షాపింగ్ మాయ

Shopping Maya - Telugu Comedy Story | Mohana Krishna Tata
షాపింగ్ మాయ - తెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ
Published In manatelugukathalu.com On 25/11/2026
“షాపింగ్ మాయ” కథలో భార్య మాయ షాపింగ్ ఉత్సాహానికి, భర్త జేబు బాధకు మధ్య జరిగే సరదా సంఘటనలు నవ్వులు పూయిస్తాయి. ₹100 కోసం మొదలైన షాపింగ్ చివరకు ₹5,100 బిల్లుగా మారిన తీరు ఈ హాస్యకథకు ప్రత్యేక ఆకర్షణ.
"ఏమండీ! మా మేనత్త మనవరాలి పెళ్లి పత్రిక వచ్చింది. వచ్చే నెలలోనే పెళ్లి!" అంటూ భార్య మాయ హాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ మాట వినగానే నా గుండె జారిపోయింది. పెళ్లి అంటే పండగే... కానీ, మొగుడి జేబుకి మాత్రం అది "దండగే" అని నాకు బాగా తెలుసు.
"సరేనోయ్, వెళ్దాంలే," అన్నాను పేపర్ చూస్తూ.
"వెళ్లడం కాదు సామీ! పెళ్లి ఐదు రోజులు. ఐదు రోజులకి ఐదు రకాల పట్టుచీరలు కావాలి. పైగా రిసెప్షన్‌కి ప్రత్యేకంగా ఒక లెహంగా కొనుక్కోవాలి.
ఈరోజే షాపింగ్‌కి వెళ్తున్నాం, అంతే!" అని ఆర్డర్ వేసేసింది.
తప్పదు కదా అని శనివారం సాయంత్రం, పైగా కార్తీక మాసపు చలిలో, నా జేబులో వేడివేడి క్రెడిట్ కార్డు పెట్టుకుని షాపింగ్ మాల్‌కి బయలుదేరాను.
మాల్‌లోకి అడుగుపెట్టడమే ఆలస్యం, మాయ కళ్లు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నట్టు వెలిగిపోయాయి.
సేల్స్ బాయ్ దగ్గరకు వెళ్లి, "తమ్ముడూ! ఆరెంజ్ కాకుండా, పింక్ కాకుండా... రెండిటికీ మధ్యలో ఉండి, కాస్త రాయల్ లుక్ వచ్చే చీరలు చూపించు," అంది మాయ.
ఆ సేల్స్ బాయ్ నా వైపు దీనంగా చూశాడు. "నాకేం తెలీదు బాబూ, నేను కేవలం బిల్లు కట్టే జీవిని," అన్నట్టు నేను మొహం పెట్టాను.
వాడు దాదాపు వంద చీరలు విప్పి చూపించాడు.
ప్రతి చీరను మాయ తన భుజం మీద వేసుకుని, అద్దంలో చూసుకుంటూ నన్ను అడిగేది: "ఏమండీ! ఇది బాగుందా?"
నేను "ఆ... చాలా బాగుంది," అంటే, "మీకు అస్సలు టేస్ట్ లేదు. ఎప్పుడూ ఒకే మాట చెప్తారు," అనేసేది.
సరే అని ఇంకో చీరకి "ఇది బాలేదు," అంటే, "ఇంత మంచి కలర్ బాలేదా? మీ కళ్లకు ఏం కనిపిస్తోందో ఏంటో!" అని విసిరికొట్టేది.
మొత్తానికి 'బాగుంది' అన్నా తప్పే, 'బాలేదు' అన్నా తప్పే అని అర్థమయ్యాక, నేను కేవలం తల ఊపడం మాత్రమే ప్రాక్టీస్ చేశాను.
రెండు గంటల తపస్సు తర్వాత ఒక మూడు చీరలు సెలెక్ట్ అయ్యాయి.
నా జేబు కొంచెం తేలికవుతుందని సంతోషపడే లోపే...
