ప్రేమ తీరాలు - పార్ట్ 5
- Lakshmi Sarma B
- Sep 15
- 7 min read
Updated: Sep 20
#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

Prema Theeralu - Part 5 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 15/09/2025
ప్రేమ తీరాలు - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు. పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది. లలిత గర్భవతి అవుతుంది. పండంటి బాబుకు జన్మనిస్తుంది. కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత కరుణాకర్, చెల్లెలు లలితల మధ్య దూరం పెరుగుతుంది.
ఇక ప్రేమ తీరాలు పార్ట్ 5 చదవండి.
“ఏమండీ! బాబుకు ఈసారన్నా పుట్టినరోజు చేద్దాము. వాడు పుట్టినప్పటినుండి ఇప్పటివరకు చెయ్యలేదు. వాడికప్పుడే ఐదేళ్ళు వచ్చాయి. వాడు అడుగుతున్నాడండి.. నా స్నేహితులందరు పుట్టినరోజులు చేసుకుంటున్నారు నాకెందుకు చెయ్యడం లేదని.
ఏమంటారు? పెద్దగా చేద్దామని కాదు. వాడి స్నేహితులవరకు చాలు, ” ఏమంటాడోనన్నట్టుగా భర్తవైపు చూడసాగింది.
“అవును లలితా. వాడు పుట్టినప్పటినుండి బారసాల తప్పా వాడి కోసం ఏ ఫంక్షన్ చెయ్యలేదు. ఈసారి వాడి ఫ్రెండ్స్ అందరిని పిలిచి పుట్టినరోజు చేద్దాము. మీ అన్నావదినకు ముందుగానే చెప్పాలి. సెలవు చూసుకుంటారు కదా.
లలితా! మీ వదిన ఎందుకు మనింటికి రావడం తగ్గించింది? ఏమైంటుందంటావు, ” అడిగాడు లలితను.
“ఏమోనండీ.. నాకు అదే అర్ధంకావడంలేదు. అదే అడిగాను అన్నయ్యను. సెలవు దొరికేది ఒక్క ఆదివారమే కదా ఎటైనా వెళదాము అంటుందట వదిన. వదిన మనసు కాదంటే బాధపడుతుందేమోనని తీసుకవెడుతున్నానని అన్నయ్య చెప్పాడు, ” అంది లలిత.
“అదేంటి వాళ్ళేమైన కొత్తగా పెళ్ళైనవాళ్ళు కాదే ప్రతి ఆదివారం బయటకు వెళ్ళడానికి.. పెళ్ళి చేసుకుని అప్పుడే నాలుగేళ్ళు అవుతుంది. ఈపాటికి ఇద్దరు పిల్లలు కూడా ఉండాల్సింది. ఇంకా ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటున్నారేమో.. పోనీలే మనకెందుకు..
సరే కానీ లలిత.. సాయంత్రం బాబును తీసుకుని షాపింగ్ కు వెళదాము. తయారుగా ఉండండి, ” చెబుతూ ఆఫీసుకు వెళ్ళిపోయాడు ఫణి.
‘అబ్బా ఎన్నాళ్ళయిందో ఈయన ఇలా మాట్లాడి.. ఎవరికైనా బాధ ఉంటుంది కన్న తల్లితండ్రులు పోతే కానీ ఈయన మరీ వాళ్ళతోటిదే లోకం అన్నట్టుగా పెరిగేసరికి తట్టుకోలేకపోయాడు. అందులో ఒక్కగానొక్క కొడుకు. తనే అలా బాధపడితే భూమిమీద పడ్డామో లేదో మమ్మల్ని అనాథలను చేసి పోయారు నా తల్లితండ్రులు.. నేనెంత కుమిలిపోవాలి.. మరిచిపోమ్మని కాదు గానీ నన్ను బాబును కూడా చూసుకోవాలి కదా. మాకు మాత్రం ఎవరున్నారు. మనసులో అనుకుంది లలిత.
“నాన్నా.. నాకు ఈ డ్రెస్ బాగుంది. ఇది తీసుకోండి. ఆ ఇదిగో.. ఇది ఇంకా బాగుంది. నాకు ఈ రెండు కావాలి, ” ఫణితో మారాం చెయ్యసాగాడు కపర్ధి.
