ఏ తల్లి కన్న బిడ్డవో..!
- Penumaka Vasantha

- 7 hours ago
- 5 min read

Ee Thalli Kanna Biddavo - Telugu Inspirational Story | Penumaka Vasantha
ఏ తల్లి కన్న బిడ్డవో..! - తెలుగు ప్రేరణాత్మక కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 20/08/2026
ఆడపిల్లల విలువను చాటిన హృదయస్పర్శి కథ ఏ తల్లి కన్న బిడ్డవో.
ఆడపిల్ల పుట్టిందనే కారణంతో కన్న కూతురిని తిరస్కరించిన తండ్రి, అదే కూతురు తన కళ్ల ముందే గొప్ప డాక్టర్‌గా ఎదిగినప్పుడు ఎలా స్పందించాడు? “ఏ తల్లి కన్న బిడ్డవో..!” అనే ఈ హృదయస్పర్శి కథ ఆడపిల్లల పట్ల సమాజంలో ఉన్న వివక్షను ప్రశ్నిస్తూ, తల్లి ప్రేమ, ఆత్మవిశ్వాసం, స్వయం ఆధారిత జీవితం ఎంతటి మార్పును తీసుకురాగలవో చూపిస్తుంది.
స్వాతి రెండోసారి ఆడపిల్లకు జన్మనివ్వడంతో భర్త ఫణిరాజు ఆమెను, తన కూతుళ్లను వదిలిపెడతాడు. కన్న కూతురిని డబ్బుకు దత్తత ఇవ్వడానికి కూడా వెనుకాడని అతని ఆలోచనలకు భిన్నంగా, స్వాతి తన పిల్లల భవిష్యత్తు కోసం స్వయంగా వ్యాపారం ప్రారంభించి వారిని చదివిస్తుంది. కాలక్రమంలో పెద్ద కూతురు సహస్ర డాక్టర్‌గా ఎదుగుతుంది.
తనను గుర్తించని తండ్రి కొడుకుకే వైద్యం చేసే స్థితికి సహస్ర చేరినప్పుడు కథలోని అసలు భావోద్వేగం వెలుగులోకి వస్తుంది. ఆడపిల్లను భారంగా చూసిన తండ్రికి, అదే ఆడపిల్ల తన జీవితంలోనే గొప్ప గుణపాఠంగా మారుతుంది. ఆడపిల్లల విలువ, తల్లి త్యాగం, స్వయం సాధికారత, తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుచేసే ఈ కథను పూర్తిగా చదవండి.
"అమ్మా..! ఈ మందులు రెండు పూటలా వేసుకోమంటారా?" అని అడుగుతున్న వ్యక్తినీ ఎక్కడో చూసినట్లుగా ఉంది సహస్రకు. "అవునండీ..! రెండు పూటలా వేసుకోవాలి." "సరేనమ్మ..!" ఇంకా ఏవో మందులు కూడా చూపించి అడిగితే అన్నిటికీ ఓపికగా జవాబిచ్చింది సహస్ర.
సహస్ర వెళ్తుంటే.. "ఈ డాక్టరమ్మకు ఎంత ఓర్పో?" తన వెనుక అంటున్న జనాల మాటలు వింటూ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళింది సహస్ర. ఇంటికి వచ్చి తన చిన్నప్పటి ఆల్బమ్ తీసి అమ్మానాన్నల ఫోటో చూసింది. 'యస్! ఇందాక నన్ను మందుల గురించి అడిగింది ఈ వ్యక్తే..! డౌట్ లేదు' అనుకుంది సహస్ర.
స్వాతి షాప్ నుండి రాగానే చెప్పింది. "అమ్మా..! ఇవాళ నాన్నను హాస్పిటల్లో చూశాను." "ఎప్పుడో నువ్వు నాలుగేళ్లప్పుడు చూసిన ఆయన్ని ఎలా గుర్తుపట్టావే? ఆయన అయివుండడు?"
ఆయన్ని రేపు ఊరు, పేరు అడిగి కనుక్కోవాలనుకుంది సహస్ర. మరుసటి రోజు హాస్పిటల్ కెళ్లగానే... నాన్న కోసం వెతికింది సహస్ర. సిస్టరును అడిగింది సహస్ర. "ఈ బెడ్ మీదుండే పేషెంట్ డిశ్చార్జి అయ్యాడా?" "అవును డాక్టర్..!" "ఆయన పేరు, ఊరు కేసు సీట్లో చూసి చెప్పగలవా?" అంటే..? ఫైల్ తీసి అతని వివరాలు చూసి చెప్పింది సిస్టర్. "ఆయన పేరు ఫణిరాజు, ఊరు రామాపురం."
'యస్! ఈ రెండు పేర్లు నేను చిన్నప్పటి నుండి విన్నవే. ఆ వ్యక్తి మా నాన్నే..! వయసు రీత్యా బట్టతల వచ్చి గడ్డం పెరగడం వల్ల గుర్తుపట్టలేకపోయాను' అనుకుంది సహస్ర. ఒక వారం తర్వాత ఫణిరాజు వచ్చాడు. సీట్లో కూర్చుని పేషెంట్స్‌ను చూస్తున్న సహస్ర దగ్గరికి వచ్చాడు. "అమ్మా..! కడుపులో మంట, నొప్పి పూర్తిగా తగ్గింది. పెద్ద డాక్టరుగారు రాలేదా?" "లీవులో ఉన్నారు, రేపు వస్తారు." "ఇంకా ఏవన్నా మందులు మీరు రాస్తే... అవి తీసుకుని వాడతాను." "ఇంకేమీ అక్కరలేదు. వేళకు అన్నం తినండి, మసాలాలు తగ్గించండి. మళ్లీ నొప్పి వస్తే రండి..!"
"మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తారు?" అడిగింది సహస్ర. "పొగాకు కంపెనీలో సూపర్‌వైజర్‌గా చేస్తా." "పిల్లలు ఎంతమంది?" "ఒక అబ్బాయి అమ్మా..!" "ఏం చదువుతున్నాడు?" "టెన్త్ తప్పాడు, బలాదూరుగా తిరుగుతున్నాడు. వాడి గురించే దిగులు." "మీకు అమ్మాయిలు లేరా?" 'ఇప్పుడు ఈ డాక్టరమ్మ ఎందుకు అన్నీ అడుగుతుంది? ఇద్దరూ అమ్మాయిలు. రెండో అమ్మాయిని అమ్మకానికి పెట్టానంటే... మొహం చూడదేమోనని "లేరమ్మా..!" అన్నాడు.
"అమ్మాయిలే లేరన్నాడు కాబట్టి ఇంకా నాన్నకు బుద్ధి మారలేదని... "సరే.. వెళ్లండి." "బలానికి ఏవన్నా మందులు!" అని అడుగుతున్న ఫణినీ చూసి "ఏమక్కరలేదు, వెళ్లండి..!" అని విసుక్కుంది. 'ఇదేంటి? ఇవాళ ఈ డాక్టరమ్మ విసుగ్గా ఉంది, మూడ్ బాగాలేదు' అనుకుంటూ వెళ్లాడు ఫణి.
"అమ్మా.. ఇవాళ ఆ ఫణి మళ్లీ వచ్చాడు హాస్పిటలుకు. నేను చెపితే నువ్వు నమ్మలేదు. నువ్వు చిన్నప్పుడు మా నాన్న గురించి చెప్పిన వివరాలే చెప్పాడు. ఒక అబ్బాయి, టెన్త్ తప్పాడని చెప్పాడు. అమ్మాయిలు లేరన్నాడు" అన్నది కోపంగా సహస్ర.
"పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు." అని గత జ్ఞాపకాల్లోకి వెళ్లాడు స్వాతి. "ఏంటే స్వాతి..! ఎంతసేపు పడుకుంటావు? ఎన్నాళ్లు దిగులుపడి ఏడుస్తావు? ఏం? రెండోసారి అమ్మాయి అయితే ఏమయ్యింది? బంగారంలాంటి పిల్ల పుట్టింది. ఇక్కడ నేను చూసుకుంటాను. అత్తవారింటికి వెళితే ఇట్లా వాళ్ల మీద పిల్లను వదిలితే వాళ్లు చూస్తారా? నాన్న పెద్దరికంగా మీ మామగారికి ఫోన్ చేసి 'ఇట్లా అమ్మాయి పుట్టిందని' చెపితే అట్లాగా..!" అన్నారు కానీ ఒక్కళ్లు వచ్చి చూసి పోలేదు. మీ ఆయన ఫోన్‌కు చేస్తే... అస్సలు తీయడం లేదు" అన్న అమ్మ మాటలు పట్టించుకోకుండా, మంచి రంగు, పెద్ద కళ్లతో, నల్లని ఒత్తైన జుట్టుతో చూడగానే ముద్దొచ్చే పిల్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంది స్వాతి. "నాకు ఎందుకు పుట్టావు?"
పెద్ద పిల్ల సహస్ర వచ్చి, "అమ్మా..! చెల్లి ఎంత ముద్దుగా ఉందో కదూ..!" "ఆ...." అంది కానీ ఒకటే దుఃఖం ముంచుకు వస్తుంటే... కన్నీళ్లు తుడుచుకుంటూ పాపకు పాలిచ్చి మళ్లీ ఉయ్యాలలో వేసి భర్తకు ఫోన్ చేసింది స్వాతి.
ఫోన్ తీయలేదు, పాపను చూడడానికి రాలేదు. ఇంకా దిగులుపడిపోయింది స్వాతి. 'ఈసారి అమ్మాయి పుడితే అసలు నాకు చెప్పొద్దు..!' అన్న భర్త మొహం కళ్లలో కనపడింది. 'ఇప్పుడేం చేయాలి? ఇద్దరాడపిల్లలను ఎలా పెంచాలి?' అని ఒకటే కుమిలిపోసాగింది.
స్వాతి ఫ్రెండ్ రూపా వచ్చింది స్వాతిని చూడడానికి. స్వాతి రాగానే ఏకరువు పెట్టింది స్వాతి అమ్మ రాజ్యలక్ష్మి. స్వాతి అత్తింటి వాళ్లు ఇప్పటి వరకు వచ్చి పిల్లను చూడకపోవడం గురించి... "అవునా ఆంటీ..! స్వాతి వాళ్ల ఆయనకు బుద్ధి ఉండాలి. రెండోసారి అమ్మాయనీ చూడడానికి రాకపోవడం ఏంటి? స్వాతి అత్తింటి వాళ్లు పశువులకన్నా హీనంగా ఉన్నారు. మాలాంటి వాళ్లకు పిల్లలు లేరు, ఉన్నవాళ్లు ఇలా చేస్తున్నారు."
పిల్లలు లేని రూపా..! పిల్లను ఒళ్లోకి తీసుకుని కాసేపు ఆడుకుని స్వాతికి ధైర్యం చెప్పి వెళ్లాడు. స్వాతి అత్తింటి వాళ్లను తలుచుకుని, "వాళ్లు చాలా మొండివాళ్లు. వచ్చి నన్ను తీసుకెళ్లరు. అమ్మవాళ్లకు... నేను, నా పిల్లలు భారం అవ్వకూడదు" అని రూపతో చెప్పి బాధపడింది స్వాతి.
రూపా అమెరికా వెళుతూ... వచ్చింది, "స్వాతి..! నాకు పిల్లలు లేరు. ఇప్పుడు పుట్టిన పిల్లను మాకు దత్తతకు ఇస్తావా? నీకు సహస్ర ఉందిగా? ఇప్పుడు తీసుకుంటేనే... మమ్మల్ని తల్లితండ్రులు అనుకుంటుంది. ప్లీజ్..! మీ వారికి చెప్పి చూడు" అంది.
మొదట స్వాతి ఒప్పుకోలేదు. కానీ ఆలోచిస్తే... 'రూపకు పిల్లను ఇవ్వడం మంచిది' అని తోచింది. రూపకూ పిల్లలు కలగరని డాక్టర్లు చెప్పారు. రూప భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తాడు. రూపకి పిల్లనిస్తే నా పిల్ల సుఖపడుతుంది.
మరుసటి రోజు రూప వచ్చింది, "ఏంటే? ఏమాలోచించావు?" "మా ఆయనకు చెప్పాలి." రూప ఫోన్ చేస్తే... తీశాడు ఫణి. వెంటనే స్వాతికి ఇచ్చింది రూపా. "ఏమండీ ఎలా ఉన్నారు?" "ఆ, ఎందుకు చేశావు?" కోపంగా అన్నాడు ఫణి. "మన రెండో అమ్మాయిని మా ఫ్రెండ్ వాళ్లు తీసుకుని పెంచుకుంటారుట, ఇద్దామా? డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. మీరు వస్తే... ఒకసారి మీతో మాట్లాడతాం" అంది నా ఫ్రెండ్.
"మా అమ్మానాన్నతో మాట్లాడి చెప్తా." సాయంత్రం వచ్చాడు ఫణి. ఫణినీ చూస్తే... ఇదివరకటిలా ప్రేమ పొంగలేదు స్వాతికి. పెద్ద పిల్ల సహస్ర "నాన్నా..!" అంటూ వెళ్లి ఒళ్లో కూర్చుంది. "చెల్లెలు ముద్దుగా ఉంది చూడు..!" ఉయ్యాల వైపు చూస్తూ చెప్పినా రెండో పిల్లను చూడడానికి ఇంట్రెస్ట్ చూపలేదు ఫణి. ఇంతలో రూపా, వాళ్ల ఆయన వచ్చారు.
రూపా వాళ్ల ఆయన నగేష్, "ఫణిగారు, మీ అమ్మాయిని మాకు ఇవ్వడానికి మీకు సమ్మతమేగా?" అంటే... ఇష్టంగా తలూపాడు. ఈలోపు రాజ్యలక్ష్మి పిల్లను తెచ్చి అల్లుడి ఒళ్లో పెట్టింది. 'పిల్లను చూసైనా అల్లుడికి మనసు మారి వద్దంటాడులే' అనుకుంది.
"మీరు మీ పిల్లను ఇచ్చినందుకు మేము మీకు పది లక్షలు మీ పెద్దపాప పేరు మీద ఫిక్స్డ్ వేస్తాం, మీకు ఓకేనా..!" అన్నాడు నగేష్. "ఇంకో ఇరవై ఇప్పిస్తే... మా పెద్దపాపకు చదువు చెప్పించి పెళ్లి చేయాలిగా? ఇప్పుడు అన్ని రేట్లూ పెరిగిపోయాయి. మీకు ఇవి పెద్ద లెక్క కాదులే" నసుగుతూ అన్నాడు ఫణి.
"ఇంకో ఐదు ఇస్తాం... అవి మేము అమెరికా వెళ్లేముందు ఇస్తాము" అన్నారు. ఇప్పుడు స్వాతికి భర్త మీద చాలా అసహ్యం కలిగింది. 'నాకు అక్కాచెల్లెళ్లు లేరు. నా పిల్లలు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారనుకుంటే... పిల్లను సరిగా కూడా చూడకుండా అమ్మకానికి పెట్టినందుకు.'
"సరే నేను వెళ్తాను, త్వరగా వచ్చేయ్, సహస్రకు స్కూల్ పోతుంది అని" చెప్పి వెళ్లాడు ఫణిరాజు. మరుసటి రోజు రూప వస్తే, "సారీ రూపా..! నా పిల్లను నీకివ్వలేను, ఏమనుకోకు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలాగోలా నేనే పెంచుకుంటాను. నువ్వు నాకు ఒక సాయం చేయవే. కొంత డబ్బు నువ్వు నాకిస్తే... నేను బిజినెస్ చేసి నీ డబ్బు నీకిస్తాను." మొదట డిజపాయింట్‌కు గురైనా, "సరేనే తప్పకుండా సాయం చేస్తాను, నువ్వు నా ఫ్రెండ్‌వి" అని రూప మాటిచ్చింది.
