దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1
- Seetharam Kumar Mallavarapu
- Sep 3
- 6 min read
Updated: Sep 8
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

Dayyam@thommido Mailu - Part 1 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 03/09/2025
దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక ప్రారంభం
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
టు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై మోహన్, ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉన్నాడు.
"నమస్తే సార్" అన్న మాట వినపడడంతో తలెత్తి ఎదురుగా ఉన్న యువకుడి వంక చూశాడు.
అతనిది ఇంచుముంచు తన వయస్సే. అంటే ముప్పై ఏళ్ళు ఉండొచ్చు. చూడ్డానికి ఉద్యోగస్తుడిలా అనిపిస్తున్నాడు.
ఫైల్ పక్కన పెట్టి "నమస్తే, కూర్చోండి" అన్నాడు మోహన్.
ఆ వ్యక్తి కూర్చున్నాక "చెప్పండి, ఏ విషయం మీద వచ్చారు" అని అడిగాడు.
"నా పేరు గోపీనాథ్. పక్కనే ఉన్న చల్లపాలెం లో టీచర్ గా పని చేస్తున్నాను. మా నాన్నగారి పేరు స్వామినాథం. ఆయన కూడా మీ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. మీరు బాగా తెలుసని చెప్పారు" అన్నాడు అతను.
"ఓ! స్వామినాథం కొడుకా మీరు.. ఆయన నాకు బాగా తెలుసు. గతంలో మేమిద్దరం కలిసి పని చేశాం. ఆయన సంవత్సరం క్రితమే రిటైర్ అయ్యారు కదూ.. పోయిన వారం కూడా ఏదో పనిమీద స్టేషన్ కు వచ్చారు" చెప్పాడు మోహన్.
"మా అమ్మగారి మెడికల్ చెకప్ కోసం నాన్నగారు నెలకు ఒకసారి చెన్నై వెళ్లి వస్తూ ఉంటారు. బస్సులు రద్దీగా ఉండడంతో ఈసారి టాక్సీ మాట్లాడుకుని వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు తొమ్మిదో మైలు దగ్గర డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఏమని అడిగితే దారికి అడ్డంగా దయ్యం లాంటి ఆకారం కనిపించిందని, కారు ఆపగానే మాయమైపోయిందని చెప్పాడు.
ఆ తర్వాత అతను కారును తిరిగి స్టార్ట్ చేయడానికి నాలుగైదు సార్లు ప్రయత్నించాడు. కానీ కారు స్టార్ట్ కాలేదు. కిందకు దిగి ఎవరికో ఫోన్ చేశాడు. తర్వాత అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. ఇంతలో బైక్ లో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతని పక్కన ఆగారు. నాన్నగారికి అనుమానం వచ్చి కిందకు దిగారు. ఇంతలో పల్లె వెలుగు బస్సు క్రిక్కిరిసిన జనంతో అక్కడ ఆగింది.
అందులోంచి పాతికమంది దాకా కిందికి దిగారు వాళ్లంతా వేటపాలెం గ్రామానికి చెందిన వాళ్ళట. ఏదో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆ వూరి వాళ్లంతా తొమ్మిదో మైలు క్రాస్ దగ్గర బస్సు ఎక్కడం దిగడం చేస్తూ ఉంటారు.
అంతమంది దిగడంతో బస్సులో కాస్త ఖాళీ దొరికింది. టాక్సీ అతనికి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసి బస్సు ఎక్కి ఇంటికి వచ్చేశారు మా పేరెంట్స్.. "
చెప్పడం ఆపాడు గోపీనాథ్.
కొద్ది క్షణాలు అతని వంక చూశాడు మోహన్. "సో.. మీరు చెప్పాలనుకున్నది ఏమిటి? ఆ టాక్సీ డ్రైవర్ ఏదో వంకతో నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపాడు. మీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగలు దోచుకోవడానికి ప్లాన్ వేసి ఉంటాడు. అదృష్టవశాత్తు ఆర్టీసీ బస్సు రావడంతో వాళ్లు క్షేమంగా ఇంటికి వచ్చారు. మీరు చెప్పాలనుకున్నది ఇదేనా?
ఇప్పుడు మేము చేయాల్సింది ఏమిటి.. మీ నాన్నగారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలిసేది. ఆ టాక్సీ డ్రైవర్ తెలిసిన మనిషేనా? అతన్ని పిలిపించి విచారించమంటారా" అడిగాడు మోహన్.
"అతని పేరు రాజు. ఈ ఊరి వాడే. ఎప్పుడూ బస్టాండ్ దగ్గరే కస్టమర్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మాకు తెలిసిన వాడు కాబట్టి మేము అనుమానించినట్లు కాకుండా ఆ దయ్యం విషయం కనుక్కోవడం కోసం పిలిపించి మాట్లాడండి. నాన్నగారు ఈ విషయం మీతో చెప్పమన్నారు.
నిన్న తొమ్మిదో మైలు దగ్గర కారుకు సడన్ బ్రేక్ వేసినప్పుడు నాన్నగారి తల ముందు సీటుకు గట్టిగా కొట్టుకుంది. పొద్దుటికి తల బొప్పి కట్టింది. పెయిన్ రిలీవర్ ఇచ్చాను. పడుకొని ఉన్నారు. అవసరమైతే పిలుచుకొని వస్తాను" చెప్పాడు గోపీనాథ్.
"అవసరమైతే చెబుతాను లేండి. మీరు వెళ్ళండి. నేను ఆ రాజును విచారిస్తాను" అన్నాడు మోహన్.
అతనికి నమస్కారం చేసి బయటకు వెళ్ళబోతున్నవాడల్లా టక్కున ఆగాడు గోపీనాథ్. వెనక్కి తిరిగి మోహన్ దగ్గరకు వచ్చి "నాన్నగారు మీతో మరో మాట చెప్పమన్నారు. ఆ తొమ్మిదో మైలు దగ్గర ఒక పది పదహైదు ఏళ్ల కిందట కూడా ఇలాగే ఒక దయ్యం చాలామందికి కనపడి ఇబ్బంది పెట్టిందట. ఒకరిద్దరిని చంపేసిందట కూడా" చెప్పాడు గోపీనాథ్.
"ఈ రోజుల్లో దెయ్యాల గురించి ఎవరూ భయపడడం లేదు. ఏదైనా రాజుతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది" చెప్పాడు మోహన్.
గోపీనాథ్ వెళ్లిపోయాక ఒక కానిస్టేబుల్ ను పిలిచాడు. "బస్టాండ్ దగ్గర రాజు అని టాక్స్ డ్రైవర్ ఉంటాడట. ఎవరో కనుక్కొని స్టేషన్కు పిలుచుకొని రా" అన్నాడు.
మరో అరగంటకు ఆ కానిస్టేబుల్, రాజును స్టేషన్కు తీసుకొని వచ్చాడు. ఎస్సై మోహన్ కు నమస్కారం పెట్టాడు రాజు.
"చూడు రాజూ! తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనిపించిందని కారు ఆపేశావట. ఈ రోజుల్లో దయ్యాలు ఎక్కడ ఉన్నాయి? రోడ్డు పక్కన ఉన్న మైలురాయిను చూసి దయ్యమని అనుకొని ఉంటావు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ ఆకారం ఎలా ఉంది?" అడిగాడు మోహన్.
"సార్! అక్కడ నిజంగానే దయ్యాన్ని చూశాను. నా వయసు 50 సంవత్సరాలు. పాతికేళ్ల నుండి డ్రైవింగ్ చేస్తున్నాను. దాదాపు 15 ఏళ్ల కిందట తొమ్మిదో మైలు దగ్గర దయ్యాలు తిరిగేవని చెప్పుకుంటారు. నాకైతే అప్పుడు ఏ దయ్యమూ కనపడలేదు. ఇప్పుడు మాత్రం నిజంగానే కనపడింది. తెల్లటి ఆకారం.. అస్పష్టంగా కాళ్లు చేతులు.. నడిచినట్టు కాక అటు ఇటు జరుగుతూ ఉంది. భయంతో నా గుండె ఝల్లుమంది. సడన్ బ్రేక్ తో కారు ఆపాను.
