ప్రేమ తీరాలు - పార్ట్ 4
- Lakshmi Sarma B
- Sep 9
- 7 min read
Updated: Sep 15
#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

Prema Theeralu - Part 4 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 09/09/2025
ప్రేమ తీరాలు - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు. పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది. లలిత గర్భవతి అవుతుంది. పండంటి బాబుకు జన్మనిస్తుంది. కరుణాకర్ రాధను వివాహం చేసుకోవాలనుకుంటారు.
ఇక ప్రేమ తీరాలు పార్ట్ 4 చదవండి.
బెల్ కొట్టగానే తలుపుతీసింది రాధ. “ఏయ్ లలిత.. బాగున్నారా? అరే.. బాబూ.. ఎంత చక్కగా ఉన్నావు నాన్నా.. రండి లోపలికి, ” అంటూ లలిత చేతిలోనుండి బాబును తీసుకుంటూ లోపలికి నడిచింది రాధ.
“వదినా.. బాగున్నారా? మా అన్నయ్య సెలక్షన్ బాగుంది, ” నవ్వుతూ అంది.
“మీరు ఇలా కూర్చొండి నేనిప్పుడే వస్తాను, ” బాబును తీసుకుని కాఫీ తేవడానికి వెళ్లింది.
“బావా. లేటుగానైనా మంచి అమ్మాయి దొరికింది, ” చిన్నగా కరుణాకర్ చెవిలో చెప్పాడు ఫణి. సిగ్గుపడుతూ చిన్నగా నవ్వాడు కరుణాకర్.
“బాబు.. నాకున్నది ఒక్కతే కూతురు. దాని బతుకు అన్యాయం అయిపోయిందని బాధతో కుమిలి పోయాము ఇన్నాళ్ళు.. నువ్వు మంచి మనసుతో మా రాధను చేసుకోవడానికి ముందుకు వచ్చావు. నీ మేలు జన్మలో తీర్చుకోలేము, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలగుతాను, ” రాధ తల్లి విశాలాక్షి వచ్చి కరుణాకర్ తో అంది.
“అయ్యో అత్తయ్యా. మీరేం బాధపడకండి. మా అన్నయ్య చాలా మంచివాడు, ఇలాంటి వాడు దొరకడం మా వదిన చేసుకున్న అదృష్టం, ఆమె కోసమే ఇన్నాళ్ళు మేమెంత చెప్పినా పెళ్ళిచేసుకోలేదు, వదినా! మా అన్నయ్యకు ఏం మంత్రమేసావో కానీ టక్కున నిన్ను చూడగానే మనసు మార్చుకున్నాడు, ” అంది వదినను ఆటపట్టిస్తూ.
“నేను కాదు మీ అన్నయ్యే నా మీద ఏదో మంత్ర ప్రభావం చేసినట్టున్నాడు, లేకపోతే నేను జీవితంలో పెళ్ళే చేసుకోనని అనుకున్నాను. మా అమ్మ రోజు చెవిలో జోరీగలాగా
పోరుపెడుతున్నా నేనొప్పుకోలేదు. ఒకసారి మోసపోయిన నాకు జీవితమంటేనే ఒకలాంటి విరక్తి వచ్చింది. కానీ మీ అన్నయ్య మంచితనం చూసాక.. ” చెప్పడం ఆపింది సిగ్గుపడుతూ.
“బాగుందమ్మా మీ వరసా.. నువ్వు మా అన్నయ్యకు వేసావో, మా అన్నయ్య నీకు వేసాడో తెలియదు కానీ మీరిద్దరు పెళ్ళిపీటలు ఎక్కుతున్నారు. మాకది చాలు. అంతేకదండి, ” భర్త వైపు చూస్తూ అంది గలగలా నవ్వుతూ..
“అంతేగా అంతేగా, ” తను లలిత నవ్వులో శృతి కలుపుతూ అన్నాడు ఫణి.
