క్షమించు అమ్మా! మన్నించు నాన్నా! పార్ట్ 3
- Kasivarapu Venkatasubbaiah
- 58 minutes ago
- 5 min read
#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #క్షమించుఅమ్మామన్నించునాన్నా, #తెలుగుపల్లెకథలు, #TeluguHeartTouchingStories

Kshaminchu Amma Manninchu Nanna - Part 3/3 - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah Published In manatelugukathalu.com On 27/02/2026
క్షమించు అమ్మా మన్నించు నాన్నా- పార్ట్ 3/3 - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
జరిగిన కథ:
రైతు దంపతులు మాధవయ్య, జానకమ్మలు తమ కొడుకు రాంప్రసాద్‌ను అల్లారుముద్దుగా పెంచుతారు. సినీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంప్రసాద్ తల్లిదండ్రులను చులకనగా చూసి అవమానిస్తాడు. కొడుకు ప్రవర్తనతో మనసు నొచ్చుకున్న మాధవయ్య, జానకమ్మ దంపతులు రాజన్న (జానకమ్మ సోదరుడు) వద్దకు చేరుకుంటారు.
వరుసగా సినిమాలు విఫలమై, నిర్మాతలు రాంప్రసాద్‌ను దూరం పెడతారు. సొంతంగా సినిమా తీసినా ‘నష్టపోయి, చివరికి నిస్సహాయుడిగా, డబ్బు లేకుండా మిగిలిపోతాడు. తల్లిదండ్రులు, మామ సహకారంతో మళ్ళీ సినిమా తీస్తాడు.
ఇక క్షమించు అమ్మా! మన్నించు నాన్నా! పార్ట్ 3 చదవండి.
తండ్రి మాటలు విన్న రాంప్రసాద్ ఉత్సాహంగా కార్యోన్ముఖుడై ముందుకు కదిలాడు. సినిమాకు "కడప చిన్నోడు" అని నామకరణం చేసి, టెక్నిషియన్లను సమకూర్చుకుని షూటింగ్ మొదలు పెట్టి, మూడు నెలల్లో ఏకబిగిన షూటింగ్ జరిపి పూర్తి చేశాడు. నాలుగో నెలలో ప్యాచ్ వర్క్ ముగించి ఐదవ నెలలో సినిమా రిలీజ్ చేశాడు.
అప్పటికే జనానికి సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడి ఉండడంవల్ల తొలి రోజు కలెక్షన్లు అసలు దాటి లాభాల్లోకి అడుగు పెట్టింది. సినిమా సక్సెస్ టాక్ రావడంతో ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల డిస్ట్రిబ్యూటర్లు మంచి రేటుకు పిక్చరును కొనుగోలు చేసి విడుదల చేయగా అక్కడ కూడా విజయం సాధించింది. బ్యాంక్ లోన్‌తో పాటు అన్ని బాకీలు తీర్చాడు రాంప్రసాద్, కోటి రూపాయలైన మామ షేర్ను మాత్రం అలాగే ఉంచుకున్నాడు.
