క్షమించు అమ్మా! మన్నించు నాన్నా! పార్ట్ 2
- Feb 22
- 6 min read
Updated: Feb 27
#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #క్షమించుఅమ్మామన్నించునాన్నా, #తెలుగుపల్లెకథలు, #TeluguHeartTouchingStories

Kshaminchu Amma Manninchu Nanna - Part 2/3 - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah Published In manatelugukathalu.com On 22/02/2026
క్షమించు అమ్మా మన్నించు నాన్నా- పార్ట్ 2/3 - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
జరిగిన కథ:
రైతు దంపతులు మాధవయ్య, జానకమ్మలు తమ కొడుకు రాంప్రసాద్‌ను అల్లారుముద్దుగా పెంచుతారు. సినీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంప్రసాద్ తల్లిదండ్రులను చులకనగా చూసి అవమానిస్తాడు. కొడుకు ప్రవర్తనతో మనసు నొచ్చుకున్న మాధవయ్య, జానకమ్మ దంపతులు రాజన్న (జానకమ్మ సోదరుడు) వద్దకు చేరుకుంటారు.
ఇక క్షమించు అమ్మా! మన్నించు నాన్నా! పార్ట్ 2 చదవండి.
దాంతో మాధవయ్య గుండె పగిలి నీరైంది. "అట్లా అంటాడని నేను ఊహించలేదు. ఎంత మాట అన్నాడు! అనడానికి ఎట్లా నోరాడింది! వాడిని ప్రాణం పెట్టి పెంచాం. వాని ఎదుగుదలకు పునాదులు వేయడానికి ఎంతో కష్టపడ్డాం. మేము వేసిన పునాదులపై భవనాన్ని నిర్మించుకొని, ఇప్పుడు నన్ను ఇల్లు దాటంటాడా? 'ఛీ!' వీడింట్లో క్షణం కూడా ఉండకూడదు" మాధవయ్య అనుకుంటుండగానే జానకమ్మ పెరట్లో ఉతికిన బట్టల్ని దండెం మీద ఆరేస్తూ రాంప్రసాద్ మాటలు విని 'వింటి నుండి వదిలిన బాణంలా' సర్రున మాధవయ్య, రాంప్రసాద్‌ల ముందుకు వచ్చింది.
"ఏరా! కళ్ళు నెత్తికెక్కాయా! ఒళ్లు కొవ్వు పట్టి బలిసి మాట్లాడుతున్నావా! మాకు పుట్టి, మేం పెంచితే పెరిగి, మా సొమ్ముతో చదివి, మా కష్టంతో ఎదిగి, మమ్మల్నే అనరాని మాటలు అంటావా! నీపై ఎంత అభిమానం చూపించాం! ఎంతగా ప్రేమగా పెంచాం! తల్లిదండ్రులన్న గౌరవం లేకుండా ఇంతగా అంటావా! నా ఇల్లు దాటి పోండి, అంతో ఇంతో మీ ముఖాన కొడతా అన్నావు కదా! ఎంత ఇస్తావో ఇవ్వు! నిన్ను కని పెంచాం, పెద్ద చేశాం, నీ ఎదుగుదలకు ఊరిలో ఇల్లు, కళ్లం దొడ్డి, రెండు ఎకరాల పొలం అమ్మినాం. అన్నీ లెక్కగట్టి ఏమి ఇస్తావో ఇవ్వు! నీ ఇంట్లో క్షణం కూడా ఉండం" ఆవేశంతో భద్రకాళిలా ఊగిపోయింది జానకమ్మ.
"అన్నిటినీ కలిపి కోటి రూపాయలు ఇస్తాను. నా ఇల్లును వదిలి పోండి." కసురుకున్నట్లుగా అన్నాడు రాంప్రసాద్.
"ఇచ్చేయ్, పోతాం!" అంతే కఠినంగా అన్నారు భార్యాభర్తలు ఒకే మాటగా.
హైదరాబాదులోనే ఉన్న తన తమ్ముడు రాజన్నకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పి బాడుగకు ఇల్లు చూడమంది జానకమ్మ.
