దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9
- Seetharam Kumar Mallavarapu
- Oct 21
- 7 min read
Updated: 3 days ago
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

Dayyam@thommido Mailu - Part 9 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 21/10/2025
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని టాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం తో కలిసి బయలుదేరుతాడు ఎస్సై మోహన్. తిరిగి వచ్చేటప్పుడు చింత చెట్టు కొమ్మ విరిగి పడటంతో జీప్ ఆగుతుంది. పొలాల్లో ఉన్న తెల్లటి ఆకారం దగ్గరకు వెళ్తాడు ఎస్సై మోహన్. ఆ ఆకారం అతన్ని గాయపరుస్తుంది. ఈ విషయాలన్నీ న్యూస్ ఛానళ్లలో వస్తాయి.
హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో మైలు దగ్గర నైట్ స్టే చెయ్యడానికి బయలుదేరుతారు.
ఆరు నెలల క్రితం కొందరు బి టెక్ స్టూడెంట్స్ తొమ్మిదో మైలు దగ్గర్లో ఉన్న శివయ్య జలపాతం టూర్ ప్లాన్ చేస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు తన ప్రేయసి రితికకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ అనే యువకుడు తొమ్మిదో మైలు దగ్గర దిగుతాడు. ఆ చీకట్లో తనకెదురైన వ్యక్తితో కలిసి దగ్గర్లో ఉన్న షెడ్ లోకి వెళ్తాడు. ఆ వ్యక్తి రితిక అన్నయ్య మురళి అని తెలుసుకుంటాడు. అతని దగ్గరకు వస్తున్న ముసుగు వ్యక్తులకు అడ్డం వెళ్తాడు గౌతమ్.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 9 చదవండి.
ఆరు నెలల క్రితం..
మురళికి అడ్డుగా నిలిచిన గౌతమ్ ను చూసి బిగ్గరగా నవ్వాడు ఒక ముసుగు వ్యక్తి.
"ఏమిటి.. ? నువ్వొక్కడివే మమ్మల్ని ఎదిరించ గలననుకుంటున్నావా.. " అన్నాడు అతను.
“కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించినవాడిని. నలుగురైదుగురు మీదికి రాగానే భయపడిపోను. నాకోసం వచ్చిన మురళిని మీనుండి తప్పిస్తాను. సాధ్యమైనంతవరకు మిమ్మల్ని ఎదిరిస్తాను. వీలు కాకపోతే నేను లొంగిపోయే లోపల మిమ్మల్ని ఖచ్చితంగా గాయపరుస్తాను. " అంటూ పొజిషన్ లోకి వస్తున్నాడు గౌతమ్.
అది చూసి మురళి, "కూల్ మిస్టర్ గౌతమ్. వీళ్ళు నా స్నేహితులే" అన్నాడు.
అర్థం కానట్లు చూసాడు గౌతమ్.
ఆ నలుగురూ తమ ముఖాలకున్న ముసుగులు తీసేసారు.
ఆశ్చర్యం.. అందరూ దాదాపు తన ఈడు వాళ్లే. బహుశా తనలాగే స్టూడెంట్స్ అయి వుంటారు.
వాళ్లలో ఒక వ్యక్తి మురళి వంక చూసి "కంగ్రాట్స్ మురళి. చెల్లెమ్మకు హ్యాండ్ సం అండ్ డేరింగ్ కుర్రాడు దొరికాడు" అన్నాడు.
మురళి, వాళ్లంతా తన స్నేహితులని గౌతమ్ కు పరిచయం చేసాడు.
"ఇంతకీ ఇదంతా ఏమిటి? తొమ్మిదో మైలు దగ్గర ఒక రాత్రంతా ఒంటరిగా గడపాలని రితిక చెప్పింది. ఇక్కడ చూస్తే ఒక బ్యాచిలర్స్ గ్యాంగ్ ఉంది. అసలు విషయం ఏమిటి?" అడిగాడు గౌతమ్.
"ముందు నువ్వు స్థిమితంగా కూర్చో. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. " అంటూ పక్కనే ఉన్న నులక మంచం వాల్చాడు మురళి.
మిగిలిన వాళ్ళు, "మీరు మాట్లాడుకుంటూ ఉండండి. మేము ఊర్లోకి వెళ్లి తినడానికేమైనా తెస్తాము" అంటూ బయటికి వెళ్లారు.