“అలాగే బాబు. నీకు ఏది కావాలన్నా కొనిస్తాను .ఏమేమి కావాలో చూసుకో, ” కొడుకు తలను ఆప్యాయంగా నిమురుతూ చెప్పాడు.
“ఓ మా మంచి నాన్న, ” అంటూ తండ్రి బుగ్గన ముద్దుపెట్టాడు.
“ఏమండి .. మనం ఇలా షాపింగ్ చేసి ఎంత కాలమైందో కదా!, ” అంది భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని మెత్తగా నొక్కి వదిలేసింది.
“నిజమే లలిత.. ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా బాధపెట్టాను, నేనేం చేస్తున్నానో అర్థం చేసుకోలేకపోయాను నేను నా తల్లితండ్రులు పోయారన్నా బాధలో ఉన్నానే కానీ, నిన్ను బాబును పట్టించుకోక ఎంత వేదనకు గురిచేసానో ఇప్పడర్థమౌతుంది. లలిత.. ఇక జీవితంలో నిన్నెప్పుడు ఇబ్బందిపెట్టను, నువ్వు నన్నెంత ప్రేమగా చూసుకుంటావో నేను అలాగే చూసుకునేవాడిని. ఏమిటో పరిస్థితులు అలా మారిపోయాయి, ఇక ముందు
బాబును నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను, ” పక్కన ఉన్న వాళ్ళు తమను చూస్తారేమోనన్న ధ్యాస కూడా లేకుండా ఆవేశంతో లలితను గుండెలకదుముకున్నాడు.
“అయ్యో ఏమండి.. అందరు మననే చూస్తున్నారు వదలండి, ” అనుకోని అతని చర్యకు సిగ్గుపడుతూ ఫణిని దూరంగా జరిపింది లలిత.
“ఓ.. ఆవేశంలో చూసుకోలేదు సారీ లలిత, ” అంటూ చుట్టుచూసాడు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. వీళ్ళను పట్టించుకున్న వాళ్ళే లేరు. దూరంగా బొమ్మలను చూస్తున్న కపర్ధి దగ్గరకు నడిచారు ఇద్దరు. బాబుకు నచ్చిన బొమ్మలు డ్రెస్సులు షూలు అలాగే లలితకు చీరెలు ఫణి కోసం డ్రెస్సులు తీసుకుని తిరిగి వచ్చేముందు హోటల్ కు వెళ్ళి డిన్నర్ చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చారు.
కపర్ధికి చెప్పలేనంత ఆనందంగా ఉంది ఒకేసారి అన్ని వస్తువలు కొనుక్కోవడంతో. రేపు స్కూల్ లో స్నేహితులందరికి చెప్పడానికి ఉవ్విళ్లూరుతున్నడు. లలితకు మళ్ళి మునుపటి
రోజులు వచ్చినందుకు మనసారా భగవంతుడికి మనసులో దండంపెట్టుకుంది.
“ఏమండి.. చాలా బిల్లు చేసారు ఈ రోజు షాపింగ్ లో. పుట్టినరోజు ఫంక్షన్ లో మళ్ళి బాగానే ఖర్చవుతుంది, మీరు గమనించారా బాబును ఎన్నడు చూడని ఆనందం వాడి కళ్ళల్లో కనిపిస్తుంది, ” బాబు పడుకున్న తరువాత భర్త దగ్గరకు వచ్చి అతని గుండెలమీద పడుకుంటూ అడిగింది లలిత.
“అవును లలిత.. వాడిలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఉత్సాహం కనిపించింది. అంతే కాదట.. రేపు స్కూల్‌లో వాడి స్నేహితులందరికి చెబుతాడట మా నాన్న చాలా గొప్పవాడు నేనడిగిందల్లా కొనిచ్చాడని. పాపం కల్మషం లేని పసిహృదయం కదా లలిత.. ఇక బిల్లంటావా..నేనేం అనవసర ఖర్చు పెట్టలేదు. పైగా పరాయివాళ్ళకు కొనలేదు కదా, ” లలితను ప్రేమగా చూస్తూ అన్నాడు.
“ఏమండి.. రేపొకసారి అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళి వద్దాము, పిలిచినట్టవుతుంది ఒకసారి. వెళ్ళినవాళ్ళము అవుతాము ఏమంటారు, ”
“అలాగే వెళదాము.నేను ఆఫీసునుండి వచ్చేవరకు తయారుగా ఉండండి వెళదాము, ” చెబుతూ తమకంగా అల్లుకుపోయాడు లలితను.
