ధర్మం కోసం
- Srinivasarao Jeedigunta

- Sep 10, 2025
- 7 min read
#DharmamKosam, #ధర్మం కోసం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Dharmam Kosam - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 10/09/2025
ధర్మం కోసం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
యింటి ముందు ఆగిన ఆటోలో నుంచి దిగి గేటు తీసుకుని వస్తున్న అమ్మాయిని చూసి “ఎవ్వరు కావాలి అమ్మాయి?” అని అడిగాడు చలపతి రావు.
“ఇది చలపతి రావు గారి ఇల్లే కదండీ” అని బెరుకుగా అడిగింది స్వప్న అనే ఆ అమ్మాయి.
“అవును” అన్నాడు చలపతి రావు. అప్పటి వరకు కొద్దిగా భయపడుతూ వున్న ఆ అమ్మాయి “కొద్దిగా లోపలికి నడవండి. మీకు కావలిసిన దానినే” అంటూ చనువుగా ముందుకు నడిచింది స్వప్న.
“నిన్ను నేను ఎప్పుడూ చూడలేదమ్మా, యిదిగో శారదా ఎవ్వరో అమ్మాయి వచ్చింది ఒకసారి వంటగదిలోనుండి బయటకు రా” అని భార్యని పిలిచాడు.
పెట్టె లోపల పెట్టి “అత్తయ్యా, నేనే వస్తున్నాను. మీరు అక్కడే వుండండి. మామయ్యగారికి టిఫిన్ చేస్తున్నట్టున్నారు..” అంటూ చనువుగా లోపలికి వెళ్తున్న స్వప్నని, “ఏయ్ అమ్మాయి.. ముందు నువ్వు ఎవ్వరో చెప్పకుండా ఈ అతిచనువు ఏమిటి, ముందు నువ్వు ఎవ్వరివి, మా యింటికి ఎందుకు వచ్చావు” అన్నాడు చలపతి గట్టిగా.
ఆ అరుపుకి వంటగదిలోకి వెళ్ళబోతున్న స్వప్న ముందు గదిలోనే ఆగిపోయి, “మీరు ముందు ఆలా కూర్చోండి, చెప్పటానికే వచ్చాను” అంది.
“ఆగవమ్మా నీ మర్యాద, ముందు నువ్వు ఎవ్వరు” అన్నాడు.
చలపతి నెత్తిన పిడుగు పడ్డట్టుగా అయ్యింది, ఆ అమ్మాయి అన్నమాట ‘మీ అబ్బాయి నన్ను మోసం చేసాడు’ అని విని.
వంటగదిలోనుంచి బయటకు వస్తో “మాకు అబ్బాయే లేడు. యింకా నిన్ను మోసం చెయ్యడం ఏమిటి?” అంది చలపతి భార్య శారద.
ముందు తెల్లబోయినా, భార్య తెలివితేటలకి మురిసిపోయాడు చలపతి. “అవునమ్మా. మాకు మగపిల్లలు లేరు. వుంటే యిక్కడ వంటరిగా మేము ఎందుకు వుంటాము, నువ్వు తప్పు అడ్రస్ కి వచ్చావు, సరైన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళు” అన్నాడు.
వాళ్ళ మాటలు విన్న స్వప్న చిరునవ్వు నవ్వుకుంటూ బ్యాగ్ లోనుండి రెండు ఫొటోస్ తీసి “ఇందులో వున్నవి మీరేనా?” అని చలపతి కి చూపించింది. వాటిని చూడగానే చలపతి మొహం నల్లబడి తెలియని వణుకు మొదలైంది.
ఇహ దబాయించి లాభం లేదు అనుకుని “అలా కూర్చో, నీ పేరు స్వప్న అన్నావు కదూ, నీ రాక అంతా స్వప్నం లా వుంది మాకు” అని, “యిదిగో అమ్మాయికి కొద్దిగా కాఫీ పట్టుకుని వచ్చి నువ్వు కూడా యిటు కూర్చో” అన్నాడు.
“యిప్పుడు చెప్పు స్వప్న. మా అబ్బాయి నిన్ను మోసం చేసాడు అన్నావు, ఎందుకు.. ఎలా.. వివరంగా చెప్పు. ఒక్క విషయం నీకు చెప్పగలను, ఈ వూరిలో మోతుబారి రైతు కుటుంబం మాది. ఆ విషయం నువ్వు మా ఇల్లు చూడగానే నీకు తెలిసివుంటుంది. మాకు ఒక్కడే కొడుకు, పేరు ఆదిత్య” అన్నాడు.
“ఆగండి. ఆ అమ్మాయి ని చెప్పనివ్వండి, అన్నీ మీరే చెప్పేస్తారేమిటి” అందిశారద.
“మీ అబ్బాయి ఆదిత్య నాకు హైదరాబాద్ మెట్రో రైలులో పరిచయం అయ్యాడు. ఆరోజు మాదాపూర్లో వున్న మా ఆఫీసు కి మెట్రోలో బయలుదేరాను. ట్రైన్ కిక్కిరిసి వుంది. చేతిలో లాప్టాప్, లంచ్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్ వీటితో నుంచుని ప్రయాణం చెయ్యడానికి అవస్థ పడుతున్న నన్ను చూసి ఆదిత్య లేచి తన సీట్ ని నాకు యిచ్చాడు. థాంక్స్ చెప్పి హమ్మయ్య అనుకుని సీట్ లో కూర్చున్నాను. ఆఫీస్ టైము అవ్వడంతో జనం ఎక్కడమే తప్పా దిగటం లేదు. ఆదిత్య నాకోసం సీట్ యిచ్చి తను తన లగేజ్ తో అలాగే నుంచుని ఉండటం బాధగా అన్పించింది.
ట్రైన్ మాదాపూర్ లో ఆగగానే జనం మొత్తం దిగిపోయారు. నేను కూడా దిగి ఎలివేటర్ దగ్గర నుంచున్నాను క్రిందకి వెళ్ళడానికి. అప్పుడు మీ అబ్బాయి కూడా అక్కడికి వచ్చాడు. నేనే పలకరించాను ‘మీరు మాదాపూర్ లోనే జాబ్ చేస్తున్నారా’ అని. అప్పుడు తెలిసింది మా ఆఫీసులు దగ్గర దగ్గర లోనే వున్నాయి అని. ఆలా జరిగిన మా పరిచయం క్యాంటీన్, సినిమాలు, మాల్స్ దాకా పెరిగింది”.
“ఈ స్నేహం ఎప్పటి నుంచి” అని అడిగాడు చలపతి.
“రెండు సంవత్సరాలనుండి. ఒకరోజు ఆదిత్య నాకు ప్రొపోజ్ చేసాడు. ‘మనం ఓకే కులం వాళ్ళం కాబట్టి మనం పెళ్ళి చేసుకుందాం, నీ ఫోటో మా తల్లిదండ్రుల కి పంపించాను, వాళ్ళు అభ్యంతరం పెట్టలేదు. నువ్వు కూడా మీ తల్లిదండ్రుల కి తెలియచేసి అంగీకారం తీసుకో’ అని మీ ఫ్యామిలీ ఆల్బమ్ నాకు యిచ్చి చూడమన్నాడు.
అప్పటికే వున్న పరిచయం లో ఆదిత్య ఎప్పుడు కూడా చెడ్డగా ప్రవర్తించకపోవడంతో నాకు కూడా ఆదిత్య మీద ప్రేమ కలిగింది. ఇద్దరం కలిసి మా తల్లిదండ్రులని కలిసాము. వాళ్ళు కూడా ఒప్పుకుని మిమ్మల్ని కలిసి మాట్లాడుతాము అన్నారు. దానితో ధైర్యంతో ఒకరోజు..” అని ఆగింది.
“అర్ధం అయ్యింది, మరి మోసం ఎందుకు చేసాడు, ఇద్దరూ కలిసి వచ్చివుంటే నేను కూడా చచ్చినట్టు ఒప్పుకుని పెళ్లిచేసేవాడినిగా” అన్నాడు చలపతి.
కొన్నాళ్ళు బాగానే వున్నాడు, ఒకరోజు ఎందుకో ‘మీ కుటుంబం మధ్యతరగతి లా వుంది, మీ నాన్నగారు ఏమి చేసేవాళ్ళు’ అని అడిగాడు.
ఆ ప్రశ్నలో నాకు ఎటువంటి అనుమానం కనిపించలేదు. ‘అవును మాది మిడిల్ క్లాస్ కుటుంబం, తింటానికి లోటులేదు. యిప్పుడు నా జీతం కూడా వుంది. బాగానే వుంది లే’ అన్నాను.
‘మీ తాత కూడా ఏమి ఆస్తులు యివ్వలేదా, ఈ రోజుల్లో డబ్బు వున్నవాళ్ళకే గౌరవం’ అన్నాడు.
‘అంటే నువ్వు అనేది ఏమిటి? మాకు వున్న గౌరవం డబ్బుతో కాదు. నడవడిక తో. మా నాన్నగారు అంటే ఊరిలో చాలా మంచి మనిషి అని అంటారు, అయినా ఆస్తులు యిప్పుడు వుండచ్చు రేపు పోవచ్చు, మనం చేసే ఉద్యోగం ముఖ్యం’ అన్నాను.
దానికి చిన్నగా నవ్వి, ‘సరేలే. సాయంత్రం సినిమా కి వెళ్లడం లేదు మనం, నాకు నైట్ డ్యూటీ పడింది, అది చెప్పటానికి వచ్చాను’ అని వెళ్ళిపోయాడు.
నాకు ఆరోగ్యం లో తేడా కనిపించడం తో ఆదిత్య తో డాక్టర్ కి చూపించుకుంటే నాకు మూడో నెల అని చెప్పింది. దానితో యిద్దరం కంగారుపడి ‘వెంటనే పెళ్ళి చేసుకోవాలి మనం, మీ ఊరు వెళ్లి మీ తల్లిదండ్రుల తో విషయం చెప్పేద్దాం’ అన్నాను ఆదిత్యతో.
ఏదో ఆలోచిస్తున్న ఆదిత్య ‘యిప్పటికి యిప్పుడు మా వాళ్ళతో చెప్పి ఒప్పించగలమని అనుకోలేను, అందుట్లో నీ ఈ పరిస్థితి లో, ఒక పనిచేస్తే మంచిది నువ్వు అబార్షన్ చేయించుకో, మనకి కొంత టైమ్ దొరుకుతుంది’ అన్నాడు.
‘మహాపాపం, అటువంటి పని నేను చెయ్యలేను, మీ నాన్నగారితో మాట్లాడాలి మనం అర్జంటుగా’ అని నేను ఆదిత్య మీద ఒత్తిడి తెచ్చాను.
‘సరే ముందు ఈ విషయం మా అమ్మతో చెప్పి ఒక వారం రోజులలో వెళ్దాం’ అన్నాడు.
అంతే.. ఆ తరువాత నుంచి మొహం చాటేసాడు. ఒకరోజు నేనే ఆదిత్య వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి ‘ఎందుకు యిలా చేస్తున్నావ్’ అని అడిగాను.
‘నేను మా తల్లిదండ్రుల తో మాట్లాడాను. వాళ్ళు అన్నారు మీ అంతస్థు మాకు సరిపోదు, ఈ పెళ్ళి చేసుకుంటే నువ్వు మమ్మల్ని మర్చిపోవాలి అని. నేను నా తల్లిదండ్రుల ని వదిలి ఉండలేను. అందుకే నిన్ను కలవడం లేదు, నువ్వు నీ జీవితం కి పనికివచ్చే నిర్ణయం తీసుకో, నన్ను మర్చిపో’ అని చెప్పి వెళ్ళిపోయాడు. దిక్కు తోచక నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను” అంది స్వప్న.
“సరే. యింత వరకు వచ్చిన తరువాత ఆడపిల్ల జీవితం నాశనం చేస్తాను అంటే కొడుకైనా నేను ఒప్పుకోను. నిన్ను చేసుకోను అనడానికి వాడికి వున్న కారణం యింతేనా యింకా ఏమైనా బలమైన కారణం వుందా తెలుసుకోవాలి. వాడిని యిక్కడికి పిలిపించి మాట్లాడుతాను. శారదా! అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు. ఆదిత్య వచ్చినప్పుడు స్వప్న వాడికి కనిపించకుండా చూడు” అన్నాడు బయటకు నడుస్తూ.
చలపతి తన స్నేహితుడు రంగయ్య దగ్గరికి వెళ్లి అతని ఫోన్ నుంచి కొడుకు ఆదిత్య కి ఫోన్ చెయ్యమన్నాడు.
చలపతి సూచన ప్రకారం “మీ నాన్నకి ఆరోగ్యం బాగుండలేదు. వెంటనే బయలుదేరి రా. విషయం తరువాత నీకు విపులంగా చెప్పగలను” అని ఫోన్ చేసాడు రంగయ్య.
ఇంటికి వచ్చి భార్య శారద కి కూడా “ఒక వేళ నీ కొడుకు ఫోన్ చేస్తే మీ నాన్నకి హెల్త్ బాగుండలేదు, వెంటనే రమ్మని ఏడుపు గోంతుతో చెప్పు” అన్నాడు చలపతి.
“ఈ అమ్మాయి మాటలు నమ్మి మన అబ్బాయిని అనుమానిస్తున్నమేమో కొద్దిగా ఆలోచించండి. మనవాడు రాముడు లాంటి వాడు” అంది.
“నీది తల్లి మనసు, మార్పు రావడానికి వాడి వయసు దోషం వుండి ఉండవచ్చు, చూద్దాం” అన్నాడు చలపతి.
అర్ధరాత్రి కొడుకు నుంచి ఫోన్ రావడంతో శారద తీసుకుని చలపతి చెప్పమన్నట్టుగా చెప్పింది.
“బయలుదేరానమ్మా. నువ్వు కంగారు పడకు, నాన్న జాగ్రత్త” అని పెట్టేసాడు.
ఉదయం ఏడుగంటలకు ఇంటికి చేరిన ఆదిత్య కి, తండ్రి పనివాళ్ళతో మాట్లాడుతో ఉండటం చూసి, ‘అదేమిటి ఆలా చెప్పారు’ అనుకుంటూ లోపలికి వచ్చి తల్లిని పలకరించి, “ఏమిటమ్మా రాత్రి నాన్నకి ప్రాణం మీదకి వచ్చింది అని చెప్పడం, యిప్పుడు చూస్తే సీన్ వేరేగా వుంది, ఎంత భయపడ్డానో తెలుసా, అసలు ఏమిజరిగింది” అన్నాడు.
“రాత్రి ఆసిడిటి వల్ల గుండెల్లో నొప్పి అనుకున్నాము. నీకు తెలుసుగా మీ నాన్నకి జలుబు చేస్తే కోవిడ్ అనుకుని మంచం ఎక్కుతారు, అంత భయం” అంది.
బయటకు వచ్చి కుర్చీలో కూర్చొని “ఏమిటి నాన్నా యిలా కంగారు పెట్టి పిలిపించడం, నాకు అక్కడ బోలెడన్ని పనులు” అన్నాడు ఆదిత్య.
“నాకు తెలుసురా నీ పనులు గురించి, ముందు కాఫీ తాగు, తరువాత ఆలా మిల్లు దాకా వెళ్లి వద్దాం” అన్నాడు చలపతి.
పేపర్ చూస్తున్న ఆదిత్య చేతికి కాఫీ కప్ అందిచటం తో, “నీ ఆరోగ్యం ఎలా వుంది అమ్మా” అంటూ పైకి చూసి ‘యిదేమిటి స్వప్న ఇక్కడికి ఎలా వచ్చింది’ అనుకుని కంగారుపడి, “ఎవ్వరు నాన్నా ఈ అమ్మాయి” అన్నాడు.
“అదే నువ్వే చెప్పాలి ఎవ్వరు అని” అన్నాడు చలపతి.
తండ్రి తనని పిల్పించడం వెనుక కథ అర్ధం అయ్యింది ఆదిత్య కి. కుర్చీలోనుంచి లేచి నుంచుని “ఆ అమ్మాయిని ఎందుకు రానిచ్చారు” అని కోపంగా అడిగాడు.
“ముందు నీకు ఆ అమ్మాయి ఎలా తెలుసు చెప్పు” అని అరిచాడు తండ్రి.
“ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతో మంది పరిచయం అవుతారు, వాళ్ళు అందరు మీ దగ్గర కి వచ్చేస్తే ఎలా. స్వప్న కి నాకు ట్రైన్ లో పరిచయం. మంచి అమ్మాయి. చెప్పాలంటే ఉద్యోగం లో నాకంటే మంచి పేరు వుంది. కొన్నాళ్ళు కి మా స్నేహం ప్రేమలా మారింది. యిరు కుటుంబాల అంగీకారం తో పెళ్లిచేసుకోవాలని అనుకుని ముందుగా స్వప్న వాళ్ళ తల్లిదండ్రుల ని కలిసాము. కులాలు ఒక్కటే అవ్వడంతో వాళ్ళు ఒప్పుకున్నారు.”
“అంటే ముందుగా నా అభిప్రాయం అక్కర్లేదు అనుకున్నావా” అన్నాడు చలపతి.
“మిమ్మల్ని అమ్మ ఒప్పించుకుంటుంది. అందుకే స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే బిలో మిడిల్ క్లాస్, మనం ధనవంతులం, ఆయిల్ మిల్లు, రైస్ మిల్లు, పొలాలు, పెద్ద ఇల్లు.. వీటితో చూస్తే స్వప్న వాళ్ళ ఫ్యామిలీ మనతో ఇమడటం కష్టం. అందుకే ఆ విషయం తనకి చెప్పాను, తను అర్ధం చేసుకోలేకపోతే నేను చేసేది ఏముంది” అన్నాడు ఆదిత్య.
“అంతేనా మీ మధ్య ఏ సంబంధం లేదా, యిలా అడగటానికి నాకు సిగ్గుగా వుంది. అయినా తప్పదు, మీరిద్దరూ కలిసి సంసారం చేసారా లేదా” అని అడిగాడు.
ఒక్క నిమిషం ఆలోచించిన ఆదిత్య “పెళ్లి చేసుకుంటామని అనుకున్నాము” అన్నాడు.
“మరి యిప్పుడు ఏమైంది? ఎందుకు నీ నిర్ణయం మార్చుకున్నావు. దీనివల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం చేసినవాడివి కావా?” అని ఆడిగాడు చలపతి.
“ఆ సంఘటన కి ముందు నాకు వాళ్ళ కుటుంబం మిడిల్ క్లాస్ అని తెలియదు, తెలిసిన తరువాత తను మన కుటుంబం లో వుండలేదు అనిపించింది” అన్నాడు ఆదిత్య.
“అది ఒక్కటే నీకు అభ్యంతరం అయితే నేను నా ఆస్తి నీకు ఇవ్వకపోతే నువ్వు ఏ క్లాస్ కి చెందుతావు, నువ్వు కూడా మిడిల్ క్లాస్ కదా. యిప్పటివరకు హై క్లాస్ లో వున్న నువ్వు ఆస్తి రాకపోయే సరికి మిడిల్ క్లాస్ అయిపోయావు, అటువంటి క్లాసులు మీద ఆధారపడి బంగారం లాంటి స్వప్న ని వదులుకోవాలి అని నువ్వు ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నావు ఆదిత్య.. చెప్పు” అని అడిగాడు తండ్రి.
తండ్రి అడిగిన ప్రశ్నకు “అవును, మీరు ఆస్తి నాకు కాకుండా ఎవ్వరికి యిస్తారు, కాబట్టి నేను ఎప్పుడు హై క్లాస్ కిందే వస్తాను, అయినా కోడళ్ళని యింటి నుంచి గెంటివేసే తల్లిదండ్రులని చూసాను కాని, కోడలు కోసం కొడుకుని గెంటివేసే మీలాంటి తండ్రిని చూడలేదు నాన్న, మీ ఆస్తి వద్దు మీరు వద్దు” అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆదిత్య.
“అయ్యో! నా వల్ల మీ కుటుంబం లో తగాదాలు వచ్చాయి, నేనే వెళ్ళిపోతాను, ఆదిత్య మీ మాట వింటాడని వచ్చాను, కాని అతనికి యిప్పుడు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే సృహ లేదు” అంది.
“చూడు స్వప్న. నీ కడుపులో మా వంశం నిలబెట్టే వాడు పెరుగుతున్నాడు. నీకు మా వాడు తాళి కట్టకపోయినా పెళ్లి చేసుకోవాలి అనే నీతో సంసారం చేసాడు. నేను ధర్మం పాటించేవాడిని, నువ్వు నా కోడలివి, యిదే నీ యిల్లు” అన్నాడు చలపతి.
రోజులు గడిచాయి, స్వప్న పండంటి మగపిల్లాడిని కనింది. “మీ తల్లిదండ్రులని వచ్చి మనవడిని చూసి వెళ్ళమని పిలువు” అని కోడలికి చెప్పాడు.
“వద్దు మామయ్యగారు, వాళ్ళు ఇప్పటికే నా సంసారం యిలా అయ్యింది అని బాధపడుతున్నారు, పరిస్థితులు చక్కపడితే వాళ్లే వస్తారు” అంది స్వప్న.
స్వప్న కి ఆయిల్ మిల్లు బాధ్యత అప్పచెప్పాడు చలపతి. స్వప్న బాధ్యత తీసుకున్న తరువాత ఆయిల్ మిల్లు లాభాలు పెరిగి పక్కనే వున్న స్థలం లో యింకో యూనిట్ కూడా మొదలుపెట్టారు. ఎంతైనా చదువుకున్న కోడలు అని మురిసిపోయారు చలపతి, శారదా దంపతులు.
కొడుకు ఆదిత్య ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని నమ్మకం తో ఎదురు చూస్తున్నారు. ధర్మం ఆలస్యంగా అయినా గెలుస్తుంది అని చలపతి నమ్మకం.
మనం కూడా ఆదిత్య తిరిగి రావాలి అని కోరుకుందాం.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments