top of page

సిలికేరు సెట్టు


'Silikeru Settu' New Telugu Story

Written By Mukkamala Janakiram


రచన: ముక్కామల జానకిరామ్


అలా జరక్కుంటే బాగుండు కానీ ఎన్నడ్లేంది కళ్ళలో భయం,శరీరంలో ఒణుకు,మాట తడబడ్తుంది.ఆ సీకట్లనే గొంగడి భూజానేస్కొని దబ్బ దబ్బ ఇంట్లెకొచ్చి కాల మంచం మీద కూలవడ్డడు అడిమయ్య.

తన భార్య లచ్చమ్మ’ ఏందయ్య ! ఒళ్లంతా సెమటలు. కల్లం కాడ పడ్కుంటని పోయి అప్పుడే ఒస్తివ’ని భుజాన్ని తట్టింది.ఒక్కపాలే సోయిలోకి ఒచ్చిండు అడిమయ్య.

అంతకు ముందే శానా రోజుల్నుండే ఆ గూడెంలో జనాలు భయపడ్తుర్రు వింత సప్పుళ్ళతో, అరుపులతో. మంత్రాలు సేసేటోళ్ళని కొందరు, దయ్యాలు తిరుగుతున్నయని కొందరు ఊరంతా గుసగుసలే. ఎవరి నోట ఇన్నా ఈ ముచ్చట్లే.

గూడెం మజ్యలో బడి. దాంట్లో పెద్ద సిలికేరు సెట్టు. పొద్దస్తమానం పిల్లలు దాని మీదే ఆటలు పాటలు. వాళ్లకు అమ్మైంది ఆ సెట్టు.

అడిమయ్య ఆ రాతిరి ఇంటికి ఒస్తుంటే బడి దగ్గెర్కి రాంగనే ఇంత అర్పులు ఇనవడ్డయి. అంద్కెనేమో ఆరోజు అడిమయ్య ఒళ్ళు దర్సుకుంది.

గూడెం సీకటైతే సాలు తలపులన్నీ బేడాలు ఏస్కొని నిట్టూర్పు తీస్తున్నయి. గూడెం లో ఊర కుక్కలు,పిల్లుల తిరుగుడే తప్ప పిల్లల తిరుగుడు కంటికి కనవడ్తలే. జనాలు ఉన్న మాటే గాని కుక్క అర్పులు ఇన్న,గాలి సప్పుడు ఇన్న గుండెలు అరచేతిలో వెట్కొని కాలాన్నీడుస్తున్నరు. ఇంకొంతమందైతే ఊర్నొదిలి సుట్టాల మార్గం పట్టిర్రు.

గూడెంలో పేరుమోసిన ఓ పెద్దమనిషి ఒక సామీజీని(దేశ గురువు)పిల్పించి పటేల్ అరుగుల మీద మీటింగ్ ఎట్టిండు. ఊరంతా కలిసి పైసలన్ని పోగేసి స్వామీజీకి కట్నకానుకలు ఇచ్చుకొని ఊరంతా కలియ తిప్పిర్రు.

స్వామీజీ సెప్పిన మాటొక్కటే ఊరి బొడ్రాయి ఊరు కు దూరంగుంది. బొడ్రాయిని ఊరు మజ్యలో పెట్టి పూజలు, యగ్నాలు, యాగాలు మూడ్రోజులు సేయాలని సెప్పిండు. బడిలోనే మకామేసి యగ్నాలు, యాగాలు జరుపుతుండు స్వామీజీ .గూడెం జనమంతా సుట్టాలను పక్కాలను పిల్సుకుని పెద్ద పండగ సేసుకుంటుర్రు. ఉంటామో పోతామో తెలియని భయానికి ఉన్న కోళ్ళను, గొర్లను కోసుకొని పండగ జేసిర్రు.

ఆ ఆరం రోజులు మంచిగ సాగినై ఆళ్ళ జీవితాలు. స్వామీజీ సంచి నింపుకొని ఎళ్ళిండు. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంత అర్పులు, సప్పుళ్ళు. మళ్ళీ భయం ఊరు ప్రజల్లో. ఏమి సేయాలో తోస్తలే. పసిపిల్లలైతే గజ గజ ఒణుకుతుర్రు.పెద్దలకు ఏమీ పాలుపోని స్థితి. ఊరి పెద్దమనిషి సేతులెత్తేశాడు. ఆ గూడెంలో ఉన్న యువకులు పున్నయ్య, ఈరయ్య, కిష్టయ్య, రవయ్య నల్గురు కల్సి ఈ గూడెం మోడు కావాల్సిందేనా అని ఒకటే మదనపడుతున్నరు.

