top of page

కేస్ నెం 37 బి - పార్ట్ 2

Updated: Sep 17

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesinTelugu

ree

Case No. 37B - Part 2 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 12/09/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. 


శత్రువులనుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక పార్వతీపురం దాటి బెల్గాం లో గూడ్స్ రైలు ఎక్కింది.

ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 2 చదవండి.. 


బొర్రా గుహలు. 


ప్రకృతిలో మనిషికి అర్ధంకాని వింతలెన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతాలున్నాయి. ఇలాంటి అద్భుతాల్లో సహజసిద్ధమైన బొర్రాగుహలు కూడా ఒకటి. తూర్పు కనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. పురాతత్వ, జంతుశాస్త్ర, శిలాజ పరిశోధకులకు విందు భోజనం. లక్షల సంవత్సరాల కిందటే ఈ గుహలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వీటిని 1807 లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. 


తెలుగులో 'బొర్ర ' అంటే రంధ్రం అని అర్థం. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియమ్ బై కార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వలన నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్‌మైట్స్ అని అంటారు. అదే విధంగా పైకప్పు నుండి కారే నీరు ఘనీభవించి స్టాలక్టైట్స్ అనేవి ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్‌మైట్స్, స్టాలక్టైట్స్ వింతవింత ఆకృతులలో రూపుదిద్దుకుంటాయి. యాత్రికులు, స్థానికులు వారి వారి ఊహాశక్తిని బట్టి వీటికి రకరకాల పేర్లు పెడుతుంటారు. 


ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్రా విశ్వ విద్యాలయానికి చెందిన ఆంత్రోపాలజిస్టులకు మధ్య రాతియుగ సంస్కృతికి చెందిన 30, 000 నుంచి 50, 000 సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ ఆది మానవులు నివసించినట్లు తెలుస్తోంది. స్థానిక గిరిజనులు బొర్రాగుహలను "బోడో దేవుడి" (పెద్ద దేవుడు) నివాసంగా నమ్ముతుంటారు. 


అంతటి అందాల గుహలలో ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ లభించే ఆధారాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు శ్యామ్ సుందర్ బృందం. శరత్ బొర్రాగుహల వద్ద బస్ దిగాడు. గైడ్లు చుట్టుముట్టారు. వారిని వద్దని వారించి, బొర్రా గుహల ప్రవేశద్వారం వైపు అడుగులు వేసాడు. 


లోపల పర్యాటకులను ఆకర్షించడం కోసం రంగురంగుల విద్యుద్దీపాలను అమర్చారు. ఆ రంగుల కాంతులు మారుతూ ఉంటే కాసేపు బొర్రా గుహల అందాలను మైమరచి చూసాడు. పర్యాటకుల ఆనందం కోసం, ఆహ్లాదం కోసం ఏర్పాటుచేసిన వివిధ కాంతులు వెదజల్లే విద్యుద్దీప అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. వాటన్నిటినీ పరిశీలనగా చూస్తూ, లోపలికి, సందర్శకులను అనుమతించని స్థలం దాటి, తవ్వకాలు జరిగే ప్రదేశానికి చేరుకున్నాడు శరత్. 


దూరం నుంచే ప్రొఫెసర్ శ్యాం సుందర్ గారిని పోల్చుకున్నాడు శరత్. దగ్గరకు వెళ్లి ప్రొఫెసర్ ను పరిచయం చేసుకున్నాడు. అక్కడి పనులను మరొక సహాయకునికి అప్పగించి, శరత్ ని తీసుకుని బొర్రా గుహల బయటకు వచ్చాడు శ్యాం సుందర్. 


బొర్రా గుహల దగ్గర ఉండే కార్తీక పార్వతీపురం ఎందుకు వెళ్ళింది? అక్కడ అర్ధరాత్రి పరుగు పెట్టి గూడ్స్ రైలు ఎందుకు ఎక్కవలసి వచ్చింది? గూడ్స్ ఎక్కిన కార్తీక ఏమయ్యింది?

*********


"కార్తీక మా బృందంలో చురుకైన అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ చైతన్యం వెల్లివిరుస్తుంది. చలాకీగా, అందరిని హుషారు పరుస్తూ, గలగలా మాట్లాడుతూ, అందరినీ నవ్విస్తూ, చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటుంది. 


