top of page
Writer's pictureKasivarapu Venkatasubbaiah

అల్లెం గుండు


'Allem Gundu' New Telugu Story

Written By Kasivarapu Venkatasubbaiah

'అల్లెం గుండు' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

వెంకటాపురానికి ఆచారం లాంటి ఒక విధానం వుంది. దాని కారణంగానే ఆ ఊరికి చుట్టూ ప్రక్కల పల్లైల్లో ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఊరి మధ్యలో గ్రామాచావడి ముందర ఒక గుండు వుంది. దాన్ని అల్లెం గుండు అంటారు. అది సాధారణ వ్యక్తులు ఎవ్వరూ ఎత్తలేరు, ఆల్లెం తిని బాగా బలిసిన వారు తప్ప. ఆ ఊరి పిల్లను పెళ్లి చేసుకుని అల్లుడిగా వచ్చినవాడు ఎవరైనా ఆరునెలలు అల్లెం తిని గుండు భుజాలపైకి ఎత్తిగాని పెళ్లాన్ని తోడ్కొని వూరు వదలడానికి వీల్లేదు. అట్లా కాని పక్షంలో సదరు అత్తకు తలవంపులు వచ్చినట్లే.

అందువల్ల ఆవూరి అత్తలు ఆ విషయంలో వెనక్కి తగ్గరు. దానిని ఒక ప్రిస్టేజిగా తీసుకుని అల్లుళ్ళను ఆరునెలలు పాటు పిండి పదార్థాలతో బాటు మాంసాహారాలు పెట్టి బాగా మేపుతారు. ఏ అత్తైన తన అల్లుడు ఊరి ప్రజలందరి ముందర గుండు ఎత్తలేక పోయి... తాను అవమానం కావడానికి ఒప్పుకోరు. కాబట్టి శాయశక్తులా ప్రయత్నించి అల్లుళ్ళకు అల్లెం పెట్టి, గుండు ఎత్తే పరీక్షలో నెగ్గి అందరి మెప్పులు పొందుతారు.

ఆ ఊరికి తూర్పున కాపువీధిలో వుండే లక్ష్మీకాంతంకు అల్లుడిగా బలరాం అనే యువకుడు వచ్చాడు. లక్ష్మీకాంతం, సుందర్రామయ్యలకు అల్లుడిగా రావడం ఎవరికైనా గొప్పే. ఆవూరిలో ఆకుటుంబానికి పెద్దరికంతోపాటు ఆస్తిపాస్తులు బాగా వున్నాయి. వారికి ఏకైక పుత్రిక విష్ణుప్రియ, ఏకైక కుమారుడు సుదర్శన్ సంతానం. విష్ణుప్రియ డిగ్రీ చదువుకుంది. సుదర్శన్ ఇంటర్ చదువుతున్నాడు.

విష్ణుప్రియ పాలరాతి బొమ్మలా చూడచక్కగా వుంటుంది. తమ వూరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసింహాపురం అబ్బాయితో విష్ణుప్రియకు సంబంధం కుదిరింది. ఒడ్డు పొడవు, అందం చందం వున్న యువకుడు బలరాం. ఫిజీ చదివి శాస్త్రీయంగా వ్యవసాయం చేస్తుంటాడు. బలరాం పల్లె ప్రేమికుడు. భూమితల్లి ఆరాధకుడు. వ్యవసాయమంటే మమకారం ఉన్నవాడు. విష్ణుప్రియ బలరాంల పెళ్లి ఊరు వాడా ఏకమై అంగరంగ వైభవంగా చేశారు. విష్ణుప్రియ బలరాంల సంబంధం ఆషామాషీగా జరిగింది కాదు. దానికొక నేపథ్యగాధ వుంది.

విష్ణుప్రియ తన ఊరిలో టెంత్ పూర్తి చేసుకుని వెంకటాపురం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉండే నరసింహాపురలోని జూనియర్ కాలేజిలో చేరింది. అదే ఊరిలో ఉండే బలరాం ఇంటర్ పూర్తి చేసుకుని ప్రొద్దుటూరు నందు డిగ్రీ కాలేజీలో చేరాడు. ఉదయమే విష్ణుప్రియ ప్రొద్దుటూరు పోయే పల్లె వెలుగు బస్సెక్కి నరసింహాపురం బస్టాపులో దిగుతుంది. బలరాం ప్రొద్దుటూరు పోవడానికి అదే బస్సు కోసం ఎదురుచూస్తూ బస్టాపులో నిల్చుంటాడు. బస్సు రాగానే బస్సు ఎక్కడానికి బలరాం, బస్సు దిగడానికి విష్ణుప్రియ ఒకేసారి కదలడంతో ఇద్దరూ తోలి సారి ఎదురు పడ్డారు. అలా రోజూ ఎదురు పడుతుండడంతో ఒకరి రూపం ఒకరి మనసులో స్థిరపడింది. ఇలా ఒక సంవత్సరం గడిచింది.

