top of page
Original_edited.jpg

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2

  • Writer: Seetharam Kumar Mallavarapu
    Seetharam Kumar Mallavarapu
  • Sep 8
  • 5 min read

Updated: Sep 15

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

ree

Dayyam@thommido Mailu - Part 2 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 08/09/2025

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

భార్యను చెన్నై లో హాస్పిటల్ లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం. దారిలో తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు టాక్సీ ఆపుతాడు. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో చెప్పమని కొడుకు గోపినాథ్ ను పంపుతాడు స్వామినాథం. తొమ్మిదో మైలు దగ్గరకు స్వామినాథం తో కలిసి వెళ్లాలనుకుంటాడు ఎస్సై మోహన్. 

ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 2 చదవండి. 


ఎస్సై మోహన్, జీపులో స్వామినాథం ఇంటికి వస్తాడు. 

అప్పటికే వాకిట్లో రెడీగా ఉన్న స్వామినాథం వెళ్ళొస్తానని భార్యకు చెప్పి జీప్ ఎక్కుతాడు. జీప్ ముందుకు కదులుతుంది. 


"ఇక్కడి నుంచి తొమ్మిదవ మైలు ఎంత దూరం?" డ్రైవర్ ను అడిగాడు మోహన్. 


"సరిగ్గా తొమ్మిది మైళ్ళు" నవ్వుతూ చెప్పాడు స్వామినాథం. 


"అవును కదూ! సిల్లీగా అడిగాను" అన్నాడు మోహన్ తను కూడా నవ్వుతూ. 


"వేటపాలెం వెళ్లడానికి బస్సు రూటు లేదు. ఆ ఊరి వాళ్ళు రోడ్డు వరకు వచ్చి బస్సు ఎక్కేవాళ్ళు.. అక్కడ తొమ్మిదో నంబరు మైలురాయి ఉండడంతో ఆ పేరు వచ్చింది. ఆ ఊరికి మెటల్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. కానీ అప్పట్లో అక్కడ దయ్యం ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో చాలామంది ఆ ఊరు వదిలిపెట్టారు. మిగిలిన కొద్ది మంది కోసం రోడ్డు వెయ్యడం ఎందుకని ఆపేశారు" చెప్పాడు స్వామినాథం. 


"కాస్త విచిత్రంగా ఉంది. అప్పుడు కనపడ్డ దయ్యం తర్వాత ఏమైపోయింది? మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చింది.. నమ్మశక్యంగా లేదు" అన్నాడు మోహన్. 


"అప్పట్లో దయ్యం కనిపించడం మాత్రం నిజమే. నలుగురైదుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఇక దయ్యాన్ని చూసిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. అయితే ఇప్పుడు మాత్రం నాకు ఏ దయ్యము కనపడలేదు. డ్రైవర్ రాజు చెప్పిన మాటల్ని నేను పూర్తిగా నమ్మలేదు. అందుకే మా అబ్బాయిని స్టేషన్కు పంపించాను. అయితే రాజు ఇందాక ఫోన్ చేసి కారు ఆపడంలో తనకు వేరే ఉద్దేశం లేదని, నిజంగానే దయ్యాన్ని లేక అలాంటి ఆకారాన్ని చూశానని చెప్పాడు” అన్నాడు స్వామినాథం. 


"ఇంటరెస్టింగ్ గా ఉంది. కేసులతో బిజీగా ఉంటే ఈ విషయాన్ని పట్టించుకునే వాడిని కానేమో. కొన్నాళ్ల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ దయ్యం విషయం నిజమా అబద్దమా అని తేల్చడానికి అవకాశం దొరికింది" అన్నాడు మోహన్. 


"మోహన్! నీ పరిశోధనలో నువ్వు విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నాడు స్వామినాథం. 


"థాంక్యూ సార్. మీలాంటి సీనియర్ల ఆశీస్సులు ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాను." అన్నాడు మోహన్. 


"అప్పట్లో కూడా ఈ దయ్యం గురించి బాగా పరిశోధనలు జరిగాయి. కానీ ఏమీ తేలలేదు. కాలినడకన వెళ్తూ చనిపోయిన వారు గుండెపోటుతో చనిపోయినట్లు, టూవీలర్ నుంచి పడి చనిపోయిన వారు ఆ గాయాల కారణంగా చనిపోయినట్టు కేసులు ముగించారు. దయ్యాన్ని చూసినట్లు చెప్పిన వారి మాటలు భ్రమలుగా కొట్టిపడేశారు. ఈసారి దయ్యం కనబడడం ఇదే ప్రథమం. చూసింది ఆ డ్రైవర్ రాజు ఒక్కడే. మళ్లీ ఎవరికైనా దయ్యం కనిపిస్తే మాత్రం ఈసారి కూడా ఈ కేసు అంత తొందరగా క్లోజ్ కాదు. ఏమైనా నీ సమర్థత మీద మాత్రం నాకు నమ్మకం ఉంది" అన్నాడు స్వామినాథం. 


"థాంక్యూ సార్" అన్నాడు మోహన్ వినయంగా.


ఇంతలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. బలంగా గాలులు వీస్తూ రోడ్డు మీద ఉన్న దుమ్ము జీప్ లోకి వచ్చింది. వర్షానికంటే ముందుగా ఆకాశంలో ఉరుములు వినపడ్డాయి. మరికొద్ది క్షణాల్లోనే బిందెలతో నీళ్లు కుమ్మరించినట్లుగా పెద్ద వాన మొదలైంది. 


జీప్ లోంచి తల బయటకి పెట్టి ఆకాశం వంక చూసిన మోహన్ “క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. వర్షంతో పాటు పిడుగులు కూడా పడవచ్చు" అన్నాడు. 


వర్షం ధాటికి రోడ్డు కనబడకపోవడంతో డ్రైవర్ జీపును రోడ్డు పక్కగా ఆపాడు. 


"మనం రావడం ఆ దయ్యానికి ఇష్టం ఉన్నట్లు లేదు" అన్నాడు మోహన్. 


అందరూ నవ్వేశారు. మరో ఐదు నిమిషాలు గడిచాక "ఓ దయ్యమా! మేము నీకు హాని చేయడానికి రావడం లేదు. వీలుంటే సహాయం చేస్తాము. మమ్మల్ని రానీ" ప్రార్థిస్తున్నట్లుగా అన్నాడు స్వామినాథం. 


ఆశ్చర్యంగా మరో రెండు నిమిషాలకి వాన తగ్గుముఖం పట్టింది. ఏదో తెలియని భయంతో అందరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అది గమనించిన స్వామినాథం "చినుకుల వేగం మందగించడం గమనించే నేను అలా అన్నాను. ఇలాంటి మేఘాల వల్ల వచ్చే వర్షాలు వచ్చినంత వేగంగా ఆగిపోతాయి. మళ్ళీ వస్తాయి. ఇక్కడ ఉన్న వర్షం మరో రెండు కిలోమీటర్లు పోతే ఉండదు" చెప్పాడు స్వామినాథం. 


జీప్ ముందుకు కదిలింది. స్వామినాథం చెప్పినట్లుగానే మరో కిలోమీటర్ వెళ్లాక వర్షం పడ్డ ఆనవాళ్లు కూడా లేవు. కానీ మరికొంత దూరం వెళ్ళాక రోడ్డుపైన గుంటల్లో నీళ్లు ఉండడం గమనించారు. అలాగే రోడ్డు పక్కనున్న చెట్ల తాలూకు చిన్న చిన్న కొమ్మలు విరిగిపడి ఉండడం కూడా గమనించారు. 


జీప్ తొమ్మిదో మైలుకు చేరుకుంది. రోడ్డుపక్కగా జీప్ ను ఆపాడు డ్రైవర్. జీపు నుండి అందరూ దిగబోతుండగా "స్వామినాథం గారూ! మీ డ్రైవర్ రాజు దయ్యాన్ని ఎక్కడ చూశాడట?" అని అడిగాడు మోహన్. 


ఒక క్షణం అటు ఇటు చూసిన స్వామినాథం "సరిగ్గా ఇక్కడే సార్. మన జీప్ ఇప్పుడు ఆ స్పాట్ లోనే వుంది' అని చెప్పాడు. 


జీప్ కింద ఏదో బాంబు ఉన్నట్లు అందరూ ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ ను మరికొంత ముందుకు తీసుకువెళ్లి జీపును ఆపమన్నాడు మోహన్. జీప్ ఆగాక అందరూ కిందికి దిగారు. 


"ఇదిగోండి సార్. ఇక్కడ ఎడమవైపుకు వెళ్తున్నది వేటపాలెం వెళ్లే కాలిబాట. ఇందాక మనం ఆగింది అదుగో.. ఆ చింత చెట్టుకు కాస్త ముందు" చెప్పాడు స్వామినాథం. 


అటువైపుకు వెళ్లాడు మోహన్. స్వామినాథం కూడా మోహన్ వెంటే వెళ్లడంతో కానిస్టేబుల్స్ కూడా వాళ్లను అనుసరించారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాక చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించాడు మోహన్. రోడ్డు పక్కన పొలాల్లో ఒక దిగుడు బావి, పక్కనే ఒక షెడ్ ఉండడం గమనించాడు మోహన్. బావికి అటువైపున దట్టంగా ఉన్న మామిడి తోట ఉంది. 


"ఎవరైనా ఉన్నారా?" షెడ్ వంక చూస్తూ గట్టిగా అరిచాడు మోహన్. 


షెడ్డులోంచి ఒక 60 ఏళ్ల వ్యక్తి బయటకు వచ్చాడు. 'వస్తున్నాను దొరా' అంటూ పొలం గట్ల పైన నడుచుకుంటూ వస్తున్నాడు ఆ వ్యక్తి.. 


"అయ్యో తాతా నీకెందుకు శ్రమ? నేనే వస్తాను" అన్నాడు మోహన్. 


"మీకు అలవాటు లేదు బాబు. జారి పడతారు. నేనే వస్తున్నాను" అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి. మోహన్ పక్కనే ఉన్న స్వామినాథం వంక ఆశ్చర్యంగా చూస్తూ "స్వామీ.. నువ్వేనా" అన్నాడు. 


అప్పుడు అతని వంక పరిశీలనగా చూసిన స్వామినాథం "రంగయ్యా నువ్వా!" అంటూ అతన్ని కౌగిలించుకున్నాడు. తర్వాత మోహన్ వంక తిరిగి "ఇతని పేరు రంగయ్య. నా క్లాస్మేట్. మంచి స్నేహితుడు కూడా" అని చెప్పాడు. 


మోహన్, రంగయ్య వంక చూసి నమస్కరించాడు. రంగయ్య ప్రతి నమస్కారం చేసి "అప్పట్లో ఈ స్వామినాథం బుద్ధిగా చదువుకునే వాడు. నేను క్లాసులు ఎగ్గొట్టి జులాయిగా తిరిగే వాడిని. ఇప్పుడు వీడు రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటున్నాడు. నేనేమో పొలాలకు నీళ్లు పడుతూ కాపలా కాస్తున్నాను. ఊరక కూచుంటే తిండి పెట్టనని నా కొడుకు తెగేసి చెప్పాడు" అన్నాడు. 


"వీళ్ళ అబ్బాయి గవర్నమెంట్ డాక్టరు. నాకు బాగా తెలుసు.. తన దగ్గరకు వచ్చేయమని ఎన్ని మార్లు చెప్పినా ఇతను వెళ్లలేదట. ఈ ఊరన్నా తన పొలాలన్నా రంగయ్యకు ఎంతో అభిమానం. అప్పట్లో పొలాలు అమ్మని కొద్దిమందిలో ఇతను ఒకడు" చెప్పాడు స్వామినాథం. 


"అయితే ఈయన దగ్గర తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. పదండి అలా ఆ దిగుడు బావి దగ్గరికి వెళ్లి మాట్లాడుకుందాం" అన్నాడు మోహన్. 


"అయ్యో! ఇక్కడంతా బురద బాబు. జారి పడతారు" అన్నాడు రంగయ్య. 


"పరవాలేదులే. ఒకసారి చూస్తే తర్వాత ఎప్పుడైనా ఈత కొట్టాలంటే నీ బావి దగ్గరికి రావచ్చు" అన్నాడు మోహన్. 


"దానిదేముంది బాబు తప్పకుండా రండి. అయితే కాస్త జాగ్రత్తగా రండి" అన్నాడు రంగయ్య. 


అతను ముందు నడుస్తూ ఉండగా వెనక మిగతా వారందరూ జాగ్రత్తగా నడిచి దిగుడు బావి వద్దకు చేరుకున్నారు. 

“ఈ బావిలో ఎంత తోడినా ఎప్పుడూ అయిదు అడుగుల వరకు నీళ్లు ఉంటాయి బాబు. అలాగే ఎన్ని వానలు పడ్డా ఐదు అడుగులకు దాటవు" చెప్పాడు రంగయ్య. 


ఇంతలో ఒక్కసారిగా వాన ప్రారంభమైంది. 


"అందరూ షెడ్లోకి రండి" అంటూ వేగంగా షెడ్ వైపు పరిగెత్తాడు రంగయ్య. 


అతని వెనుకే వేగంగా వెళ్ళాడు ఎస్సై మోహన్. షెడ్ తలుపు దగ్గరకు వేసి ఉందని అనుకొని నెట్టాడు. కానీ రాలేదు. లోపల ఏదో కిర్రుమని శబ్దం వినపడింది. తర్వాత రంగయ్య తలుపు తెరిచాడు. 


"గాలికి తలుపు మూసుకుపోయినట్లు ఉంది" అన్నాడు. 


కానీ మోహన్ కు ఆ సమాధానం తృప్తి కలిగించినట్లు లేదు. లోపల అంతా పరిశీలనగా చూస్తున్నాడు. ఒక మూలన పాత బీరువా ఒకటి ఉంది. దానిపైన ఒక ఇనుప ట్రంకు పెట్టె ఉంది. ఆ పెట్టె మూత పూర్తిగా మూసుకోలేదు. బహుశా హడావిడిగా రంగయ్య ఇప్పుడు దాంట్లో ఏదో ఉంచి ఆ పెట్టెను బీరువా పైన పెట్టి ఉంటాడు. ఆ పెట్టెలో నుండి ఏదో తెల్లని వస్త్రం లాంటిది కనిపిస్తోంది. అది తెల్ల చీర లేదా తెల్ల పంచ కావచ్చు. 


మిగతా వాళ్ళు కూడా షెడ్ లోకి వచ్చారు. స్వామినాథం మోహన్ వంక చూస్తూ "ఏమిటో ఆలోచనలో ఉన్నట్లున్నారు" అన్నాడు. 


"నాకెందుకో దయ్యం ఆ పెట్టెలో ఉన్నట్లు అనిపిస్తోంది" అన్నాడు ఎస్సై మోహన్. 


"మరి అయితే ఇంకేం, ఆ పెట్టెను తీసుకెళ్లి లాకప్ లో పడేయండి" అన్నాడు స్వామినాథం. 


"రంగయ్య గారూ. మీరు ఏమీ అనుకోను అంటే ఒక్కసారి ఆ పెట్టెను చూడనిస్తారా" అడిగాడు మోహన్. 


"ఎందుకు బాబూ. దాంట్లో ఏముంటుందని.. ?" అంటూ నీళ్లు నమిలాడు రంగయ్య. 


"మీ పైన అనుమానం అని కాదు రంగయ్య గారూ. ఒకవేళ అందులో దయ్యం ఉంటే మీకు ఏమైనా హాని జరుగుతుందని నా భయం. దయచేసి ఆ పెట్టెను చూడనివ్వండి" అన్నాడు మోహన్. 


"మీరు నిరభ్యంతరంగా ఆ పెట్టెను చూడండి" అన్నాడు స్వామినాథం. 


కానీ రంగయ్య బదులు ఇవ్వలేదు. ఒక కానిస్టేబుల్ అతని సమాధానం కోసం చూడకుండా ఆ ట్రంకు పెట్టెను కిందకు దించాడు. మోహన్ సైగ చేయడంతో ఆ పెట్టె మూతను తెరిచాడు. 


అంతే! అందరూ ఒక్కసారిగా నిర్ధాంత పోయారు.

=========================================================

ఇంకా ఉంది

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page