ఇక్కడ ఉండే రాళ్ళ మధ్యలో శిలాజాలు ఏమైనా లభిస్తాయేమో, వాటి ఆధారంగా ఈ గుహల వయస్సు ఇంకాస్త నిర్ధారణగా చెప్పవచ్చునని పరిశోధనలు చేస్తున్నాము. మరో నెల రోజులు మా పరిశోధనలు జరుగుతాయి. ఈలోగానే ఈ ఉపద్రవం వచ్చిపడింది. ” చెప్పాడు శ్యాంసుందర్. 


ఇద్దరూ బొర్రా గుహల నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న టీ దుకాణంలో కూర్చున్నారు. శరత్ టీ తాగుతూ మౌనంగా వింటున్నాడు. 


పర్యాటకుల జీపులు, కార్లు, బస్సులు వస్తూనే ఉన్నాయి. పర్యాటకుల సందడి కొనసాగుతోంది. చుట్టుప్రక్కల దుకాణాలు పర్యటకులలో నిండి ఉన్నాయి. పర్యాటకులలో టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి వచ్చేవాళ్ళతో అక్కడ ఉన్న చిన్న దుకాణాలు కిక్కిరిసి ఉన్నాయి.. ఇద్దరూ లేచి మరికొంచెం ముందుకు నడిచారు. 


అక్కడ ఓ దృశ్యం శరత్ ను ఆకర్షించింది. కొంతమంది స్త్రీలు వచ్చే జీపులను, కార్లను ఆపుతున్నారు. వారిదగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ స్త్రీల చుట్టూ కొందరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించాడు శరత్. 


శరత్ అటు చూడడం గమనించిన ప్రొఫెసర్ “అరకు లోయలో అత్యంత ప్రధానమైన ఆనందోత్సవం, చైత్ర మాసంలో జరుగుతుంది. చైత్ర పర్వం, లేక ఈటెల / ఇటికల/ ఇటిఙ/ చైత్ పరబ్ పండుగ సందర్భంగా ఈ ఆనందోత్సవం జరుగుతుంది. పండుగ రోజుల్లో పురుషులు ఈటెల తోనూ, విల్లంబులతోనూ జంతువులను వేటాడుతారు. చైత్ పరబ్ చైత్ర మాసంలో (ఆంగ్ల క్యాలెండర్‌లో మార్చి/ ఏప్రిల్) జరుపుకుంటారు. 


చైత్ర మాసం మొత్తం ఆదివాసీలు పండుగ వాతావరణంలో ఉంటారు, పొలంలో పనికి వెళ్లరు, వ్యవసాయం కోసం మట్టిని ముట్టుకోరు. సమర్ధులైన వ్యక్తులందరూ అడవిలో వేటకు వెళతారు. వారు వేట ముగించుకుని గ్రామానికి తిరిగి రాగానే దారిలో పసుపు నీళ్లతో మహిళలు స్వాగతం పలుకుతారు. పగటిపూట స్త్రీలు, పిల్లలు, వృద్ధులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూనే ఉంటారు. 


ఈ పండుగ సందర్భంగా ఎవరైనా బయటి వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశిస్తే వారి నుంచి జరిమానా వసూలు చేస్తారు. ఆ డబ్బుతో సాయంత్రం పండుగ చేసుకుంటారు. 


ఆరోజు బయటి నుంచి వచ్చే వాహనాలను ఆపి, స్థానిక మహిళలు జరిమానా వసూలు చేస్తున్న సందర్భంలో, సాయంత్రం ఆ ఉత్సవం చూడటానికి కార్తీక వెళ్ళింది. ఆ తర్వాత మరి కనిపించలేదు. స్థానికంగా అంతా వెతికాము. ఆ మర్నాడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. 


చుట్టుపక్కల ప్రాంతాలైన చాపరాయి, మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలతో సహా అన్నీ మా బృందం వెతికింది. పోలీస్ వారు లోయలో కూడా వెతికారు. ఆఖరుగా మీకు కూడా ఫిర్యాదు చేస్తే మంచిదని కామేశ్వరరావుకు ఫిర్యాదు చేసాను" నడుస్తూ వివరించేడు శ్యాం సుందర్. 


ప్రొఫెసర్ చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు శరత్. కార్తీక వెళ్లిన ప్రదేశాన్ని చూసారు. అనుమానించదగిందిగా ఏ విషయం తోచలేదు. తిరిగి తవ్వకాలు జరిగే ప్రదేశాన్ని చేరుకున్నారు. శ్యాం సుందర్ బృందంతో ఒకరోజు గడపడానికి నిశ్చయించుకున్నాడు శరత్. 


కార్తీక ఉండే టెంట్ నే శరత్ కి కేటాయించారు. ఆ రాత్రి శ్యామ్ సుందర్ అనుమతితో టెంట్ ను, కార్తీక వస్తువులను పరిశీలించాడు శరత్. కార్తీకకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది. చరిత్ర కూడా అధ్యయనం చేసినట్లు ఉంది. వివిధ రాజ్యాలు, రాజ వంశాలకు చెందిన పతాకాలు చిత్రించి ఉన్నాయి. డైరీలో కూడా ఎక్కువగా చిత్రాల లోనే దినచర్య రాసి ఉంది. ఇతర వివరాలు ఏమి లేవు. 


మరునాడు ఉదయం శరత్ స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి, తనను తాను పరిచయం చేసుకుని, కార్తీక కేసు విషయం, పరిశోధన వివరాలు అడిగి తెలుసుకున్నాడు. కార్తీక ఫోటో చూపించి, స్థానికులను ఆమె గురించి విచారించాడు శరత్. అందరూ ఉత్సవ సంరంభంలో ఉన్నారు. 


కార్తీక ఫోటోను పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా చూపించి ఓపిగ్గా విచారించాడు. ఒక చిన్నపిల్లవాడు కార్తీకను గుర్తుపట్టాడు. తల్లితో పాటు ఆ పిల్లవాడు కూడా గ్రామంలో ప్రవేశించేవారి జరిమానా వసూలు చేయడంలో పాల్గొన్నాడు. 


"ఈ అమ్మిని నాను సూసినాను. మాయమ్మ డబ్బులడుగుతూ ఉంటే సెల్ ఫోన్ లో ఫోటో తీసింది. నాను సూసినాను. " అన్నాడు. 


"నీ పేరు?" అడిగాడు శరత్.


"బిడ్డిక సోమ" అన్నాడు ఆ పిల్లవాడు. 


"చూడు సోమ, నువ్వు చదువుకుంటున్నావా?" అడిగాడు శరత్


"ఆఁ ఇస్కూల లో 5 వ తరవాతి" చెప్పాడు తనదైన యాసలో సోమ. 


"వెరీ గుడ్. నువ్వు సరిగ్గా చెప్తే నీకు చాక్లేట్ ఇస్తాను. నీ స్నేహితులకు కూడా ఇస్తాను" అన్నాడు శరత్. 


"ఆ యమ్మి ఫోటోలు తీస్తా ఉంది. కార్లు ఆగి ఉన్నాయి. కొన్ని కార్లకి కూడా ఫోటోలు తీసింది. అప్పుడు ఒక నల్ల కారులో వచ్చిన అబయి కారు దిగినాడు. ఆ యమ్మిని పిలుసుకు పోయినాడు. కారు లోకి లాగి కూర్సోపెట్టినాడు. కారు ఎనక్కి తిరిగి ఎలిపోయినాది" చెప్పాడు సోమ. 


పిల్లలందరికీ చాక్లెట్స్ కొని ఇచ్చి, ఆలోచనలో పడ్డాడు శరత్. నల్లకారు లో వచ్చినవారు ఎవరు? కార్తీకను ఎందుకు తీసుకువెళ్లారు? ఎక్కడికి తీసుకువెళ్లారు? కార్తీక వాళ్ళకి ముందే తెలుసా? కార్తీక ఫోన్ ఎందుకు పనిచేయడం లేదు? కార్తీక ఆపదలో ఉందా? కనీసం తానైనా శ్యాం సుందర్ గారికో, తన తల్లిదండ్రులకో ఫోన్ చేయవచ్చు కదా? 


ఎన్నో ప్రశ్నలు శరత్ బుర్రలో తిరుగుతున్నాయి. అరుకు వచ్చే దారిలో టోల్ గేటు దగ్గర ఆ కారు వివరాలు దొరుకుతాయేమో ప్రయత్నించాలి అనుకున్నాడు. మళ్ళీ వెనుకకు వెళ్లి, శ్యాం సుందర్ ని కలిసి, తాను ఇక్కడ చేయవలసింది ఏమి లేదని.. వైజాగ్ వెళ్లి ప్రయత్నిస్తానని చెప్పాడు. కార్తీక డైరీ అడిగి తీసుకున్నాడు. 


"కార్తీక తల్లిదండ్రులకు విషయం తెలుసా?" అని అడిగాడు. 


"కార్తీక కనబడడం లేదని నిశ్చయించుకోగానే మొదట వాళ్ళకే ఫోన్ చేశానని, వారు వచ్చాకే పోలీస్ రిపోర్ట్ ఇచ్చానని" చెప్పాడు శ్యాం సుందర్. 


విశాఖపట్నంలో కార్తీక తల్లిదండ్రుల చిరునామా, ఫోన్ నెంబర్ తీసుకుని బయలుదేరాడు శరత్. 

****

ఎండ చుర్రున తగలడంతో కార్తీకకు మెలకువ వచ్చింది. తాను ఎక్కడ ఉందో అర్ధం కాలేదు మొదట. కాసేపు గడిచాక నెమ్మదిగా ఒక్కో విషయం గుర్తుకువచ్చాయి. అర్ధరాత్రి రైలు పట్టాల వెంట పరుగు పెట్టడం, వచ్చిన గూడ్సు రైలు ఎక్కి కూర్చోవడం.. ఆ వెంటనే నీరసం వల్ల నిద్ర పట్టేయడం అన్నీ.. రైలు ఆగి ఉంది. ఇది ఏ ఊరో, ఏ స్టేషనో తెలీదు. మధ్యాహ్నం కాబోలు.. ఎండ ఎక్కువగా ఉంది. 


జేబులు తడుముకుంది. పదిరూపాయల నోటు మాత్రం ఉంది. ఆకలి, దాహం ఎక్కువగా ఉన్నాయి. ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉన్నాయి. లేచి నిలబడలేనంత నిస్సత్తువగా ఉంది. అయినా తప్పదు. లేచి నిలబడింది. నెమ్మదిగా తల ఒక్కటి బయటకు పెట్టి చూసింది. ఆఖరు పెట్టె కావడంతో ప్లాట్ ఫారం చేరుకోలేదు. బయట పెద్దగా జనాలు లేరు. ఓపిక చేసుకుని జాగ్రత్తగా పెట్టెలో నుంచి దిగింది. 


అటు ఇటు చూసుకుంటూ పట్టాలు దాటబోయింది. ఎదురుగా స్టేషన్ పేరు సూచిస్తూ విజయవాడ జంక్షన్ అనే బోర్డు కనిపించింది. ఎక్కడి పార్వతీపురం, ఎక్కడి విజయవాడ? మూతలు పడుతున్న కళ్ళను బలవంతాన తెరుస్తూ, తడబడే అడుగులతో పట్టాలు దాటింది. పైన ఎండ మండిపోతోంది. చుట్టూ ఎక్కడా నీటి జాడ లేదు. కాలి బాట మీదుగా నడక ప్రారంభించింది. దూరంగా పశువుల కాపరులు కనిపిస్తున్నారు. గట్టిగా అరిచి పిలిచే ఓపిక లేదు. చేయి ఎత్తి ఊపింది. ఎవరూ చూడలేదు. తిరిగి నడక కొనసాగించింది. 


ఎదురుగా ఎవరో వ్యక్తి సైకిల్ పై వస్తున్నాడు. ఆపమన్నట్లుగా చేయి ఎత్తింది. ఆ వ్యక్తి ఆగి, హఠాత్తుగా సైకిల్ వెనుకకు తిప్పి హడావిడిగా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి బండి మీద ఇద్దరు వ్యక్తులు వచ్చారు. కార్తీకను చూస్తూనే బండిని అడ్డంగా తిప్పి, అక్కడే ఉన్న ఒక పొదను ఢీ కొట్టి పడిపోయారు. వెంటనే లేచి, బండి తీసుకుని వెనుకకు తిప్పి, వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్లిపోయారు. 


ఎందుకలా హడావుడి పడ్డారో అర్ధం కాక చుట్టూ చూసింది. వారు పడిన చోట శీతల పానీయం సీసా పడి ఉంది. బహుశా వారి చేతిలో నుంచి పడిపోయి ఉంటుంది. తీసుకోకుండానే వెళ్లిపోయారు. ప్రాణం లేచి వచ్చినట్లైంది కార్తీకకు. వెళ్లి, సీసా అందుకుని గబగబా కాస్త తాగింది. ఏ మాత్రం తడి లేని గొంతు మండింది. కాసేపాగి మరో గుటక వేసింది. ముఖంపై కాస్త చిలకరించుకుంది. మిగతా పానీయం అంతా తాగి అలాగే ఆ పొద దగ్గర కూర్చుండి పోయింది. 


