top of page
Original.png

 నీ శతృవును జయించు

Updated: Oct 18

#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #NeeSathruvunuJayinchu, #నీశతృవునుజయించు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

వారంవారం కథల పోటీలో బహుమతి పొందిన కథ

ree

Nee Sathruvunu Jayinchu - New Telugu Story Written By  - Chilakamarri Rajeswari

Published in manatelugukathalu.com on 06/09/2025 

నీ శతృవును జయించు - తెలుగు కథ

రచన: చిలకమర్రి రాజేశ్వరి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

ఆ రోజు నుంచే నందిని కళాశాలలో ఇంటరు రెండవ సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతున్నాయి. పిల్లలందరూ, తమ పాత స్నేహితులను కలిసిన ఆనందంతో కబుర్లు చెప్పుకుంటున్నారు. మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చాక, అందరూ కలుసుకున్నది ఇప్పుడే మరి.


ఇంతలో గంట మోగింది తరగతులు ప్రారంభ మవుతాయనడానికి సంకేతముగా. అది విన్న పిల్లలు కబుర్లు మాని తరగతుల గదుల వైపు పరుగులు తీసారు. వాళ్ల లో ఇద్దరు, వరుణ్, కిరణ్ ఒకటే చోటు నుంచి ఒకే బస్సులో వస్తారు. ఇద్దరూ ఉండటం కూడా ఒకే అపార్టమెంటులో. 10 వ తరగతి కూడా ఒక పాఠశాల, లోనే చదివారు. ఎప్పుడూ కళాశాలకు వచ్చిన దగ్గరనించి, మళ్ళా సాయంత్రం తిరిగి బస్సు ఎక్కేదాకా, ఇద్దరూ సాధారణంగా కలిసే కనిపిస్తారు.


ఆ విషయం వాళ్ల కు ఎంతో ఇష్టమైన లెక్కల మాష్టారుకి బాగా తెలుసు. అందుకే ఇవాళ తరగతికి పాఠం చెప్పడానికి వచ్చిన వెంటనే, ఆ ఇద్దరి కోసం ఆయన కళ్ళు వెతికాయి. వాళ్ళు ఇద్దరూ కనిపించారు కానీ ఒకచోట కాదు, వేర్వేరు చోటులలో. ఇద్దరి మొహాల్లో ఒకరకమైన ఉదాసీనత కనిపించింది. ఇంటరు రెండవ సంవత్సరం లోకి వచ్చామనే అత్రుత, ఆనందం లోపించినట్టు అనిపించింది. 


తనలోని ఆలోచనలకు అడ్డుకట్ట వేసి, లెక్కలు బోధించడం మొదలుపెట్టారు. సమయం అయిందనే సూచనగా గంట మోగింది. తరగతి నుంచి బయటకు వెళుతూ, పిల్లలకు 


తెలియకుండా, మళ్ళా వారిద్దరినీ ఒకసారి చూసి, తల ఆడించుకుంటూ వెళిపోయారు.


ఆ రోజు సాయంత్రం దాకా సమయం చిక్కినపుడల్లా వాళ్లిద్దరినీ గమనిస్తునే ఉన్నారు ఇద్దరూ కలిసితిరగటం లేదు, కనీసం మధ్యాహ్నం భోజన సమయంలో కూడా కలిసిలేరు. 


తర్వాత రోజు కూడా అలాగే గడిచింది. మాష్టారు ఆ రాత్రి ఒక నిశ్చయానికి వచ్చారు, ఇంక ఆలస్యం చేయకూడదు, ఇద్దరి మధ్య దూరం పెరిగేటట్టే కనిపిస్తోంది. దీనికి కారణం బహుశ, ప్రథమ సంవత్సరం ఇంటరులో వారిద్దరికీ వచ్చిన మార్కులు అయి ఉండవచ్చేమోనని తోచింది. దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. ఆలోచించగా ఒక మార్గం తోచి అప్పుడు హాయిగా పడుకొన్నారు. 


ఉదయం లేచి నెమ్మదిగ తయారై, కళాశాల చేరుకున్నారు. 

బస్సు ఆగినవెంటనే, వరుణ్, కిరణ్ గబగబా దిగి ఎవరిదారినవాళ్ళు, తరగతి గదికి చేరుకున్నారు. మొదట భౌతికశాస్త్రం తరగతి ముగిసింది. తరువాత లెక్కలు మాష్టారు వచ్చి పాఠం చెప్పారు. తరగతి అయిపోగానే వెళుతూ, వరుణ్, కిరణ్ మీరిద్దరూ నా గదికి రండి అని చెప్పారు. ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ విడివిడిగా మాష్టారు గదికి వెళ్ళారు.


“సెలవులు సరదాగా గడిపారా, ఎక్కడికైనా వెళ్ళారా? ఏం చేసారు?” అంటూ వాళ్ల మొహాలలో కనపడుతున్న ఆత్రుతని తగ్గించడానికి అన్నట్టు సరదా సంభాషణ మొదలుపెట్టారు.


“సర్, మీరు ఎందుకో రమ్మన్నారు” అంటూ ఇద్దరూ మాష్టారు ఏం చెపుతారా అని ఆదుర్దాగా చూసారు.


“ఏం లేదు, మీరిద్దరూ ఏమైనా దెబ్బలాడుకున్నారా, ఎందుకు కలిసి ఉండటం లేదు. ఇద్దరూ బద్ధ శత్రువుల లాగా, ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికే ఇష్టపడటంలేదు, కారణం ఏంటో నాకు చెప్పేంతవరకు, మీరు ఇక్కడనుంచి కదలడానికి వీల్లేదు” అని కొంచం తీవ్రంగానే చెప్పారు. 


మాష్టారు కోపం అప్పటివరకు ఎరుగని ఆయన్ని అలాచూసి బిత్తరపోయారు. దుఃఖం ఇద్దరికి పొర్లుకువచ్చింది. వాళ్లని అనునయంగా దగ్గరకి తీసుకుని, “ఏమైందర్రా మీకు, ఎందుకు ఇలా ఉంటున్నారు, నాకు చెప్పండి, ఎవరైనా ఏమన్నా అన్నారా?” అని ఆప్యాయంగా అడిగారు.


వరుణ్ నెమ్మదిగా నోరు విప్పాడు, “మరేమో, కిరణ్ కి మార్కులు ఎక్కువ వచ్చాయి. ‘మీ యిద్దరూ కలిసే చదువుతున్నారు కదా, వాడికి అన్ని మార్కులు వచ్చాయి, నీకెందుకు రాలేదు?. నిన్ను మాటల్లో పెట్టి, నువ్వు చదువుకోకుండా చేసిఉంటాడు. వాడు మాత్రం ఇంట్లో చక్కగా చదువుకొని ఉంటాడు. అందుకే వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి. వాడితో స్నేహం చేస్తే, నీకు ఇంకా మార్కులు తగ్గిపోయి, రాంకు రావడం కష్టమవుతుంది. వాడితో ఇక మాట్లాడటం మానేసెయ్, నీదారి నువ్వు చదువుకో, అనవసరంగా సమయం వృధా చేసుకోకు, నువ్వు మాట్లాడినట్లు తెలిస్తే, నేను ఊరుకోను’ అని చెప్పింది. అమ్మ అలా అనేటప్పటికి,నాకు కూడా, అలానే అనిపించి, కిరణ్ మీద బాగా కోపం వచ్చింది.అందుకే, వాడు నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా, దూరంగా ఉంటున్నాను.”

 

ఆ మాటలు విన్న కిరణ్ నివ్వెరపోయాడు, ఎలాగో గొంతు పెగల్చుకొని, “సార్, మేమిద్దరం కలిసి చదువుకొంటే, 


సందేహాలు తీరి, పాఠాలు బాగా అర్థం అవుతాయని అనుకున్నాను కానీ, వాడికి, తక్కువ మార్కులు రావాలని నాకెప్పుడూ లేదు. మరి ఆంటీకి అలా ఎందుకు అనిపించిదో తెలియదు.” అని అన్నాడు.


మాష్టారు "చూడు వరుణ్, ఒకమాట చెపుతాను, విను, నీకు మార్కులు తక్కువ రావాలని కిరణ్ ఎందుకు అనుకుంటాడు, తనకి సాధ్యమైనంత ఎక్కువ మార్కులు రావడానికి ప్రయత్నిస్తాడు గానీ. నువ్వే, నీ కోపం తగ్గించుకొని, ఆలోచించు, నీకే అర్ధమవుతుంది. 


ఇంకోసారి నీకు ఎక్కువ మార్కులు వచ్చినపుడు, నీమీద కోపంతో కిరణ్ నీతో మాట్లాడటం మానేస్తే, నీకు ఎంత బాధ కలుగుతుంది, అది కూడా ఆలోచించు.


మీ యిద్దరికీ యిదే నా మాటగా చెబుతున్నా, ఇతరులు సాధిస్తున్న విజయాలను చూసి మనం అసూయ పడకూడదు, వారిపై ద్వేషం పెంచుకోకూడదు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. 


నీ శతృవులు బయటలేరు. మనలో ఉండే స్వార్థం, అసూయ, ద్వేషం, కోపం, ఇవే మన నిజమైన శతృవులు. వాటికి మనం బానిసగా మారకుండా, జయించి, ముందుగా మనపై మనం విజయం సాధించగలిగితే అదే మీ నిజమైన గెలుపు.


ఇకనైనా నా మాట విని, మీరిద్దరు, మంచి స్నేహితులుగా ఉండాలనేదే నాకోరిక. మరి తీరుస్తారా” అని ఇద్దరినీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకొన్నారు.


వరుణ్,, కిరణ్ వెంటనే “సర్, మీరు చెప్పింది బాగా అర్ధమైంది, మాలో ఉన్న దుర్గుణాలను జయించడమే కాదు, బాగా కష్టపడి, ఫలితాలు సాధిస్తాం, మా స్నేహాన్ని కాపాడుకుంటాం. ఇదే, మేము మీకిచ్చే మాట” అని ఆయన చేతిలో చేయి వేసి, ఆయనకాళ్ళకి దండం పెట్టారు. 


మాష్టారు ఆనందంతో వారిద్దరినీ, ‘విజయీభవ’ అని ఎంతో ప్రేమగా అశీర్వదించారు.

***

చిలకమర్రి రాజేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి

 

నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.


మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.


నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.


పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

Comments


bottom of page