దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8
- Seetharam Kumar Mallavarapu
- 2 days ago
- 5 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

Dayyam@thommido Mailu - Part 8 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 14/10/2025
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని టాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం తో కలిసి బయలుదేరుతాడు ఎస్సై మోహన్. తిరిగి వచ్చేటప్పుడు చింత చెట్టు కొమ్మ విరిగి పడటంతో జీప్ ఆగుతుంది. పొలాల్లో ఉన్న తెల్లటి ఆకారం దగ్గరకు వెళ్తాడు ఎస్సై మోహన్. ఆ ఆకారం అతన్ని గాయపరుస్తుంది. ఈ విషయాలన్నీ న్యూస్ ఛానళ్లలో వస్తాయి.
ఆరు నెలల క్రితం కొందరు బి టెక్ స్టూడెంట్స్ తొమ్మిదో మైలు దగ్గర్లో ఉన్న శివయ్య జలపాతం టూర్ ప్లాన్ చేస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు తన ప్రేయసి రితికకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ అనే యువకుడు తొమ్మిదో మైలు దగ్గర దిగుతాడు. ఆ చీకట్లో తనకెదురైన వ్యక్తితో కలిసి దగ్గర్లో ఉన్న షెడ్ లోకి వెళ్తాడు.
హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో మైలు దగ్గర నైట్ స్టే చెయ్యడానికి బయలుదేరుతారు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 8 చదవండి.
ఆ ఇద్దరు వ్యక్తులను టాక్సీలో ఎక్కించుకుని తొమ్మిదో మైలు బయలు దేరాడు డ్రైవర్ రాజు. ఒక సారి టైం చూసుకున్నాడు. సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలు.
వాళ్లతో మాటలు కలిపాడు రాజు.
"ఇదిగో సార్లూ.. మీరెవరో తెలీదు కానీ ఈ మధ్య కొందరు కుర్రాళ్ళు రీల్స్ అంటూ ఏవో పెడుతున్నారట, వాటికోసం సాహసాలు చేస్తున్నారట. మా బంధువుల అబ్బాయి ఆలా చేసి రైలు నుండి పడిపోయాడు. మీరు కూడా ఆలా చెయ్యడానికి దయ్యం దగ్గరకు వెళ్లాలనుకుంటున్నారు. మీ ఇష్టం. కానీ మీకు కావాలంటే పక్కనున్న వేటపాలెంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీకు తోడు ఉంటారు. ఏదో ఖర్చులకు ఇస్తే చాలు వాళ్లకు. ఏమంటారు?" అని అడిగాడు.
ఒక వ్యక్తి మాట్లాడుతూ "నా పేరు పండు. ఇతని పేరు చిట్టిబాబు. మేమిద్దరం హేతువాద సంఘం వాళ్ళము. రెండు రాత్రుళ్ళు ఆ తొమ్మిదో మైలు దగ్గర ఆ దయ్యం కోసం వెయిట్ చేస్తాము. దయ్యం రాలేదంటే ఆ విషయాన్నీ అందరికీ చెప్పి, వాళ్ళ భయాన్ని పోగొడతాం. ఒకవేళ నిజంగా దయ్యమే వస్తే తెల్లారేవరకు ఆంజనేయ దండకం చదువుతూ కూర్చుంటాం. తెల్లరాక అందరికీ దయ్యాలు ఉన్నాయని చెబుతాం. మా ఉద్దేశం నిజం నిరూపించడమే" అన్నాడు.
"మీ ఉద్దేశాలు మంచివే బాబులూ. కానీ పక్కన తోడుగా ఇద్దరు ముగ్గురు ఉన్నంత మాత్రాన వచ్చే దయ్యం రాక మానదు. మీకు కాస్త గుండె ధైర్యంగా ఉంటుంది. " చెప్పాడు రాజు.
“నువ్వు చెప్పేది నిజమే. కానీ మా ప్రయత్నం మమ్మల్ని చెయ్యనీ. ఇద్దరం చేతిలో సెల్ ఫోన్లు రెడీగా పెట్టుకుని ఉంటాము. ప్రాణం పోయే పరిస్థితి వస్తే దయ్యం వచ్చిందనో ఎవరో దయ్యం పేరు చెప్పి అటాక్ చేశారనే ఎవరో ఒకరం కాల్ చేసే చనిపోతాం. మేము ఒక ఆశయంతో వచ్చాం. మమ్మల్ని నిరుత్సాహ పరచకు" అన్నాడు చంటి.
'వీళ్ళు ఎంత చెప్పినా వినేలా లేరు' అనుకున్నాడు రాజు. "నేను సడన్ బ్రేక్ వేస్తే మీ చేతిలో ఫోన్లు కింద పడిపోతాయి. ఇక దయ్యం తలుచుకుంటే అర క్షణంలో అనుకున్న పని చేసేయ్యదా.. ఐనా ఎవరికి ఎలా రాసి పెట్టి ఉందొ" నిట్టూరుస్తూ అన్నాడు రాజు. వాళ్ళు జవాబివ్వలేదు.