నాలుగు పశువులను తోలుకుంటూ ఒక పిల్లవాడు అటుగా వచ్చాడు. నీడన కూర్చున్న కార్తీకను చూసి "బాబోయ్ దెయ్యం" అని అరచుకుంటూ పరుగెత్తాడు. ఆ అరుపుకు బెదిరిన పశువులు కూడా పరుగులు తీశాయి. కార్తీక తన చేతులు చూసుకుంది. బొగ్గుపొడితో నల్లగా ఉన్నాయి. 


అప్పుడే గమనించింది, తన బట్టలు కూడా బొగ్గుతో నల్లగా మారి ఉన్నాయి. ముఖాన్ని తడిమి చూసుకుంది. శీతల పానీయంతో బంక బంకగా ఉంది. అరచేతులు నల్లగా అయ్యాయి. సైకిల్ మీద, బండి మీద వచ్చిన వ్యక్తులు ఎందుకు బెదిరిపోయారో అర్ధం అయ్యింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. లేచి ఆ కాలిబాట వెంబడే నడిచింది. కాస్త జనావాసాలు కనిపిస్తున్నాయి. 


ఒక పబ్లిక్ ఫోన్ బూత్ కనిపిస్తే అటు నడిచింది. అక్కడ కూర్చున్న వ్యక్తి బెదిరి చూసాడు. శీతల పానీయం వలన దాహం తగ్గకపోగా ఇంకాస్త పెరిగింది. దాహం అన్నట్లు సైగ చేసింది. బెదురుతూనే నీళ్ల సీసా అందించాడు. కొంచెం కొంచెంగా ఆ నీళ్లు పూర్తిగా తాగి, సీసా తిరిగి అందించి, నమస్కారం చేసింది. 


అతడు బెరుకు తగ్గి, "ఏం కావాలి?" అన్నాడు. 


ఫోన్ వైపు చూపించింది కార్తీక. 

"డబ్బులు.. డబ్బులున్నాయా?" అడిగాడు ఆ వ్యక్తి. 


జేబులో నుంచి పది రూపాయల నోటు తీసి అందించింది. "వెళ్ళు" అన్నాడతడు. లోపలికి వెళ్లి, తల్లి నెంబర్ కి ఫోన్ చేసింది. అటు నుంచి రింగ్ అవుతోంది. కానీ ఫోన్ ఎత్తలేదు. కాసేపు చూసి ఫోన్ పెట్టేసింది. తండ్రి నెంబర్ కు ఫోన్ చేసింది. నాలుగు రింగులు అయ్యాక కార్తీక తండ్రి ఫోన్ ఎత్తాడు. "హలొ" అన్నాడు. తండ్రి గొంతు వినగానే చెప్పలేనంత దుఃఖం వచ్చేసింది కార్తీకకు. గొంతు పూడుకుపోతుండగా "నాన్నా" అంది. కానీ కార్తీక తండ్రి సత్యనారాయణకు ఆ పిలుపు సరిగా వినబడలేదు. "ఎవరూ?" అన్నాడు. 


మళ్ళీ పిలిచి చెప్పేలోగా ఫోన్ బూత్ లో వ్యక్తి ఫోన్ బటన్ నొక్కేసాడు. "నువ్వు ఇచ్చిన డబ్బులకు టైం అయిపోయింది" అన్నాడు. 


కార్తీక నిస్సహాయంగా చూసింది. జేబులన్నీ వెతికింది. డబ్బులు లేవు. చేతులు జోడించింది. పిచ్చిదాన్ని చూసినట్లు చూసాడు ఆ వ్యక్తి. బయటకి పొమ్మన్నాడు. చేసేది లేక బయటకు వచ్చింది కార్తీక. 


ఆకలి, ఆవేదన, దుఃఖం ముప్పిరిగొనగా నాలుగడుగులు వేసి, నీరసంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది కార్తీక. 


========================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

2 Comments


@nagamanjarig1315

•4 days ago

ధన్యవాదాలండీ

Like

@రత్నమంజరి

•3 days ago

👍🏿

Like
bottom of page