top of page
Original.png

మంచితనపు పండువెన్నెల


అర్ధరాత్రి వర్షంలో రహస్య గది తలుపు తెరిచిన ప్రయాణికుడికి కనిపించిన భయపడుతున్న మధ్యవయస్కురాలు

Manchitanapu Panduvennela- Telugu Mystery Story | Bhattu Venkata Rao

మంచితనపు పండువెన్నెల తెలుగు మిస్టరీ కథ | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 19/08/2026


మంచితనపు పండువెన్నెల కథలో ఒక పెద్ద వాన కారణంగా అర్ధరాత్రి బస్సు ప్రయాణం ఆగిపోతుంది. ఒంటరిగా మిగిలిపోయిన ప్రయాణికుడు రోడ్డు పక్కనున్న ఓ హోటల్‌లో తలదాచుకోవాల్సి వస్తుంది. అక్కడ అతనికి ఇచ్చిన ఇరుకు గదిలో ఉన్న ఓ తలుపును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని హోటల్ యజమాని హెచ్చరిస్తాడు. కానీ చీకటి, భయం, కుతూహలం కలిసి అతన్ని ఆ రహస్య తలుపు తెరవడానికి పురికొల్పుతాయి. తలుపు అవతల కనిపించిన మధ్యవయస్కురాలి దీనమైన విన్నపం అతని మనసును కలచివేస్తుంది. అయితే మరుసటి ఉదయం అదే స్త్రీ బస్సులో కనిపించడంతో కథ ఒక్కసారిగా మిస్టరీగా మారుతుంది. మంచితనం, అనుమానం, భయం, మానవత్వం మధ్య సాగే ఈ కథ చివరికి మనం చూసేది నిజమా, మనసు సృష్టించిన భ్రమా అనే ప్రశ్నను మిగుల్చుతుంది.


పెద్ద వాన.

"బస్సింక ముందుకెళ్ళదు" అన్నాడు డ్రైవరు. "ప్రయాణం ఈ రాత్రికిక సాగదు. దిగిపోయి దగ్గర్లో ఉన్న హోటళ్ళలో ఏదైనా ఒక హోటల్లో తలదాచుకోండి. పొద్దున సంగతి పొద్దున చూసుకుందాం" అన్నాడు. బస్సులో ఉన్నది అయిదారుగురిమే. చేసేది లేక సరేనని అందరం బస్సు దిగిపోయాం.


రోడ్డు పక్కన ఒక హోటల్లో ఆ రాత్రికి పడుకోడానికి గది అడిగాను. "లేదు" అన్నాడు వెంటనే. చూడడానికి చాలా కరుకుగా, మాట ఏమాత్రం తేడా మాట్లాడినా తన్నేవాడిలా ఉన్నాడతను. అర్ధరాత్రి బస్సు దిగాను. ఊర్లో తెలిసిన వాళ్ళెవరూ నాకు లేరు. ఒంటరివాణ్ణి. ఇంకెక్కడికీ పోలేను. సగం రాత్రి ఎలాగూ గడిచిపోయింది. ఓ అయిదారు గంటలు తలదాచుకోవడానికి, వీలయితే కాస్త నడుం వాల్చడానికి ఏదన్నా తమరే దయచేసి దారి చూపించండని ప్రాధేయపడ్డాను.


"సరే, పైనొక గది ఉంది. ఇరుకు గది. చిన్న మంచం ఉంటది. పడుకోగలిగితే పడుకోండి. ఈ చలిలో ఫాను లేకపోయినా పరవాలేదు. స్టోర్ రూమ్ అది. చిన్న బెడ్ లాంపు ఉంటుంది. అంతే. ఇష్టమైతే పోయి ఆ గదిలో పడుకోండి" అన్నాడు.

రాత్రి తలదాచుకోవడానికి ఇంకేం కావాలి? అది చాలు. ఏదోలా గడిపేస్తాను, అలాగే, అన్నాను.


సరే అని గదికి దారి చూపించాడు. మెట్లెక్కి పైకెళ్ళాలి. వెళ్ళబోతుండగా చెప్పాడు.

"ఆ గది లోపలి గోడకి తలుపుంటుంది. ఆ తలుపు గడి మాత్రం తియ్యొద్దు. ప్రమాదం. కొండ మీద ఉంది కదా బిల్డింగు. అవతల అంతా ఓమోస్తరు లోయ. చీకటిలో ఏమీ కనపడదు. అడుగు పట్టుతప్పిందంటే, అంతే సంగతులు. జాగ్రత్త" అని హెచ్చరించాడు.