విష్ణుప్రియ కాలేజిలో కాలేజ్ డే జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో పాల్గొని మయూర నృత్యం చేసింది విష్ణుప్రియ. బలరాం పూర్వ విద్యార్థిగా ఆ కార్యక్రామాలలో పాల్గొని మొదటి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏకపాత్రాభినయం చేశాడు. ఆరోజు ఒకరినొకరు తమ పేర్లను, వూర్ల పేర్లను చెప్పుకొని పరిచయం చేసుకున్నారు. రోజూ బస్సు దగ్గర ఎదురు పడినప్పుడు హాయ్ చెప్పుకొనే వారు.

మరుసటి సంవత్సరం విష్ణుప్రియ కూడా ప్రొద్దుటూరులో బలరాం చదువుతున్న డిగ్రీ కాలేజీలోనే చేరింది. అప్పటి నుంచి విష్ణుప్రియ ఎక్కిన బస్సే బలరాం కూడా ఎక్కి ఇద్దరూ మాట్లాడుకుంటూ పోయెచ్చేవారు.

డిగ్రీ చివరి సంవత్సరం బలరాం, డిగ్రీ మొదటి సంవత్సరం విష్ణుప్రియ చదువుతున్నప్పుడు ప్రొద్దుటూరు కళా భారతి వారు కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విష్ణుప్రియ నాగిని నృత్యం చేసి జ్ఞాపిక అందుకుంది. బలరాం అన్యభాషా పదాలు లేని అచ్చతెలుగులో ఉపన్యసించే విభాగంలో పాల్గొని పది నిమిషాలు ఏకధాటిగా అనర్గళంగా మాట్లాడి జ్ఞాపిక తోపాటు అందరి ప్రశంసలు అందుకున్నాడు.

తరువాత సంవత్సరం పిజి ఫస్ట్ ఇయర్ లో బలరాం, డిగ్రీ సెకండ్ ఇయర్ లో విష్ణుప్రియ చేరారు. SCNR కాలేజి కాంపౌండ్లోనే డిగ్రీ, పీజీ ఉండడం వల్ల తరుచూ ఎదురు పడేవారు. కలిసి మాట్లాడుకొనే వారు. అట్లా మూడేండ్లకు బలరాం పిజీ , విష్ణుప్రియ డిగ్రీ పూర్తయే సరికి ఇద్దరి మధ్య స్నేహం బలంగా బలపడింది. చివరిగా కాలేజ్ నుంచి వస్తూ బస్సులో బలరాంతో అంది విష్ణుప్రియ..

"వచ్చే ఆదివారం ఝరికోనలో గంగమ్మ జాతర ఉంది. వస్తావా! మా ఊరికి కిలోమీటర్ దూరంలో అడివిలో ఉంది గంగమ్మ దేవాలయం"

"ఆఁ వస్తాం! మాకు మ్రొక్కుబడి వుంది. కుటుంబమంతా వస్తాం. " ఆసక్తి కనబరుస్తూ బలరాం.

"మా ఊరి ఆడపిల్లలందరం జాతరలో కోలాటం ఆడుతాం"

"ఔనా! అయితే జాతర్లో కలుద్దాం " అంటూ నరసింహాపురం రాగానే దిగిపోయాడు బలరాం.

విష్ణుప్రియ కోలాటం, జడకోపు, జట్టిజాం, డాన్సు ఆడడంలో దిట్ట. బలరాం బలిగుడు(కబడ్డీ) కుస్తీ, కర్రసాము, చెక్క భజన, డ్యాన్సుల్లో కొట్టిన పిండి.

జాతర్లో రెండు కుటుంబాలు కలిశాయి. పిల్లల ద్వారా పెద్దలు పరిచయాలు అయ్యాక షామియానాలు ప్రక్కప్రక్కనే వేసుకున్నారు. గంగమ్మకు యాటను పెట్టుకొచ్చాక వంట చేసుకుని భోజనాలు కానిచ్చారు. జాతర కారణంగా కోనంతా జనసందోహంతో కోలాహలంగా ఉంది. రంగురంగుల అలంకరణలతో విద్యుత్ దీపాలతో సోభాయమానంగా ఉంది. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకగా మొదలైనాయి.

విష్ణుప్రియ తమ ఊరి యువతులతో కలిసి కోలాటంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నరసింహాపురం ట్రూప్ తో కలిసి శివతాండవం అపూర్వంగా నర్తించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసి మెప్పించాడు బలరాం.

"అద్భుతంగా నృత్యం చేసినందుకు అభినందనలు. నీలో గొప్ప కళాకారుడు ఉన్నాడు." అభినందించింది విష్ణుప్రియ.

"అలాగా! నువ్వు మాత్రం తక్కువ తిన్నావా! అందరూ నిన్ను బాగానే పొగిడారు కదా! ఏమైతేనేం నీ అభినందనలకు కృతజ్ఞుడను" అన్నాడు బలరాం.

ఇద్దరూ సరదాగా కొద్దిసేపు ముచ్చటించు కున్నారు. ఉదయాన్నే రెండు కుటుంబాలు వీడ్కోలు చెప్పుకొని ఎవరి దారిన వారు పోయారు.

అటు కొంత కాలానికి నరసింహాపురంలో నరసింహస్వామి తిరుణాల జరిగింది. చుట్టూ ప్రక్కల జరిగే తిరుణాలల కన్నా పెద్దది. ఉత్సవాలకు నెల రోజుల ముందు నుంచే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలకు ప్రాక్టీసులు జరుగుతాయి. మంచి ప్రదర్శనకు భారీ బహుమతులు కూడా ఉంటాయి. బలరాం విష్ణుప్రియకు ఫోన్ చేసి

"మేము తిరుణాలలో ప్రదర్శించెందుకు ఈసారి రాయలసీమ ప్రధాన కళారూపమైన 'చెక్క భజన'ను ఎన్నుకున్నాం. ఇందులో పన్నెండు మంది స్త్రీలు, పన్నెండు మంది పురుషులు ఉంటారు. మాకు ఒక స్త్రీ నెంబర్ తక్కువ వచ్చింది. నువ్వు మా జట్టులో చేరి ఆడుతావా?" అని అడిగాడు. విష్ణుప్రియ ఆనందంగా ఒప్పుకుంది.

"మేము మా ఊరివాళ్ళు ప్రతేడు తిరుణాలకు వస్తుంటాం. కాకపోతే ఈసారి నీ ఆహ్వానంపై వస్తాం. అంతే తేడా." అంది విష్ణుప్రియ నవ్వుతూ...

"నా ఆహ్వానాన్ని మన్నించినందుకు కృతజ్ఞతలు" బలరాం వినయ పూర్వకంగా చెప్పాడు.

"కృతజ్ఞతలు ఎందుకులే! చాల రోజుల తర్వాత నిన్ను చూడబోతున్నాందుకు సంతోషంగా వుంది నాకు." అమితాసక్తి కనబరుస్తూ ప్రియ.

"నాకు అదే ఉద్దేశం! తిరుణాల సాకుతో నిన్ను పిలవడం " మనసులోని ఆశను వ్వక్తం చేశాడు బలరాం.

"మన స్నేహం మరచిపోలేదన్న మాట" ఒకింత ఆశ్చర్యంతో ప్రియ.

"ఎలా మర్చిపోగలను? ఒకరోజుది కాదు కదా! మన పరిచయం. అయితే నీవు రెండు రోజులు ముందు రావాలి ప్రాక్టీస్ కోసం. సరేనా? " అంటూ బై చెప్పాడు ఉత్సాహంతో బలరాం.


ఈవిషయం తల్లిదండ్రులకు చెప్పింది విష్ణుప్రియ. వారు కూడా సరే అన్నారు. విష్ణుప్రియ తల్లిదండ్రులు లక్ష్మీకాంతం సుందర్రామయ్యలకు ఒక ఆలోచన తట్టి సాయంత్రం చుట్టాలు పక్కాలను పిలిచి తన మనసులోని మాటను బయట పెట్టారు.

" గంగమ్మ జాతరలో బలరాం అనే అబ్బాయిని చూశామే, ఆ అబ్బాయికి మన అమ్మాయి నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది." బంధువులను అడిగాడు సుందర్రామయ్య.

"బెషుగ్గా ఉంటుంది.అబ్బాయి ఆరడుగుల అందగాడు. చందమామ వంటి ముఖము గలవాడు. అమ్మాయికి సరీగ్గా సరిపోతాడు.. అందమైన ఈడు జోడు " అందరూ ముక్తకంఠంతో అన్నారు..

"మనం నరసింహాపురం తిరుణాలకు పోయినప్పుడు ఈవిషయం బలరాం తల్లిదండ్రులతో మాట్లాడుదాం. కుదిరితే తాంబూలాలు మార్చుకుందాం." వారితో అన్నాడు సుందర్రామయ్య.

" అలాగే చేద్దాం " ఒప్పుకున్నారు చుట్టాలు ఆనందం వ్యక్తం చేస్తూ...

తిరుణాల రెండ్రోలుందనగా విష్ణుప్రియ ప్రాక్టీస్ కోసం నరసిహాపురం పోయింది. విష్ణుప్రియను ఆదరంగా తోడ్కొని వచ్చి అమ్మా నాన్నలతో కలిపాడు బలరాం. విష్ణుప్రియ ప్రియంగా పలుకరించింది. ఆనందంగా ప్రతిస్పందించారు బలరాం అమ్మానాన్నలు. ప్రియను తీసుకుని పోయి చెక్కభజన సభ్యులకు పరిచయం చేశాడు. అందరూ కుర్చోని కబుర్లలో పడ్డారు.