తల విదిలించుకుని రోడ్డు వైపుకు చూసేసరికి అక్కడ ఏ ఆకారమూ లేదు. వేటపాలెంలో ఉంటున్న నా స్నేహితుడు చెన్నయ్య కు కాల్ చేశాను. పెళ్లి కోసం వేరే ఊరుకు వెళ్లానని, మరో అరగంటలో తొమ్మిదో మైలు దగ్గర దిగుతానని చెప్పాడు. ఈ లోపల నాకు ధైర్యం కోసం ఊర్లో ఉన్న తన స్నేహితులను పంపిస్తానని చెప్పాడు. వాళ్లు బైక్లో వచ్చాక నాకు కాస్త ధైర్యం వచ్చింది.
మరికొంతసేపటికి బస్సు రావడంతో నా కారులో ఉన్న ప్యాసింజర్లు అందులో వెళ్లారు. అదే బస్సులో నా స్నేహితుడు చెన్నయ్య దిగాడు. కారు ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో అతనితోపాటు నేను కూడా వేటపాలెం వెళ్లాను. రాత్రికి అక్కడే పడుకొని ఉదయం వచ్చి ప్రయత్నించగానే కారు స్టార్ట్ అయింది. వేటపాలెం వెళ్లే దారిలో, బస్సు దిగిన వేటపాలెం గ్రామస్తుల మధ్య, నాకు కనిపించిన దయ్యం గురించి చర్చ జరిగింది. దాదాపు పదహైదు సంవత్సరాల కిందట తొమ్మిదో మైలు - వేటపాలెం మధ్య ఉన్న రోడ్డులో దయ్యం చాలామందికి కనిపించిందని, ఒకరిద్దరు భయంతో గుండె ఆగి చనిపోయారని మాట్లాడుకున్నారు. దాంతో నాది భ్రమ కాదని అనిపించింది" చెప్పాడు రాజు.
"సరే అయితే. నువ్వు వెళ్ళొచ్చు" అన్నాడు మోహన్.
"నా కారులో ఎక్కిన ప్యాసింజర్లు నాకు తెలిసిన వాళ్ళే. రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం, ఆయన భార్య నా కారులో వచ్చారు. వాళ్లు నా మీద ఏమైనా అనుమానపడ్డారా?" అడిగాడు రాజు.
"అదేం లేదు. ఎలక్షన్లు జరిగి సంవత్సరం అయిపోయింది కదా. ఆ గొడవలన్నీ సద్దుమణిగాయి. దాంతో ఖాళీగా ఉన్నాము. దయ్యం గురించి వినగానే బాగా కాలక్షేపం అవుతుందని నిన్ను పిలిపించాను. అంతే" అన్నాడు మోహన్.
తర్వాత తన పై అధికారులకు విషయాన్ని తెలియజేశాడు. ఇలాంటి విషయాల్లో ఉన్నతాధికారులకు విషయం తెలియజేయడం చాలా మంచిదని అతనికి తెలుసు. వాళ్ల సలహా ప్రకారం బయటకు వెళ్తూ ఉన్న రాజును ఆపి, అతను చెప్పిన మాటలనే స్టేట్మెంట్గా రాయించి తీసుకున్నాడు.
స్వామినాథం దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి తనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వచ్చిన మోహన్ ను సాదరంగా ఆహ్వానించాడు గోపీనాథ్. తన తండ్రిని లేపి హాల్లోకి తీసుకొని వచ్చాడు. స్వామినాథం ను చూడగానే మోహన్ అతనికి నమస్కరించాడు.
"దయ్యాన్ని మీరు గానీ మీ శ్రీమతి గానీ చూశారా" అడిగాడు మోహన్.
"లేదు మోహన్. నేను, మా ఆవిడ వెనక సీట్లో కూర్చొని ఉన్నాం. ముందు సీట్లో కూర్చొని ఉండి ఉంటే ఆ దయ్యాన్ని చూడడమో లేదా అక్కడ ఏమీ లేదనుకోవడమో.. ఏదో ఒకటి తెలిసేది.
కానీ అక్కడ దయ్యం కనిపించడం కొత్తేమీ కాదు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఆ దయ్యం బాధ పడలేక చాలామంది తమ భూములు అమ్ముకొని బయటి ఊర్లకు వెళ్ళిపోయారు. అలాంటివారిలో నేనూ ఒకడిని. అక్కడ భూమి అమ్మి, ఈ ఊర్లో ఇల్లు కొనుక్కున్నాము" చెప్పాడు స్వామినాథం.
“ఇప్పటి సంగతి పక్కన పెట్టండి. అప్పట్లో.. అంటే మీరు చెప్పినట్లు పది పదిహేను సంవత్సరాల క్రితం మీరు ఆ దయ్యాన్ని చూశారా?" అడిగాడు మోహన్.
"చూశాము. ఒకరోజు రాత్రిపూట నాకు మెలకువ వచ్చి చూస్తే మా ఇంటి కిటికీకు తల ఆనించి నాలుక లోపలికి చాపుతూ ఉంది. పక్కనే ఉన్న నా భార్యను లేపి కిటికీ వైపు చూడమన్నాను. ఆమెకు కూడా ఆ ఆకారం కనపడి కెవ్వున అరిచింది. అంతే! ఆ ఆకారం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేము ఇంట్లో ఉన్నాం, ఆ దయ్యం బయట ఉంది కాబట్టి మేము తట్టుకున్నాము. అదే దయ్యాన్ని రోడ్లో వెళ్తున్న వాళ్లు చూస్తే వాళ్లకు కలిగే భయం ఇంత అంతా కాదు" చెప్పాడు స్వామినాథం.
"ఆ దయ్యం కేవలం భయపెట్టడమేనా లేక ఎవరికైనా హాని చేసిందా?" అడిగాడు మోహన్.
"వేటపాలెం ఊరికి బస్సు వెళ్లే దారి లేదు. తొమ్మిదో మైలు దగ్గర దిగి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఒంటరిగా నడిచి వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. గుండె ఆగి చనిపోయినట్లు పోస్టుమార్టంలో తెలిసింది. వారికి అంతకుముందు ఏ విధమైన గుండె జబ్బులు లేవు. దయ్యాన్ని చూసిన భయం వల్ల గుండె ఆగి ఉంటుందని కొందరు, దయ్యమే గుండెల పైన గుద్ది చంపి ఉంటుందని మరికొందరు అనుకున్నారు. మొత్తానికి వాళ్ల చావుకు కారణం దయ్యమేనని అందరూ అనుకున్నారు. ఇక రాత్రిపూట ఆ దారిలో బైక్ లో వస్తూ పడిపోయి అందులో ఉన్నవారు మరణించడం రెండుసార్లు జరిగింది. దాంతో ప్రాణ భయంతో మా ఊరి వాళ్లంతా పొలము పుట్రా అమ్ముకొని ఎవరికి అవకాశం ఉన్నచోటికి వాళ్లు వెళ్లిపోయారు.. మా పొలం అమ్మిన డబ్బులతో ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. అలా ఎవరి వసతిని బట్టి వాళ్ళ దారి వాళ్లు చూసుకున్నారు" చెప్పాడు స్వామినాథం.
"ఆటో ఆగిపోవడం, దయ్యం కనిపించడం.. ఈ విషయాలన్నీ సిఐ గారికి, ఎస్పీ గారికి చెప్పాను. నన్ను ఈ రోజే తొమ్మిదో మైలు దగ్గరకు వెళ్లి ఈ విషయం విచారించమన్నారు.. మీరు రాలేకపోయినా మీ అబ్బాయి గోపీనాథ్ ను నాతో పంపించండి.. ఎందుకంటే అటు నుంచి వేటపాలెం కూడా వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా" అన్నాడు మోహన్.
"మీకు ఆ దయ్యం గురించి చెప్పగలిగిన వాళ్ళు మా తరం వాళ్లే. కాబట్టి నేనే మీతో వస్తాను" చెప్పాడు స్వామినాథం.
"అడగడం మర్చిపోయాను. మీకు నిన్న తలకు దెబ్బ తగిలిందట కదా! ఇప్పుడు ఎలా ఉంది?" అడిగాడు మోహన్.
"తల కాస్త బొప్పి కట్టింది. అంతే. ఇప్పుడు నొప్పి కూడా తగ్గింది" చెప్పాడు స్వామినాథం.
