భార్య - పార్ట్ 1
- Sudarsana Rao Pochampalli
- 2 hours ago
- 3 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #Bharya, #భార్య, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Bharya - Part 1 - New Telugu Story Written By Sudarsana Rao Pochampally Published in manatelugukathalu.com on 13/02/2026
భార్య - పార్ట్ 1 - పెద్దకథ మొదటి భాగం
రచన : సుదర్శన రావు పోచంపల్లి
శ్రీకంఠ ఆ రోజు పనులన్నీ ముగించుకొని, సలక్షణంగా సాపాటు చేసి, తాంబూలమేసుకొని, నిమ్మళంగా వాలుకుర్చీలో కూర్చుని, చేతులు తలకింద పెట్టుకొని, కాళ్లూపుకుంటూ, అప్పుడప్పుడు కండ్లు తెరుస్తూ మూస్తూ, నిదురమత్తులో జారుకునేవాని మాదిరిగా ఏదో ఆలోచిస్తున్న ధోరణిలో ఉంటాడు.
అతని చిరకాల స్నేహితుడు భవభూతి. భవభూతి ఉండేది ఉద్యోగరీత్యా స్థిరపడ్డ ప్రదేశము, శ్రీకంఠ ఉండే చోటుకు దూరమే.
శ్రీకంఠ, భవభూతి ఇద్దరూ విశ్రాంత ఉద్యోగులే. ఇద్దరికీ మిత సంతానమే అయినా, శ్రీకంఠకు ఇద్దరు ఆడపిల్లలైతే (శ్రావణి-చతుర), భవభూతికి ఒక కొడుకు (జయంత్), ఒక బిడ్డ (అక్షర).
ఇద్దరి పిల్లల చదువులు, పెండ్లిండ్లూ అయిపోయి, పిల్లలందరూ ఇతర దేశాలకు వెళ్లిపోయారు.
ఇక్కడ శ్రీకంఠము భార్య సత్యవతితోనూ, అక్కడ భవభూతి సతీమణి భవానితోనూ ఇద్దరిద్దరే నివసిస్తుంటారు.
ఒకసారి కండ్లు తెరిచి చూడగా, ఒక్కసారే ఎదురుగా భవభూతి-భవాని కనబడడంతో ఉలిక్కిపడ్డట్టు లేచి, "ఓహోహో! ఎన్నాళ్లకెన్నాళ్లకు మీ హఠాద్దర్శనము!" అంటూ ఆప్యాయంగా భవభూతిని కౌగలించుకొని, "బాగున్నావా భవాని?" అని పలకరిస్తూ, పగటి నిద్రకుపక్రమిస్తున్న భార్య సత్యవతిని పిలిచి, "ఎవరొచ్చారో చూడు!" అని సంబరపడుతూ వారి రాకను తెలియపరుస్తాడు శ్రీకంఠ.
సత్యవతి కూడా సంబరపడుతూ భవానిని కౌగలించుకొని, కుశల ప్రశ్నలు వేస్తూనే, "ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనము సిద్ధము చేస్తాను. ఇప్పటికే చాలా పొద్దుపోయిందంటూ" లోనికి ఆహ్వానిస్తుంది, "రండి అన్నయ్యా, వదినా" అని సంబోధిస్తూ.
ఎంతో అభిమానంతో భార్య సత్యవతి, మిత్రుడు భవభూతి, అతని భార్య భవాని భోజనము చేసి ముగించే వరకు వారి ప్రక్కనే కూర్చొని, వారి వారి పిల్లల యోగక్షేమాలు ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు.
భోజనము చేసిన తరువాత, "మీరు సుదూర ప్రయాణము వల్ల చాలా అలిసిపోయినట్టున్నారు. ప్రస్తుతం మీకు కొంత విశ్రాంతి అవసరము" అంటూ భార్య సత్యవతికి ఆ సంగతి తెలుపుతున్నట్టు చూస్తాడు శ్రీకంఠ.
సత్యవతి వాళ్ళకు విశ్రాంతికి ఏర్పాటు చేస్తుంది.
