మాతృత్వం ఒక వరం

Matruthvam Oka Varam - Telugu Family Story| Addanki Lakshmi
మాతృత్వం ఒక వరం - తెలుగు కుటుంబ కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 25/09/2026
“మాతృత్వం ఒక వరం” అద్దంకి లక్ష్మి రచించిన హృద్యమైన తెలుగు కుటుంబ కథ. పిల్లల పెంపకంలోని మమత, తల్లికి లభించే అపురూపమైన ఆనందం, కుటుంబంలో పరస్పర అవగాహన, తల్లి జీవితంలో మాతృత్వానికి ఉన్న ప్రత్యేక స్థానం ఈ కథకు ప్రధానాంశాలు.
"ఇదిగోనండి! మీ టిఫిన్ బాక్స్ బ్యాగులో పెట్టుకోండి."
"రాధా! నువ్వు కూడా తొందరగా తెములు, మళ్లీ ఆఫీసుకు టైం అయిపోతుంది," అంటూ రవి కంగారు పెడుతున్నాడు.
"లేదండి, నేను ఆఫీసుకు రావడం లేదు," అంది మెల్లగా.
"ఏంటి, ఈ రోజు సెలవు తీసుకున్నావా? ఒంట్లో కులాసాగా లేదా?" అడిగాడు రవి ఆఫీసుకు తయారవుతూ.
"లేదండి, నేనింకా ఆఫీసుకు వెళ్లను, ఉద్యోగం మానేశాను," అంది రాధ తాపీగా.
"అదేమిటి ఉద్యోగం మానేయడం? నాకు ఈ విషయం ఒక్కసారి కూడా చెప్పలేదు!"
"అవునండి, క్రిందటి వారం డాక్టర్ దగ్గరికి వెళ్లొచ్చాము కదా! వాళ్లు కన్ఫామ్ చేశారు నాకు ప్రెగ్నెన్సీ అని."
"అయితే అదేమిటి? కడుపుతో ఉంటే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవాలా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా?" అన్నాడు చికాగ్గా రవి.
"లేదండి, నాకు ఇంక కుదరదు," అంది తాపీగా రాధ.
"అంతా నీ ఇష్టమేనా? నాకేం చెప్పక్కర్లేదా? భర్త విలువ లేదా?" అంటూ కోపంగా అరిచాడు రవి.
"లక్ష రూపాయల జీతం పోగొట్టుకుని, ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటావా?"
"ప్లీజ్! ఈ విషయంలో నన్నేమీ మీరు బలవంతం పెట్టకండి. ఆఫీస్‌కి వెళ్లి రండి, మనం మెల్లగా మాట్లాడుకుందాం," అంది రాధ శాంతిగా.
టిఫిన్ బాక్స్ తీసుకుని కోపంగా వెళ్లాడు రవి.
రవి వెళ్లిన తర్వాత మెల్లగా టిఫిన్ తిని కిచెన్ సర్దుకుని కాస్త హాయిగా, రిలీఫ్‌గా ఫీల్ అయింది రాధ.
కొడుకు బంటికి ఆరు సంవత్సరాలు. వాడు ఉదయమే స్కూల్ బస్సులో స్కూల్‌కి వెళ్తాడు. సాయంత్రానికి వస్తాడు.
రవి, రాధ ఒకే కంపెనీలో వేరువేరు సెక్షన్లలో పని చేస్తున్నారు. ఇద్దరికీ శాలరీ బానే వస్తుంది. పెళ్లయిన వెంటనే లోన్ తీసుకుని ఆ కాలనీలో చక్కటి ఫ్లాట్ తీసుకున్నారు.
పెళ్లయిన రెండేళ్లకు బంటి పుట్టాడు. అప్పుడు సెలవులు కూడా ఎక్కువ ఇచ్చేవారు కాదు, ఒక మూడు నెలలు డెలివరీకి ఇచ్చేవారు.
మామగారు, అత్తగారు వచ్చి పిల్లవాడి పెంపకం పూర్తిగా చూసుకునేవారు. ఆఫీసు కూడా దూరం అవడం వల్ల పొద్దున్నే 8:00కి బయలుదేరితే మళ్లీ వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయ్యేది.
రాధ పూర్తిగా అలసిపోయేది. పిల్లవాడిని కాసేపు దగ్గరకు తీసుకుందామన్నా కూడా ఆమెకు శక్తి ఉండేది కాదు. పూర్తిగా అత్తగారే పెంచింది.
"చూడు రాధా! చూడు, బంటిగాడు నవ్వుతున్నాడు. ఇదిగో బోర్లా పడ్డాడు," అంటూ ముచ్చటపడేది అత్తగారు.
ఏదీ తనకు చూడటానికి ఎక్కడ టైం, ఓపిక? ఆ పిల్లవాడికి పాకడం వచ్చింది, బోర్లా పడుతున్నాడు, బుడిబుడి అడుగులు నడిచేవాడు. అత్తగారికి ముచ్చట.
బోర్లా పడితే ఆ చుట్టుపక్కల వాళ్లందరినీ పిలిచి బొబ్బట్లు పంచిపెట్టేది, అడుగులేస్తే అరిసెలు తయారు చేసి అందరికీ ఆనందంగా పెట్టేది. ఏ ముచ్చటా తను చూడలేదు.
"రాధా! ఇదిగో చూడవే, పిల్లవాడు అత్తా అత్తా అంటున్నాడు," అనేది.
కాసేపు ఎత్తుకుందామని రమ్మంటే తన దగ్గరకు వచ్చేవాడు కాదు, అత్తగారి దగ్గరికే వెళ్లేవాడు.
రవి దగ్గరకు అసలే వచ్చేవాడు కాదు. మామగారు, అత్తగారు అంటేనే వాడికి ఇష్టం, వాళ్ల దగ్గరే ఆడేవాడు.
అయినా తనేమీ ఇది పట్టించుకునేది కాదు. ఎంతసేపూ ఆ ఉద్యోగము, ఆ శాలరీ, ఈ ఇల్లు బాధ్యత, లోను తీర్చాలి... ఇవే మనసులో మెదులుతూ ఉండేవి. ఈ పిల్లల్ని పెంచడం, ఈ ముద్దుమురిపాలు... ఇవన్నీ తాను ఆలోచించేది కాదు. పూర్తిగా ఆఫీసులో కష్టపడి పనిచేయడమే తెలుసు.
బంటిని స్కూల్లో చేర్పించారు. వాడింక స్నేహితులతో ఆడుకోవడం, చదువుకోవడం వీటిలో పడిపోయాడు.
ఇంతలో మళ్లీ తను కడుపుతో ఉంది. బంటీని స్కూల్లో చేర్పించిన తర్వాత అత్తగారు, మామగారు పల్లెలో ఉన్న సొంతంటికి వెళ్లిపోయారు.
"పిల్లవాడు పెద్దవాడయ్యాడు కదా, మాకు మా ఊరిలో అక్కడే హాయిగా ఉంటుంది," అన్నారు.
తాను కూడా ఏమీ బలవంతం చేయలేదు. పెద్దవాళ్లయ్యారు, వాళ్లు ఎక్కడ హాయిగా ఉంటే అదే మంచిది అనిపించింది. వాళ్ల సంతోషమే తనకు కావలసింది.
క్రిందటి వారం డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకొచ్చింది. ఆవిడ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసింది. వెంటనే రాధ ఆ సంతోష విషయాన్ని అత్తగారికి, అమ్మకు ఫోన్ చేసి చెప్పింది.
ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. "ఈసారి అమ్మాయి పుట్టాలే రాధా! ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి," అన్నారు అత్తగారు.
మరుసటి రోజు అత్తగారు ఫోన్ చేశారు. "ఎలా ఉంది ఆరోగ్యం? కులాసాగా ఉందా?" అంటూ... "బానే ఉన్నాను అత్తయ్యగారూ," అంది రాధ.
"ఏం లేదమ్మా, నీకో విషయం చెబుదామని," అంది.
"చెప్పండి అత్తయ్యగారూ," అంది రాధ. రాధను కన్నకూతుర్లా ప్రేమగా చూసుకుంటుంది అత్తగారు.
"ఇదిగో చూడమ్మా రాధా! మాతృత్వం తల్లికి ఒక వరం. పిల్లల్ని కనడం, పెంచడం దేవుడు మనకు ఇచ్చిన వరాలు. ఇవి మగవాళ్లకు దొరికే వరాలు కావు.
ఈ వరాలను అనుభవించడమే మనకు జీవిత సాఫల్యము. నా విషయమే తీసుకో, నేను మీ మామగారు బ్యాంకులో పనిచేసేవాళ్లము. మీ ఆయన, మీ ఆడపడుచు ఇద్దరు పుట్టారు.
ఇద్దరినీ మా అత్తగారు, మా మామగారే పెంచేవారు. పిల్లలిద్దరూ నన్ను అసలు పట్టించుకునేవారు కాదు, నా దగ్గరకు వచ్చేవారు కాదు. నిజానికి నేను కన్నాను గానీ వాళ్లను నేను అసలు పెంచనే లేదు."
