అన్నా...

Anna... - Telugu Emotional Story | Bhattu Venkata Rao
అన్నా... - తెలుగు భావోద్వేగ కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 25/11/2026
కాయకష్టం చేసుకుని బతికే ఓ సామాన్యుడి జీవితంలో జరిగిన అనూహ్య ప్రమాదం, ముందుగానే కనిపించిన నీడ, ఆపద సమయంలో వినిపించిన చెల్లెలి గొంతు చుట్టూ అల్లుకున్న హృదయస్పర్శి కథే ‘అన్నా...’.
బల్లపరుపుగా ఉండే చెక్క రిక్షా లాగుతున్నాడు కేశవులు. నడివయసు మనిషతడు. ‘ఊహ తెలిసిన కాణ్ణుంచి’ రిక్షా లాగడమే అతడు నేర్చిన పని. అదే అతడి కుటుంబానికి జీవనాధారం అయింది.
బోలెడంత బరువుంది రిక్షా మీద. అన్నీ సిమెంటు బస్తాలు.
‘కొట్టు కాణ్ణుంచి బిల్డింగ్ సైటు కాడికి చేర్చాల. ఊరు దాటి రెండు కిలోమీటర్లు బోవాలని బేరమాడితే పరవాలేదులే అనుకున్నా... నడుములు ఇరిగిపోతున్నయ్ లాగి లాగి... పైనుంచి ఎండ దంచేస్తా ఉంది. చెవట్లు కారిపోతున్నయి...’ అని మనసులో అనుకుంటూ రిక్షా లాగుతున్నాడు కేశవులు.
అప్పటికి బాగా అలిసిపోయాడు. బరువు లాగడం కష్టం అనిపించింది. ‘ఇగ లాభం లేదు… కూసేపాగాల’ అనుకుంటూ ఒక చెట్టు నీడన రిక్షాని ఆపి దిగాడు.
రిక్షా కింద ఇనపకమ్మీకి యాలాడగట్టిన మంచినీళ్ళ ప్లాస్టిక్ సీసాని, నెమ్మదిగా వొంగి తీసుకుని, రెండు గుటకలేశాడు.
‘వేడిగున్నై నీళ్ళు. ఉండవా మరి? ఎండెట్టా మండిపోతావుంది? అయినా నీళ్ళు నీళ్ళేగా! ఆ రెండు గుక్కలు గొంతులో పడకపోతే అయ్యగారి పని అవుటేగా...’ అనుకుంటూ చెట్టు కింద పాతి ఉన్న ఎత్తయిన రాయి మీద కూర్చున్నాడు.
‘ఇదెవులు పాతాడో ఈడ... ధర్మాత్ముడు... నాలాంటోడు కూసోడానికే కామాల!’ అని ఆలోచిస్తూ రాయి మీద సద్దుకుని కూర్చున్నాడు.
‘పర్లేదు... సౌకర్యంగా ఉండేట్టే పాతాడు సామి…’ అని మెచ్చుకోలుగా అనుకున్నాడు. అలా కూర్చున్న తరువాత కాస్త కుదుటపడ్డట్లయింది ప్రాణం అతడికి.
‘పైసలేమీ తీసుకోకుండా ఫ్రీగా నీడనిచ్చే చెట్లు రోడ్డు పక్కన ఉండబట్టిగాని, లేకపోతే నాలాటోళ్ళ పని ఫైసలే అయిపోద్ది ఇట్టాటి ఎండల్లో మరి…’ అని మనసులో అనుకుంటూ సేదదీరుతుండగా... ఒక నల్ల కారు రయ్‌మని రోడ్డు మీద దుమ్ములేపుకుంటూ పోయింది.
మొహం మీదకి గాలిలో ఎగిరి వస్తున్న దుమ్ముని చేత్తో అటూ ఇటూ గాల్లోనే ఊపి విదిలించుకుంటూ... దుమ్ముని తప్పించుకోవడానికన్నట్లుగా మొహం అవతలి వైపుకి తిప్పుకున్నాడు కేశవులు.
ఇంకా మధ్యాహ్నం కాకుండానే కణకణ కాస్తున్న ఎండకి అతడి నీడ నేల మీద పడి ఉంది ఆ వైపున. నల్లటి నిగతో ఉంది ఆ నీడ. తాను చేతిలో పట్టుకుని ఉన్న మంచినీళ్ళ బాటిల్‌తో సహా నల్లగా మెరుస్తూ ఉంది.