ఫలహారాలు కాఫీలు తాగాక కాసేపు ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. రాధ కూడా కొత్త పాత లేకుండా బాగా కలిసిపోయింది బాబుతో ఆడుతూ.
“అత్తయ్యా .. మా అత్తయ్య మామయ్య యాత్రలకు వెళ్లారు వాళ్ళు వచ్చాక పెళ్ళి, మాకున్న పెద్దదిక్కు వాళ్ళే కనుక వచ్చే వారం వాళ్ళు వస్తారు. ఈలోగా ముహుర్థం చూసుకుని మనం చూసుకోవలసిన పనులు చేసుకుందాము, వదినా అన్నయ్యతో వెళ్ళి నీకు నచ్చినవి కోనేసుకో. మొహమాటం వద్దు, ” పెద్దమనిషిలా చెప్పింది లలిత.
“అలాగే లలిత .. మీకే కాదమ్మా మాకూ ఎవరూ లేరు ఇప్పుడు మీరు తప్పా. రేపే పూజారి దగ్గరకు వెళ్ళి కనుక్కుంటాను. అమ్మా రాధ.. కుంకుమ భరిణ తెచ్చి మీ ఆడపడుచుకు బొట్టుపెట్టి తాంబూలం ఇవ్వమ్మా, ” లలిత వాళ్ళు వెళ్లడానికి లేచి నిలబడగానే అంది విశాలాక్షి.
రాధ చేతిలో ఉన్న బాబు, లలిత దగ్గరకు రావడం లేదు. “వదినా చూసావా.. మా వాడు అప్పుడే అత్తకు కాకాపడుతున్నట్టున్నాడు, ”
“బాగుంది లలిత.. మీ అన్నయ్యకు మీ వదిన అవసరం కాబట్టి వల వేసాడంటే ఒప్పుకుంటాను, వాడెందుకు మీ వదినను కాకాపడతాడు? అంటే మీ వదిన వాడికి కూడా నచ్చిందనా, ” అర్థంకాక అడిగాడు ఫణి.
“అబ్బా మీకేం అర్థంకాదు.. రేపు మా అన్నయ్యకు కూతురు పుడితే వాడికి ఏమౌతుందనుకున్నారు వాడికి కాబోయే భార్య కాదా చెప్పండి, అందుకే అంటున్నాను బాబు అత్త దగ్గరనుండి రానంటున్నాడు కదాని, ” ఫక్కున నవ్వుతూ ఫణి చెవి మెలేసింది.
“అమ్మ బాబోయ్ ఎంత దూరాలోచన.. నా మనసుకు తట్టనేలేదు సుమా, ” అన్నాడు నొప్పిగా ఉన్న చెవిని రుద్దుకుంటూ.
“వదినా. నువ్వు మాత్రం పాపనే కనాలి. ఊరుకునేది లేదు, ” అంటూ అందరూ బయలదేరారు.
“ఎలా అనిపించింది మీకు రాధను చూస్తే,” దారిలో ఇద్దరిని ఉద్దేశించి అడిగాడు కరుణాకర్.
“చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా ఉంది బావా, మనసు దెబ్బతిన్న మనిషి కాబట్టి నీ విషయంలో బాగానే ఉంటుందనిపిస్తుంది, వాళ్ళమ్మగారు కూడా బాగానే మాట్లాడారు.
“అన్నీ ఒకే చోట దొరకాలంటే దొరకవు. డబ్బున్న వాళ్ళందరు కాపురాలు చక్కగా చేసుకుంటారన్న నమ్మకం ఏం ఉండదు. మన తాహతుకు మించి కోరుకోవడం కూడా
మంచిది కాదు. మంచిపని చేసావు కరుణా, ”
అప్పుడప్పుడు కరుణా అంటుంటాడు. స్నేహితులు కదా.
“అవునన్నయ్యా.. వదినను చూస్తుంటే ఎవరో కొత్తవాళ్ళలా అనిపించలేదు. మనలో కలిసిపోయినట్టుగా ఉంది, కానీ పాపం వదిన నీ దగ్గరకు వచ్చేస్తే వాళ్ళమ్మ ఒంటరి అయిపోతుందేమో, పోనీ ఒకపని చేస్తే ఎలా ఉంటుంది.. ఆవిడ కూడా మీతో పాటుగా ఉంటుంది వదినకు సాయంగా ఏమంటావన్నయ్యా, ” అడిగింది లలిత.
“నువ్వు చెప్పేదాకా నేను ఆమె గురించే నేనాలోచించలేదమ్మా , అవును. ఆమెను మాతోపాటే ఉండమని చెప్పడం మన ధర్మం. అందుకే అంటారు చూడు.. తల్లి లేకున్నా తోబుట్టువు తల్లితో సమానమని. చిన్నదానివైనా బాగా చెప్పావు, ”
“ఉష్ ఉష్,” అంటూ దగ్గు నటించాడు ఫణి.
“ఏమైంది ఫణి నీళ్ళేమైనా తాగుతావా, ” కంగారుగా అడిగాడు కరుణాకర్.
“అయ్యో అన్నయ్యా .. ఆయన నన్ను వెక్కిరిస్తున్నాడు, నువ్వన్నావు కదా బాగా చెప్పావని అందుకు నేను ఉబ్బిపోతున్నానని ఆయనకు కుళ్ళు, ”
“మరే. నాకదే పని. మీ అన్నయ్య నిన్ను అదే పనిగా పొగుడుతుంటే నాకు నవ్వు వచ్చింది. ఏం.. నవ్వుకునే అధికారం కూడా నాకు లేదా బావా, ” బుంగమూతిపెట్టి లలితవైపు చూస్తూ కన్నుకొడుతూ అడిగాడు.
“మళ్ళి మొదలైందా మీ చిలిపి సయ్యాటలు.. ఇంటికి వెళ్ళాక మీ ఇష్టం, ఇప్పుడు మాత్రం సరదాగా ఉందాము సరేనా, ” అన్నాడు.
ముహూర్తాలు పెట్టుకున్నారు. పదిరోజుల్లో పెళ్ళి. లలిత ఫణి షాపింగ్ చేస్తున్నారు. అక్కడ కరుణాకర్ రాధ పెళ్లికి కావలసినవి కొంటున్నారు. ఇంకో రెండురోజుల్లో యాత్రలకు వెళ్ళిన ఫణి తల్లితండ్రులు వస్తున్నారు. వాళ్ళు వచ్చేరోజు ముందుగానే లలిత ఫణి బాబుతో వెళ్లారు, వచ్చేటప్పుడు వాళ్ళను తీసుకుని రావాలనే ఉద్దేశంతో.
తెల్లవారి లేచినప్పటినుండి ఇద్దరు కలిసి ఇల్లంతా శుభ్రంచేసి టిఫెన్ తయారుచేసి వాళ్ళకోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు ఎంత దూరం వచ్చారో కనుక్కుందామంటే. కాలిగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటకు తిరుగుతున్నాడు ఫణి, తల్లితండ్రుల రాక కోసం.
సాయంత్రవరకు చూడగా చూడగా ఇంటిముందు అంబులెన్స్ ఆగింది. లలిత ఫణిల మనసు కీడు శంకించింది. పరుగు పరుగున బయటకు పరుగెత్తుకు వచ్చారు. అంబులెన్స్ నుండి ఒక్కొక్కరిని కిందకు దింపుతుంటే అచేతనంగా నిలబడిపోయాడు ఫణి. అత్తమామలను ఆ పరిస్థితిలో చూడగానే కళ్లు తిరిగిపడిపోయింది లలిత.
ఇరుగుపొరుగు సహాయంతో లలిత లేచింది. ఫణి తల్లితండ్రుల పక్కన కూర్చొని బోరుబోరుమని ఏడవసాగాడు. ఏం జరిగిందో వివరిస్తున్నాడు ఆ అంబులెన్స్ లో వచ్చినతను. తిరుగు ప్రయాణంలో వస్తుంటే బస్సు ఒక చిన్న లోయలో పడిపోయింది. ఎవరూ ప్రాణాలతో దక్కలేదు. అందరిని వాళ్ళ చోటుకు తరిలిస్తున్నామని చెప్పాడు.
“నాన్న .. ఏమిటిది మంచిగా యాత్రలు పూర్తి చేసుకుని వస్తారు మిమ్మల్ని మాతోపాటే తీసుకవెళదామని వచ్చాము ఇందుకా మేము వచ్చింది, పెద్దవాళ్లు మేము లేకుండా వెళ్ళొద్దని చెప్పాము వినలేదు, ఇప్పుడు చూడండి నన్ను ఒంటరిని చేసి మీరు వెళ్ళిపోయారు ఎందుకు నాన్న చెబితే వినలేదు,” అంటూ ఏడుస్తున్నాడు.
“బాబు.. ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు. జరుగవలసిన కార్యక్రమం చూడాలి కదా. లే నాయన, ” ఫణి ని దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు రాజశేఖరం అన్న సోమశేఖరం.
లలితను ఊరడించడం ఎవరివల్లా కావడంలేదు. కరుణాకర్ కు ఫోన్ చేసిచెప్పారు. ఎంత తొందరగా రావాలన్నా కనీసం ఐదు ఆరు గంటలు పడుతుంది. అంతవరకు ఉంచడం
మంచిది కాదని చేసేసారు ఫణి పెదనాన్న,ఊరివాళ్ళు కలిసి.
బోసిపోయినట్టున్న ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండాలనిపించడం లేదు ఫణి లలితలకు. కరుణాకర్ రాధలతో రాధా వాళ్ళమ్మ వచ్చింది తోడుగా ఉండడానికి. రాధ లలితను ఊరడించడము కరుణాకర్ ఫణిని సముదాయించడం సరిపోయింది.
విశాలాక్షి బాబును కంటిరెప్పలా చూసుకోసాగింది. పన్నెండురోజులు చాలా కష్టం మీద గడిచిపోయాయి తిరుగు ప్రయాణం రోజు వచ్చాడు ఫణి పెదనాన్న.
“నాయన ఫణి.. నువ్వు తీరిక చేసుకుని మళ్ళి వస్తే ఈ ఇల్లు పొలం నీ పేరన చేసుకుంటే సరిపోతుంది, మా తమ్ముడు న్నన్నాళ్ళు ఈ ఇల్లు పొలం వాడి ప్రాణంగా చూసుకున్నాడు, నువ్వెలాగు ఇక్కడకు వచ్చి ఉండలేవు. అందుకని నీకు వచ్చే
వాటా పంచుకుంటే సరిపోతుంది. నువ్వు ఉంచుకుంటావో అమ్ముకుంటావో నీ ఇష్టం. ఆ.. అన్నట్టు నువ్వు అమ్ముతానంటే మాత్రం మమ్మల్ని కాదని వేరొకరికి అమ్మడానికి వీలులేదు, ” విషయం తేలతీసాడు పెద్దాయన.
ఫణికి ఇవేమి పట్టడంలేదు. “పెదనాన్న.. నాన్నలేని నాకు ఇవేమి వద్దు. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఈ ఊరికి ఋణం తీరిపోయింది. నాకు మా నాన్న
పంచిన ప్రేమ చాలు, ” కలత చెందిన మనసుతో అన్నాడు ఫణి.
ఫణి ఆవేశంతో అన్నాడు. సర్ధి చెప్పడానికి పక్కన ఎవరులేరు. కావాలనే ఫణి పెదనాన్న ఫణిని ఒక్కడిని చూసి అడిగాడు.
“అదేంటి నాయన అలా అంటున్నావు పెద్దల ఆస్తి నీకు ఉండాలి కదా! ఎంతో అంత వాళ్ళ తృప్తికోసం నువ్వు తీసుకోవాలి నాయన. కాదనకూడదు, పోయిన వాళ్ళెలాగు తిరిగి రారు. ఉన్న మనమైనా కలిసిమెలిసి ఉండాలి. నువ్వప్పుడప్పుడు వస్తుండు. నేనున్నాను కదా!”
“ పెదనాన్న.. నాకేం చెప్పకండి. నాకేమి వద్దు. మీరేం చేసుకుంటారో చేసుకోండి, ” అన్నాడు కొంచెం గట్టిగా.
“సరే సరే నీ ఇష్టం బాబు. నువ్వు ఎలా చేద్దామంటే అలాగే చేద్దాం, ఇప్పుడు నీ మనసు మంచిగా లేదు. కొన్నాళ్ళు పోయాక ఆలోచిద్దాము, ఇదిగో ఈ దస్తావేజులమీద
సంతకం పెట్టు. నేనే దగ్గరుండి నీ వాటా నీకు వచ్చేటట్టు చేస్తాను, ” అంటూ కొన్ని కాగితాలమీద సంతకం పెట్టించుకున్నాడు సోమశేఖరం.
ఫణి చూసి చూడకుండా అన్ని పేపర్లమీద సంతకంపెట్టి పెదనాన్న చేతిలో పెట్టాడు. పేపర్లు అందుకున్న
సోమశేఖరం గర్వంతో మీసం మెలేసుకున్నాడు ఎన్నాళ్లుగానో ఈ ఆస్తి దక్కించుకోవాలని మనసుపడే ఉబలాటం ఇప్పుడు తీరడంతో.
ఈ విషయం సోమశేఖరానికి ఫణికి తప్ప ఇంకొకరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఫణి ఆ విషయం ఆ క్షణంలోనే మరిచిపోయాడు. అందరు కలిసి తిరిగి వచ్చారు.
ఎవరి మనసులు మంచిగా లేకున్నా కరుణాకర్ రాధల పెళ్ళి ఆపకుండా జరిగిందనిపించారు. కరుణాకర్ కు ఇష్టం లేకపోయినా ఫణి ఊరుకోలేదు. పట్టుబట్టి జరిపించాడు.
“బాబు .. మా రాధకు ఏమి తెలియదు. అమాయకురాలు. మీరే దాన్ని అర్థం చేసుకుని బాగా చూసుకోండి, ” అల్లుడితో చెబుతూ కళ్ళనీళ్ళుపెట్టుకుంది.
“అత్తయ్య.. మీరేం బెంగపడకండి. రాధను నేను బాగా చూసుకుంటాను, అంతేకాదు. మీరు మాతోపాటే కలిసుంటారు. ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలిపెడతాము.. త్వరగా బయలుదేరండి, ” చెప్పాడు కరుణాకర్.
“అయ్యో నాయన.. మీ మధ్యలో నేనెందుకు.. నాకు ఒంటరిగా ఉండడం అలవాటే. అయినా నాకు మీరు కాకపోతే ఎవరున్నారు? ఓపిక ఉన్నంతకాలం ఇలాగే ఉంటాను,
ఓపిక లేనప్పుడు మీ దగ్గరకే వస్తాను నాయన.. మీరు తొందరలోనే ఓ మనవడిని ఇవ్వండి, నేను పెద్దదాన్ని అయిపోతున్నాను. ముందు ముందు చెయ్యలేకపోవచ్చు.
ఆ ముచ్చట కూడా తీరిపోతే నాకంతకన్న కావలసిందేముంది, ” కూతురిని ప్రేమగా చూస్తూ అంది.
“ఫో అమ్మా.. నీకన్నీ తొందరనే. నిన్నగాకా మొన్ననే కదా పెళ్ళైంది, అప్పుడే మనవడు కావాలంటే ఇదేమన్నా మంత్రాలతో అయ్యే పననుకున్నావా ఏంటి.. కొన్నాళ్ళు మేమిద్దరం సంతోషంగా కాలం గడపని.. అప్పుడు నువ్వన్నట్టు చూద్దాం, ” క్రీగంట భర్త కరుణాకర్ వైపు చూస్తూ అంది.
“నీకు తెలియదు రాధ .. ఇప్పటికే నీ వయసు ముప్పదిలోకి రాబోతుంది, ఇంకా లేటు చెయ్యడం మంచిది కాదమ్మా. ఏ వయసులో జరుగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందరికి మంచిది, సంతోషంగా గడపడమనేది పిల్లాడు పుట్టాక ఉండదేమిటి.. నేను చెప్పేదే చెబుతున్నా మీ ఇష్టం, ” అంది ముఖం చిన్నబుచ్చుకుంటూ.
“అలా ఏం లేదు లేండి. మీరన్నట్టుగానే సంవత్సరం తిరిగేలోపు మీ చేతిలో మనవడిని పెడతాము, నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళ ముద్దు ముచ్చటలు బుడి బుడి నడకలు చూస్తుంటే అంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది, రాధ.. మనం ఆ పనిలోనే ఉందాము సరేనా, ” అత్తగారితో చెబుతూ రాధ చెవిలో గుసగుసగా అన్నాడు.
“ఛీ పొండి,” అంది సిగ్గుపడుతూ రాధ.
“మా నాయనే ఎంతబాగా చెప్పావు. చాలు.. నాకు ఈ సంతోషం, ” ముసి ముసిగా నవ్వుతూ అంది విశాలాక్షి.
“సరే. మీరు మీ మనవడు వచ్చాక అక్కడనే ఉండాలి మరి, వాడి ఆలనాపాలనా మీదే బాధ్యత.
***
రాధ రోజు వస్తూ లలితను ఓదారుస్తూనే ఉంది. ఫణి ఆఫీసుకు వెళుతున్నాడే కానీ అనుక్షణం తల్లి తండ్రులు జ్ఞాపకానికి వస్తున్నారు. రోజులు యాంత్రికంగా గడుస్తున్నాయి.
కాలం ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు. కాలాలు మారుతున్నట్టే మనుషుల్లో మార్పులు సహజం. రాధలో చిన్న మార్పు మొదలైంది. రావడం తగ్గించింది. అదేమంటే ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువయింది అంటుంది.
“అన్నయ్య .. బొత్తిగా రావడం తగ్గిస్తున్నారు నువ్వు వదినా, వారం రోజులైనా రావడానికి కుదరడం లేదా మీకు, ఏమైందన్నయ్యా మేమేమన్నా తప్పుగా ప్రవర్తిస్తున్నామా, ” అడిగిందొకరోజు లలిత.
“అదేం లేదమ్మా .. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువయింది, ఆదివారం ఒక్కరోజు సెలవు దొరికితే మీ వదిన ఎక్కడికైనా వెళదామంటుంది, పెళ్ళి చేసుకున్న తరువాత తప్పదు కదామ్మా ఇలాంటివి, కాదంటే చిన్నబుచ్చు కుంటుందేమోనని ఏమనలేకపోతున్నాను అంతే, ” మనసు చివుక్కుమంది అలా చెబుతుంటే కరుణాకర్ కు.
కానీ తప్పడంలేదు. రాధ మునుపటిలా లేదని చెప్పలేకపోతున్నాడు.
“పోనిలే అన్నయ్యా మీరు సంతోషంగా ఉంటేచాలు, ” అంది లలిత నవ్వుతూ.
ఫణిలో గానీ లలితలో గానీ మునుపటి సంతోషం వేళాకోళాలు చిలిపి తగాదాలు అన్ని పోయాయి. యాంత్రికంగా రోజులు వెళ్ళదీస్తున్నారు. లలిత అనుక్షణం ఫణిని కనిపెట్టుకుని ఉంటుంది. అతని మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్యలోనే కొంచెం ఉత్సాహంగా ఉంటున్నాడు, బాబు ఆటలుపాటలను చూస్తూ.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

@swapnaj8931
•10 hours ago
Baagundi