కాస్త నిద్రలో జారుకొని, వచ్చీ రాని నిద్రతో ఒక గంట సమయము అటూ ఇటూ పొర్లుతూ అలసట తీర్చుకున్న భవభూతి, భవాని లేచి అర్రలోనుండి ఇవతలికి వచ్చే వరకే సత్యవతి చాయ చేసి ఉంచుతుంది. చాయ త్రాగి, ఆ మాటా ఈ మాటా మాట్లాడుకుంటుండగా, ఒక్కసారే కండ్ల నీళ్ళు పెట్టుకుంటాడు భవభూతి. అది చూసిన శ్రీకంఠ ఒక్కసారే ఉలిక్కిపడి, "స్నేహితునికి ఎందుకో ఈ దిగులు?" అనుకుంటూ తాను కూడా గద్గద స్వరముతో, "ఏమిటి భవభూతి, ఉన్నట్టుండి అంత విచారమెందుకు?" అని అతని భుజము మీద చేయివేస్తూ అనునయించినట్టుగా అడుగుతాడు శ్రీకంఠ.
"ఏమీ లేదు... జీవితము ప్రశాంతంగా నడుస్తున్నదని సంబరపడితే, అక్కడ మా అల్లుడు కార్తీక్ నా బిడ్డ అక్షరను లక్షణంగా చూసుకుంటాడనుకొని, విదేశములో ఉద్యోగము, మంచి సంప్రదాయ కుటుంబము, ఇంకేం పర్వాలేదనుకొని మేమిద్దరం సంతోషంగా కాలం గడుపుతుంటే, అశనిపాతం లాంటి వార్త" అంటూ ఇంకా కుమిలిపోతుంటాడు భవభూతి.
అతన్ని ఓదార్చే క్రమంలో, ఇంకా దగ్గరికి జరిగి శ్రీకంఠ భవభూతి వీపు పై చేయి వేస్తూ, "కాస్త స్థిమితపడు భవభూతీ! అంత కష్టమేమొచ్చింది? మేము లేమా? అసలు విషయమేమిటి? నిన్ను ఇంత బాధకు గురిచేసిన ఆ సంఘటనేమిటి?" అని అడుగుతూ, "నువ్వైనా చెప్పమ్మ భవానీ!" అని భవాని వైపు తిరుగుతాడు శ్రీకంఠ.
భవభూతికి తోడు భవాని కూడా విచార వదనముతో కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, "ఇంతకాలము మేమెంతో సంతోషంగా కాలం గడుపుతూ అదృష్ట దేవత మా ఇంట్లోనే కొలువై ఉన్నదనుకున్నాము. కాని మొన్న అక్షర ఫోన్ లో చెప్పి దాని బాధలు వివరిస్తుంటే ఆ మాటలు కూడా వినలేక పోయాము" అని మళ్ళీ కుమిలిపోతూ, "నా బిడ్డ అక్షరను మా అల్లుడు కార్తీక్ పెట్టే హింసలు ఏమని చెప్పాలి? అదీ ఈనడుమే ఏం శని పట్టిందో ఏమో! బిడ్డకు మొగుడు పెట్టే యాతనలు ఇంతా అంతా కావట! లేస్తే కొట్టుడు, కూచుంటే కొట్టుడు, లేనిపోని అభాండాలు వేయడం, అనుక్షణము నరకము చూపిస్తున్నాడట! 'ఇక నేను బ్రతకలేను' అంటూ నా బిడ్డ ఏడుస్తూ చెబుతుంటే నా గుండె తరుక్కు పోయింది.
పోయి నా బిడ్డను ఇక్కడికి తీసుకు వస్తామనుకుంటే దగ్గర కాదాయె! ఆ దుర్మార్గుడు పంపడాయె!" అని మళ్ళీ కుములుతుంది భవాని.
"లేక లేక పెళ్ళైన చాలా కాలానికి నాలుగు నెలల క్రింద నీళ్లు పోసుకుంటే ఆ పాపిష్ఠోడు కడుపు కూడా తీయించి వేసిండట! ఇంత ఘోరమెక్కడైనా ఉంటదా? ఇంత కాలానికి ఆ భగవంతునికి మా మీద ఇంత నిర్దయ ఎందుకు కలిగిందో!" అని వాపోతుంది భవాని.
ఇంకా ఉంది..
భార్య - పెద్దకథ రెండవ భాగం త్వరలో
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