అత్తారింటికి వెళ్లకుండా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసింది. ఫణి ఫోన్ చేశాడు, "ఏంటి? మీ ఫ్రెండ్ వాళ్లు డబ్బులు బ్యాంకులో వేయలేదని." "వాళ్లు వేయరు, నేను పిల్లని వాళ్లకు ఇవ్వడం లేదు." "అయితే నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. డబ్బులు తీసుకుని వస్తేనే రా, లేకపోతే నిన్ను, పిల్లలను పోషించే స్థితిలో లేను."
"సరే నేను రావడం లేదు అని..!" ఫణితో తెగతెంపులు చేసుకుని పుట్టింట్లోనే గోనె సంచులు తయారు చేసే బిజినెస్ స్టార్ట్ చేసింది. మొదట్లో ఇబ్బందులు పడినా, ఇప్పుడు సొంతంగా తన దగ్గరే ఒక ముప్ఫై మంది దాకా ఉపాధి కల్పిస్తుంది స్వాతి. రెండో పిల్ల స్వరూప ఇంజనీరింగ్ చదువుతోంది. ఆయన దగ్గరకు వెళ్లుంటే..! ఈ పిల్లలను ఇలా చదివించేదాన్ని కాదు. "అమ్మా...!" అంటూ పిలిచిన సహస్ర పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది స్వాతి.
ఒక నెల తర్వాత పిల్లాడికి బాగాలేదని హాస్పిటల్‌కు తెచ్చాడు ఫణి. డాక్టర్ చూసి, "ఈ అబ్బాయికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా?" "లేదండీ, ఏదో కొంచెం ఆల్కహాల్ తీసుకుంటాడు, అంతే...!" పిల్లాడి వైపు చూస్తూ అన్నాడు ఫణి. "లివర్ డ్యామేజ్ అయింది. కొన్నాళ్లు అబ్జర్వేషన్లో ఉంచాలి" అని జాయిన్ చేయమంటే... చేశారు. వాళ్లమ్మ ఏడుస్తూ, "డాక్టరుగారు, తగ్గుతుందా మా అబ్బాయికి?" అంది. "ఆ, చూడాలి. పిల్లాడు ఇంత పాడయ్యేదాకా ఏం చేస్తున్నారు?" అంటూ ఫణినీ, పెళ్లాన్నీ తిట్టాడు డాక్టర్.
డాక్టరుతో పాటు రోజూ వచ్చి చూసి వెళ్తుంది ఫణి కొడుకు రమేష్‌ను సహస్ర. రమేష్‌కు కొంచెం బాగైంది. వెళ్తూ సహస్రకు "ఏ తల్లి కన్న బిడ్డవో! నా పిల్లాడికి బాగైంది. చాలా చాలా థాంక్స్ తల్లి..!" అన్నారు ఫణి దంపతులు.
"మీరు కన్న బిడ్డనే నాన్నా..! నేను. అమ్మాయిలు లేరన్నారు మీకు. మీరు వదిలేసిన స్వాతి పెద్ద పిల్లను. నా పేరు డాక్టర్ సహస్ర..! ఆడపిల్లలను తక్కువ చేసి చూడకండి. మీ వంశోద్ధారకుడిని బాగు చేసుకోండి ముందు." స్టెత్ సరిచేసుకుంటూ వెళ్తున్న సహస్రను చూస్తూ ఆశ్చర్యపోయాడు ఫణి.
"ఏంది? ఈ డాక్టర్ పిల్ల నీ కన్న కూతురా?" అంటూ సహస్ర వైపు చూస్తూ అంది ఫణి భార్య ఆశ్చర్యపోతూ. "ఆ..." అని తలూపాడు. సహస్రను చూస్తూ 'ఆడపిల్లలను కన్నదని మీ అమ్మను వదిలేసినందుకు నాకు బాగా శాస్తి జరిగింది' బెడ్‌పై ఉన్న కొడుకును చూసుకుని మనసులో బాధపడ్డాడు ఫణిరాజు.
సమాప్తం
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.











Comments