top of page

కేస్ నెం 37 బి - పార్ట్ 1

Updated: Sep 12

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesinTelugu

ree

కొత్త ధారావాహిక ప్రారంభం

Case No. 37B - Part 1 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 07/09/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అర్ధరాత్రి సమయం. అప్పుడప్పుడూ వెళ్లే ఆటో, లారీ తప్ప జనాలు తిరిగే వేళ కూడా దాటిపోయింది. కార్తీక పరుగెడుతోంది. రొప్పుతోంది. అయినా ఆగలేదు. పార్వతీపురం రైల్వేస్టేషన్ సమీపించింది. లోపలకు పరిగెత్తింది. స్టేషన్ లో ఎవరూ లేరు. టికెట్ కౌంటర్ కూడా మూసి ఉంది. ఒకరో ఇద్దరో బిచ్చగాళ్ళు రెండవ తరగతి విశ్రాంతి గదిలో బెంచీల మీద నిద్రపోతున్నారు. స్టేషన్ మాస్టర్ తన గదిలో కుర్చీలో కూర్చుని కునికి పాట్లు పడుతున్నారు. చాలా ఆదుర్దాగా ఉంది కార్తీకకి. 


ఎవరో వచ్చిన అలికిడికి తలెత్తి చూసాడు స్టేషన్ మాస్టర్. “ఎవరు కావాలి?” అడిగాడు. 


“వైజాగ్ వెళ్లే రైలు…” మాట సగంలో ఆపేసింది కార్తీక. 


“ఇప్పుడు వైజాగ్ వెళ్లే రైళ్లు ఏవి లేవే. ఇక్కడ ఏ రైళ్లు ఆగవు” చెప్పేడు. కార్తీక నిరాశగా చూసింది. అక్కడ ఉన్న కూలీ ఒకడు “ఇలా వెళ్తే బెలగాం స్టేషన్ వస్తాది. కానీ ఇప్పుడు ఆటోలు, రిచ్చాలు దొరకవు. రోడ్డు మీదకెళ్ళి నడిచి పోవాలి. లగేజీ ఏటైనా ఉందా? తోడొచ్చిదా?” అన్నాడు ఆశగా పెదాలు తడుపుకుంటూ. కార్తీక భయంగా చూసింది. 


“ఏం వద్దు.” అనేసి స్టేషన్ బయటకు వెళ్ళిపోయింది. కూలీ కాసేపు అటు చూసి, రెండడుగులు ముందుకు నడిచాడు. కార్తీక ఎక్కడా కనిపించలేదు. వెనక్కి తిరిగి స్టేషన్ మాస్టర్ గదివైపు వెళ్ళిపోయాడు. 


కార్తీక నెమ్మదిగా చాటు నుంచి బయటకు వచ్చింది. రోడ్డు మీదకు వెళ్లాలనిపించలేదు. చీకటిని చాటు చేసుకుంటూ పట్టాల వెంబడి పరుగు కొనసాగించింది. చీకట్లో రాళ్లపై పరుగు అంత సులువు కాదు. అయినా ఆపలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం బెలగాం స్టేషన్. చీకటి... రాళ్లు… కీచురాళ్ల రొదలు…


అయినా పడుతూ లేస్తూ పరుగెడుతూనే ఉంది కార్తీక. ఆయాసంతో గుండెలు ఎగసి పడుతున్నాయి. దప్పికతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. సూదిగా ఉన్న ఒక రాయి చెప్పులో నుండి అరిపాదానికి గుచ్చుకుంది. ప్రాణం విలవిల్లాడింది. ఎదురుగా ఏదో రైలు వస్తున్నట్లు, వెలుగు కనిపించింది. కూత వినిపించింది. చటుక్కున రైలు కట్ట దిగి, పక్కనే ఉన్న బంజరు స్థలంలో బోర్లా పడుకుంది. అక్కడ ముళ్ళే ఉన్నాయో, పాములే ఉన్నాయో, పొదలే ఉన్నాయో గమనించే పరిస్థితిలో లేదు.


ఏదో గూడ్స్ రైలు దడదడమని చప్పుడు చేస్తూ వెళ్ళిపోయింది. తన గుండెలు కూడా అలాగే చప్పుడు చేస్తున్నాయి అనుకుంది కార్తీక. రైలు వెళ్లిపోగానే మళ్ళీ చీకటి అలుముకుంది. ఆ కాస్త విశ్రాంతికే సేద తీరినట్లయింది. లేచి మళ్ళీ పరుగు అందుకుంది కార్తీక. బెలగాం రైల్వేస్టేషన్ చేరుకుంది. ముప్పావుగంట పట్టినట్లుంది. ప్లాట్ ఫారం వైపు నడిచింది.


చీకటిని పారద్రోలుతూ విద్యుద్దీపాలు వెలుగుతూ ఉన్నాయి. రాబోయే రైళ్ల కోసం కొందరు ప్రయాణికులు అక్కడక్కడా వేసి ఉన్న బెంచీల మీద కూర్చుని, పడుకొని ఉన్నారు. ముసుగుపెట్టిన యాచకులు, ఇళ్లు లేని దిమ్మరులు కూడా అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు. వెలుగు తన మీద పడకుండా జాగ్రత్త పడుతూ ప్లాట్ఫారమ్ చివర ఉన్న బెంచీ మీద కూలబడింది కార్తీక. ఇప్పుడు ఏ రైలు ఉందో తెలీదు. ఎటు వెళ్తుందో తెలీదు. ఏ కాస్త అలికిడి అయినా తుళ్ళిపడి చూస్తోంది. నోరు పిడచకట్టుకు పోతోంది. అయినా లేచే ఓపిక లేదు. కాళ్లు సహకరించం అని మొరాయిస్తున్నాయి. కాస్త దూరంలో కుళాయి కనిపించింది. లేని ఓపిక తెచ్చుకుని అటువైపు అడుగులు వేసింది కార్తీక. పంపు తిప్పి చూసింది. నీళ్లు రావడం లేదు. విపరీతమైన నిస్పృహ ఆవరించింది. ఇంకా ముందుకు వెళ్లాలంటే వెలుగులోకి వెళ్ళాలి. చుట్టూ చూసింది. ఒక స్తంభం పక్కన నిద్రపోతున్న బిచ్చగాడి చిరుగుల దుప్పటిలో నుంచి నొక్కులు పడిన నీళ్ల సీసా కనబడింది. ఆలోచించలేదు కార్తీక. అత్యవసర పరిస్థితుల్లో అవే ప్రాణాలు నిలిపే అమృతమనుకొని, గబగబా అక్కడికి చేరి, ఆ యాచకునికి నిద్రాభంగం కాకుండా నీళ్ల సీసా బయటకు తీసి గొంతు తడుపుకుంది. మళ్ళీ నెమ్మదిగా సీసాని తీసిన చోటే పెట్టేసింది. 


కాళ్ళ నొప్పులు, దప్పిక కొంచెం తీరి, స్వస్థత చిక్కగానే చుట్టూ చూసింది. తాను నిలుచున్నది మూడవ నెంబరు ప్లాట్ ఫారం. అటువైపు ఉన్నది రెండవ నెంబరు ప్లాట్ ఫారం. అక్కడ నుండి పట్టాలు దాటితే ఒకటవ నెంబరు ప్లాట్ ఫారం, టికెట్ల కౌంటర్, విశ్రాంతి గది వగైరాలు కనిపిస్తున్నాయి. సమయం ఎంత అయ్యిందీ తెలీదు. ఏ రైలైనా వస్తుందో రాదో తెలీదు. తన పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉంది కార్తీకకు. ఇక్కడ ఎక్కువసేపు ఉండే పరిస్థితి లేదు. మళ్ళీ ప్లాట్ ఫారం చివరకు వెళ్లి కూర్చుంది. 


ఏదో రైలు వస్తున్నట్లుంది. బహుశా ప్రయాణికుల రైలు కాదేమో… గంట కొట్టలేదు. లేదా ఇక్కడ ఆగని ప్రయాణికుల రైలేమో… పరిపరివిధాల పరుగెడుతున్నాయి కార్తీక ఆలోచనలు. కూత, వెలుగు క్రమంగా పెరిగాయి. రైలు పరుగెత్తే చప్పుడు మాత్రం తక్కువగా వస్తోంది. వెలుగు పడుతుందని భావించి కార్తీక గబుక్కున కాళ్ళలో తల పెట్టుకుని, చేతులు తలమీదుగా కట్టుకుని, కాస్తంత ఖాళీలో నుంచి చూడసాగింది. తన అదృష్టమేమో అన్నట్లు రెండో ప్లాట్ ఫారంపై గూడ్సు రైలు నెమ్మదిగా వచ్చి, బాగా ముందుకు పోయి ఆగింది. గార్డు పెట్టి కాకుండా మరో రెండు పెట్టెలు ఓపెన్ వేగన్లు చివరగా ఉన్నాయి.


ఇటు నుంచి గార్డు, ఆ చివర నుంచి డ్రైవర్ దిగి స్టేషన్ మాస్టర్ గది వైపు నడవడం చూసింది. నెమ్మదిగా లేచి చుట్టూ చూసింది. రైలు వచ్చిన అలికిడికి లేచిన ప్రయాణికులు కొందరు అది గూడ్స్ కావడంతో మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. నెమ్మదిగా ప్లాట్ ఫారం దిగి పట్టాల మీదకు చేరుకుంది. అతి కష్టం మీద కమ్మీలు పట్టుకుని ఎగబాకుతూ ఓపెన్ వేగన్ లోకి చేరుకుంది. అది ఖాళీ బొగ్గు వేగన్. మొత్తం మసితో నిండి ఉంది. అక్కడక్కడ కొంచెం బొగ్గు కూడా ఉంది. ఏదైతే ఏం లెమ్మని ఒక మూల ముడుచుకు కూర్చుంది. విశ్రాంతి దొరికి మనసు నెమ్మదించేసరికి కడుపులో ఆకలి కరకరమంది. చేసేదేం లేక అలాగే కూర్చుంది. ఇంతలో రైలు కదులుతున్నట్లు కూతవేసింది. రైలు ముందుకు పోతుంటే కార్తీక కళ్ళు మూతలు పడ్డాయి.


***


"మిస్టర్ శరత్, అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీస్ వారికి ఫిర్యాదు చేసారు. స్థానికంగా ఉండే పోలీసులు, అటవీ పోలీసులు, స్థానికుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని వెతికించారు. ఎక్కడా ఆమె జాడ కూడా లేదు. ఏవైనా క్రూరమృగాల బారిన పడిందేమో అని ఆ దిశగా కూడా వెతికించారు. ఫలితం లేదు. ఇప్పడు శ్యాం సుందర్ గారు మన సహాయం అర్ధించారు. పోలీస్ వారికి ఇచ్చిన ఫిర్యాదు కాపీని జత చేసి, మన డిటెక్టివ్ ఏజెన్సీకి ప్రత్యేకంగా కార్తీక ఆచూకీ కనిపెట్టమని ఇచ్చిన ఫిర్యాదు ఇది. వివరాలన్నీ ఇందులో ఉన్నాయి." అని ఫైలు అందించాడు కామేశ్వరరావు, అడిస్ అధిపతి. శరత్ ఆ సంస్థలో ఒక అన్వేషకుడు.


మిలిటరీ సర్వీస్ నుంచి బయటకు వచ్చాక, ప్రభుత్వ అనుమతితో పరిశోధన, రక్షణ (అన్వేష్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ సెక్యూరిటీస్, అడిస్) సంస్థని స్థాపించాడు కామేశ్వరరావు. చురుకైన యువకులను, మిలిటరీ, పోలీస్ రంగాలలో వృత్తి విరమణ చేసి, ఆసక్తి, ఉత్సాహం ఉన్న మాజీ ఉద్యోగులను తన సంస్థలోకి ఉద్యోగులుగా తీసుకున్నాడు. వివిధ ఆఫీసులకు సెక్యూరిటీ గార్డుల నియామకం నుండి అవసరమైన చిన్న చిన్న పరిశోధనలు చేసి, పోలీస్ వారికి సహకరించడం కూడా ఆ సంస్థ చేపడుతుంది. కొందరు ప్రయివేటు వ్యక్తులు కూడా అడిస్ సేవలు తగినంత రుసుముతో పొందుతారు. బయటకు అడిస్ అని బోర్డు మాత్రమే కనిపిస్తుంది. ఏ కార్యాలయమో వివరం ఉండదు. 


శరత్ ఆ ఫైలు పట్టుకుని తన సీట్ లోకి వచ్చి కూర్చున్నాడు. ఫైల్ పైన కార్తీక అని రాసి ఉంది. మొదట పేజీలో ప్రొఫెసర్ శ్యాం సుందర్ ఇచ్చిన ఫిర్యాదు, దానితో పాటు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాగితాలు, కార్తీక ఫోటోలు ఉన్నాయి. కార్తీక ఫోటోలను ఆసక్తిగా పరిశీలించాడు. బస్ట్ ఫొటో ఒకటి, ఫ్రెండ్స్ తో ఉన్న గ్రూప్ ఫోటో ఒకటి, తవ్వకాలు జరుగుతున్నపుడు తీసిన ఫోటో ఒకటి మూడు ఫోటోలు జత చేశారు. తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఫేంట్, షర్ట్ తో ఉంది. ఆ రోజు సాయంత్రం నుంచే కార్తీక కనిపించలేదు. అంటే ఆ దుస్తులతోనే మాయమై ఉండాలి. కార్తీక వ్యక్తిగత వివరాల కోసం చూసాడు శరత్. 


పేరు: పి. కార్తీక


చదువు: ఎం.ఏ ఆర్కియాలజీ, ఆంధ్రా యూనివర్సిటీ


వయసు: 23 ఏళ్ళు


ఎత్తు: 5 అడుగుల 3 అంగుళాలు


బరువు: తెలీదు (సుమారు 50 కేజీలు ఉండవచ్చు. ఊహించి రాసింది)


శరీర సౌష్టవం: సన్నం, లావు కానీ మధ్యస్తం


ధరించిన దుస్తులు: కనిపించకుండా పోయిన రోజు నీలం జీన్స్ పేంట్, తెలుపుపై నీలపు పువ్వుల చొక్కా


చేతిలో హేండ్ బేగ్ ఉంది.


తల్లిదండ్రులు: విశాలాక్షి, సత్యనారాయణ


వైవాహిక స్థితి: అవివాహితురాలు


నివాసం: విశాఖపట్నం


ఉద్యోగం: ప్రో. శ్యాం సుందర్ ఆర్కియాలజిస్ట్ గారి దగ్గర అసిస్టెంట్.


వివరాలు చదివి, ఫోటోలు మరోసారి చూసి ఫైల్ మూసి, లేచాడు శరత్. 


"నేను ఒకసారి శ్యామ్ సుందర్ గారితో మాట్లాడాలి సర్." అన్నాడు శరత్, కామేశ్వరరావు గారితో…


"సరే, ఫోన్ చేస్తాను. నువ్వు ఫోన్ లో మాట్లాడతావా? లేదా కలిసి మాట్లాడతావా?" అడిగాడు కామేశ్వరరావు.


"నేను ఆయనను కలిసి మాట్లాడుతాను. ఎప్పుడు వీలవుతుందో కనుక్కోండి సర్." అన్నాడు శరత్.


"సరే"నని, శ్యాం సుందర్ తో ఫోన్ లో మాట్లాడి, "శ్యామ్ సుందర్ గారు లొకేషన్ లో ఉన్నారట. వీలైతే అక్కడికే రమ్మన్నారు. వెళ్ళు. ఓసారి అక్కడ పరిసరాలు చూసినట్లు కూడా ఉంటుంది" అన్నాడు కామేశ్వరరావు.


"సరే. బయలుదేరుతాను." అని చెప్పి, కావలసిన వివరాలు తన డైరీలో రాసుకుని, ఫైల్ ను బీరువాలో పెట్టేసి, బయలుదేరాడు శరత్.

========================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

3 Comments


@lavanyadv2782

•17 minutes ago

సూపర్ 👍👍👍

Like


@nagamanjarig1315

•2 hours ago

ధన్యవాదాలండీ

Like

@రత్నమంజరి

•1 hour ago

👍🏿

Like
bottom of page