మురళి తనతో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడనీ, తమ ప్రైవసీ కోసం అందరూ ఏదో నెపంతో బయటకు వెళ్ళారనీ గ్రహించాడు గౌతమ్.
"గౌతమ్.. గతంలో.. అంటే దాదాపు పదేళ్ల క్రిందట మా ఊళ్ళో దయ్యం బారిన పడి ఐదుగురు చనిపోయారు. వారిలో మా నాన్నగారు కూడా ఉన్నారు. "
"అవును. ఐ యామ్ సారీ. ఆ విషయం రితిక చెప్పినప్పుడే చాలా బాధ పడ్డాను. దయ్యాలనేవి లేవు. కానీ వాటి భయం మనుషుల ప్రాణాలు హరిస్తుంది. " అన్నాడు గౌతమ్.
"మిగతా వారి మరణాల సంగతి తెలీదు గానీ మా నాన్న మరణం మాత్రం దయ్యం వల్ల భయంతో కాదు. అయన ఆ రోజుల్లోనే దయ్యాలను నమ్మేవాడు కాదు. కాబట్టి నిజంగా దయ్యమే అతన్ని చంపి ఉండాలి. లేదా ఎవరైనా హత్య చేసి ఉండాలి" చెప్పాడు మురళి.
"అయితే మీ నాన్నగారిది ఖచ్చితంగా హత్యే. మరి ఆ హత్యకు కారకులెవరు?"
"పోలీసులు అప్పట్లో చురుగ్గా దర్యాప్తు జరిపి ఉంటే ఖచ్చితంగా నిజం బయటికి వచ్చేది. నాకు కొందరు వ్యక్తుల మీద అనుమానంగా ఉంది. కానీ ఆధారాలు లేవు. నాన్నగారు చనిపోబోయే ముందు రోజు ఈ షెడ్ ఓనర్ రంగయ్య తాతతో తన అనుమానాలు చెప్పారట. కానీ ఆ అనుమానాలకు ఏ ఆధారాలు లేకపోవటంతో ఏమీ చెయ్యలేక పోయారట.
వాళ్ళు మాట్లాడుకున్న మరుసటి రోజే నాన్న మా ఉరికి వెళ్లే వాగు దగ్గర చనిపోయి ఉన్నారు. అందరూ దయ్యాన్ని అనుమానించే సమయంలో వేరే కారణం చెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో లేరు. దాంతో రంగయ్య, కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి కలెక్టర్ గారిని కలవడానికి వెళ్లారు. అయన సబ్ కలెక్టర్ గారిని కలవమన్నారు.. " చెబుతూ ఉన్న మురళి మాటలకు అడ్డు వచ్చాడు గౌతమ్.
"సబ్ కలెక్టర్ ను కలిసారా.. అయన పేరు.. " ఆతృతగా అడిగాడు.
"అయన పేరు శ్రీనివాసరావు గారు. అయన మీ నాన్నగారే" చెప్పాడు మురళి.
"అంటే మా నాన్నగారి గురించి నీకు ముందే తెలుసా" ఇంకా ఆశ్చర్యం నుండి కోలుకోలేదు గౌతమ్.
"అవును. ఆయన యాక్సిడెంట్ లో రెండు కాళ్ళూ పోగొట్టుకున్న విషయం కూడా తెలుసు. "
"ఆశ్చర్యంగా ఉందే.. అంటే అన్నీ నా గురించి తెలుసుకున్నాకే రితిక నన్ను కలిసిందా" అడిగాడు గౌతమ్.
"అవును. అయితే అందులో మోసం ఏమీ లేదు. ముందు నన్ను పూర్తి విషయాలు చెప్పనీ" అన్నాడు మురళి.
తన ఆదుర్దాను అణచుకొని చెప్పమన్నట్లు చూసాడు గౌతమ్.
"రంగయ్య, స్వామినాథం కలిసి మీ నాన్నగారు శ్రీనివాసరావు గారిని కలిశారు. మా నాన్న తనతో చెప్పిన విషయాలను రంగయ్య వివరించాడు.
కలెక్టర్ గారితో చెప్పి ఎంక్వయిరీ చేయిస్తానన్నారు మీ నాన్నగారు. కానీ కారణం తెలీదు కానీ కలెక్టర్ గారు ఆ విషయాన్నీ పట్టించుకోలేదు. అప్పుడు మీ నాన్నగారు శివయ్య జలపాతం దగ్గరకు వ్యక్తిగతంగా వచ్చి అటునుంచి మా ఊరికి వచ్చారు. అప్పుడు దయ్యం విషయంగా ఊరివాళ్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెళ్లేముందు కలెక్టర్ తో పోట్లాడి అయినా సరే ఈ దయ్యం విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తామని స్వామినాథంతో, రంగయ్యతో చెప్పారు.
ఆ తరువాత వారం రోజులకే అయన వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ అయి అయన రెండు కాళ్ళు కోల్పోయారు. " చెప్పాడు మురళి.
"అంటే ఆ యాక్సిడెంట్ ఎవరో చేయించిందన్నమాట. నాకు ఈ వివరాలు మా నాన్నగారు ఎప్పుడూ చెప్పలేదు"" అన్నాడు గౌతమ్.
"కానీ మీ అన్నయ్య దీపక్ కు, అక్కయ్య నవ్యకు తెలుసు. ఐ పి ఎస్ ఆఫీసరై ఎప్పటికైనా ఆ యాక్సిడెంట్ చేయించిన వాళ్ళను చట్టానికి పట్టించాలనేదే మీ అన్నయ్య ధ్యేయం. చట్టంలో లొసుగులతో వాళ్ళు తప్పించుకోకూడదనేదే మీ అక్కయ్య ధ్యేయం" చెప్పాడు మురళి.
"అంటే మా అక్కయ్య.. "
"అవును. తను నా క్లాస్ మేట్. నువ్వు, రితిక లాగా అన్నమాట. " నవ్వుతూ చెప్పాడు మురళి.
"అంతా ఆశ్చర్యంగా ఉంది. మా అన్నయ్య కూడా ఎప్పుడూ ఈ విషయాలు చెప్పలేదు. " అన్నాడు గౌతమ్.
"నువ్వు ఆవేశపరుడివి కదా. తొందరపాటు నిర్ణయం తీసుకుంటావని చెప్పలేదు. " చెప్పాడు మురళి.
ఇంతకీ ఇప్పుడు నేను చెయ్యవలసింది ఏమిటి? మీ ప్లాన్ ఏమిటి?" అడిగాడు గౌతమ్.
"అన్నీ వివరంగా చెబుతాను. ముందుగా అప్పట్లో దయ్యం కనిపించినప్పటి విషయాలు నీకు చెబుతాను. అప్పుడు మనం చెయ్యబోయే పని గురించి నీకు ఒక అవగాహన వస్తుంది. ' అన్నాడు మురళి.
***
ప్రస్తుతం..
"డ్రైవర్ రాజు మాతో ఏం మాట్లాడాడో మీకు ఎలా తెలుసు?" రంగయ్యను ప్రశ్నించాడు పండు.
"మిమ్మల్ని దించాక తిరిగి వెళ్తూ నాకు ఫోన్ చేసాడు రాజు. బయటి ఊరివాళ్ళు చింత చెట్టు దగ్గర రెండు రాత్రుళ్ళు ఉండబోతున్నారని, వాళ్లకు ఎంత నచ్చ చెప్పినా వినలేదని నాతో చెప్పి బాధపడ్డాడు. " అన్నాడు రంగయ్య.
"మాకేమీ కాదు. మా గురించి బాధ పడకండి. మేము స్మశానాల్లో కూడా కొన్ని రాత్రుళ్ళు గడిపాము. " చెప్పాడు చిట్టిబాబు.
ఆ రోజు సాయంత్రం ఎస్సై మోహన్ ఇద్దరు కానిస్టేబుల్స్ తో తొమ్మిదో మైలుకు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. పోలీస్ జీప్ కాకుండా ప్రైవేట్ కారు మాట్లాడుకున్నారు. సరిగ్గా ఆ సమయానికి స్వామినాథన్ కొడుకు గోపినాథ్ కూడా అక్కడికి వచ్చాడు. అందరు కలిసి బయలుదేరారు.
తొమ్మిదో మైలుదగ్గర చింత చెట్టు కింద టెంట్ వేసి ఉండటం గమనించాడు మోహన్. కానీ కారును ఆపకుండా ముందుకు వెళ్లి వేటపాలెం టర్నింగ్ లో కొంత దూరం వెళ్ళమన్నాడు. అక్కడ అందరూ కిందికి దిగారు.
వెనక్కి నడుచుకుంటూ వచ్చి టర్నింగ్ లో ఉన్న మూతపడ్డ టీ కొట్టు దగ్గరకు వచ్చారు. అది ఒక చిన్న పెంకుటిల్లు. లోపల విడిగా గదులేవీ లేవు.
బయట తాటాకులతో ఒక షెడ్ వేసి ఉంది. వాడకంలో లేకపోవడంతో ఆ షెడ్ లో వేసిఉన్న చెక్క బల్లలు అవసాన దశలో ఉన్నాయి.
ఆ పెంకుటింటి తలుపు కూడా సగం ఊడి ఉంది. స్వామినాథన్ తో ముందుగా చెప్పి ఉంచడంతో లోపల క్లీన్ చేయించి, ఒక టార్పాలిన్ పరిపించాడు. నాలుగు బ్లాంకెట్స్ కూడా లోపల ఉంచాడు.
"కండ్రిగ నుండి అప్పుడప్పుడు కొందరు కుర్రాళ్ళు వచ్చి, ఇక్కడ పార్టీ చేసుకొని, చీకటి పడేలోగా వెళ్ళిపోతారట" చెప్పాడు గోపీనాథ్.
"అదేమిటో.. పోకిరీగాళ్లకు మాత్రం దయ్యాలు కనపడవు" అన్నాడు మోహన్.
"ఆలా ఏమీ లేదు మొదట్లో కొందరు ఈ పెంకుటింటిని రాత్రి పూట అసాంఘిక కార్యక్రమాలకు కూడా వాడుకునే వారట. ఒకసారి అలా వచ్చిన వాళ్లకు దయ్యం కనపడ్డంతో రాత్రుళ్ళు ఎవరూ ఇక్కడ స్టే చెయ్యడం లేదు. ఈ టీ కొట్టుకు కరెంట్ కనెక్షన్ ఎప్పుడో కట్ చేసారు. మీకు కావాలంటే వేటపాలెం నుండి మనిషిని పిలిపించి ఈ పూటకు అక్రమ కనెక్షన్ ఇప్పిస్తామని నాన్నగారు చెప్పారు" అన్నాడు గోపినాథ్.
"బాధ్యతగల ఉద్యోగంలో ఉంటూ అలాంటి పని చెయ్యకూడదు' అన్నాడు మోహన్.
"ఆ మాట కూడా నాన్నగారు చెప్పారు. వేటపాలెం నుండి ముగ్గురు కుర్రాళ్ళు రాత్రికి మనతో ఉంటారు. వచ్చేటప్పుడు మన రాత్రి భోజనం, రెండు కిరోసిన్ లాంతర్లు, కొన్ని క్యాండిల్స్ తెస్తారు. " చెప్పాడు గోపీనాథ్.
రాత్రి ఎనిమిది గంటలప్పుడు ముగ్గురు యువకులు అక్కడికి వచ్చాడు.
వారిలో మురళిని గుర్తు పట్టాడు మోహన్.
"నమస్తే సర్. నేను మురళిని. వీళ్ళు నా స్నేహితులు శేఖర్, గౌతమ్" పరిచయం చేసాడు మురళి.
"నువ్వు తెలుసు. శేఖర్ ని కూడా చూసాను. ఈ గౌతమ్ ఎవరు? మీ వూరి వ్యక్తిలా లేడే.. " సందేహిస్తూ అడిగాడు ఎస్సై మోహన్.
"మా బంధువుల అబ్బాయి. నాకు వరసకు బావ అవుతాడు" చెప్పాడు మురళి.
ఆ రాత్రి అందరూ వంతుల వారీగా ఆ పెంకుటింటి నుండి బయటకు వచ్చి చింత చెట్టు పరిసరాలు దూరం నుండి గమనిస్తూ ఉన్నారు.
సరిగ్గా అర్థరాత్రి పన్నెండు గంటలప్పుడు బయటకు వచ్చిన గౌతమ్ వెంటనే లోపలి వచ్చి, "ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ షెడ్ దగ్గరకు వెళ్తున్నారు. తెల్లటి దుస్తుల్లో ఉన్నారు" అని మోహన్ తో చెప్పాడు.

"మిగిలిన వాళ్ళను లేపండి" అంటూ మోహన్ బయటకు వెళ్ళాడు. టెంట్ లో ఉన్న పండు, చిట్టిబాబులు భయంతో కేకలు పెట్టుకుంటూ పొలంలో ఉన్న రంగయ్య షెడ్ వేపు పరుగులు పెడుతున్నారు. వెనగ్గా పరుగెడుతున్న చిట్టిబాబు కింద పడిపోయాడు. దయ్యం లాంటి ఆ ఆకారం అతని మీద దాడి చేసి అతని ముఖాన్ని గోళ్ళతో రక్కింది. సరిగ్గా ఆ సమయానికి మోహన్ తన దగ్గరున్న ఫ్లాష్ లైట్ అటువైపు వెయ్యడంతో ఆ ఆకారాలు రెండూ పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాయి.
ముందు పరుగెడుతున్న పండు వెనక్కి తిరిగి వచ్చి చిట్టిబాబును పైకి లేవనెత్తాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మోహన్, రక్తం కారుతున్న చిట్టిబాబు ముఖం వంక చూసాడు. అతనికి చాలా బాధ కలిగింది. ఈ లోపల మిగిలిన వారు కూడా అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ చిట్టి బాబును కారులోకి ఎక్కించారు. వేటపాలెం గ్రామస్థులను తిరిగి వాళ్ళ ఊరికి పంపేసి టౌన్ కు బయలుదేరాడు మోహన్.
బయలుదేరే ముందు ఆ టెంట్ లో అమర్చిన సిసి కెమెరాల తాలూకు హార్డ్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నాడు.
చిట్టి బాబును హాస్పిటల్ లో చేర్చాడు మోహన్. ఇద్దరు పోలీసులను అక్కడ కాపలాగా ఉండమన్నాడు. పండుకు పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న లాడ్జిలో రూమ్ ఏర్పాటు చేసాడు. జరిగిన విషయాలన్నీ ఎస్పీకి రిపోర్ట్ చేసాడు. హార్డ్ డిస్క్ తన దగ్గర ఉన్న విషయం మాత్రం చెప్పలేదు.
తరువాత తన ఇంటికి వెళ్ళాడు. హార్డ్ డిస్క్ ను సిస్టం కు కనెక్ట్ చేసాడు. బయటి వైపుకు ఉన్న కెమెరాలో ఆ ఆకారాలు టెంట్ ను సమీపించడం కనిపించింది. చీకట్లో ఆ ఆకారాలు అస్పష్టంగా కనిపిస్తున్నా దయ్యల లాగే ఉన్నాయి. అవి లోపలి వెళ్లడం, పండు చిట్టిబాబులు భయంతో బయటకు రావడం అంతా సహజంగానే ఉంది. అలాగే చిట్టిబాబును ఆ ఆకారం గోళ్ళతో రక్కడం కూడా నైట్ విజన్ కెమెరాలో రికార్డ్ అయి వుంది.
టెంట్ లోపలి వైపుకు ఒకే కెమెరా అమర్చి ఉంది. దాన్ని కాస్త ఫార్వార్డ్ చేసి చూసాడు. అందులో ఆ ఆకారాలను చూసి ఇద్దరూ బయటకు పరుగెత్తడం కనిపించింది. ఆ వీడియోను కాస్త వెనక్కి జరిపి చూసాడు.
దయ్యాలు రావడానికి పది నిముషాల ముందునుండీ వాళ్లిద్దరూ మాటిమాటికీ తమ చేతి వాచీల వంక చూసుకోవడం గమనించాడు మోహన్.
'అంటే..! ఆ ఆకారాలు వస్తాయని వీళ్లకు ముందే తెలుసా.. '
వాళ్ళమీద అనుమానం మొదలయింది మోహన్ కు.
కానీ చిట్టి బాబు ముఖం మీద ఉన్న గాయాలు తీవ్రమైనవని డాక్టర్లు ప్రాథమిక పరిశీలనలో చెప్పారు. అలా వాచీల వంక చూసుకోవడం వాళ్ళ అలవాటా..
తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఉంది మోహన్ ముఖం.
=========================================================
ఇంకా ఉంది
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.



Comments