ఏదో ఈ రాత్రికి, వానలో తలదాచుకోవడానికే నేను ఆ గదిలోకి వెళుతున్నాను. కొత్త ప్రదేశమంటే నాకు అదో రకమైన బెరుకు. అంత తొందరగా ముందుకెళ్ళను. రూములో లైటు స్విచ్చిని తప్ప మరొకటి ముట్టుకోను అని చెప్పి మెట్లెక్కి వెళ్ళి, గది తలుపు తీసి, చేతిలో ఉన్న సంచిని మంచంపై పెట్టి, హమ్మయ్య అని మనసులో అనుకుంటూ మంచంపై కూర్చున్నాను.


అతడు చెప్పినట్లు బాగా ఇరుకు గది అది. ప్లాస్టిక్కు నవారు అల్లిన ఒక ఇనప మంచం వేసి ఉంది అందులో. అంతే. ఎదురుగా గోడకి గడియపెట్టి ఉన్న తలుపులు కనిపించాయి. అవతల ఇలాంటిదే ఇంకొక గది ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆ తలుపుల్ని చూడగానే. బహుశా ఆ తలుపుల గురించే అతడు జాగ్రత్త చెప్పి ఉంటాడు అని మనసులో అనుకుంటూ మంచంపై నడుము వాల్చాను.


అలసిపోయి ఉంది శరీరం. బయట నుండి ఉధృతంగా గాలి వీస్తూ శబ్దం ఈల లాగా వినిపిస్తోంది. వర్షం దంచికొడుతూ ఉంది. నిద్రపట్టే పరిస్థితి కాదు. అయినప్పటికీ నిద్రపోవడానికి ప్రయత్నించాను. మనసులో నా దయనీయ పరిస్థితి సినిమాలో రీలులాగా కరుణరసభరితంగా కళ్ళ ముందు కదిలింది.


భయం కొలిపే ఒంటరి గది, దానిని మించిన నా ఒంటరి జీవితపు అలసిపోయినతనం. ఎప్పుడూ ఏదో నిరామయం వెంటాడుతూ ఉన్నట్లుంటుంది లోపల. అంతలో కరంటు పోయింది. సన్నటి వెలుతురు మాత్రమే పంచుతున్న ఆ బెడ్ లాంపు కూడా ఆరిపోయింది. ఇంకేముంది, చీకటిమయమైపోయింది అంతా. మనిషి గుండె భయంతో బేజారెత్తి పోవడానికి కావలసిన మొత్తం సెట్టింగు అంతా పర్ఫెక్టుగా కుదిరినట్లయింది.

ఇక... ఆ మనిషి ఎలాంటి పరిస్థితిలోనూ తెరవొద్దన్న తలుపులను తెరవడమొకటే ఈ సెట్టింగ్ మొత్తంలో ఇప్పుడు మిగిలి ఉంది అన్నట్లుగా ఒక కోతి ఆలోచన నా మనసులో మెదిలింది. మనిషి కోతి నుంచి పుట్టాడని అందుకేగామోసు అంటుంటారు. ఎంత భయంలో కూడా కోతి స్వభావం మనిషిని విడిచిపెట్టి పోదు బహుశా అందుకనే.


మంచం మీద శరీరం నిలవలేదు. ఎప్పుడెప్పుడు లేచి ఆ తలుపు గడి తీద్దామా అన్న తొందర మొదలైంది. మరింక ఆగేదెందుకు? అది కూడా చేసేద్దాం అనిపించింది. ఒక వేళ అతడు చెప్పినట్లు లోయలో పడిపోతేనో? అని సందేహం కలిగింది. ఆ... అంత సులభంగా ఎందుకు పడిపోతాంలే! అని ధైర్యం కూడా ఆ వెంటనే కలిగింది. అంతే... మంచం మీది నుంచి లేచి వెళ్ళి నెమ్మదిగా గడియ తీశాను. గడియ తీస్తూ, అవతల నుంచి ఒక్కసారిగా బలంగా నా మీదికి కొట్టబోయే గాలిని, వాన చినుకులను తట్టుకోవడానికన్నట్లుగా శరీరాన్ని సిద్ధం చేసి రెడీగా పెట్టుకుని, నెమ్మదిగా తలుపు గడి తీశాను. ఎంత జాగ్రత్తగా తీసినప్పటికీ, ఇనుము ఒకదానికొకటి రాసుకున్నప్పుడు వచ్చే సన్నటి కీచు శబ్దం రాకుండా ఆపలేకపోయాను.


అతడు భయపెట్టినట్లు అవతల లోయ ఏమీ లేదు. నాకు అనిపించినట్లుగా, మరొక చిన్న చీకటి గది ఉంది. అందులో ఎవరో ఉన్నట్లుగా నాకు అలికిడి వలన తెలిసింది. అవతలి వైపు నుంచి మెరిసిన మెరుపు కాంతి గదిలో పడి చీకటిని ఒక క్షణం వెలిగించింది. ఆ వెలుగులో, లోపల ఉన్నది ఒక స్త్రీ అని, ఆమె మధ్యవయస్కురాలనీ, ఒక మూలన ముడుచుకుని భయపడుతూ కూర్చుని ఉన్నదనీ... నాకు తెలిసింది. ఆశ్చర్యపోయాను.


"ఎవరు నువ్వు?" అని అడిగాను.


"వీడు రాక్షసుడు. నన్ను వీడి చెర నుండి తప్పించి తీసుకెళ్ళండి..." అని భయపడుతూ, నీరసం నిండిన కంఠంతో దీనంగా ఆమె అడిగింది.


మనసు కరిగింది. అయినా నేనప్పుడున్న పరిస్థితికి, అంత సహాయం చేసేంత గొప్ప స్థితిలో ఉన్నానా నేను? అని ప్రశ్నించుకున్నాను. అంత ధైర్యం నాకు లేదు. పరాయి వ్యక్తి కోసం ప్రాణానికి తెగించడం నా స్వభావం కాదు.


తలుపు గడియవేసి వచ్చి మళ్ళీ మంచంపై పడుకున్నాను. పడుకున్నోడిని పడుకోకుండా గడెందుకు తీశాను? అని నన్ను నేను తిట్టుకుంటుండగా ఎప్పటికో నిద్రపట్టింది.


గట్టిగా వినిపిస్తున్న బస్సు హారను శబ్దానికి ఉలికిపడి లేచాను. తెల్లగా తెల్లవారిపోయుంది. వాన కూడా వెలిసింది. పక్కన మిస్టరీ గది తలుపులు తెరిచున్నాయి. సంచి తీసి చంకన పెట్టుకుని, పరుగెట్టుకుంటూ కిందికొచ్చి, ఆ లాడ్జి ఆయనకు డబ్బులిస్తూ 'ఆ గదిలో ఆమె ఏమైంది?' అన్నాను.


ఆయన నా వైపు ఒక చూపు వికటంగా చూసి 'ఎళ్ళండెళ్ళండి, బస్సు డ్రైవరు బాగా హడావుడి పడుతున్నట్లున్నాడు' అన్నాడు.


నేను మరేం మాట్లాడకుండా వచ్చి బస్సులో కూర్చున్నాను.


బస్సు కదిలింది. నా వెనక సీట్లో నాకేదో అనుమానంగా అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. కిటికీలోంచి బయటకు చూస్తూ ఒక నడివయసు స్త్రీ కూర్చుని ఉంది. చేతిలో ఉన్న సంచిని ఒడిలో పెట్టుకుని, ప్రశాంతత నిండిన చూపులతో దూరంగా పచ్చటి పొలాల్లోకి చూస్తూ ఉన్నదామె.


లోకంలో ఇంకా మిగిలి ఉన్న మంచితనాన్ని ఆమె తన జీవితంలో మరోసారి కనుగొన్నట్లుగా, ఆ మంచితనపు పండువెన్నెలలో అప్పటిదాకా తడిసి, కొన్ని క్షణాల ముందే ఆ వెన్నెలలోంచి బయటకొచ్చినట్లుగా సంతృప్తిగా, స్వచ్ఛంగా, ధైర్యంగా ఉన్నట్లనిపించింది ఆమె ఆ క్షణం నా కళ్ళకి. అదేగాకుండా ఆమెను అంతకు ముందు నేను ఎక్కడో చూసినట్లుగా కూడా నాకు అస్పష్టంగా అనిపించింది.


నాకు నిద్ర మత్తు ఇంకా పూర్తిగా వదిలినట్లు లేదు… అన్న సందేహం నాకు కలిగింది. వెంటనే నేను ఎక్కవలసిన బస్సునే ఎక్కానా? అని గాబరాలో పడిపోయాను. ఆ గాబరాలో బస్సులో ఉన్న మిగతా జనం వంక చూస్తూ ఉండిపోయాను.


మనుషులు చూపించే మంచితనం కొన్ని సందర్భాలలో ‘అది నిజమేనా? నమ్మదగినదేనా?’ అన్న సందిగ్ధంలో పడేసి, మంచివాళ్ళను సైతం అసహనానికి గురిచేసేంత అయోమయంగా ఉంటుందని ఆ గాబరాలో నాకు నేను సర్దిచెప్పుకున్నాను.


భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page