అయితే అందులో ఏదో తేడా కనిపించింది కేశవులుకి. కాయకష్టం చేసుకుని బతికేవాడికి వొంట్లో వొణుకు పుట్టించే తేడా అది. ఆ తేడా వంకే తేరిపార చూశాడు కేశవులు.
అలా చూసిన అతడి కళ్ళకి ఆ నీడ మధ్యకి విరిగిపోయి సగమిటూ, సగమటూ అన్నట్లుగా రెండు విడి సగాలుగా ఉంది. మధ్యలో నడుము లేదు.
‘ఇదేందబ్బా ఇట్టాగుందిది!?’ అని గాబరాపడుతూ మళ్ళీ తన నీడ వంక తేరిపార చూశాడు కేశవులు.
ఎంత చూసినా అప్పటిదాకా తాను చూసిన తన నీడలో ఏమీ మార్పు లేకుండా రెండు సగాలుగా ఉన్నట్లుగా కనిపించింది కేశవులికి తన నీడ, మధ్యలో నడుము లేకుండా.
‘అయిపోయిందిరా నాయనా... ఇగ మన పని అయిపోయినట్టే. నడుం బోయిందంటే ఇంక దేనికి పనికొస్తాం మనం? నడుం బోవడమంటే పేణం బోవడమన్నట్టేగా…’ అనుకుంటూ కంగారుగా మరోసారి తన నీడ కేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు కేశవులు.
అప్పుడు కనిపించింది కేశవులుకి… అప్పటిదాకా తాను చూసిన తన నీడలో… తన నడుము ఉండాల్సిన చోట, నేలలోపలికి ఏటవాలుగా ఏర్పడి ఒక చిన్న గొయ్యి ఉంది.
నేలలో ఏర్పడి ఉన్న ఆ గొయ్యి కారణంగా నీడలో నడుము ఆ గొయ్యి లోపలికి పడిపోయి, మొత్తం మనిషి నీడలో నడుము లేనట్లుగా భ్రాంతి కలిగిస్తూ ఉంది.
‘అమ్మయ్య... అదనమాట సంగతి. మన నడుము మాయమైపోలే... మనకాడనే ఉందనమాట!’ అని అనుకుని స్థిమితపడ్డాడు కేశవులు.
(2)
కాస్త అలసట తీరాక… మళ్ళీ సిమెంటు బస్తాలు బరువున్న చెక్క రిక్షాని లాగుతూ అక్కడి నుండి బయలుదేరాడు కేశవులు. పది పదిహేనడుగుల దూరం అలా లాగుతూ వెళ్ళి, ఆపై సీటు మీద ఎక్కి కూర్చుని బలంగా తొక్కసాగాడు.
పోను పోను రోడ్డు మీద రిక్షా స్పీడందుకుంది. ‘ఇదే స్పీడులో ఇంకో పదిహేను నిమిషాలు పోనిస్తే సైటు కాడికెళ్ళి పోవచ్చు...’ అనుకుంటూ మంచి ఊపు మీద వొంట్లో శక్తినంతా కూడదీసుకుని రిక్షా తొక్కసాగాడు కేశవులు.
పది నిమిషాలు గడిచాయి. ఇంకో అయిదు నిమిషాల దూరంలో గమ్యం ఉందనగా, వెనకనుంచి స్పీడుగా వస్తున్న లారీ ఒకటి, రిక్షాకి వెనక ఇంకా అల్లంత దూరంలో ఉండంగానే ‘బొంయ్యి బొంయ్యి’మని పేద్ద సౌండుతో హారను కొట్టింది.
తన వెనకనే రిక్షాకి దాదాపుగా ఆనుకుని ఉందన్నట్లుగా వినిపించింది కేశవులుకి ఆ లారీ చేసిన హారను శబ్దం.
ఒక్కసారిగా వెనకనుంచి వచ్చిన అంత శబ్దానికి అదిరిపడ్డాడు కేశవులు. ‘అయిపోయాన్రా దేవుడా…’ అనుకుంటూ కంగారుగా, తొక్కుతున్న స్పీడులోనే రిక్షాని రోడ్డు కిందకి దించే ప్రయత్నం చేశాడు.
అతడి దురదృష్టానికి అక్కడే గతుకులు ఎక్కువగా ఉండడంతో అదుపు తప్పింది బండి. తట్టుకుని ఆపగలిగే సమయం అతడికి లేదు.
అలిసిపోయి ఉన్న కేశవులి శరీరంలో అంత శక్తి అంతకన్నా లేదు. బ్యాలెన్సు తప్పి రిక్షా తిరగబడింది.
చేయగలిగేది లేక హ్యాండిలు వదిలేశాడు కేశవులు. రిక్షా పరిగెడుతున్న స్పీడుకి, సీటు మీద నుంచి ఎగిరవతల పడ్డాడు. సిమెంటు బస్తాలు మీద పడినై.
రిక్షా చక్రాలు మెలితిరిగినై. వెనక నుంచి వచ్చిన లారీ అదేమీ పట్టించుకోకుండా, రిక్షాని దాటి దానిపాటికది వెళ్ళిపోయింది. క్షణాలలో జరిగిపోయింది ఇదంతా.
లేవలేక పడిపోయున్న కేశవులుని పక్కనే పొలాల్లో కూలిపని చేసుకుంటున్న జనం పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యందిచ్చి లేపి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు.
లేవలేకపోయాడు కేశవులు. నడుము దగ్గర బాగా దెబ్బ తగిలినట్లనిపించింది. ‘అమ్మా...’ అంటూ బాధగా మూలిగాడు.
కళ్ళెదురుగా దూరంగా పైన నీలం రంగు ఆకాశంలో కణకణలాడే ఎండను కాస్తూ సూర్యుడు కనిపించాడు. చూడలేక కళ్ళు మూసుకున్నాడు కేశవులు.
చుట్టూ మూగిన కూలిజనం అతడిని లేపి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కేశవులి ఆలోచనలు పది నిమిషాల క్రితం చెట్టు కింద తాను చూసిన తన నీడ వైపుకి భయంగా మళ్ళాయి.
‘ఇందాక చెట్టు కాడ కనిపిచ్చిన నీడలో మాదిరిగా అయిపోయానా ఏందిరా దేవుడా...?’ అనుకున్నాడు.
‘జరగబోయేదే నాకు ముందుగా చెట్టుకింద నీడలో కనిపిచ్చిందా...?!’ అనే చిత్రమైన ఆలోచన అతడి మనసులో మరింతగా భయాన్ని రేపింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి కేశవులికి.
చుట్టూ చేరి తనను కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న కూలిజనం ఏవేవో ధైర్యం కలిగించే మాటలు చెబుతున్నారు. కానీ అవేవీ అతడికి సరిగా వినపడడం లేదు.
అయితే, ఆ అందరి మాటల మధ్య నుంచి ఒక స్త్రీ కంఠం ఆత్మీయంగా "భయపడమాకన్నా, అట్టా ఏం జరగదులే భయపడమాక..." అనడం కేశవులుకి స్పష్టంగా వినిపించింది.
తనకు బాగా పరిచయమున్న గొంతులా అనిపించింది కేశవులికి ఆ స్త్రీ కంఠం. గాయపడి స్పృహపోగొట్టుకున్న శరీరంపై చల్లని నీళ్ళను చిలకరించినట్లుగా అనిపించిందతడికి ఆ మాటలలోని ఆత్మీయత.
అంత బాధలోనూ, గాబరాలోనూ ‘ఎవరిదబ్బా ఈ గొంతు...’ అని ఆలోచించాడు కేశవులు.
అకస్మాత్తుగా ఆ గొంతు ఎవరిదో అతడి స్ఫురణకు వచ్చింది. ఆ గొంతు పదేళ్ళ క్రితం దాదాపుగా ఇటువంటిదే రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన తన చెల్లెలు నీలమ్మ గొంతులా అతడికి అనిపించింది.
ఆశ్చర్యపోతూ, నెమ్మదిగా కళ్ళు తెరిచి జనం వైపు చూశాడు కేశవులు. తన చుట్టూ మూగిన కూలిజనంలో అందరూ మగవాళ్ళే ఉన్నారు తప్ప, ఆడవాళ్ళెవరూ లేకపోవడం గమనించాడు. ‘నీలమ్మా... పైనుంచి చూస్తూ అన్నకి ధైర్యం చెబుతున్నావా అమ్మా...’ అని మనసులో అనుకున్నాడు.
ఎక్కడి నుంచో తెలీకుండా వినిపించిన తన చెల్లెలి మాటలు ఆ క్షణాలలో అతడిపై సంజీవనిలా పనిచేయగా, ప్రయత్నించి వొంట్లోకి తెచ్చుకున్న బలంతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు కేశవులు.
(సమాప్తం)
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.












Comments