******* ******* ******* ********
“రామ్మా లలిత బాగున్నావా? ఏంటి చెప్పాపెట్టకుండా వచ్చారు, రా ఫణి ఇలా కూర్చో. ఓరేయ్ అల్లుడా.. ఏంటి బలే ఉత్సాహంగా కనిపిస్తున్నావు.. ఏంటి సంగతులు, ” మేనల్లుడిని అమాంతంగా ఎత్తుకుంటూ అడిగాడు కరుణాకర్.
“మామయ్య.. నేనేం చిన్నపిలాడిని కాదు నన్ను దింపు కిందకు, ” చటుక్కున మామ చేతిలోనుండి కిందకు జారాడు కపర్ధి.
“ఓర్నీ భడవా.. ఇంతలేవు అప్పుడే పెద్దాడివి అయిపోయానంటావేంటిరా, ఏంటి ఫణి వీడిలో ఇంత మార్పు?ఇన్నాళ్ళు పెద్దగా మాట్లాడకపోయేవాడు, ”
“అదా.. అది వాడి పుట్టినరోజు వస్తుంది కదాని వాడడిగినవన్ని కొన్నాము. అప్పటినుండి సంతోషమెక్కువయి ఇలా మాట్లాడుతున్నాడు, ” నవ్వుతూ కొడుకువైపు చూస్తూ అన్నాడు.
“ఏంటి సంగతులు కొత్తగా వింటున్నాను” అన్నట్టుగా లలితవైపు చూసాడు కరుణాకర్.
“అన్నయ్యా .. వాడు అలా ఉండడానికి కారణం అదొక్కటే కాదు, వాళ్ళ నాన్న మాతో ఇదివరకు ఫణిలాగా ఉండడం కూడా. ఇప్పుడు మేమిద్దరం గాలిలో దూదిపింజాల వలే ఎగిరిపోతున్నామంటే నమ్ము. వదిన ఎక్కడన్నయ్యా ఇంట్లో లేనట్టుంది షాపింగ్ కు వెళ్ళిందా, ” లోపలకు చూస్తూ అడిగింది.
“షాపింగ్ కాదు కానీ ఈ మధ్యన ఒక కొత్త స్నేహితురాలు పరిచయమైంది. రోజు ఆఫీసు హడావుడే కదా సెలవు దొరికినప్పుడు అలా తిరిగి వస్తుంటారు. నన్ను రమ్మంటుంది. నాకంత ఓపిక ఉండదు. సరే ఎలాగు తోడు దొరికింది కదా వెళ్ళిరాని అనుకుంటాను, ” చెప్పాడు కరుణాకర్.
“మరి ఆరోజు అలా చెప్పావేంటన్నయ్యా? వదినతో పాటు బయటకు వెళతాను.. రావడానికి కుదరడం లేదని? అన్నయ్యా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ఏమైందో చెప్పు, ”
“అరే అదేం లేదురా లలిత.. ఎప్పుడో ఒకసారి కుదరదని చెబుతాను అంతే, ” నాలిక కరుచుకుంటూ అన్నాడు.
“బావా. రేపు బాబుది పుట్టినరోజు. నువ్వు రాధ తప్పకుండా రావాలి. అందరికి ఫోన్ చేసి చెప్పాము. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అలాగే ఇంటికి వచ్చి చెప్పినట్టవుతుందని లలిత నేను చెప్పడానికి వచ్చాము. రాధకు చెప్పి తీసుకుని రండి. అంతేకాదు దగ్గరుండి అన్ని మీరే చూసుకోవాలి, ” చెబుతూ లేచాడు వెళదామన్నట్టుగా లలితవైపు చూస్తూ.
“అరే అప్పుడే వెళ్ళిపోతున్నారు.. రాధ వస్తుంది ఉండండి. రాత్రికి ఇక్కడే డిన్నరు చేసి వెళ్ళాలి. మీరు వెళ్ళిపోతే రాధ వచ్చాక నాతో గొడవపడుతుంది. చాలా రోజుల తరువాత వచ్చారు కాదనకండి. నేనిప్పుడే రాధకు ఫోన్ చేస్తాను, ” ఫోన్ తీసుకుని లోపలకు వెళ్లాడు.