"రామ్! నువ్వు పల్లె పాటలు, పల్లె ఆటలు, పల్లె పదాలు వైపు మొగ్గు చూపుతుంటావు కారణం కనుక్కోవచ్చా? " అడిగింది విష్ణుప్రియ

"ప్రియా! కంప్యూటర్ చదువుల కోసం అందరూ ఇంగ్లీషు మీడియం స్కూల్లకు, కాలేజీలకు ఎగబడడం వలన మన భాష సక్రమంగా మాట్లాడేవారే కరువైపోయారు. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, పారశీకం, తెలుగు కలిసిన సంకర భాషను మాట్లాడుతుంటారు. అంతో యింతో ఇంకా పల్లెల్లోనే మన జీవభాష మిగిలింది. పల్లె భాషను, పల్లె పాటను, పల్లె ఆటను మనం కాపాడుకోవాలి. మన అస్తిత్వాన్ని ఉనికిని నిలబెట్టు కోవాలంటే మన మూలాల్ని మరువ కూడదు. అది నా ప్రగాఢ ఆశయం." తన ధ్యేయాన్ని నిష్కర్షగా నిర్ద్వందంగా చెప్పాడు.

"నాకూ ఇష్టమైన ఆశయమే " ప్రియ తన వాంఛితాన్ని తెలిపింది.

"అయితే నాతోనే జీవితం పంచుకోవచ్చుగా" అన్నాడు కొంటెగా

బలరాం హటాత్తుగా అలాంటి ప్రతిపాదన చేసేసరికి కొంత షాక్ గురైంది ప్రియ. అంతలోనే తేరుకొని చిరునవ్వుతో...

“అలాంటి అవకాశం వేస్తే ఎంత మాత్రం వదులుకోను." అంది ధృడంగా

"అలాగైతే ఆ దిశగా ప్రయత్నాలు చేయమంటావా? అనుమతి కోరుతున్నట్లు అడిగాడు బలరాం.

"నిస్సంకోచంగా, నిరభ్యంతరంగా చేయవచ్చు" ప్రియ స్థిరంగా అంది.

జీవిత భాగస్వామిని ఎంచుకునే సమస్య పరిష్కార మైనందుకు ఆనందపడ్డారు ఇద్దరూ. చెక్క భజన సభ్యులంత ఉత్సాహంగా చప్పట్లు కొట్టి అభినందించారు. బలరాం ఇంట్లో ఉంటూ చెక్క భజన ప్రాక్టీస్ చేసింది ప్రియ.

నరసింహాపురంలో చాలా పెద్ద పురాతనమైన నరసింహస్వామి దేవాలయం ఉంది.ఏటేటా తిరుణాల చాల గొప్పగా జరుగుతుంది. తిరుణాల రెండ్రోజులు జరిగే ఉత్సవం. మొదటి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనేక కళా బృందాలు వచ్చి తమ కళారూపాలను ప్రదర్శిస్తాయి. లంకలాటాలు , జెయింట్ వీల్స్, రకరకాల వినోద వస్తు సరంజామంత దిగుమతి అవుతుంది. వివిధ వస్తువులు అమ్మే అంగళ్లు బజార్లు బజార్లుగా ఏర్పాటైతాయి. తిరుణాల మొదట్లో జరిగే చెక్కభజన, తిరుణాల చివర్లోజరిగే ఎద్దులు బండ లాగుడు పోటీలు తిరుణాలంతటికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

తిరుణాలకు వెంకటాపురం ఊరి జనమంతా బస్సుల్లో ట్రాక్టర్లలో ఆటోల్లో కదిలారు. మొదటి రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బలరాం, విష్ణుప్రియల బృందం చెక్కభజన ప్రదర్శించారు. ఆ ప్రదర్శన అమోఘంగా సాగింది. ప్రదర్శనలో బృందం సభ్యులంతా పురుషుడు ప్రక్కన స్త్రీ, స్త్రీ ప్రక్కన పురుషుడు గుండ్రంగా నిలబడి ఎడమచేత్తో చెక్కతాళాలు వాయిస్తూ, కుడిచేతిని అభినయ పూర్వకంగా కదిలిస్తూ, పాటపాడుతూ , దానికి అనుగుణంగా లయబద్దంగా అడుగులు వేస్తూ , వలయాకారంగా తిరుగుతారు.

పాట యొక్క రాగాలాపన హెచ్చుతగ్గులను బట్టి నిదానంగాను వేగంగాను అడుగులు వేస్తారు. చూసేవారికి కన్నుల పండగగా ఉంటుంది. బలరాం, విష్ణుప్రియల బృందం ప్రదర్శన జనానికి బాగ నచ్చింది. వీరి బృందానికే మొదటి బహుమతి దక్కింది.

మర్నాటి దినం విష్ణుప్రియ బంధువులు, బలరాం బంధువులు బలరాం యింట్లో సమావేశమైయారు. పిచ్చాపాటిగా ఆమాట ఈమాట మాట్లాడుకుంటూ బలరాం విష్ణుప్రియల పెళ్లి ప్రస్తావన తెచ్చారు విష్ణుప్రియ వైపువారు. అందుకు బలరాం తల్లిదండ్రులు నరసింహారావు మధుమతిలు మహానందంగా ఒప్పుకున్నారు.

"వినయ విదేయతలతో పాటు అమ్మాయి మంచి తెలివితేటలన్న పిల్ల మా కోడలు కావడం గొప్ప అవకాశంగా భావిస్తాం" అన్నారు. అబ్బాయి తల్లిదండ్రులు సంబరపడిపోతూ…

"అయితే మీరు ఒక విషయం ఒప్పుకోవాల్సి వుంది. పెళ్లి అయ్యాక ఆరునెలలు అత్తారింట్లో అల్లెం తిని, మా ఊరి మధ్యలో ఉన్న అల్లెంగుండు భుజాల పైకెత్తిగాని భార్యను మీ ఊరికి పిల్చుక పోవడానికి వీలులేదు. అది మా ఊరి కట్టుబాటు.ఈ ఒప్పందానికి ఒప్పుకోవాలి మీరు " విషయం వివరించారు వెంకటాపురం పెద్దలు.

"అలాగైతే అబ్బాయిని అడగాలి "అని బలరాం వైపు చూశాడు బలరాం తండ్రి. బలరాం అంగీకరిస్తూ తలూపాడు.

"మంచి సంబంధం కోసం మేము ఈ కట్టుబాటుకు ఒప్పుకుంటున్నాం" తమ ఒప్పుదలను తెలిపారు బలరాం తల్లిదండ్రులు. వెంకటాపురానికి నరసింహాపురానికి మధ్య దూరం పది కిలోమీటర్లే కాబట్టి వచ్చిపోతుండొచ్చు. అత్యవసరాలకు కూడా అనుకూలంగా ఉంటుందని ఇరుపక్షాల తల్లిదండ్రులు, రెండూర్ల పెద్ద మనుషులు అంగీకరించారు.

"కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు" బలరాం విష్ణుప్రియల ఆనందానికి అవధులు లేవు.. బలరాం విష్ణుప్రియల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బలరాం ఊరికంతా అల్లుడైనట్లు ఊరంతా మురిసిపోయింది. అల్లుడి హోదాలో విష్ణుప్రియ సమేతుడై బలరాం వెంకటాపురం వచ్చినప్పుడు ఊరి పొలిమేర నుంచి మేళతాళాలతో ఊరి ప్రజలు ఊరేగింపుగా తీసుకొచ్చి అల్లుడిని కూతురిని అత్తమామల యింట్లో విడిచారు.


తిరిగింపులు, మరిగింపులు పూర్తైనాయి. ఆల్రెం తినడానికి అత్త లక్ష్మీకాంతం యింటికొచ్చాడు అల్లుడు బలరాం. అప్పటి నుండి మొదలైంది అల్లెం తినే యజ్ఞం. బలరాంకు ఏసీ గదిని కెటాయించి అందులో పెట్టెమంచం, పరుపు , లేపుదిండు ఏర్పాటు చేసి దానిపై ముఖమల్ దుప్పటి పరిచారు.

అల్లెం ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు, మాంసాహారాల పాటు ప్రధాన పాత్ర పోషించేది అత్తరసలు(అరిసెలు) బహుశా అత్త అల్లెంలో పెట్టేవి కాబట్టి వీటికి ఆపేరొచ్చి ఉండొచ్చు. అవు నెయ్యిలో నానిన అత్తరసలను భోజనం తర్వాత ముప్పూటలా అల్లుడికి పెడతారు. వీటితోపాటు లడ్లు, కర్జికాయలు కూడా పెడతారు. ఉదయం, సాయంత్రం పెద్ద లోటా ఆవుపాలు ఇస్తారు. ఇక భోజనంలో మొదటి ప్రాధాన్యం మాంసమే. రోజు ఒకరకం పెడతారు. ఒకరోజు భోజనంలో నాటుకోడి పులుసు, వడలు (గారెలు) . మరోరోజు మటన్ పల్వా. ఇంకొక రోజు రంగయ్య చికెన్ సెంటరులో బాయిలర్ కోడి కూర. మరోరోజు కాయగూరల పులావ్, నంజుకోవడానికి చికెన్ పకోడా . ఆదివారం రంగయ్య కోసిన వేటమాంసం. అవి ఇవి లేనప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న డాబాలో మటన్ బిర్యానో, చికెన్ బిర్యానో తెస్తుంటాడు బావమరిది సుదర్శన్. అప్పుడప్పుడు వేటగాళ్లు అడవి జంతువుల మాంసం తెచ్చి ఇస్తుంటారు. ప్రొద్దుటూరుకు పోయి రకరకాల పండ్లు తెస్తుంటాడు మామ సుందర్రామయ్య.

మొదటి సారి అల్లుడు భోజనాలు దగ్గర కుర్చునప్సడు అల్లుడితో...

"అల్లుడూ! ఇప్పటి నుంచీ మీ కుటుంబం, మా కుటుంబం వేర్వేరు కాదు. ఒకే కుటుంబం. మీ సమస్యలు మావి, మా సమస్యలు మీవి. కాబట్టి మోహమాటం పడకుండా తినాలి. స్వతంత్రంగా నడుచుకోవాలి" అత్త లక్ష్మీకాంతం అంది కొత్తతనం పోవడం కోసం.

"మొహమాటం ఏమీ లేదులే అత్తా! మీరు మేమూ ఒకటై పోయాక ఇక మొహమాటం ఎందుకుంటదిలే అత్తా!" అల్లుడి సమాధానం.

కూతురు కొసరి కొసరి వడ్డించింది. బలరాం అల్లెం తింటూ రేపొక్క చాయగా మాపొక్క చాయగా తీరుతున్నాడు. అల్లుడి పుణ్యమాని ఇంటిల్లిపాది బాగా తింటున్నారు. ఇరుగుపొరుగు అమ్మలక్కలు తీరుతున్న అల్లుని చూసి అత్తను ప్రశంసాపూర్వకంగా మెచ్చుకుంటే అత్త ముఖం సంతోషంతో చాటంతైంది . ఒకింత గర్వం కూడ పొడచూపింది.


అల్లుడు యింట్లో ఉంటే అదో సరదా, అదో ఆనందం. ఊరిలోని యువకులు యువతులు బలరాంను వెంటబెట్టుకుని పొయి ఏట్లో ఇసుకలో బలిగుడు , మైదానంలో క్రికెట్ లాంటి ఎన్నో ఆటలు ఆడేవారు. పరాచికాలు పడేవారు. వరసైన వారు ఆట పట్టించేవారు. గేలి, ఎగతాళి చేసేవారు. ఊరంతా బలరాంను ఆత్మీయంగా చూసుకునే వారు.


బలరాం ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఊరు నుంచి డాబా వరకు , డాబా నుంచి ఊరికి పదిసార్లు పరిగెత్తేవాడు . పంచాయతీ ఆఫీసు దగ్గర ఉన్న వ్యాయామశాలలో వ్యాయామం చేసేవాడు. చెరువులో ఈత కొట్టేవాడు. వేగంగా సైకిల్ తొక్కేవాడు. ఊరి యువకులతో కుస్తీలు పెట్టేవాడు. ఎవరూ నిద్రలేవక మునుపే అల్లెంగుండు దగ్గరకు వచ్చి, గుండు ఎత్తే ప్రాక్టీస్ చేసేవాడు. మొదటి నెల మొకాళ్ళ వరకు, రెండవ నెల పొట్ట వరకు, మూడవ నెల ఎద వరకు నాలగవ నెల అతి కష్టమ్మీద భుజాల పైకి ఎత్తేవాడు. ఐదవ నెల కొంత కష్టంగాను, ఆరవ నెల అలవోకగాను గుండు భుజాలపైకి ఎత్తి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్నాడు.

బలరాం వచ్చిన ఐదవ నెలలో వెంకటాపురం పెద్దమ్మకు దేవర జరిగింది. ఆరోజు ప్రతి యింటికి బంధువులు వచ్చారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా పాల్గొన్నారు. బలరాం తల్లిదండ్రులు కూడ వచ్చారు. బలరాంలో శారీరకంగా వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు బలరాం తల్లిదండ్రులు.

పెద్దమ్మ దేవర సందర్భంగా కర్రసాము, కుస్తీలు, బలిగుడు, బరువులు మోయడం, బిర్రుపెట్గిన బండ్లను లాగడం, పరుగెత్తడంలో, ఎగరడంలో మగవారికి పోటీలు పెట్టారు. చాలా వాటిల్లో బలరాం బృందమే గెలిచింది. ఆడవాళ్లకు జట్టిజాం, పిస్తిపిస్తి, గీజర్గోల్ గిన్నెలో గోల్, అబ్బాలమ్మ అబ్బాలు, జడకోపు, కోలాటం మొదలైన గ్రామీణ ఆటల్లో జరిగాయి. దాదాపుగా అన్నింట్లో విష్ణుప్రియ గుంపే గెలిచింది. రాత్రికి మహాభారతంలోని "సౌగంధికా పుష్ప అపహరణం" నాటక ప్రదర్శన జరిగింది. ద్రౌపదిగా విష్ణుప్రియ అపురూప సౌందర్యవతిగా , అతి సుకుమారంగా నటించి మెప్పించింది. భీముడి వేషంలో బలరాం కండలు తిరిగిన వస్తాదులా అచ్చం భీముడిలా కనిపించి చూపరుల మతులు పోగోట్టాడు. ప్రేక్షకుల ఈలలు, కేకలు, అరుపులతో స్టేజి దద్దరిల్లిపోయింది.


సుందర్రామయ్య కుటుంబం పెద్దమ్మకు మేకపోతును పెట్టుకొచ్చారు. మొదటి రోజు మేకపోతు బోటి, ఆయాలు, మరోరోజు ఎముకలు పులుసు వండుకొని తిన్నారు. మెత్తని కండలను వాలికలుగా కోసి, తాడును దండెంగా కట్టి దానిపై వాలికలను దిగేసి ఎండబెట్టారు. బాగా ఎండిన తర్వాత ఎండు సీయల కూర, రాగిసంగటి, జొన్న రొట్టెలు బలరాంకు పెడుతూ వచ్చారు. సమయం గడిచే కొద్దీ బలరాం కాస్త బాహుబల రాముడైయాడు.