"కడప చిన్నోడు" విజయవంతం కావడంతో రాయలసీమ నేపథ్యంలోనే మరో కథ రాయడానికి ఉపక్రమించాడు రాంప్రసాద్. కథలో సీమ చతురోక్తులు, సరసోక్తులు సామెతలు, నానుడులు, పలుకుబడులు కథలో పెట్టి కథను హాస్యభరితం చేశాడు, సెంటిమెంట్లు, సీమ పౌరుషం, కొంత ఫ్యాక్షనిజం దట్టించి కథ రాసుకున్నాడు. తెలుగు సీరియల్సులోని అందమైన హీరో హీరోయిన్లైన సురేంద్ర, సుచిత్రలను ఎన్నిక చేసుకున్నాడు, మిగతా పాత్రలకు కూడా సీరియల్ నటులనే తీసుకుని కొద్దిమొత్తాల్లో రెమ్యునరేషన్ ఇచ్చి "సీమ కుర్రోడు" అనే పేరును సినిమాకు నిర్ణయించాడు. రాయలసీమలోని ప్రసిద్ధ ప్రదేశాలైన లేపాక్షి, పెనుగొండ కోట, పెన్న అహోబిలం, మహానంది, యాగంటి, సంగమేశ్వరం, శ్రీశైలం ప్రాజెక్టు, హార్సిలీ హిల్స్, తలకోన, నల్లమల, ఎర్రమల అడవుల్లోని వాటర్ ఫాల్స్ మొదలైన ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొని సినిమా రిలీజ్ చేశాడు. అది భారీ విజయం సాధించింది. ఆ తరువాత జూనియర్ సినిమా నటులలోని సుందరమైన రూపం ఉన్న వారిని కథానాయక నాయికలుగా తీసుకుని "కలియుగ దానకర్ణుడు బుడ్డావెంగళరెడ్డి" జీవితకథను సినిమాగా నిర్మించాడు. అది కూడా విజయం బాటలో నడిచింది. అదే ఉత్సాహంతో "రేనాటి బెబ్బలి" పేరుతో గండికోటను పాలించిన చినతిమ్మానాయుడి జీవితాన్ని సురేంద్రతోనూ, సిద్ధవటంకోటను పాలించిన మట్లి అనంతభూపాలుడి చరిత్రను "రేనాటి సింహం" పేరుతో నరసింహప్రసాద్‌తోనూ భారీ హంగులతో సినిమాలు తీసి వందల కోట్లను ఆర్జించాడు రాంప్రసాద్. సెకండ్ విన్నింగ్‌లో మళ్లీ రాంప్రసాద్ సినీ ఫీల్డ్‌లో నిలదొక్కుకొని పోయిన ప్రతిష్టను నిలబెట్టుకున్నాడు. మళ్లీ రాంప్రసాద్ కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎగబడ్డారు.
రాంప్రసాద్ తన మనోరమ బ్యానర్ కింద చివరగా అత్యంత భారీ చిత్రంగా రేనాటి చోళరాజుల్లో ప్రముఖ రాజైన త్రైలోక్యవల్లభుడి జీవిత చరిత్రను "రేనాటి వీరుడు" టైటిల్‌తో తెలుగు సినీ అగ్రశ్రేణి హీరో హీరోయిన్లతో భారీ బడ్జెట్లో సినిమా నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేసి భారీ ఘనవిజయం సాధించి వేలకోట్ల ఆదాయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు రాంప్రసాద్. తాను సినీ ఫీల్డ్‌కు పరిచయం చేసిన వారందరికీ మంచి అవకాశాలు వచ్చి వృద్ధిలోకి వచ్చారు. వారంతా రాంప్రసాద్ మాకు గురువని చెప్పుకుంటూ ఉంటారు.
రాంప్రసాద్ మళ్లీ తన సొంత ఇంటిని దక్కించుకున్నాడు. అమ్మానాన్నను పిలుచుకొని సొంత ఇల్లు చేరుకున్నాడు. వందల ఎకరాల పండ్ల తోటలను కొని అందులో ఫామ్‌హౌస్ కట్టుకున్నాడు. తన డబ్బులో కొంత ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. కొంత మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాడు. అగ్రశ్రేణి కంపెనీల షేర్లు కొన్నాడు. అపార్ట్‌మెంట్ ఒకటి, షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి నిర్మించాడు. పుణ్యక్షేత్రాలు తిరగడానికి, తీర్థయాత్రలు చేయడానికి తల్లిదండ్రులకు ఒక కారు, తన భార్యకు ఒకటి, తనకి ఒకటి ఖరీదైన కార్లు కొన్నాడు. అలా చేసి తన సొమ్మును, తన జీవితాన్ని భద్రం చేసుకున్నాడు రాంప్రసాద్.