“హలో రాధ .. ఎక్కడున్నావు.. మా చెల్లి వాళ్ళు వచ్చారు. త్వరగా ఇంటికి వస్తావా? వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు. నువ్వు వచ్చేవరకు ఉండమన్నాను. ఏం కుదరదా.. ఎందుకు? యాదగిరిగుట్టకు వెళ్ళారా.. రాత్రి పదవుతుందా.. సరే నీఇష్టం, ” ఫోన్ పెట్టేసి మోమున నవ్వు పులుముకుంటూ వచ్చాడు.
“ఏమన్నది వదినా వస్తున్నదా, ”
“లేదమ్మా .. వాళ్ళ స్నేహితురాళ్ళందరు బలవంతం చేస్తే యాదగిరిగుట్టకు వెళ్ళారట. వచ్చేవరకు రాత్రవుతుందట. పోని నేను వంటచేస్తాను.. నాకు అలవాటే కదా. మీరు ఇలా కూర్చొని టీవి చూస్తుండండి, ” ఇంటికి వచ్చిన. ఆడపడుచుకు పట్టెడన్నం పెట్టలేని తన పరిస్థితికి తనలో తానే కుమిలిపోసాగాడు కరుణాకర్.
లలితకు ఫణికి కరుణాకర్ పరిస్థితి కొంచెం కొంచెం అర్థంకాసాగింది. రాధ కరుణాకర్ ను పట్టించుకోవడం లేనట్టుందనుకున్నారు ఎవరి మనసుల్లో వాళ్ళే.
“అన్నయ్యా.. నువ్వేం ఇబ్బంది పడక్కరలేదు. ఇంట్లో వంటంతా ఉంది, ఊరికే ఇలా కలిసి వెళ్దామని వచ్చాము. వదిన ఉన్నప్పుడు మరోసారి వస్తాము, ” అంటూ చెప్పి బయలుదేరారు.
వాళ్ళు వెళ్ళినవైపే చూస్తూ తనలో తానే అనుకోసాగాడు. రాధను కోరి చేసుకున్నాడు గానీ ఆమె కోరికలకు అంతే లేకుండా పోతుంది. షికార్లంటుంది సినిమాలంటుంది. ఎప్పుడు.. ఏదో ఒక షాపింగ్ అని డబ్బులన్ని దుబారా చేస్తుంది. ఏమన్నంటే ఏం మీ చెల్లెలికి పెట్టాలని చూస్తున్నారా.. అంటుంది. నా సంపాదన నా ఇష్టమున్నట్టు ఖర్చుపెట్టుకుంటాను మీ సొమ్మేమిపోతుంది అని గొడవ. లలితను చూస్తే మండిపడుతుంది. వాళ్ళింటికి వెళ్ళొద్దంటుంది. వాళ్ళు మనింటికి రాకూడదని ఆంక్షలు..
ఛీ ఛీ అందుకే పెళ్ళిచేసుకోకూడదని అనుకుంటే లలిత పట్టువదలలేదు. సరిగ్గా రాధ కలవడం, మనిషి మంచిదనుకోవడం నాదే పొరబాటు. “తెల్లనివన్ని పాలు కాదు నల్లనివన్ని నీళ్ళు కాదని” ఊరికే అంటారా. లలితకు చెప్పి బాధపెట్టలేను నాలో నేను కుమిలిపోవడం తప్పా.
***
“రండి వదిన బాగున్నారా ? చాలా రోజులైంది మనం కలిసి, ” అన్నావదిన రాగానే ఎదిరెళ్ళి ఆప్యాయంగా అడిగింది లలిత.
“ఆ బాగున్నాము. మొన్న మీరు వస్తున్నట్టు ముందుగా చెప్పలేదు, ” పొడిపొడిగా మాట్లాడింది రాధ.
“సాయంత్రం కదా ఇంట్లోనే ఉంటారు అనుకుని బయలుదేరాము. అన్నయ్య ఉన్నారు కదా పరవాలేదు లే వదినా. మేమే ఫోన్ చేసి రావలసింది, ” నొచ్చుకుంటూ చెప్పింది.