ఆరునెలల అల్లేం తినే కాలం గడిచిపోయింది. బలరాం బల ప్రదర్శన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అల్లెంగుండు ఎత్తడానికి ఓరోజు నిర్ణయించారు ఊరి పెద్దలు. ఆరోజు బలరాం ఊరి నుంచి అమ్మానాన్నలు కూడ వచ్చారు. నిర్ణయించిన రోజు ఉదయం బలరాం అల్లెంగుండు దగ్గరకు వచ్చాడు. ఊరి పెద్దలు, బలరాం తల్లిదండ్రులు , అత్తామామలు ఆసీనులై ఉన్నారు. అత్తామామలకు, అమ్మానాన్నలకు నడుమున విష్ణుప్రియ కుర్చోని ఉంది. చుట్టూ ఊరి జనం నిల్చున్నారు. అందరిలో ఉత్సాహం , ఉత్కంఠత నెలకొనివుంది.


బలరాం ఒకసారి భార్య విష్ణుప్రియ వైపు చూసి కన్నులు ఎగరేశాడు. విష్ణుప్రియ బొటనవ్రేలు పైకెత్తి ఉత్సాహం పరిచింది. ప్రక్కనే ఉన్న అత్తను చూసి చిన్నగా నవ్వాడు. అత్త ముఖం ఆనందానికి భయ్యానికి మధ్యన ఊగిసలాడింది. చుట్టూ నిల్చున్న ప్రజల్ని చూసి చేతులెత్తాడు. జనం కేకలు ఈలలు వేసి ప్రతిస్పందించారు.

బలరాం అల్లెం గుండు మీదికి వంగి, రెండు చేతులతో గుండును బిగించి పట్టుకుని అవలీలగా, సునాయాసంగా భుజం పైకెత్తి బారెడు దూరం విసిరేశాడు. అంతవరకు భుజం పైకెత్తిన వారే గాని , బారెడు దూరం విసిరిన వారు ఎవరూ లేరు. జనం పెద్ద పెట్టున కేకలు, అరుపులు, ఈలలు వేస్తూ డ్యాన్స్ వేశారు. యువకులంతా పరుగెత్తుకొచ్చి బలరాంను చేతులు పైకెత్తుకుని గ్రౌండ్ చుట్టూ తిప్పారు.

బలరాం అత్త విజయగర్వంతో ఎద విరుచుకుని నిలబడింది. మామ విజయసూచికంగా మీసం మెలితిప్పాడు. విష్ణుప్రియ, సుదర్శన్, అమ్మానాన్నలు, ఊరి పెద్దలు ఆనందంతో చప్పట్లు చరిచారు. ఆ ప్రాంతమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. అందరూ లక్ష్మీకాంతంను అభినందనలతో ముంచెత్తారు. అభినందనల వర్షంలో తడిసి ముద్దై ఉబ్బితబ్బిబ్బైయింది లక్ష్మీకాంతం. తలెత్తి ఎద విరుచుకొని నిటారుగా నిలబడింది.

అల్లెంగుండు ఎత్తే కార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు అందరూ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. బలరాం ఇక రేపు ఊరికి ప్రయాణం అనగా ఆలోచనల్లో పడ్డాడు.

"ఊరివారు చూపిస్తున్న ప్రేమ, అభిమానం , ఆత్మీయతకు బదులుగా నేను ఏమియ్యాలి. ఊరికి ఏమిచేస్తే ప్రతిఫలమైతుంది? "ఆలోచించసాగాడు.


నెలరోజులుగా అడివి నుంచి పులొకటి రాత్రి పూట ఊర్లోకొచ్చి, ఇంటి బయట కట్టేసిన మేకలను, గోర్రెలను, దూడలను ఏవి కనబడితే వాటిని ఎత్తుక పోతుంది.‌ మొన్నటికి మొన్న అర్థరాత్రి బయటి కొచ్చిన మల్లేషును పంజాతో కొట్టింది. చావుబతుల్లో త్రుటిలో ఇంట్లోకి దూరి వాకిలి వేసుకున్నాడు. లేకపోతే పులి చేతుల్లో చచ్చేటోడే . అది మొదలు రాత్రి ఏడుగంటలకే ఊరి జనం భయంతో వాకిల్లు బిగించుకొని ఇంట్లోనే ఉంటున్నారు. ఈమధ్య పులి భయం ఎక్కువైపోయింది జనానికి. పులి మాట ఎత్తితే గజగజ వణికుతున్నారు.

"ఈ ఊరికి ఎలాగైనా పులి బాధ పోగొట్టాలి." ఢృడంగా తలచుకున్నాడు బలరాం.

ఆ రాత్రి బాగా పొద్దు పోయాక పన్నెండు ఒంటిగంట మధ్యన విష్ణుప్రియ గాఢ నిద్రలో ఉండగా మెల్లగా బలరాం లేచి ఇంటి బయటకు వచ్చి, పంచన నిలబెట్టిన ఈటెను తీసుకుని వీధిలోకొచ్చాడు. వీధి నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది. రివ్వున చల్లగాలి వీచి శరీరానికి తగిలి హాయిగొల్పుతుంది . వీధి మధ్యలో నిలబడి పులి వచ్చే దిక్కుగా చూస్తున్నాడు బలరాం. కానీ పులి ఊర్లోకి ఎప్పుడొచ్చిందో ఏమోగానీ, వీధులన్నీ తిరిగి ఏమి దొరక్క ఉస్సూరుమని తిరుగు ప్రయాణం పట్టి వస్తుంటే అల్లంత దూరంలో బలరాం వెనిక్కి తిరిగి నిలబడి ఉండడాన్ని చూసింది.


పులి వేగంగా పరుగెత్తుకొచ్చి ఎగిరి ముందరి రెండు కాళ్ళు పంజాలతో బలరాం వీపుపై బలంగా కొట్టింది. పులి గోర్లు బలరాం వీపున లోతుగా దిగుబడి రక్తం చిమ్మింది. ఆ దెబ్బకు ఎదురుకపోయి బోర్లా పడ్డాడు, చేతి లోని ఈటె విసురుకి పోయి దూరంగా పడ్డది. వెంటనే బలరాం అప్రమత్తుడై చురుగ్గా లేచి నిలబడి మళ్లీ తనపైకి ఎగిరి పంజా విసురుతున్న పులి డొక్కలో పిడికిలి బిగించి గట్టిగా ఒకగుద్దు గుద్దాడు.. బలరాం.

బలరాం ముష్టిఘాతానికి పులి దూరంగా ఎగిరి పడింది. అప్పటికే పలిపంజా బలరాం ఎదపైబడి చీరేసింది. తిరిగి పులి పరుగెత్తుకొచ్చి మీద పడబోయింది. బలరాం ఒడుపుగా దాని దెబ్బ నుంచి తప్పుకొని దాని గుండెలపై బలమైన కిక్ ఇచ్చాడు. దానితో పులి వెల్లకిలా పడి పోయింది. వెంటనే లేచిన పులి వేట విధానాన్ని మార్చుకొని నేరుగా పోయి బలరాంతో కలబడింది. పులి, బలరాం కిందామీదా పడి నాలుగైదు పొర్లులు పొర్లారు. వీలు చూసుకొని బలరాం దానిపొట్టపై రెండు పాదాలు పెట్టి శక్తికొద్దీ విసిరికొట్టాడు.


కుంగదీసుకపోయి నేలపైన దబ్బున పడింది పులి. బలరాం మెరుపు వేగంతో పైకి లేచి ఈటె అందుకున్నాడు. క్రింద పడిన పులి రోషంతో గాండ్రించి బలరాం పైకి దూకింది. బలరాం నేర్పుగా ప్రక్కకు జరిగి పెద్దపెట్టున పొలికేక వేసి పులి తెలజంకన (సంక క్రింది భాగం) ఈటెతో బలంగా కుమ్మాడు. ఈటె పులి గుండెల్ని చీల్చుకుంటూ ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు పొడుచుకొచ్చింది. దానితో పులి మనిషెత్తు పైకెగిరి క్రిందపడి తనుకులాడింది. బలరాం పులి శరీరం నుంచి ఈటెను లాగి, మరీ నాలుగు పోట్లు కసిదీరా పొడిచాడు. పులి మరి కొద్దిసేపు నేలపై పొర్లి ప్రాణం విడిచింది.


పులి గాండ్రింపును, బలరాం పొలికేకను విన్నా విష్ణుప్రియ ఉలిక్కిపడి లేచి బయటికి పరుగెత్తు కొచ్చింది . ఆమెతోపాటు ఆమె కుటుంబం, ఊరి ప్రజలు పరుగెత్తుకొచ్చి చూశారు. పులి చచ్చిపడింది. రక్తసిక్తమైన శరీరంతో కన్నులు బైర్లుక్రమ్మి క్రీంద పడిపోతున్న బలరాంను విష్ణుప్రియ పరుగెత్తుకొచ్చి వడిసి పట్టుకుంది. భయాందోళనలుతో ఊరంతా ఊపిరి బిగపట్టారు ఆవేళప్పుడే ఆఊరి ఆర్ ఎం పి డాక్టరు ప్రధమ చికిత్స చేసి సుమోలో ప్రొద్దుటూరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటలుకు చేర్చారు బలరాంను.


సరిగ్గా నెల రోజులకు బలరాంను సంపూర్ణ ఆరోగ్యంతో "పులిని చంపిన వీరునికి జై" అంటూ ఊరేగింపుగా ఊరిలోకి తీసుకొచ్చారు ఊరి జనం. ఏమైతేనేం ఊరికి పులి బాధ తప్పింది.

కొసమెరుపు ఏమిటంటే విష్ణుప్రియ నెల తప్పడం. దానితో బలరాం తల్లిదండ్రుల అత్తమామల సంబరం అంబారం తాకింది. ఊరిజనం ఉత్సాహం ఉప్పెనైంది.

------------

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.


26 views0 comments

Comments


bottom of page