"నాకు స్టేషన్లో కాస్త పని ఉంది. ఒక గంటలో ముగించుకొని వస్తాను. ఈలోగా మీరు రెడీ అయి ఉంటే మా జీపులో తీసుకొని వెళ్తాను" చెప్పాడు మోహన్.
బయటకు వెళ్లిన మోహన్ కు స్వామినాథన్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోమని సీఐ గారు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే లోపలికి వచ్చాడు. అప్పటికే స్వామినాథం, గోపీనాథ్ లోపలి గదిలోకి వెళ్లి ఉన్నారు. హాల్లో టేబుల్ పైన ఉన్న స్వామినాథం ఫోన్ మోగింది. 'టాక్సీ రాజు కాలింగ్' అంటూ డిస్ప్లే లో రావడం గమనించాడు మోహన్. ఇంతలో స్వామినాథం భార్య ఫోను శబ్దానికి హాల్లోకి వచ్చింది.
తిరిగి వచ్చిన మోహన్ ని చూసి ఆశ్చర్యపోయింది.
"స్వామినాథం గారిని పిలవండి. ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇందాక మర్చిపోయాను" చెప్పాడు మోహన్.
"అలాగే, కూర్చోండి. " అంటూ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసింది ఆమె.
"ఎవరు.. రాజానా. మా వారి దగ్గర నుంచి నాలుగైదు మిస్డ్ కాల్స్ ఉన్నాయా. ఉండు.. ఆయనకు ఇస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది. మోహన్ తిరిగి వచ్చిన విషయం ఆయనకు చెప్పిందేమో వెంటనే బయటకు వచ్చాడు స్వామినాథం.
"స్వామినాథం గారూ! రాజు దగ్గర, మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోమన్నారు మా సిఐ గారు. రాజును స్టేషన్కు పిలిపించి విచారించి స్టేట్మెంట్ తీసుకున్నాను. మీరు డిపార్ట్మెంట్ వాళ్లే కదా.. ఇంటికి వచ్చి పలకరించి స్టేట్మెంట్ తీసుకుందామనుకున్నాను. అసలు విషయం మర్చిపోయి వెళ్ళిపోతున్నాను" అన్నాడు.
"పర్వాలేదు మోహన్. దానిదేముంది" అంటూ జరిగిన సంఘటన గురించి ఒక స్టేట్మెంట్ రాసి ఇచ్చాడు స్వామినాథం. ఆ మధ్యలోనే రాజు నుండి రెండు మూడు సార్లు కాల్ రావడం, స్వామినాథం కట్ చేయడం గమనించాడు మోహన్.
"ఎవరో ఫోన్ చేస్తున్నట్లున్నారు. మాట్లాడండి" అన్నాడు మోహన్.
"అదే.. ఆ టాక్సీ డ్రైవర్ రాజు మాకు బాగా తెలిసినవాడు. మేము అతన్ని అనుమానించామని అనుకుంటాడేమో.. అలాంటిదేమీ లేదని చెప్పడానికి కాల్ చేశాను. అప్పుడతను డ్రైవింగ్లో ఉన్నాడేమో.. తీయలేదు. అందుకని ఇప్పుడు చేస్తున్నట్లుంది. పర్వాలేదు. మీరు వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుతాను" చెప్పాడు స్వామినాథం.
స్టేట్మెంట్ తీసుకొని బయటకు నడిచాడు మోహన్. అతను వెళుతూ ఉండగా మరోసారి స్వామినాథం ఫోన్ రింగ్ కావడం గమనించాడు. స్టేషన్ కు వచ్చిన మోహన్, ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాడు. రాజు కావాలని కారు ఆపి ఉండొచ్చని అనుమానించిన స్వామినాథం, ఇప్పుడు అతను బాధపడతాడేమోనని కాల్ చేయడం కొంత విచిత్రంగా అనిపించింది అతనికి. స్టేషన్లో చేయాల్సిన పనులు తొందరగా ముగించుకొని ఇద్దరు కానిస్టేబుల్స్ ను తీసుకొని స్వామినాథం ఇంటికి బయలుదేరాడు మోహన్.
==================================================================
ఇంకా ఉంది
==================================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.




Comments