భార్య సుజితను కొడుకు దీక్షిత్‌ను, కూతురు నిశితను ఇంటికి పిలుచుకు రావడానికి తల్లిదండ్రులతో కలిసి కారులో అత్తింటికి పోయాడు రాంప్రసాద్. అల్లుడు ఇంటికి వచ్చినందుకు అత్తామామలు మహానందపడ్డారు. దీక్షిత్, నిశిత నాన్నను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి రాంప్రసాద్‌ను కౌగిలించుకొన్నారు. రాంప్రసాద్ హృదయం ఆనందంతో పులకించి ఉప్పొంగిపోయింది. అత్తామామలు మాధవయ్యను జానకమ్మను ఆదరంగా ఆహ్వానించి సోఫా సీట్‌లో కూర్చోబెట్టారు. తేనీటిని అందించారు.
"అల్లుడూ! అమ్మాయి మేడ మీద ఉంది." అన్నాడు మామ. రాంప్రసాద్ మేడ మీదకు పోయి భార్యకు కనిపించాడు. భార్య ఒక్క ఉదుటున వచ్చి భర్తను వాటేసుకుంది. రాంప్రసాద్ పరువశంతో భార్యను గుండెలకు అదుముకున్నాడు. "ఇన్నాళ్ళకు మేము గుర్తొచ్చామా?" అంది సుజిత కన్నీళ్ళతో.
"నేను నిలదొక్కుకున్న దాకా మీరు ఇక్కడే ఉండాలి అనుకున్నాను." అన్నాడు రాంప్రసాద్.
"నిలదొక్కుకొని చాలా కాలమైంది కదా"
"అప్పటికింకా తీవ్రమైన పోరాటంలోనే ఉన్నాను"
"ఏమైనా మీకు అండగా ఉండాల్సిన సమయంలో నేను నా స్వార్థం చూసుకుని పుట్టింటికి వచ్చాను. నన్ను క్షమించండి" అన్నది సుజిత గద్గద స్వరంతో.
"నువ్వు వచ్చి మంచి పని చేశావు. ఆ సమయంలో నాతో ఉండివుంటే, నువ్వు నీతోపాటు పిల్లలు కూడా బాధపడేవారు, దరిద్రాన్ని అనుభవించేవారు"
"నిజానికి నేను ఆరోజు పుట్టింటికి వచ్చింది కొంత డబ్బు తీసుకుని రావడానికి. దానికి ముందు అత్తామామలకు ఫోన్ చేశాను. 'డబ్బు తేవద్దమ్మా! వాడు కిందా మీదా పడాలి, చెంపేటు గోడేటు తగిలితే సాలోకి వస్తాడు. అప్పటిగ్గానీ జ్ఞానోదయం కాదు. వాడికి గుణపాఠం కావాలి. వాడు మనిషి కావాలి. అంతకైతే మేము ఉన్నాం కదమ్మా! మేము చూసుకుంటాం. నువ్వు పిల్లల్ని చూసుకుంటూ నిశ్చింతగా ఉండు.' అని మామగారు నాకు ధైర్యం చెప్పారు. మీరు ఒక స్థాయికి వచ్చాక 'ఇంటికి రమ్మంటారా మామయ్యా' అని ఫోన్ చేసి అడిగాను. "మేమే వస్తాం. కొంత కాలం ఓపిక పట్టమ్మా" అన్నారు. జరిగిన విషయమంతా భర్తకు చెప్పింది సుజిత.
"అంతగా అవమానించినా అమ్మానాన్న నన్ను ఆదరించి మళ్లీ సినీపరిశ్రమలో నిలబెట్టారు. ఆ గుణపాఠమే జరక్కుంటే నాలో మార్పు వచ్చేది కాదేమో! అందువల్ల మంచే జరుగింది. నాన్న నన్ను మళ్లీ మనిషిని చేశాడు" అని ఇద్దరు మేడ దిగి కిందికి వచ్చారు. అందరూ సంతోషంగా ఆరోజు ఉండి మరుసటిరోజు భార్యాపిల్లలను వెంటబెట్టుకొని, అమ్మానాన్నలతో ఇంటికి పోయాడు రాంప్రసాద్, అత్తామామలను తన ఇంటికి ఆహ్వానించి.
మేనమామకు రెండు వందల కోట్లు చేతిలో పెట్టి "మామా! నీవు చేసిన మేలు సామాన్యమైనది కాదు. ఎప్పటికీ మరిచిపోలేనిది. నీవే లేకుంటే నేనూ, మా అమ్మానాన్న ఏమైపోయేవాళ్లమో మామా! ఇదిగో నీ భాగానికి రెండు వందల కోట్లు రూపాయలు తీసుకో మామా!" డబ్బు ఇచ్చి కృతజ్ఞతా పూర్వకంగా చెప్పాడు రాంప్రసాద్.
"అల్లుడూ! మేము ఎన్ని జన్మలెత్తినా ఇంత డబ్బును సంపాదించలేమల్లుడూ! నిజానికి మాకంటే నీవే గొప్పవాడివి రాంప్రసాద్." ఉబ్బితబ్బిబ్బులయ్యారు రాజన్న మంగమ్మలు.
"అదేం కాదు కానీ మరదలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం, బావమరిదిని ఫారినుకు పంపి చదివిద్దాం! సౌకర్యవంతమైన ఇల్లు కొందాం! అందులో మీరు ఉండరు. ఇక ముందు దేనికైనా నేను మీకు అండగా ఉంటాను మామా" భరోసా ఇచ్చాడు రాంప్రసాద్.
సాయంత్రం డైనింగ్ టేబుల్ దగ్గర అమ్మానాన్నలు, అత్తామామలు, మేనత్త, మేనమామలు, సుజిత, అన్న, వదినెలు, పిల్లలు డిన్నర్‌కు కూర్చున్నప్పుడు అందరితో రాంప్రసాద్ ఇక నుంచి తన నిర్ణయాన్ని చెప్పాడు.
"ఇక నుంచి నా బ్యానర్లో సినిమాలు నిర్మించను. నిర్మించి జీవితాన్ని రిస్క్‌లో పెట్టుకోను. ఎప్పుడైనా నాన్న సూచనల మేరకు బడ్జెట్లో ప్రయోగాత్మకంగా తీయడం తప్ప, ఇతరులకే సినిమాలు తీయడానికి ప్రాధాన్యత ఇస్తాను. అది కూడా సంవత్సరానికి ఒకటి మాత్రమే శ్రద్ధగా క్రమశిక్షణతో అందరినీ గౌరవిస్తూ, అభిమానిస్తూ పనిచేసి సినిమా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాను.
ఇక నుంచి కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతాను. ఇప్పుడు నేను సంపాదించిన ఆస్తి తక్కువేమీ కాదు. దీనిపై వచ్చే ఆదాయాన్ని మాత్రమే అనుభవిస్తూ పోతే ఎన్ని తరాలైనా తరగదు. ఇకపై నేను ఉరుకులు పరుగులు పెట్టడం కానీ, అతికి పోవడం గానీ చేయను. అమ్మానాన్నలను, భార్యాబిడ్డలను చక్కగా చూసుకుంటూ, నిబ్బరంగా నిదానంగా శాంతిగా బతకాలని అనుకుంటున్నాను. బతుకుతాను కూడా. ఇది ఇప్పటినుంచి నా నిర్ణయం" దృఢంగా స్థిరంగా చెప్పి ముగించాడు రాంప్రసాద్.
అందరూ మంచి నిర్ణయం తీసుకున్నావని అభినందించారు. "ఇక ముందు మీ జీవితం నిర్విఘ్నంగా ఆనందంగా సాగాలని కోరుకుంటూ ఉన్నాం" అన్నారు.
=============================
సమాప్తం
=============================
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను
