మా గణితం మాస్టారు, ఆస్కార్ అవార్డులు!
- Amaraneni Mahesh
- Sep 9
- 4 min read
#MaheshAmaraneni, #మహేష్అమరనేని, #Ma Ganitham Mstaru, #మాగణితంమాస్టారు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ma Ganitham Mastaru - Oscar Awards - New Telugu Story Written By - Mahesh Amaraneni
Published In manatelugukathalu.com On 09/09/2025
మా గణితం మాస్టారు, ఆస్కార్ అవార్డులు - తెలుగు కథ
రచన: మహేష్ అమరనేని
సాధారణంగా పాఠశాల జీవితంలో విద్యార్థులందరికీ ఒకే ఒక శత్రువు ఉంటారు - ఆయనే గణితం మాస్టారు. ఆయనంటే అందరికీ కోపం, భయం మరియు చిరాకు. కానీ మా నలుగురు స్నేహితుల బంధం బలోపేతం అవ్వడానికి కారణం కూడా ఆయనే. మిగతా సబ్జెక్టుల్లో ఎలాగోలా పాస్ మార్కులు తెచ్చుకున్నా, గణితంలో మాత్రం మా అందరికీ ఒకేలా మార్కులు వచ్చేవి. అవి సున్నా నుంచి ఐదు లోపు.
మాకు అలా 'మంచి' మార్కులు వచ్చిన ప్రతిసారీ, ఇంకోటి కూడా మా అందరికీ సమానంగా పంచేవారు మా గణితం మాస్టారు. అవే ఆయన చేతి దెబ్బలు. మమ్మల్ని కొట్టేటప్పుడు, "మీకు ఆస్కార్ ఇవ్వాలిరా!" అనేవారు. మొదట్లో మాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది అది ఆస్కార్ అవార్డు అని. ఎందుకంటే, ఆయన మమ్మల్ని కొట్టడానికి కర్ర ఎత్తేలోపే మా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేవి.
"అబ్బా" అని దెబ్బ తగిలినట్టే ఏడ్చేవాళ్ళం. మహానటి సావిత్రి గారు గ్లిసరిన్ లేకుండానే కన్నీళ్లు తెప్పించగలరని అంటారు. అలా చూసుకుంటే, దేశంలో ఉన్న పాఠశాలల్లో మా లాంటి మహానటులు చాలా మంది ఉంటారు. (సావిత్రి గారితో పోల్చానని తప్పుగా అనుకోకండి!)
మా మట్టి బుర్రల్లోకి గణితం ఎక్కించడానికి మా మాస్టారు చాలా తపన పడేవారు. మమ్మల్ని ముందు వరుసలో కూర్చోబెట్టేవారు. "ఒరేయ్, ఆస్కార్స్! మీరు నా ముందుకొచ్చి కూర్చోండి. నేను చెప్పేది సరిగ్గా వినకపోయినా, చేయకపోయినా ఈ రోజు నా చేతిలో చచ్చారే!" అని బెదిరించేవారు.
మేము కూడా "చచ్చాం రా" అనుకునేవాళ్ళం. లెక్కలు చెబుతూ మధ్యలో ఫార్ములా అడిగేవారు. మేము చెప్పలేకపోతే, మా అందరిని బెంచి మీద నుంచి మోకాళ్ళ మీదకి షిఫ్ట్ చేసేవారు (నీల్ డౌన్ అన్నట్టు).
"మీ మొఖాలు చూస్తే నాకు వచ్చిన లెక్కలు కూడా మర్చిపోతున్నాను!" అని ఆయన పాటికి ఆయన చెప్పుకుంటూ వెళ్ళేవారు.
ఆయనంటే ఉన్న సహజ కోపం మమ్మల్ని ఏదో ఒకటి చేయాలిరా అని ఉసిగొల్పింది.
మా మాస్టారు రోజు తెల్లటి షర్టు, ప్యాంటు వేసుకుని వచ్చేవారు. మేము మేధావులం కదా, అందుకే మాకు ఒక సందేహం కలిగింది. "ఈయనకి ఇవే ఒక జత బట్టలా? ఎప్పుడూ ఇవే వేసుకుని వస్తాడు!" అనుకున్నాం.
అది కనుక్కోవడానికి ఒక పథకం వేశాం. క్లాసు జరుగుతుండగా, క్లాసు మధ్యలో ఆయన అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు మాలో ఒకడు పెన్ను నిబ్ తీసి తెల్లటి బట్టలకి ఇంక్ అంటించాడు. "చూద్దాం! రేపు కూడా ఇవే వేసుకుంటాడా లేదో?" అనుకున్నాం.
మరుసటి రోజు మళ్ళీ తెల్లటి బట్టలు వేసుకుని వచ్చారు. మేము మళ్ళీ మా పనితనం చూపించాం. క్లాసు మధ్యలో ఆయన అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు ఇంకు చల్లాం. నాలుగు రోజుల తర్వాత మేము ఇంకు చల్లిన బట్టలు వేసుకుని ఆయన వచ్చారు. వేరే మాస్టార్లు అందరూ "ఏమైందండి, ఇంకు అంటింది?" అని అడుగుతూ ఉన్నారు. మేము చూసి నవ్వేవాళ్ళం.
***
ఆ రోజు ఆదివారం, సెలవు రోజు. అంతకు ముందు రోజే మాకు మా మాస్టారి నుంచి ఆహ్వానం అందింది. ఆదివారం ఆయన ఇంటికి రావాలని. "రాకపోతే తాట తీస్తాను" అన్న ఒక్క మాటతో మాకు వెళ్ళక తప్పలేదు.
ధైర్యం చేసుకుని భయంగా ఆయన ఇంటికి చేరుకున్నాం. సాదరంగా లోపలికి ఆహ్వానించారు. మంచినీళ్ళు ఇచ్చి, "ఇప్పుడు చెప్పండిరా, మీలో ఎవరు నా బట్టలకి ఇంకు అంటించారు?" అని అడిగారు.
అంతే! మాకు ఆల్మోస్ట్ తడిచిపోయింది.
"చెప్పకపోతే చచ్చారే.. చెప్పండి!" అని పెద్దగా అడిగేసరికి మా సందేహం గురించి, మా పథకం గురించి చెప్పక తప్పలేదు.
"మీకు లెక్కల్లో సందేహాలు రావు కానీ, నేను వేసుకునే బట్టల మీద సందేహాలు వస్తాయా?" అని కొంచెం తీర్థం పోసి (రెండు చేతి దెబ్బలు) "నడవండిరా ఇంటి వెనక్కి!" అని తీసుకువెళ్లి, "ఇంకు మరకలు పోయేదాకా ఉతికి ఆరేసి ఇంటికి వెళ్ళండి" అని ఆజ్ఞాపించారు.
అంతే! మాకు అప్పగించిన పనిలో పడి బట్టల్ని బండకేసి బాదుతున్నాం. ఇంతలో మాలో ఒకడికి జ్ఞానోదయం అయి, "ఒరేయ్! జాగ్రత్త! మనం కోపంలో గట్టిగా బాదుతున్నాం. ఇవి చిరిగితే, మన వెనక భాగం చిరిగిపోతుంది" అన్నాడు.
"నిజమేరా" అనుకుని మాకు వచ్చినట్టు ఉతికి ఆరేసి ఇంటికి వెళ్ళిపోయాం.
***
ఎన్ని వెధవ పనులు చేసినా మనల్ని మనస్ఫూర్తిగా క్షమించేది ముగ్గురే - అమ్మ, నాన్న, మరియు గురువు.
అవి పదవ తరగతి పరీక్షల రోజులు. గణితం పరీక్షకు రెండు రోజులు సెలవులు వచ్చాయి. మాకు మళ్ళీ ఆహ్వానం అందింది. ఈసారి బట్టలు బ్యాగుతో సహా రమ్మన్నారు. మళ్ళీ ఆహ్వానం అంటే మళ్ళీ గట్టిగా బడిత పూజ ఉందా మనకి అనుకున్నాం. "ఎవరూ ఏమీ చేయలేదు కదా, ఎందుకు రమ్మనట్టు?" అనుకుంటూ వెళ్ళాం.
మాకు ఒక రూమ్ చూపించి, మా బట్టలు అక్కడ పెట్టుకుని, గణితం బుక్ తీసుకుని రమ్మన్నారు. "ఒరేయ్ ఆస్కార్స్! ఇన్నాళ్ళు మీకు మార్కులు రాకపోయినా, ఫెయిల్ అయినా పర్లేదు. కానీ ఇవి టెన్త్ క్లాస్ ఫైనల్ పరీక్షలు. మీరు పాస్ కాకపోతే దేనికీ పనికిరాకుండా పోతారు. కాబట్టి ఈ రెండు రోజులు నేను మీకు గణితం చెబుతాను. మంచిగా నేర్చుకుని పాస్ అవ్వండిరా" అన్నారు.
మేము ఒకరి మొఖాలు మరొకరు చూసుకున్నాం. ఎందుకంటే మేము అప్పటికే ఫిక్స్ అయిపోయాం - "గణితంలో మనం ఫెయిల్ అవుతాం, సప్లిమెంటరీ రాయాలి" అని.
"నాకు అర్థమైందిరా! ఇన్ని రోజులు రాని గణితం ఈ రెండు రోజుల్లో మీకు ఎలా వస్తుంది? కాబట్టి నేను మీకు కొన్ని ముఖ్యమైన లెక్కలు మార్క్ చేసి చెబుతాను. మీకు పరీక్షల్లో వచ్చిన రాకపోయినా అవే రాసి రండి. అదృష్టం ఉంటే పాస్ అవుతారు!" అని చెప్పారు.
***
మీరు నమ్మరు. మేము నలుగురం గణితంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. అఫ్ కోర్స్, టెన్త్ కూడా.
మేము స్వీట్స్ తీసుకుని మా గణితం మాస్టారి ఇంటికి వెళ్ళాం. అప్పటికే ఆయన అందరికీ స్వీట్స్ పంచుతున్నారు, "నా స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యారు!" అని సంతోషంతో.
మా రిజల్ట్స్ చూసి అందరికంటే, మాకంటే ఎక్కువగా సంతోషపడింది మా గణితం మాస్టారు. అంతేగా! కాదు అనుకున్న అద్భుతం జరిగినప్పుడు ఎవరైనా సంతోషపడాల్సిందే.
అదేంటో తెలియదు కానీ, పాఠశాలలో చదువుతున్నప్పుడు రాని పరిణితి, పాఠశాల వదిలి వెళ్ళేటప్పుడు వస్తుంది. మేము మా గణితం మాస్టారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాం. "మీ వల్లే మేము పాస్ అయ్యాం సర్!" అన్నాం.
ఆయన మమ్మల్ని దగ్గరకు తీసుకుని, "మీరు నా ఆస్కార్స్ రా!" అన్నారు. అప్పుడు అర్ధం అయింది మాకు. ఆయన తెల్లటి బట్టలు ఎందుకు వేసుకుంటారో!. ఆయన మనసు అంత తెల్లనిది.
మన జీవితంలో కొంతమందిని ఎప్పటికి మరచిపోలేము. చివరికి అల్జీమర్స్ వచ్చినా! అలాంటి వారిలో మా గణితం మాస్టారు ఒకరు.
***సమాప్తం***
మహేష్ అమరనేని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు మహేష్.
సాధ్యమైనంత వరకు, నిజ జీవితంలో చూసిన సంఘటనలు మీద కథలు రాస్తూ ఉంటాను. ఇంతకు ముందు కొన్ని కథలు ప్రతిలిపి లో ప్రచురించాను.
Comments