"అక్కా! మన ఇంటి పక్కనే ఇల్లు ఖాళీ అయింది. నువ్వు, బావా రాండి. నేను ఇల్లు బాడుగకు మాట్లాడుతాను" అన్నాడు రాజన్న.
ఇంతలోపల కోటి రూపాయలు బ్యాగ్‌లో పెట్టి మాధవయ్యకు ఇచ్చి "ఇంకా నా ఇంటి పక్కకు రాకండి" గద్దించినట్లు చెప్పాడు రాంప్రసాద్.
"ఇంకానా! నీ ఇంటికి రావడమా! నీ ముఖం కూడా చూడం" అని ఆటో ఎక్కి బావమరిది ఇంటికి పోయాడు మాధవయ్య జానకమ్మతో కలిసి.
రాంప్రసాద్ భార్య సుజిత తనకు ఎంత బాధగా ఉన్నా భర్త ఆవేశం చూసి ఏమీ అనలేక ఊరక చూస్తూ ఉండిపోయింది. తర్వాత ఫోన్ చేసి "భర్త ఆగడాన్ని అడ్డుకోలేని తన బలహీనతను క్షమించండి మామయ్యా!" అని కోరింది సుజిత.
"వాడు ధనమదంతో ఉన్నాడమ్మా. ఈ పరిస్థితుల్లో ఎవరి మాట వినడు. అహంకారం అణిగాక అర్థమవుతుంది వాడు ఏం కోల్పోయాడో. అంతవరకు వేచి ఉందాం. నువ్వేం బాధపడకు. వాణ్ణి ఒక కంట కనిపెట్టుకుని ఉండు సుజితా!" సమాధానపరిచాడు మాధవయ్య.
ధనం పెరిగితే మదం పెరుగుతుంది అన్నట్లుగా రాంప్రసాద్ పెట్రేగి పోతున్నాడు. చేసే పనుల్లో నిర్లక్ష్యం, తనతో పనిచేసేవారిని అవమానించడం వల్ల టెక్నిషియన్స్ వెళ్లిపోవడం, సినిమా కథను ఎంచుకోవడంలో శ్రద్ధ లోపించడం, షూటింగ్‌లో ఏకాగ్రత లేకపోవడం వలన పతనం ప్రారంభమైంది.
రాంప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమా తొలిసారిగా ఏ లాభం లేకుండా గట్టెక్కింది. దాని తరువాత పిక్చర్ ఫ్లాపే అయింది. దానితో నిర్మాతలకు అతని ప్రతిభ మీద అనుమానం మొదలైంది. కమిట్మెంట్ అయిన ఒక సినిమా షూటింగ్ ముగించుకుని రిలీజ్ అయింది. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక నిర్మాతలకు రాంప్రసాద్ నైపుణ్యంపై నమ్మకం పోయి అగ్రిమెంట్లు రద్దు చేసుకున్నారు. రాంప్రసాద్ మీద విపరీతమైన నమ్మకం ఉన్న ఒక నిర్మాత ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా అపజయం పాలైంది. ఇప్పుడు రాంప్రసాద్ దగ్గర ఒక్క సినిమా కూడా లేదు. నిర్మాతలందరూ ఒక్కసారిగా రాంప్రసాద్‌ను దూరం పెట్టారు. రాంప్రసాద్ అహం దెబ్బతింది. దానితో రాంప్రసాద్ సొంతంగా "మనోరమ" అనే ఒక బ్యానర్ స్థాపించి తన దగ్గర ఉన్న నగదు, బంగారంతో ఒక సినిమా నిర్మించాడు. అది విజయం సాధించలేకపోయింది. తన భవనాన్ని, వివిధ వెంచర్లలో కొన్న ప్లాట్స్‌ను అమ్మి మరో చిత్రం భారీ అంచనాలతో తీశాడు. అది కూడా అపజయాన్ని చవిచూసింది. ఇక చిల్లిగవ్వ చేతిలో లేకుండా నిస్సహాయకుడిగా నిలిచిపోయాడు రాంప్రసాద్.
