంటాడు," అని సెలవిచ్చాడు పరమేశ్వరుడు.
సర్వమంత్రస్వరూపిణి శివునికి నమస్కరించి, "ఓ గంగాధరా! భక్తులు ఏ పరిచర్యల వలన నీ సాయుజ్యాన్ని పొందుతారు?" అని భక్తితో అడిగింది.
"సర్వమంగళాదేవీ! పంచాక్షరీ మంత్రాలతోనూ, స్మరణం చేతనూ, నమస్కారం చేతనూ మొదలైన సేవలతో నన్ను సేవించాలి.
నేను ఈశ్వరుండను, సనాతనుడను, అవ్యయుడను, సత్యాత్ముడను.
శివలింగారాధన, భస్మ రుద్రాక్ష ధారణ వలన పరిశుద్ధులై అభిషేకాదులతో నన్ను ఆరాధిస్తే నా సాయుజ్యాన్ని పొందుతారు.
పద్మనయనా పార్వతీ! నీవు నారీశిరోమణివి.
నీ వలన స్త్రీధర్మాలను వినవలెనని నా కోరిక. వాటిని తెలుపవా?" అని శివయ్య అడిగేసరికి గిరిపుత్రి గంగానదిలో స్నానమాచరించి...
"ప్రభూ! తమరు సర్వమూ తెలిసినవారు, మీకు చెప్పేంతదానను కాను. అయినా మీ ఆజ్ఞను పాటించి నేను నేర్చినంత చెప్తాను.
కన్యాదానం జరిగిన తరువాత స్త్రీకి భర్తే అధికారి. భర్తను దైవంగా భావించి మేలు చేయాలి. అతని అభిప్రాయం ప్రకారమే దైవ పితృకార్యాలు చేయాలి. దానివలన ఆమెకు ఇహ, పరలోక సుఖాలు లభిస్తాయి. భర్త ఎటువంటివాడైనా, ఎట్టి స్థితిలో ఉన్నా అతడిని ఆమె గౌరవించాలి. భార్యకు భర్తే గతి.
అక్రమంగా ప్రవర్తించే స్త్రీలు మూడు రకాలు. వారు వరుసగా ఆసురి, పైశాచి, రాక్షసి.
ఆసురి చంచల మనస్సుతో ధనం వ్యయం చేస్తుంది.
కోపం అధికంగా కలిగి ఉంటుంది పైశాచి.
కలహప్రియ రాక్షసి.
వీరు భర్త వంశంవారిని పాడుచేసి తాము పాపలోకానికి పోతారు. ఈ ముగ్గురూ పశ్చాత్తాపంతో ధర్మమార్గంలో నడిస్తే పాపాలను పోగొట్టుకుని భర్తతో కలసి స్వర్గానికి వెళతారు," అని అబలాధర్మాలను వివరించింది.
శివ పార్వతుల సంవాదం విన్నవారికి సర్వ శుభాలు కలుగుతాయని పరమేశ్వరుడు ప్రకటించాడు.
నారద మహాముని ఈ వృత్తాంతాన్ని శ్రీకృష్ణపరమాత్మునికి వినిపించాడు.
............ సమాప్తం ..........
మంగళమహాశ్రీ...............
గమనిక: ఈ రచన మహాభారతంలోని గౌరీ శంకరుల సంవాదం ఆధారంగా సేకరించబడిన ప్రాచీన ధార్మిక వృత్తాంతం. ఇందులో కనిపించే కొన్ని సామాజిక, స్త్రీ–పురుష ధర్మాలకు సంబంధించిన భావనలు ఆనాటి కాలపరిస్థితులు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. వాటిని నేటి చట్టాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, స్త్రీ–పురుష సమానత్వ విలువలకు ప్రత్యామ్నాయంగా కాకుండా ఇతిహాస సాహిత్యంలోని భాగంగా మాత్రమే పాఠకులు గ్రహించగలరు.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి







Comments