“అంతేకదా మీ అన్నయ్య ఉంటే చాలు .. అహా కనీసం మీ అన్నయ్యనన్నా ఉన్నాడు అంటున్నాను, ” అంది. విని మౌనంగా ఊరుకుంది లలిత. తనేదో అని వదినేదో మాటలు పెంచుకునేకంటే మౌనంగా ఉన్నది ఉత్తమం అనుకుంది.
పుట్టినరోజు వేడుక చాలా బాగా జరిగింది. కపర్ధి స్నేహితులతో బలె సరదాగా గడిపాడు. చెప్పిన వాళ్ళందరు వచ్చినందుకు సంతోషపడ్డారు లలితా ఫణి. కరుణాకర్ అందరిలో కలివిడిగా తిరుగుతూ అందరికి అన్ని అందుతున్నాయో లేదో చూడసాగాడు.
రాధ మాత్రం తనో గెస్ట్ లాగా ఓ పక్కన కూర్చొని ఫోన్ మాట్లాడుతూనే ఉంది. తనకేం మాత్రం సంబంధం లేని వాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించసాగింది. లలిత ఎవరికైనా మా వదినా అని పరిచయం చేసినా ఓ చిన్న నవ్వు విసిరి అలాగే కూర్చుంది తప్పా లేచి ముందుకు రాలేదు. కరుణాకర్ కు భార్య ప్రవర్తన చూస్తుంటే నామోషీగా అనిపించసాగింది.
లలిత ఫణిలకు రాధ బాగా అర్ధంకాసాగింది. అందరు వెళ్ళిపోయారు. కరుణాకర్ లలిత దగ్గరకు వచ్చి లలిత చేతులుపట్టుకుని..
“లలిత .. నన్ను క్షమించమ్మా. మీ వదిన తీరు నిన్ను బాధపెట్టిందని తెలుసు, కానీ ఏం చెయ్యను.. ప్రతి విషయం తను చెప్పినట్టే చెయ్యాలని చాలా మూర్ఖంగా సాధిస్తుంది. సమయం దొరికినప్పుడు తీరికగా మాట్లాడుతాను, ” రాధ ఎక్కడ వింటుందోనని మెల్లిగా చెప్పి “ వెళ్ళొస్తాను ఫణి. ఒరేయ్ మేనల్లుడా.. పుట్టినరోజు బ్రహ్మాండంగా చేసుకున్నావు వస్తాను, ” చెప్పి గబగబా వెనుదిరిగాడు ఆ పక్కనుండి లేని నవ్వును పులుముకుంటూ.
“ఉంటాను లలిత.. బాధలన్ని మరిచిపోయి పుట్టినరోజు వేడుక బాగానే చేసారు,” అంది నిష్టూరం ధ్వనించే స్వరంతో. రాధ అన్న మాటలకు ఇద్దరు స్తబ్ధులుగా చూస్తూ నిలుచున్నారు ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ.
***
కాలచక్రం గిర్రున ఓ ఐదేళ్ళు ముందుకు పరుగెత్తింది. ఈమధ్య కాలం జరుగవలసిన పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. కపర్ధి ఇప్పుడు ఐదో తరగతిలో చేరాడు. మంచిచెడు అర్థం చేసుకోగలుగుతున్నాడు. లలితకు కాస్త శ్రమ తగ్గింది. ఫణి దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాడు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా ఆప్యాయతలు అనురాగాలు పంచుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు.
కరుణాకర్, లలిత కుటుంబం కలవడం చాలా తగ్గిపోయింది. ఏ రెండునెలలకోసారి కుదిరితే కరుణాకర్ వచ్చి వెళుతున్నాడు అది చాలా తక్కువ సమయం ఉండి వెళుతున్నాడే కానీ రాధలో మార్పేమిటో చెప్పలేకపోతున్నాడు. మనము అడుగడమెందుకు తనకిష్టమైనప్పుడు తనే చెబుతాడులే అని లలితవాళ్ళూ అడగడంలేదు.
రోజు లలితనే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకుని భర్త కొడుకు లేచేవరకు టిఫిన్ లంచ్ బాక్స్ తయారుగా పెడుతుంది. ఫణి లేచి కపర్ధిని లేపుతాడు ఇద్దరు తయారయి వచ్చి, ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు. పని హడావుడిలో పడి వాళ్ళను గమనించలేదు లలిత.
