ముందుచూపు
- Rallabandi Sangam Naidu

- 2 minutes ago
- 2 min read

Mundhuchoopu - Telugu Moral Story | Rallabandi Sangam Naidu
ముందుచూపు - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 20/08/2026
ముందుచూపు అనేది ఒక చారిత్రక నేపథ్యంతో సాగుతున్న విలువల కథ. కొసల దేశ యువరాజు ఆదిత్యవర్మ గురుకుల విద్యను పూర్తి చేసి, యుద్ధంలో తన ప్రతిభను నిరూపించుకుంటాడు. అయితే అతని గొప్పతనం కేవలం యుద్ధ విజయంలోనే ఉండదు. శత్రువులుగా మారిన సైనికుల పట్ల మానవత్వంతో వ్యవహరించడంతో పాటు, భవిష్యత్ తరాలకు అవసరమైన ప్రకృతి వనరుల గురించి ఆలోచిస్తాడు.
జనాభా పెరుగుదల, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, మరణాల తగ్గుదల వంటి భవిష్యత్ పరిణామాలను ముందుగానే ఊహించి, యుద్ధ ఖైదీలతో మొక్కలు నాటించే నిర్ణయం తీసుకుంటాడు. ముందుచూపు, పర్యావరణ పరిరక్షణ, మానవత్వం, బాధ్యతాయుతమైన నాయకత్వం వంటి విలువలను ఈ కథ హృదయానికి హత్తుకునే విధంగా వివరిస్తుంది.
పూర్వం కొసల దేశాన్ని మహేంద్రవర్మ పాలించేవాడు. మహేంద్రవర్మ ఏకైక సంతానం ఆదిత్యవర్మ. కొడుకంటే మహేంద్రుడికి వల్లమాలిన అభిమానం. కొడుకుని చూడకుండా ఉండేవాడు కాదు. పంచప్రాణాలు కొడుకే. తన తరువాత వారసుడిగా తన కొడుకే కాబట్టి కొడుకుపై తన ప్రేమను చంపుకుని విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపాడు. ఎక్కడ తన దగ్గరుంటే కొడుకు గారాబం వలన విద్య రాదోనని మహేంద్రుడి ఆలోచన.
ఆదిత్యవర్మ గురుకులంలో సకల విద్యలు నేర్చుకున్నాడు. వేదవేదాంగాలు తెలుసుకున్నాడు. విలువిద్య, కత్తిసాము, కర్రసాములో ప్రావీణ్యం సాధించాడు. గురువు దగ్గర తనకు తానే సాటి, తనకు తానే పోటీ అని పేరు తెచ్చుకున్నాడు. విద్య పూర్తిచేసుకున్న ఆదిత్యవర్మ గురువు ఆశీర్వాదం తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న కుమారుణ్ణి చూసి మహేంద్రవర్మ ఆనందానికి అవధులు లేవు. వయోభారంతో ఉన్న తనకు సరైన వారసుడు తన కొడుకేనని మంత్రికి చెప్పాడు. మంత్రి "ఒకసారి యువరాజు యుద్ధ విద్యలేపాటివో పరీక్షించి ఆ తరువాత పట్టాభిషేకం చేద్దాం రాజా" అన్నాడు. మంత్రి సలహాకు రాజు తల ఊపాడు.
కొసల రాజ్యానికి తూర్పు భాగంలో నిరంతరం అంతర్యుద్ధాలు జరుగుతుండేవి. ఆదిత్యవర్మను ఆ అంతర్యుద్ధాలు అణచమని రాజు ఆజ్ఞాపించాడు. తన తండ్రి ఆజ్ఞ మేరకు రాజ్యంలోని తూర్పు భాగంలో తిరుగుబాట్లను ఆదిత్యవర్మ విరోచితంగా యుద్ధం చేసి అణిచివేశాడు. తిరుగుబాటు నాయకుడిని బహిరంగంగా ఉరితీశాడు. భవిష్యత్తులో మరెవరూ తిరుగుబాటు చేయకుండా ఈ ఘటన తోడ్పడుతుందని ఆదిత్యవర్మ భావన. తిరుగుబాటు చేసిన సైనికులను జీవితకాలం ఖైదీలుగా ఉంచమన్నాడు. వారితో జైల్లో మొక్కలు నాటించమన్నాడు.
ఈ విషయాలను మంత్రి ద్వారా తెలుసుకుని కుమారుని విజయం చూసి మహేంద్రవర్మ పొంగిపోయాడు. కాకపోతే యుద్ధంలో పట్టుబడ్డ సైనికులను చంపకుండా మొక్కలు నాటించటమేమిటని మహేంద్రుడికి సందేహం కలిగింది. ఇదే విషయాన్ని కొడుకుని అడిగాడు.
ఆదిత్యవర్మ వివరించసాగాడు: "ఆ తిరుగుబాటు నాయకుని వలలో పడి వీరు మనకి వ్యతిరేకమయ్యారు కానీ, వీరికి మనమీద నిజంగా తిరుగుబాటు చేయాలని ఉండదు. ఇన్ని అడవులున్నాయి కదా, యుద్ధ ఖైదీలతో మొక్కలు ఎందుకు నాటుతున్నానని మీకు అనుమానం కలిగి ఉండవచ్చు. మన పూర్వీకులు ముందుచూపుతో మొక్కలు నాటడం వలన మనం సుఖంగా ఉన్నాం.
మనం మొక్కలు నాటడం వలన రాబోయే తరం సుఖంగా ఉంటుంది. ముందు ముందు జనాభా పెరుగుతుంది. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతుంది. మరణాలు తగ్గుతాయి, జననాలు పెరుగుతాయి. ఇప్పుడు ఉన్న అడవులు సరిపోవు. ఇంకా అడవులు పెంచాలి. అందుకే యుద్ధ ఖైదీలతో మొక్కలు నాటిస్తున్నాను" అన్నాడు ఆదిత్యవర్మ.
ముందుచూపు, మానవత్వం గల కుమారుడు తన వారసుడు అయినందుకు మహేంద్రవర్మ పొంగిపోయి, పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టించాడు. సంతోషంగా తన కొడుకుని రాజును చేశాడు.
***
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం






Comments