తొమ్మిదో మైలు దగ్గర కారు ఆపాడు రాజు.
ఇద్దరూ దిగారు. తాను కూడా దిగి, డిక్కీలో వాళ్ళు ఉంచిన ఫోల్డబుల్ టెంట్ ను బయటకు తీసి వాళ్లకు అందించాడు రాజు.
"మళ్ళీ కలుస్తామో లేదో.. ఒక సెల్ఫీ తీసుకుందాం" అంటూ వాళ్ళ అనుమతి కోసం చూడకుండా తన సెల్ బయటకు తీసాడు. వాళ్ళు కూడా కాదనకుండా దగ్గరకు వచ్చి నిల్చున్నారు. సెల్ఫీ తీసుకున్నాక, తన నంబర్ వాళ్లకు ఇచ్చి "అవసరమైతే కాల్ చెయ్యండి. వేటపాలెం వాళ్లకు కాల్ చేసి ఒక గుంపుగా వచ్చి సహాయం చెయ్యమంటాను.
భయపడి పారిపోతే ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమోనని అనుకోవద్దు. ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం. " అని చెప్పి, తాను తిరిగి వచ్చేసాడు.
"మనమెవరో తెలీకపోయినా మనకోసం ఎంత తాపత్రయ పడుతున్నాడా ఆటో డ్రైవర్" అన్నాడు చిట్టిబాబు..
"నిజమే. కానీ మనం ఒక ఆశయం కోసం వచ్చాము కదా. దయ్యం విషయంలో నిజం బయటకు తియ్యాలి కదా. పద.. ఆ చింత చెట్టు కింద మన టెంట్ వేసుకుందాం" అన్నాడు పండు.
తమ లగేజీని, ఫోల్డబుల్ టెంట్ ను తీసుకొని చింత చెట్టు దగ్గరకు వెళ్లారు ఇద్దరూ.
ఆ టెంట్ తో పాటు ఇచ్చిన పదునైన చెక్కలను నాలుగు వైపులా పాతారు. టెంట్ పై భాగాన్ని బలంగా ఉన్న చెట్టు కొమ్మకు బిగించారు. బలమైన గాలి వీచి టెంట్ పైకి లేచినా, ఎక్కడికీ పోదు. ఆ గాలి తగ్గాక తిరిగి బిగించుకోవచ్చు.

"రెండు రాత్రుళ్ళు ఇక్కడ గడుపుదాం. ఎల్లుండి ఉదయాన్నే తిరిగి వెళ్లిపోవచ్చు. టెంట్ కు నాలుగు వైపులా బ్యాటరీ ఆపరేటేడ్ నైట్ విజన్ సిసి కెమెరాలు అమర్చాలి. అలాగే ఆటోమేటిక్ గా ఫోటోలు తీసి అప్లోడ్ అయ్యేలా చేసుకోవాలి. మన ఛానల్ లో అరగంటకొకసారి ఈ ఫోటోలు, వీడియోలు ప్రసారమవుతాయి. రాష్ట్రమంతా సంచలనం కావాలి" చెప్పాడు పండు.
"సందేహం లేదు. అంతా మన బాస్ చెప్పినట్లు జరుగుతుంది" అన్నాడు చిట్టిబాబు.
ఇద్దరూ కలిసి టెంట్ చుట్టూ సిసి కెమెరాలు అమర్చారు.
పక్కన పొలాల్లో ఉన్న రంగయ్య షెడ్ కనపడింది వాళ్లకు.
"అక్కడ కరెంట్ ఉంది. అవసరమైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు" అన్నాడు చిట్టిబాబు.
"మన దగ్గర నాలుగైదు పవర్ బ్యాంకులు ఉన్నాయి. మరీ అవసరమైతే రేపు ఛార్జింగ్ చేసుకోవచ్చు" అన్నాడు పండు.
ఇంతలో షెడ్ నుండి రంగయ్య బయటకు వచ్చాడు. చింత చెట్టు కింద ఉన్న టెంట్ వంక ఆశ్చర్యంగా చూస్తూ వీళ్ల దగ్గరకు వచ్చాడు.
"ఎవరు బాబూ మీరు.. ? ఏదైనా సర్వే పనిమీద వచ్చారా? ఎంతసేపు ఉంటారు" అని అడిగాడు.
"చూడండి తాతగారు.. మేము దయ్యాన్ని చూడాలని వచ్చాము. అది కనపడితే ఒక సీసాలో బంధించి తీసుకొని వెళ్తాము" అన్నాడు పండు.
"అయ్యా! దేవుడితోగానీ, దయ్యలతోగానీ ఎకసెక్కాలాడకూడదు. దయ్యం చంపాలనుకున్న వాళ్ళను దేవుడు కాపాడడు. దేవుడు కాపాడే వాళ్ళ జోలికి దయ్యం వెళ్ళదు" అన్నాడు రంగయ్య.