"ఇప్పుడు వీటికి మ్యాచింగ్ గాజులు, మేకప్ కిట్, ఇంకా పిల్లలకి బట్టలు కొనాలి," అంది మాయ.
మాల్ మొత్తం మూడు రౌండ్లు కొట్టాం.
నా కాళ్లు నొప్పులు పుట్టి, థియేటర్లో 'ఇంటర్వెల్' కోసం ఎదురుచూసే ప్రేక్షకుడిలా అయిపోయాను.
దారిలో కనిపించిన ప్రతి ఐటమ్‌ని చూసి, "ఇది మా వదినకి బాగుంటుంది, ఇది మా పిన్నికి గిఫ్ట్ ఇవ్వచ్చు," అంటూ ట్రాలీ నింపేస్తోంది మాయ.
నా పరిస్థితి ఎలా ఉందంటే, ట్రాలీ బరువు పెరిగేకొద్దీ నా బీపీ కూడా పెరుగుతోంది! చివరికి బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాం.
బిల్లు చూస్తే... నా శాలరీ అకౌంట్ మొత్తం క్లీన్ అయిపోయేలా ఉంది.
కౌంటర్ అతడు "సార్, క్యాషా? కార్డా?" అని అడిగాడు.
నేను ఎంతో ధైర్యం తెచ్చుకుని క్రెడిట్ కార్డు తీసి ఇస్తుంటే, మాయ నా వైపు తిరిగి, "చూశారా! నావల్లే కదా మీకు ఇంత మంచి షాపింగ్ మాల్‌లో ఇన్ని బట్టలు దొరికాయి.
పెళ్లిలో మీ భార్య మహాలక్ష్మిలా మెరిసిపోతుంటే ఆ ఆనందమే వేరు!" అంది నవ్వుతూ.
"నువ్వు మహాలక్ష్మిలా మెరుస్తావో లేదో కానీ, వచ్చే నెల నా అకౌంట్ మాత్రం ఖాళీ అవడం ఖాయం," అని నా మనసులో అనుకుంటూ, పైకి మాత్రం నకిలీ నవ్వు నవ్వి "అంతేగా! అంతేగా!" అన్నాను.
ఇంటికి వచ్చాక చూస్తే... తెచ్చిన బట్టలన్నీ బెడ్‌రూమ్‌లో పడేసి, "అయ్యో! రిసెప్షన్‌కి వేసుకోవడానికి మ్యాచింగ్ క్లిప్ కొనడం మర్చిపోయాను.
రేపు మళ్లీ వెళ్దాం," అంది మాయ.
ఆ మాట వినగానే నేను అక్కడే సోఫాలో స్పృహతప్పి పడిపోయాను!
మరుసటి రోజు ఉదయం...
"ఏమండీ! నిన్న ₹30,000 బిల్లు కట్టాం కదా... ఈరోజు కేవలం ఆ ₹100 మ్యాచింగ్ హెయిర్ క్లిప్, మ్యాచింగ్ బొట్టుబిళ్లలు మాత్రమే కొందాం. త్వరగా రెడీ అవ్వండి, లేకపోతే మాల్‌లో రద్దీ ఎక్కువైపోతుంది," చాలా అమాయకంగా అంది మాయ.
నేను మనసులో చాలా ప్రశాంతంగా ఫీలవుతూ, "ఓన్లీ ₹100 కదా, దీనికి క్రెడిట్ కార్డ్ కూడా అక్కర్లేదు, జేబులో చిల్లరతోనే అయిపోతుంది," అని ధీమాగా మళ్లీ అదే షాపింగ్ మాల్‌కి బయలుదేరాను.
కానీ, నాకు తెలీదు... ఆడవాళ్లు ₹100 వస్తువు కోసం మాల్‌లోకి వెళ్తే, అది కేవలం ఒక 'ఎంట్రీ పాస్' మాత్రమేనని!
మాల్‌లోకి అడుగుపెట్టామో లేదో, ఫ్యాన్సీ సెక్షన్ వైపు వెళ్తున్న మాయ కళ్లు అటు పక్కనే ఉన్న "న్యూ అరైవల్స్ - పట్టు శారీస్" డిస్‌ప్లే బోర్డు మీద పడ్డాయి.
అక్కడ ఒక మెరిసిపోతున్న కాంబినేషన్ చీరను డమ్మీ బొమ్మకి కట్టి ఉంచారు. అంతే! మాయ కాళ్లు బ్రేకులు పడ్డ లారీలా అక్కడే ఆగిపోయాయి.
"ఏమండీ! ఆ చీర చూడండి... ఎంత బాగుందో! అసలు ఆ బార్డర్ డిజైన్, ఆ కలర్ కాంబినేషన్... వచ్చే నెల మన బావగారి షష్టిపూర్తికి కట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది కదూ!" అంది నా వైపు ఒక లుక్ ఇస్తూ.
"మాయా! మనం వచ్చింది ₹100 క్లిప్ కోసం... నిన్నే కదా ఐదు చీరలు కొన్నావ్!" అని నేను బతిమిలాడాను.
"అబ్బా! నిన్న కొన్నవి పెళ్లికి. ఇది షష్టిపూర్తికి. పైగా చూడండి... 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్ ఉందట! అంటే ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ! మనం కొంటే లాభమే కానీ నష్టం లేదు కదా!" అంటూ నన్ను లాక్కెళ్లిపోయింది.
నేను మనసులో 'ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారే కానీ, ఆ ఒకదాని ధరలోనే రెండిటి ధర కలిపేస్తారని వీళ్లకు ఎవరు చెప్తారు సామీ!' అని తల బాదుకున్నాను.
చీర నచ్చడమే ఆలస్యం, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్, దానికి కాంబినేషన్ గాజులు... ఇలా ఒకదాని వెంట ఒకటి ట్రాలీలోకి వచ్చి పడిపోయాయి.
చివరకు ఎప్పుడో గుర్తొచ్చి, మనం రావడానికి కారణమైన ఆ ₹100 మ్యాచింగ్ క్లిప్‌ను కూడా ట్రాలీలో పడేసింది.
మళ్లీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాం. నిన్నటి కౌంటర్ అతనే ఉన్నాడు. నన్ను చూసి సానుభూతిగా ఒక నవ్వు నవ్వి, మెషీన్‌లో బార్‌కోడ్స్ స్కాన్ చేయడం మొదలుపెట్టాడు.
"సార్! మొత్తం ₹5,100 అయింది!" అన్నాడు కూల్‌గా.
నా కళ్లు బైర్లు కమ్మాయి. జేబులో ఉన్న ₹100 నోటు నన్ను చూసి ఏడుస్తున్నట్టు అనిపించింది. తప్పక మళ్లీ వెనుక జేబులోంచి క్రెడిట్ కార్డు తీసి వణుకుతున్న చేతులతో వాడికి ఇచ్చాను.
బిల్లు పట్టుకుని బయటకు వస్తుంటే మాయ ఎంతో మురిసిపోతూ, ఆ ₹100 క్లిప్‌ను నా చేతికి ఇచ్చి, "చూశారా ఏమండీ! ఈ ₹100 క్లిప్ ఎంత బాగుందో! ఇది కొనడానికి రాబట్టే కదా... మనకు ఇంత మంచి ₹5,000 చీరలు దొరికాయి.
ఐ యామ్ సో లక్కీ!" అంది.
నేను గుండెల్లో వస్తున్న ఏడుపును దాచుకుంటూ, "నువ్వు లక్కీవో కాదో తెలీదు కానీ... వచ్చే నెల నా క్రెడిట్ కార్డ్ బిల్లు చూసి నాకేదో అవడం మాత్రం ఖాయం," అని ముఖం మాడ్చుకుని బండి స్టార్ట్ చేశాను!
సమాప్తం.
***********
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ















Comments