అరే ఇదేమిటి ఎనిమిదవుతున్నా తండ్రికొడుకుల అలికిడి లేదు. ఈపాటికి వచ్చి టిఫిన్ తినడానికి కూర్చోవాలి కదా అనుకుంటూ కొడుకు పడుకున్న గదివైపు చూసింది. కపర్ధి ఇంకా పడుకునే ఉన్నాడు.
“ఒరేయ్ కపర్ధి ఏమిట్రా.. ఇది స్కూల్ టయం అయిపోతుంది ఇంకా అలానే పడుకుంటే ఎలా, నువ్వు లేచి తయారయ్యేసరికి బస్సు కూడా వెళ్ళిపోతుంది ఏం మొద్దునిద్ర రా, సరే నువ్వు పడుకున్నావు మీ నాన్నెందుకు లేపలేదు అసలు ఆయన కూడా లేచాడా లేదా, ” అనుకుంటూ భర్త పడుకున్న పడకగదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోతూ.
“ఏమండోయ్ శ్రీవారు ఈ రోజు ఆదివారమనుకున్నారా ఏంటీ దుప్పటి కప్పుకుని పడుకున్నారు, బలే వారే అన్ని రడి చేసి టేబుల్ మీద పెట్టాను త్వరగా లేవండి ఆఫీసు టయం అయిపోతుంది, ”
స్నానం చేసాక పనంతయ్యేవరకు పక్క బట్టలు ముట్టదు. అందుకని దూరంగా నిలుచుని గట్టిగా పిలిచింది. ఉలుకుపలుకులేదు ఫణి దగ్గరనుండి.
ఇదేమిటి ఇంత గట్టిగా అన్నా కూడా లేవడంలేదు.. ఇంతలా ఎప్పుడు పడుకోడే. చీమ చిటుక్కుమంటే లేచి కూర్చుంటాడు.. కంగారేసి భర్తను తట్టిలేపబోయింది. ఒళ్ళు కాలిపోతోంది.
‘అయ్యో.. ఇదేమిటి.. రాత్రి బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఒళ్ళు చూస్తే వేడిగా
ఉంది.’
“ఏమండి .. ఏమండి.. ఏమైంది ఇలా చూడండి, లేవండి నాకు భయంగా ఉంది,” భర్తను తట్టి లేపింది కప్పుకున్న దుప్పటితీసివేస్తూ. మెల్లిగా ములుగుతూ కళ్ళు తెరిచి లలితవైపు చూసాడు.
“దాహం .. దాహం.. లలిత మంచినీళ్లు, ” మగతగా అడిగాడు.
“ఇదిగో తాగండి. నెమ్మదిగా ఇలా కూర్చోండి, ” తన వైపు ఆనించుకుని నీళ్ళు తాగించింది.
“ఏమండి.. రాత్రంతా బాగానే ఉన్నారు కదా. ఇంతలోనే ఈ మాయదారి జ్వరం ఏంటి.. మీరు బయట ఏమన్నా తిన్నారా ఏదో పడినట్టులేదు, ”
“లలిత .. నాకు ఏదో అవుతోంది. నన్ను హాస్పిటల్ కు తీసుకవెళ్ళు, ” మాటలు తడబడుతుండగా మెల్లిగా చెప్పాడు.
“అయ్యో ఏమౌతుందండి.. ఉండండి క్యాబ్ బుక్ చేస్తాను, ” పక్కనే ఉన్న ఫణి ఫోన్ తీసుకుని క్యాబ్ బుక్ చేసి భర్తను మెల్లిగా పడుకోబెట్టి ఇన్సూరెన్స్ కార్డు డబ్బులు తీసుకుని, బాబును ఇంటి ఓనరు సావిత్రమ్మకు అప్పగించే లోపల క్యాబ్ వచ్చింది. పక్కింటి వాళ్ళ సాయంతో హాస్పిటల్‌కు తీసుకవచ్చింది. నర్సులు వార్డ్ బాయ్ వచ్చి లోపలకు తీసుకెళ్లారు ఫణిని.
మనసులో భయపడుతూనే దేవుళ్ళందరికి దండంపెడుతూ కూర్చుంది డాక్టర్లు
ఎప్పుడు పిలుస్తారోనని ఎదురుచూస్తూ.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

@kpj6968
•5 hours ago
Story excellent
@swapnaj8931
•9 hours ago
Katha bagundi