"కొంచెం తికమకగా ఉంది. ఇంతకీ మమ్మల్ని దయ్యం ఏమైనా చేస్తుందా? దేవుడు మమ్మల్ని కాపాడటానికి రాడా" నవ్వుతూ అడిగాడు చిట్టిబాబు.
ఇది నవ్వులాట వ్యవహారం కాదు. ఎక్కడో ఉన్న మీ మెదడులో దయ్యం దూరబట్టే, దయ్యాన్ని చూడాలంటూ ఇక్కడికి వచ్చారు. అంటే ఆ దయ్యమే మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. మీరు దానికి లొంగి, దానిమాటే విన్నారు. మరి ఇందులో దేవుడు చేసేదేముంది?" అన్నాడు రంగయ్య.
"అంటే దేవుడు మమ్మల్ని గాలికి వదిలేసినట్లేనా?" అడిగాడు పండు.
"వదలలేదు. అందుకే ఇందాక డ్రైవర్ రాజు, ఇప్పుడు నేను మీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాము. వినకుంటే దేవుడేం చేస్తాడు" అన్నాడు రంగయ్య వాళ్ళ వంక సూటిగా చూస్తూ.
ఆశ్చర్యపోయారు ఇద్దరూ.
డ్రైవర్ రాజు చెప్పిన మాటలు ఇతనికెలా తెలిసాయి.. ఇద్దరూ ఒకరి వంక మరొకరు చూసుకున్నారు.
***
హేతువాదులమంటూ వచ్చిన వాళ్ళ గురించి ఎస్ పీ కి తెలిపాడు మోహన్.
"ఆ ప్రాంతంలో దయ్యాలు ఉన్నట్లు గతంలో కూడా కొందరు పుకార్లు పుట్టించారు. అప్పట్లో రాజకీయ వత్తిడుల వల్లనో మీలాంటి ప్రో యాక్టివ్ సిబ్బంది లేకపోవడం వల్లనో పరిశోధన సజావుగా సాగలేదు. ఈ సారి అలా జరగడానికి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు. వాళ్లకు ఏ కారణం వల్ల ప్రమాదం జరిగినా అది దయ్యం వల్లనేనని పుకార్లు పుడతాయి. ఈ రెండు రాత్రుళ్ళూ అరగంటకోసారి తొమ్మిదో మైలు మీదుగా గస్తీ తిరగండి. ఆ చింత చెట్టు దగ్గర ఆగి పరిసరాలు గమనించాలి. " ఆదేశించాడు ఎస్ పీ.
"సార్, ఆ తొమ్మిదో మైలు క్రాస్ దగ్గర ఒక మూసివేసిన టీ కొట్టు ఉంది. నేను ఒకరిద్దరు కానిస్టేబుల్స్ తో రాత్రికి అక్కడ ఉంటాను. అవసరమైతే వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళవచ్చు" చెప్పాడు మోహన్.
"గుడ్ ఐడియా. వేటపాలెం ఊరినుండి కూడా కొందరు యువకుల్ని సహాయంగా తెచ్చుకోండి. " చెప్పాడు ఎస్ పీ.
వెంటనే స్వామినాథం కు కాల్ చేసి విషయం చెప్పాడు మోహన్.
"వేటపాలెం లో తెలిసిన వాళ్లకు చెప్పి రాత్రికి మీకు తోడుగా అక్కడ ఉండమంటాను. వీలుంటే మా అబ్బాయి గోపీనాథ్ ను కూడా సాయంత్రం మీతో పంపుతాను. " చెప్పాడు స్వామినాథం.
***
ఆర్నెల్ల క్రితం..
గౌతమ్ ను తన కాళ్ళ వంక చూడమంటాడు ఆ వ్యక్తి.
అతని కుడికాలికి ఆరు వేళ్ళు.
రితిక కుడి కాలికి కూడా ఆరువేళ్ళు.
'మా ఇంట్లో తరతరాలుగా ఆరు వేళ్ళు ఉన్నాయట. మా అన్నయ్యకు కూడా ఆరు వేళ్ళు" అని రితిక ఒకసారి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.
"మురళిగారంటే మీరేనా.. " చెయ్యి జాపుతూ అడిగాడు గౌతమ్.
"కాదు. వట్టి మురళిని" తనుకూడా చెయ్యి అందిస్తూ నవ్వుతూ అన్నాడు మురళి. ఇంతలో బయట అడుగుల శబ్దం వినిపించింది. బయటకు వెళ్ళబోతున్న గౌతమ్ ను ఆపాడు మురళి.
"ఈ గుడిసె తలుపు వాళ్ళను ఆపదు. ఇద్దరం కలిసి ఎదిరిద్దాం" అంటూ తలుపు తీసాడు గౌతమ్.
"ముసుగులు వేసుకున్న నలుగురు వ్యక్తులు అతన్ని నెట్టుకుంటూ లోపలికి వచ్చారు.
"ఇదిగో.. ఇక్కడ వున్నాడ్రా.. " అంటూ మురళిని సమీపించబోయారు.
అడ్డంగా నిలిచాడు గౌతమ్.
=========================================================
ఇంకా ఉంది
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 త్వరలో
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments