top of page
Original.png

గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 2

2 hours ago
4 min read

 పార్వతీదేవి కన్నులు మూయగా మూడో కన్ను తెరిచిన పరమశివుడు – గౌరీ శంకరుల సంవాదం పార్ట్ 2

Gouri Sankarula Samvadam - Part 2 - Telugu Devotional Story | Bhaskara Rao B. R. K. V.

గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 2 - తెలుగు ఆధ్యాత్మిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 25/09/2026


మహాభారతంలోని అనుశాసనిక పర్వం ఆధారంగా శ్రీ బి. ఆర్. కె. వి. భాస్కరరావు గారు అందిస్తున్న గౌరీ శంకరుల సంవాదం – పార్ట్ 2లో అనేక ఆసక్తికరమైన శివతత్త్వ రహస్యాలు కనిపిస్తాయి. పార్వతీదేవి శివుని రెండు కన్నులను మూయడంతో జగమంతా చీకటిలో మునిగిపోవడం, శివుడు నుదుటి నేత్రాన్ని తెరవడం, నీలకంఠుడు అనే పేరు రావడం, పినాక ధనుస్సు మరియు వృషభ వాహనం వెనుక ఉన్న విశేషాలను ఈ భాగంలో తెలుసుకుందాం.




గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 2 చదవండి


"నేను పుణ్యస్థలాలు సేవిస్తూ, అన్ని స్థలాలు తిరుగుతూ అన్ని రకాల చెట్లు, తీగలు, పొదలతో సుందరంగా ఉన్న ఒక ఉద్యానవనాన్ని హిమవత్ పర్వతంపై చూశాను. 


కోకిలల నాదాలు, గంధర్వుల గానాలు, దేవకాంతల రాగాలు ఒప్పారే ఉద్యానంలో బంగారం తాపిన ప్రదేశంలో పులితోలు వస్త్రంగా, సర్పాలే ఆభరణాలుగా, విభూతి మైపూతలుగా అలంకరించుకున్న అతి శ్రేష్ఠమైన దేహంగల మహాదేవుడు, సాధ్యులు, విద్యధరులు, దేవతలు, భూతములు గుంపుగా కట్టి చుట్టిరాగా కొలువున్న ఆ మహాసభలో నేను కూడా వర్ణించలేని రీతిలో స్వామి కొలువై ఉన్నాడు.


పుణ్యనదులు, దిక్కులు స్త్రీ రూపాలు ధరించి పరమేశ్వరుణ్ణి సేవించగా, శుభమైన దేహంగల పర్వతరాజ పుత్రి మెల్లగా వెనుకవైపు నుండి సమీపించి, చిరునవ్వు వదన సౌందర్యానికి రెట్టింపు చేస్తుండగా, మృదువైన తన చేతులతో భవుని కనుల జంటను మెల్లగా మూయగా జగమంతా సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర సముదాయం, అగ్ని లేనిదై కారుచీకట్లో మునిగిపోగా ప్రాణికోటి అల్లాడిపోయింది.


శివుడు నొసటి నేత్రం తెరిచాడు. దానితో ఆ కంటి మంటలు వెండికొండను కప్పివేశాయి.


ఆ మంటలు తన తండ్రి అయిన హిమవంతునికి ఆపదను చేకూర్చేవి అవడంతో, తన శిరోజభూషణ కాంతి శివుని పాదాలను అలంకరించేలా నమస్కరించేసరికి, శివుడు దయతో చూడగా మంచుకొండ చల్లారి తిరిగి శోభతో అలరారింది.


ఆశ్చర్యపోయిన భవాని వినయంతో "స్వామీ! నీ నొసటి కన్ను తెరవడానికి కారణం రహస్యం కాకపోతే చెప్పండి?" అంది.


"శివాని! నీకు తెలియని రహస్యం నా దగ్గర ఏమైనా ఉందా? ఈ లోకాలన్నీ నా స్వరూపాలే కనుక నాకేది జరిగితే లోకాలన్నిటికీ అదే కలుగుతుంది. నీవు నా కన్నులు మూయగా లోకాలు చీకటిలోకి వెళ్ళాయి. సకల ప్రాణులు భయం పొందాయి. నీ చేతులు తొలగించకుండా చీకటిని పోగొట్టడానికి నా నుదుటికన్ను తెరవవలసి వచ్చింది" అన్నాడు.


గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 2.1



ఇదే అదనుగా భావించిన భవాని భవునితో 

"నిటలాక్షా! తమకు నాలుగు ముఖాలెందుకు ఉన్నాయో మృదు మధురంగా సెలవీయండి?" అని అడిగింది.


"తిరుగులేని భుజశక్తి, శౌర్యము, అస్త్రశస్త్రాలకు చావులేని సుందుడు, ఉపసుందుడు అనే రాక్షసులు ఉండేవారు. వారిని చంపడానికి విశ్వకర్మ లోకాలన్నిటిలోనుంచి అందాలను నువ్వుగింజంత పరిమాణమంత మేలైన స్థిరభాగాలను తెచ్చి ఒక కాంతగా తయారు చేసి, ఆమెకు తిలోత్తమగా నామకరణం చేసి నా వద్దకు తెచ్చాడు. 


ఆమె నా చుట్టూ ప్రదక్షిణంగా తిరిగింది. ఆ ఇంతి దేవతల పనిని చేయగలదు, వెళ్ళు అని ఆమె తిరిగిన ప్రతి దిక్కుకు ఒక్కొక మొగం పెట్టి చూశాను. ఆ రోజు నుంచి నాలుగు ముఖముల వాడినై ఉండిపోయాను."


"జగదీశా! నీ కంఠంలో ఆ నలుపెందుకు?" అని గిరిజ అడుగగా, "దేవతలు, రక్కసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకగా లోకభయంకరమైన హాలాహలం పుట్టింది. జగత్తును రక్షించడానికి దాన్ని కంఠంలో పెట్టుకున్నాను. అప్పటి నుంచి బ్రహ్మాది దేవతలు నన్ను నీలకంఠుడు అని పిలుస్తున్నారు" అని సమాధానం ఇచ్చాడు శివుడు.


"ఇంకా ఏమైనా అడగాలా?" అని భవుడు అడిగితే, "స్వామి! పినాకాన్ని మిగిలిన ఆయుధాల కంటే ఎక్కువ ఇష్టంతో పట్టుకోవడానికి కారణం తెలుపండి?" అని భవాని అడిగింది.


"ఓ కోమలీ! మొదటి యుగంలో కణ్వుడు అనే మహర్షి గొప్ప నిష్ఠతో తపస్సు చేశాడు. అతని శరీరం కప్పుతూ ఒక వల్మీకం పెరిగింది. దానిమీద ఒక వెదురు పెరిగింది. అది సాధారణమైన వెదురుగా కాకుండా ఆశ్చర్యంగా మిక్కిలి పొడవు, వెడల్పు కలిగి ఉంది. 


బ్రహ్మ ఆ మహర్షికి వరమిచ్చి, ఆ వెదురును తాను తీసుకొని, లోకాల మేలు కాంక్షించే నాకు పినాకాన్ని, విష్ణువుకు శార్ఙ్గం అనే వింటిని, చివరి తునకతో గాండీవాన్ని చేశాడు. బ్రహ్మ మూడు విండ్లు చేసి, లోకాలకు మేలు కాంక్షించి మూడవదానిని తాను గ్రహించి తన లోకానికి వెళ్ళాడు. పినాకాన్ని ఎక్కువగా మన్నించడానికి కారణం అది" అని వివరించాడు భవుడు.


"సర్వేశా!! ఇతర వాహనాలు ఎన్నో ఉన్నా నిండు హృదయంతో ఆదరించి వృషభాన్నే ఎందుకు అధిరోహిస్తావు?"


"నేను లోకాల మేలు కొరకు మంచుకొండ మీద గొప్ప తపస్సు చేస్తూ ఉండగా నా చుట్టూ చేరి భయం లేకుండా తిరుగుతూ నన్ను కష్టపెట్టేసరికి నేను కోపించి చూడగా అవి బాధపడ్డాయి. 


బ్రహ్మాది దేవతలు నన్ను ప్రార్థించి నాకొక ఎద్దును కానుకగా ఇచ్చి, గోపతి అని పేరుపెట్టి గోవుల బాధ తీర్చారు. అది మొదలు నేనా ఎద్దును వాహనంగాను, ధ్వజంగాను చేసుకుని అన్ని తావులలోనూ మంగళకరమైన సంచారం చేస్తూ ఉంటాను."


గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 3 త్వరలో మీ ముందుకు వస్తుంది. 



*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.

బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page