ఏమండీ..! ఆవిడ వచ్చింది
- Penumaka Vasantha

- Oct 16
- 3 min read
#పెనుమాకవసంత, #PenumakaVasantha, #TufanuloKaruloShikaru, #ఏమండీఆవిడవచ్చింది, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Emandee Avida Vachhindi - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 16/10/2025
ఏమండీ..! ఆవిడ వచ్చింది - తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
భర్త పోయి, పిల్లాడిని తీసుకుని పుట్టినింటికి చేరింది కమల.తమ పక్కన ఉన్న చిన్నింట్లో కమలను పెట్టాడు కమల అన్న కిరణ్.
కిరణ్ భార్య కుమారి ప్రతిదానికీ కమలతో తగాదా ఆడుతుంది. పట్నంలో కమల ఫ్రెండ్ విజయ జాబ్ చేస్తుంది.
“మా ఓనర్ ఇంట్లో వాళ్ల పిల్లలను చూసుకోవడానికి మనిషి కావాలి కమల. చాలా మంచివాళ్లు. నువ్వు వచ్చి చేరవచ్చా?” అని అడిగింది.
సాయంత్రం అన్న రాగానే సంగతి చెప్పింది కమల.
మొదట కిరణ్ వద్దన్నాడు. కానీ కమల బలవంతంతో “సరే” అన్నాడు కిరణ్.
విజయ, కమలను వాళ్ల ఓనర్ రాజారావు ఇంటికి తీసుకెళ్లింది.
“సర్, ఈమె మా ఫ్రెండ్ కమల. ఈమధ్య భర్త పోయాడు. ఒక బాబు ఉన్నాడు. తను డబ్బులకు ఇబ్బంది పడుతుంటే ఇక్కడికి రమ్మని చెప్పాను, సార్.”
రాజారావుకు పొందికగా ఉన్న కమలను చూసిన వెంటనే మంచి అభిప్రాయం కలిగింది.
“చూడమ్మా, ఇక్కడ నీ పని — మా పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపటం, ఈవెనింగ్ వాళ్లు రాగానే స్నానాలు చేయించి, చదివించి, అన్నం పెట్టి నిద్రపుచ్చటం. నువ్వు బాగా చేస్తే జీతంతో పాటు నీ పిల్లాడికి గది కూడా ఇస్తాను. నేను బిజినెస్ పనుల మీద ఊళ్ళు తిరుగుతుంటాను. పిల్లలను జాగ్రత్తగా చూడమ్మా.”
“అలాగే సార్!” అంది వినయంగా కమల.
ఆ రోజే పనిలో చేరింది. వాచ్‌మన్, అతని భార్య సహాయంతో త్వరగానే అడ్జస్ట్ అయింది కమల. మొదట కొంత ఇబ్బంది పడ్డా, ఇప్పుడు అలవాటు అయింది.
రాజారావు నెలకు నాలుగు రోజులు మాత్రమే ఇంట్లో ఉంటాడు. రాజారావు పిల్లలు బాగా అలవాటయ్యారు కమలకి.తన పిల్లాడికి, వాళ్ల పిల్లలకు కథలు చెబుతూ నిద్రపుచ్చేది.
అప్పుడప్పుడూ అన్నయ్యకు ఫోన్ చేస్తుంది.
“అక్కడ పనిమనిషిగా చేసేదానికంటే నా ఇంట్లోనే ఉండొచ్చుగా?” అని నిష్టూరంగా అడుగుతాడు కిరణ్.
“లేదన్నయ్యా, ఇక్కడ బాగానే ఉంది. నువ్వు టెన్షన్ పడవద్దు,” అని చెప్పేది కమల.
ఇలా నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడాయన ఊళ్ళు తిరగటం మానేసి ఇంటి పట్టునే ఉంటున్నాడు. చుట్టాలందరూ “ఆడపిల్ల పెద్దయ్యేలోపు మళ్లీ పెళ్లి చేసుకో” అని రాజారావుపై ఒత్తిడి పెడుతుంటారు. రాజారావుకూ ఆలోచన కలిగింది — ఆడపిల్ల తల్లి చాటున పెరగాలి. పిల్లలను ఎవరు బాగుగా చూసుకుంటారో ఆలోచిస్తే, కమల సరైనదనిపించింది. నాలుగేళ్లుగా ఆమెను గమనిస్తే — ఎంతో పద్ధతిగా, ప్రేమగా పిల్లల్ని చూసుకుంది.
ఒక రోజు భోజనం సర్దుతూ వెళ్తున్న కమలను పిలిచి అడిగాడు:
“నేను మళ్లీ పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను కమల.”
“మంచిదయ్యగారూ. ఇక నా అవసరం లేకపోయినా, నన్ను ఏదో పనిలో పెట్టండి,” అంది తలవంచుకుని.
“నా భార్య పని ఉంది, నీకిస్తా చేస్తావా?” అని నవ్వుతూ అన్నాడు.
“అయ్యగారూ, ఏం మాట్లాడుతున్నారు? నాకు బాబు ఉన్నాడు. వాడికి అన్యాయం చేయలేను,” అంది కమల.
“చేయమని ఎవరన్నారు? నా పిల్లలతో పాటు నీ పిల్లాడిని కూడా చూసుకుంటాను. ఆలోచించి చెప్పు,” అన్నాడు రాజారావు.
ఏం చేయాలో అర్థం కాక, స్నేహితురాలు విజయ సలహా అడిగింది కమల.
“ఎన్నో ఏళ్లుగా ఆయనను తెలుసు. నువ్వు డౌట్ పడకు. ఒప్పేసుకో, పెళ్లి చేసుకో,” అంది విజయ.
ఒక వారం తర్వాత కమల — “మా అన్నయ్యతో మాట్లాడండి సార్” అని చెప్పింది.
కిరణ్ పట్నానికి వచ్చి రాజారావును కలిశాడు.
“నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను,” అన్నాడు రాజారావు.
“తనకి బాబు ఉన్నాడు కదా?” అని నసిగాడు కిరణ్.
“అదేనా మీ దిగులు? నేను ఎంతోమంది పేద పిల్లలకు ఫీజు కడతాను. మీ చెల్లెల్ని కూడా నా పిల్లలలా చూసుకుంటాను,” అన్నాడు రాజారావు.
చెల్లెలి తలూపడం చూసి కిరణ్ సంతోషపడ్డాడు.
ఒక మంచి ముహూర్తంలో, గుడిలో అందరి సమక్షంలో రాజారావు–కమల వివాహం జరిగింది.
తరువాత పండుగకు కమల, రాజారావు పిల్లలతో కలిసి కిరణ్ ఇంటికి వెళ్ళారు.
చుట్టాలు చూడటానికి వచ్చారు. నగలతో మెరుస్తున్న కమలను చూసి అందరూ సంతోషపడ్డారు.
“మీ ఆయన నిన్ను, నీ బాబుని ఎలా చూస్తున్నారు?” అని అడిగితే,“ఆయన దేవుడు. నా పిల్లాడిని వాళ్ల పిల్లలతో సమానంగా చూస్తారు,” అంది మెరిసే కళ్లతో కమల.
ఒక రోజు ఒక ఆవిడ వచ్చింది.రాజారావు బయట పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.ఆ ఆవిడను చూసి కోపంగా అడిగాడు —“ఎందుకు వచ్చావు?”
“నా పిల్లలను చూసి పోదామని,” అంది.
“వాళ్లు బావున్నారు. కానీ ఇక వెళ్ళు.”
“ఇంకా మీకు నా మీద కోపం పోలేదా?” అంది ఆవిడ.
“అది ఎట్లా పోతుంది? పిల్లల్ని, భర్తని వదిలేసి వెళ్లిపోయావు. ఈ జన్మలో పోదు,” అన్నాడు రాజారావు.
ఎవరితో ఆయన ఇంత గట్టిగా మాట్లాడుతున్నారో అని బయటికి వచ్చిన కమల —ఆ ఆవిడ బతిమాలటం చూసి ఆశ్చర్యపోయింది.
“వెళ్తావా? లేక పోలీసుల్ని పిలవనా?” అన్న రాజారావు మాట విని ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆవిడ.
లోపలికి వచ్చి కమల అడిగింది — “ఆవిడ ఎవరు?”
“నా మొదటి భార్య సుమతి,” అన్నాడు రాజారావు.
“ఆవిడను ఇంట్లోకి రానీయవచ్చుగా? నిజానికి ఆవిడకే ఈ ఇంట్లో హక్కు ఉంది కదా,” అంది కమల ప్రశాంతంగా.
“నీకు మొదటే చెప్పాలి అనుకున్నా, సమయం రాలేదు,” అన్నాడు రాజారావు.
“ఆ సుమతి పిల్లలు చిన్నప్పుడే వాళ్ల బావతో లేచిపోయింది. నాకిష్టం లేని అవమానం భరించలేక నేను ఈ సిటీకి వచ్చాను.
ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టాను, డబ్బు సంపాదించాను. ఇక విడాకుల కోసం ఫైల్ చేస్తాను. నీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కమల. ఇక నుంచి ఆవిడ వస్తే నాకే చెప్పు, ‘ఏమండీ ఆవిడ వచ్చింది’ అనొద్దు,” అని నవ్వాడు రాజారావు.
ఆ నవ్వులో కమల నవ్వు కూడా జతకలిసింది.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.




Comments