సుజిత భర్తతో "చేసే పనిపై శ్రద్ధ పెట్టమని, కర్తవ్యం పట్ల నిర్లక్ష్యం తగదని, అందరితో మంచిగా మర్యాదగా ఉండమని" చెప్తూ వచ్చింది. ఆమె మాటలను పెడచెవిని పెడుతూ వచ్చాడు రాంప్రసాద్. ఇక భర్త విపరీత ప్రవర్తనకు విసికిపోయి తప్పనిసరై కొడుకును, కూతురును వెంటబెట్టుకొని పుట్టిల్లు చేరింది భార్య సుజిత.-----ఒక రోజు రాంప్రసాద్ మాసిన గడ్డంతో, మురికి దుస్తులతో, పెరిగిన క్రాప్‌తో, కాళ్ళకు చెప్పులు లేకుండా మేనమామ రాజన్నకు అమీర్‌పేటలో కనిపించాడు. వాడి దీనస్థితికి జాలి పడ్డాడు రాజన్న.
"ఏరా రాంప్రసాద్! ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు రా! ఇలాంటి పరిస్థితికి కారణం ఇప్పటికైనా తెలిసిందా!" అడిగాడు.
"తెలుసుకున్నా మామా! నా అహంకారమే, అహంభావమే కారణం. నా ప్రవర్తన వల్ల ఐశ్వర్యం పోయింది, ఆలుబిడ్డలు పోయారు, అమ్మానాన్నలను వెళ్ళగొట్టాను. ఇప్పుడు హీనమైన దీనస్థితిలో ఉన్నాను మామా!" విలపిస్తూ అన్నాడు.
"రాంప్రసాద్! మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం రారా!" రాజన్న పిలిచాడు.
"నేను వారి పట్ల చేసిన దుర్మార్గానికి, అపరాధానికి నా ముఖం వాళ్లకు చూపించలేను మామా!"
"ఎలాగైనా నిన్ను కనిపెట్టి పిలుచుకు రమ్మన్నారు మీ అమ్మానాన్నలు. లేకపోతే మేము అన్నం నీళ్ళు మానేస్తామన్నారు" అని చెప్పి బలవంతంగా రాంప్రసాద్‌ను అక్కాబావల దగ్గరకి లాక్కుని పోయాడు రాజన్న.
రాజన్నతో వచ్చిన కొడుకును చూసి గుండెలకు హత్తుకున్నారు తల్లిదండ్రులు. "ఏంటి నాయనా! రాజాలా ఉన్నవాడివి ఇలా ఎలా అయిపోయావు. ఏం జరిగింది?" బాధ పడుతూ అడిగారు తల్లిదండ్రులు.
"మీ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన దానికి భగవంతుడు విధించిన శిక్షమ్మా ఇది. ఏమీ లేనివాడికి అతి కొద్ది కాలంలోనే ఊహించని ఐశ్వర్యం అందేసరికి కన్నుమిన్ను కానక ప్రవర్తించాను. ఫలితంగా సమస్తం పోయి శూన్య హస్తాలతో నిలిచాను. భార్య కూడా పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది." దుఃఖపడుతూ చెప్పాడు రాంప్రసాద్.
"నువ్వు సుఖంగా ఉంటే చాలు అనుకొని వచ్చాం. ఇలా అవుతుందని అనుకోలేదు. బాధపడకు నాయనా" అని స్నానం చేయించి, భోజనం పెట్టి, ఇంటిపైన ఉన్న బెడ్‌రూంలో విశ్రాంతి తీసుకోమన్నారు తల్లిదండ్రులు.
"ఇంత చేసినా నా తప్పును క్షమించినారు. నన్ను క్షమించు నాన్నా! మన్నించు అమ్మా!" అంటూ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడిపోయాడు కొడుకు.
"రాంప్రసాదూ! జీవితం అన్నాక వడిదుడుకులు ఉంటాయి, తప్పు ఒప్పులు జరుగుతాయి, సమస్యలు వస్తుంటాయి. అన్నింటినీ సమన్వయ పరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. నువ్వు ఇప్పటికైనా దృష్టి పెట్టి ఆలోచించు! ఏమి చేయడం వల్ల పతనం అయ్యాను. ఏమి చేస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అని యోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో!" అని చెప్పి విశ్రాంతి తీసుకోమన్నారు.
మరుసటి రోజు మాధవయ్య, జానకమ్మ, రాజన్న, అతని భార్య మంగమ్మ రాంప్రసాద్‌ను కూర్చోబెట్టుకొని ఇక ముందు ఎలా ముందడుగు వేయాలి అనే విషయం మీద చర్చించారు.
"చూడు! రాంప్రసాదూ! జొన్నచేలో పోగొట్టుకొని సజ్జచేలో వెతికితే ప్రయోజనం లేదు. పోయిన చోటే వెతికితేనే ఫలితం ఉంటుంది. కాబట్టి నీవు మళ్లీ సినిమా తీయడానికి ప్రయత్నించు! అయితే ఈసారి కొత్తగా, తీక్షణంగా ఆలోచించి ఒక మంచి కథ రాసుకో! అది రొటీన్‌కు భిన్నంగా ఉండాలి. రాయలసీమ పల్లె కథైతే సరికొత్తగా ఉంటుంది. కథలో సీమ ఆచార సాంప్రదాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు, తిరునాళ్ళు, జాతరలు, జానపదాలు, ఏలపాటలు, సీమకు సంబంధించిన చెక్కభజన, కోలాటం పొందుపరచు. సీమ యాస, సీమ మాండలిక పదాలతో కూడిన సంభాషణలు బాగుంటాయి. తాగునీటి, సాగునీటి సమస్యలు, కరువులు, వలసలు కథలో భాగమై ఉండాలి. సమస్యల సాధనకు ఉద్యమించే కథానాయకుడు. అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విషయాల్లో సహకరించే కథానాయిక హుషారైన జోడిగా ఉండాలి. అలాంటి కథ రాసుకో రాంప్రసాద్. తప్పక ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది." చెప్పడం పూర్తి చేశాడు మాధవయ్య.
"కథ రాయడానికి కొత్త చూపును అందించావు నాన్నా! నేను పుట్టిన కడప ప్రాంతమే నా కథా క్షేత్రంగా చేసుకుని కథ రాస్తాను."
"మనసును నిర్మలంగా ఉంచుకొని కథ రాయి రాంప్రసాద్. కథ మంచిగా వస్తుంది" రాంప్రసాద్ తల్లి చెప్పింది.
"అలాగే అమ్మా! అని సరే, సినిమా తీయడానికి డబ్బులు ఎట్లా?" అనుమానం వ్యక్తం చేశాడు రాంప్రసాద్.
"అల్లుడూ! బ్యాంక్‌లో మీ డబ్బు ఉంది కదా, దానిపై తొంభై శాతం లోన్ ఇప్పిస్తాను. నేనూ కూడా ఒక యాభై లక్షలు దాకా సర్దుతాను. నువ్వు పెద్ద దర్శకుడివి కాబట్టి నీకు బాగా తెలిసిన నిర్మాతలందరి దగ్గర కథ చెప్పి కన్విన్స్ చేసి కొంత డబ్బు అప్పుగా అడుగు. కొంతే కాబట్టి కాదనలేక ఇస్తారు" మామ రాజన్న ఫైనాన్స్ విషయం సరళం చేసి చెప్పాడు.
"చూడు ప్రసాద్! ఈసారి తక్కువ బడ్జెట్‌లో సినిమా తీయ్. నువ్వు అగ్రశ్రేణి దర్శకుడివి కాబట్టి నువ్వు ఏమి చేసినా గొప్పగా అనుకుంటారు ప్రేక్షకులు. మీ లాంటి దర్శకుల సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి. మొత్తం పెట్టుబడి ఓపెనింగ్స్‌లోనే వచ్చేట్టు ప్లాన్ చేసుకో! ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అంతా కొత్తవారితో సినిమా తీస్తున్నట్లు, ఈ సినిమా ప్రయోగాత్మకంగా, ప్రయోజనాత్మకంగా ఉంటుందని ప్రకటించు! ప్రేక్షకుల్లో విపరీతమైన కుతూహలం నెలకొని సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
కడపజిల్లాలో అన్ని పాత్రలకు సరిపోయే రంగస్థల నటులు ఉన్నారు. వారికి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఖర్చులకు ఇస్తే చాలు. సినిమా అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా నటిస్తారు. ఇక హీరో విషయానికి వస్తే ప్రొద్దుటూరులో వెంకటసుబ్బయ్య చిన్న కొడుకు నరసింహప్రసాద్ ఉన్నాడు. అతను మంచి అందగాడు. బాడీబిల్డర్. మంచి డ్యాన్సర్ కూడా. కోలాటం, చెక్కభజన చక్కగా చేస్తాడు. అతన్ని హీరోగా తీసుకో! వీర రాఘవయ్య కూతురు ఇందుమతి చక్కని రూపవతే కాదు కూచిపూడి డ్యాన్సర్ కూడా. కాలేజి నాటకాల్లో నటించి బహుమతులు అందుకుంది. ఆమెను హీరోయిన్‌గా తీసుకో! టెక్నిషియన్స్‌తో మర్యాదగా ఉంటూ శ్రద్ధగా సినిమా నిర్మించు! తప్పక విజయం సాధిస్తుంది." దర్శకుడి కర్తవ్యాన్ని వివరించాడు మాధవయ్య.
"నాన్నా! అమోఘమైన దారి చూపించావు నాన్నా! సినీ పరిశ్రమ మీద ఇంత అవగాహన ఉన్న మిమ్మల్ని ఇంతకాలం నిర్లక్ష్యం చేసినందుకు క్షమించు నాన్నా! మీ సూచనలు, సలహాలు నూరు శాతం పాటిస్తాను." చెప్పి కార్యసాధనకు తన రూమ్‌కు వెళ్ళిపోయాడు రాంప్రసాద్.
నెల రోజులు కష్టపడి శ్రద్ధగా తండ్రి సూచనలు అనుసరించి ఒక అందమైన కథ రాసుకున్నాడు. మేనమామ సలహాలు పాటించి డబ్బు సమకూర్చుకున్నాడు. తండ్రికి కథ వినిపించి "భేషుగ్గా వచ్చింది" అనిపించుకున్నాడు రాంప్రసాద్.
"ఇక షూటింగ్ ఏఏ లోకేషన్లలో జరిపితే బాగుంటుంది నాన్నా!" రాంప్రసాద్ అడిగాడు మాధవయ్యను.
"ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకోని ప్రాంతాలు కడపజిల్లాలో చాలా ఉన్నాయి. గండికోట, సిద్ధవటం కోట, పెన్నా లోయ, పాపాఘ్ని, బాహుదా నదుల మలుపులు, గువ్వలచెరువు కనుమ, కదిరి కనుమ, సాణిపాయ కనుమ, చిట్వేలు రాపూర్ ఘాట్ రోడ్డు, గూండాలకోన జలపాతం, గుంజనా జలపాతం, పాలకొండ జలపాతం, మైలవరం ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టు ఏకోపార్క్, చెప్పలి తిరునాళ్ళు, పుష్పగిరి తిరునాళ్ళు, విడుపులపాయ, లంకమల అడవులు, శేషాచల పర్వత సానువులు, కే.సి. కెనాల్ కింద ఉన్న పచ్చటి మాగాణి భూముల్లో షూటింగ్ చేస్తే చాలా కొత్తదనంగా ఉంటుంది." షూటింగ్ లోకేషన్స్ జాబితా తెలిపాడు మాధవయ్య.
============================================
ఇంకా వుంది
===============================================
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను




Comments