"గతమంతా ఆలోచించుకుంటే ఇప్పుడు మాతృత్వం యొక్క విలువ ఎంతో తెలుసుకున్నాను. చంటిపిల్లలు, ఆ ముద్దుముచ్చట, ఆ మాటలు, అల్లరి... ఇవేమీ నాకు తెలియవు. మూడు నెలల పిల్లాడు ముచ్చటగా నవ్వుతుంటే తల్లి మనసు మురిసిపోతుంది.
అమ్మ అని మొదటిసారి పిలిస్తే మనసు పరవశమవుతుంది, బుడిబుడి నడకలు నడుస్తుంటే ఆనందం, చిన్నచిన్న పలుకులు పలుకుతుంటే అమ్మానాన్నల జన్మ ధన్యం. ఈ ఆనందం ఎంత డబ్బు ఇవ్వగలదు?"
"పిల్లల్ని పెంచడంలోనే ఆ మాతృత్వంలోని మమత, ఆనందం... బూరి బుగ్గలతో ముసిముసిగా నవ్వే ఆ పసిపిల్లలు, వాళ్లతో గడిపిన జీవితం... అవే తీయతీయటి అనుభవాలు మాతృమూర్తికి.
అమ్మ అమ్మ అంటూ తన చిన్నపిల్లలు తల్లి చుట్టూ తిరగడం అమ్మ జన్మకు అదృష్టం. మూడు సంవత్సరాల పిల్లవాడు స్కూలుకు వెళ్లే వరకు పెంచుకుంటే ఆ ఆనందాలన్నీ నువ్వు అనుభవిస్తావు.
బంటిగాడి విషయంలో నేను, మీ మామగారే పెంచాము కదా వాడిని! మళ్లీ నీకు ఈ అదృష్టం దొరికింది. రవి మాటలు వినిపించుకోకు. మీకు డబ్బుకేమీ లోటు ఉండదు, అవసరమైతే మామగారు కూడా సహాయం చేస్తారు కదా! బాగా ఆలోచించుకుని నిర్ణయానికి రా.
చక్కగా పిల్లవాడిని పెంచుకుని, వాడు స్కూలుకు వెళ్లిన తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరు.
నేను కూడా రవికి అర్థమయ్యేటట్లు చెప్తాను," అంటూ రాధ అత్తగారు, రాధకు వివరించి చెప్పింది.
అత్తగారు చెప్పిందల్లా నిజమే అని అనిపించింది రాధకు.
కొడుకు బంటి ఎప్పుడూ తన దగ్గరకు వచ్చేవాడు కాదు చిన్నతనంలో. తాను ఎప్పుడైనా ఎత్తుకుంటే ఏడుస్తూ అత్తగారి ఒళ్లోకి వెళ్లిపోయేవాడు. అప్పుడు తనకి కాస్త బాధగా కూడా మనసులో అనిపించేది.
అత్తగారు చెప్పినవన్నీ నిత్యసత్యాలు. తాను పెద్దవాడి విషయంలో ఇవన్నీ అనుభవపూర్వకంగా చూసింది.
రాధ ఒకే నిర్ణయం తీసుకుంది. పిల్లవాడు పుట్టి మళ్లీ వాడు బడికి వెళ్లే వరకు తాను ఉద్యోగం చేయకూడదని... అందుకనే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది.
ముందే చెప్తే రవి ఒప్పుకోడు కదా! అందుకే ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి అప్పుడు చెప్పింది.
సాయంత్రం రవి ఇంటికి వచ్చాడు.
కానీ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఈ విషయం గురించి అతడు మనసులో ఎంతో ఆలోచించాడు.
"సారీ రాధా! పొద్దున నీ మనసును అనవసరంగా కష్టపెట్టాను. నువ్వు జాబ్‌కి వెళ్లొద్దు, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో. పిల్లలను కని, పెంచి పెద్ద చేయడం మాతృమూర్తి బాధ్యత.
ఆ సంతోషాలను తల్లిని అనుభవించకుండా చేయడం నిజంగా నా తప్పే. ఇప్పటికీ మా అమ్మ నా చిన్నతనంలో నన్ను ఎంత గారంగా పెంచేదో, నేను ఎంత అల్లరి చేసినా నవ్వుకునేదో నాకు జ్ఞాపకం.
నిజమే, మాతృత్వం స్త్రీలకు ఒక గొప్ప వరం. మనకేం లోటు లేదు, నా జీతంతోనే సర్దుబాటు చేసుకుందాం. నీవు హాయిగా పిల్లల బాధ్యతను తీసుకో," అన్నాడు రవి.
"మీరు ఎంత మంచివారండి!" అంటూ రాధ, రవి హృదయంలో తలదాచుకుంది.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,











Comments