మన తాతల అరుగుల మీద ముచ్చట్లు,పిల్లల ఎన్నెల కుప్పల ఎలాయిల ఆటలు,సిలికేర్ సెట్టెక్కిన అల్లరి పిల్లల కోతి కొమ్మచ్చి ఆటలు,అమ్మలక్కలు సప్పట్లు,పెద్దవాళ్ళ బాగోతాలు, రామ భజనలు,యువతుల కోలాటాలు,ఎన్నెల ఎలుతుర్ల ముక్కుగిచ్చుడు ఆటలు ఇయన్నీ సూడమా అన్కుంటూ ఆలోచన్లో వడ్డరు.

రాతిరి ఐందంటే సాలు తలుపులు బిగించుకొని" బోసి వొయిన అవ్వ నోరులా ఉంది మా ఊరు" అన్కొని ఎలాగైనా దీన్ని సంగతి సూడాలన్కొని ఆళ్ళంత మాట్లాడుకుంటున్రు.

ఒక రాతిరి సేతిలో బ్యాటర్లతో అద్ధ రాతిరి పన్నెండు గంటలు కావొస్తోంది.నక్కల ఊలలు,కుక్కల ఏడ్పులు,పక్షుల అర్పులు,ఆపై సళ్ళని గాలి భయంకరంగా ఉంది ఆ ఊరి ఆతావర్నం.జనమంతా భయం భయంతోనే నిద్రలోకి జారుకుర్రు."ఏకువ మబ్బోలే గూడేన్ని కప్పిన మంచోలే" దైర్నాన్ని కూడగట్కోని బ్యాటర్ల ఎలుతురులో సీకటి దారుల్లో ఊరంతా తిరుగుతూ బడి వద్దకు సేరు కుర్రు .ఒక్క పాలే ఇంత ఇంత అర్పులు ఇనిపించినై . ఒకల్నొకలు ఈపి సర్సుకొని ముందుకు పోతుర్రు.కిష్టయ్య ఎనకడుగు ఎయ్యంగనే కాల్కి ఏదో గట్టిగా తాకింది.గుండె ఒక్కపాలె జారినట్లు ఐంది. అసల్కే సిమ్మ సీకటి పైంగ అరుపులు ఎనక్కి తిరిగి సూస్కుంటే ఆల్లు పొద్దుగాల కర్రబిల్ల(కిరికేటు) ఆడిన బండరాయి అది .

హమ్మయ్య!! అని ఊరిపి పీల్సుకుర్రు.

దైర్నం కూడగట్కొని ఆ సుట్టూ ఎంత ఎతికిన ఏమీ కనిస్తలే .బడి మొత్తం కలియ తిరుగుతుర్రు. సిలికేరు సెట్టు దగ్గరికి సేరుకుర్రు. ఒకరోకు ఇంత సప్పుళ్ళు, ఇంకోరోకు ఊరంతా నిషబ్ధాల సప్పుడు.సెట్టును మొత్తం బ్యాటర్లతో జల్లెడ పడుతుర్రు .సెట్ల సికారు కొమ్మల్లో రంగుల మెర్సినట్లు అన్పించింది.బ్యాటర్లన్ని ఒక దగ్గర వెట్టి ఎలుతురు పెంచిర్రు.అక్కడ తుమ్మెదలు కలుసుకుంటున్నప్పుడు ఆనుంచి ఒచ్చే, అవి సేసే అర్పులని తెల్సుకోంగనే ఆళ్ళ ముఖంలో బల్బులు ఎలిగినై. ఆటిని అక్కన్నుంచి అల్లించి సంబురంగ ఇండ్లకు సేరుకుర్రు.

ఈ ఇషయం తెల్సి అడిమయ్య, ఊరంతా ఊపిరోస్కున్నరు .

ఎప్పటిలాగనే సిన్న పిల్లల ఆటల్తో,తాతవ్వల ముచ్చట్లతో,రామ భజన్లతో , ఎన్నెల ఆటలతో ఊరంతా సింగారించుకుంది.

ఇంత దైర్నం సేసిన ఆ పోరగాల్లను ఊరి జనమంతా మెచ్చుకుర్రు.ఊరిప్పుడు కుషాళ్తో ఉంది.

పొద్దుగూకులు కళ్ళముందు తిరిగే తుమ్మెదలు ఎంతపని చేశాయని ముక్కునెలేస్కున్నరు గూడెం ప్రజలు.

సామీజీ సేసిన పనికి తిట్టిపోస్తూ ఎవరిపనిల ఆళ్ళు సంతోషంగా గడుపుతుర్రు.


https://www.manatelugukathalu.com/profile/janakiram/profile





88 views0 comments
bottom of page