ప్రేమ తీరాలు - పార్ట్ 3
- Lakshmi Sarma B
- Sep 4
- 7 min read
Updated: Sep 9
#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

Prema Theeralu - Part 3 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 04/09/2025
ప్రేమ తీరాలు - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు. పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది. లలిత గర్భవతి అవుతుంది.
ఇక ప్రేమ తీరాలు పార్ట్ 3 చదవండి.
తొమ్మిది నెలలు పసిపాపలా చూసుకున్నారు లలితను అత్తమామలు. కరుణాకరైతే కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందోన్నట్టుగా చూడసాగాడు. పుట్టబోయ బిడ్డను ఎప్పుడెప్పుడు చూసుకోవాలన్న ఆదుర్దాలో ఉన్నాడు ఫణి. భార్యకు పళ్ళరసాలు, పాలు, మంచి మందులు ఇప్పిస్తున్నాడు. అందరు ఎదురు చూస్తుండగా పండంటి బాబుకు జన్మనిచ్చింది లలిత. మనవడిని చూసుకుని మురిసిపోయారు నాయనమ్మ, తాత.
బోసినవ్వుల మేనల్లుడిని చూసి పట్టరాని ఆనందంతో తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి మేనల్లుడికి వేసాడు కరుణాకర్. అలసిపోయిన లలితను చూస్తుంటే మనసంతా మెలిపెట్టినయింది ఫణికి. ఒకచేత్తో బాబును సంతోషంతో హృదయానికి హత్తుకుంటూ లలితను ఆర్తిగా చూస్తూ నుదిటిమీద చుంబించాడు ఫణి.
కాలం ఎవరికోసం ఎదిరి చూడదు కదా తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది. లలిత దాంపత్యం అన్యోన్యంగా ఉంది. బాబు పుట్టినప్పటి నుండి వాడితోటిదే లోకం అయిపోయింది ఇల్లు భర్త పసివాడు ఇదే ఆమె లోకం. అప్పుడప్పుడు అలివేలు రాజశేఖరం వచ్చి వెళుతుంటారు.
“మామయ్యా! మీరు మాతోపాటే ఉండండి. మీరక్కడ ఒంటరిగా ఉండడమెందుకు.. అందరం కలిసే ఉందాము. చిన్నవాడిని మీరే పెంచాలి. మీ అబ్బాయిని పెంచినట్టుగా, మీ చేతుల్లో వాడు ప్రయోజకుడు కావాలని ఉంది మామయ్య” ఈసారి రాజశేఖరం వాళ్ళు వచ్చినప్పుడు అడిగింది లలిత.
“ లలిత .. ఎప్పుడైనా మీ దగ్గరకు రావలసిన వాళ్ళమేనమ్మా, కాకపోతే ఇంకా కొన్నాళ్ళు అక్కడే ఉంటాము. పొలం పుట్రా ఉన్నాయి, వీడా అక్కడికి వచ్చి పొలం పనులు చూసుకోడు. మనం లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జా చేస్తారు. మాకు ఓపిక ఉన్నంతవరకు అక్కడే ఉంటాము. ఈ ఇరుకు గదుల్లో మాకు సరిపోదమ్మ. పల్లెటూరి పచ్చగాలులు మా వంటికి సరిపోతాయి. తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మీ దగ్గరకే వస్తాం తల్లి, ” ఆప్యాయత కూడిన స్వరంతో చెప్పాడు రాజశేఖరం.
“నిజమే లలిత.. మీ మామయ్య చెప్పినట్టు ఈ పట్నవాసం వాతావరణంలో మేము ఇమడలేము. బయటకు పోవాలంటే ఒక్కటే హంగామా. రోడ్డు దాటలేము, ఏ పక్కనుండి
ఏం వచ్చి గుద్దుతుందో అర్థంకాదు. ఒక మనిషి సహాయం లేకుండా ఎక్కడకు వెళ్ళలేము స్వతంత్రంగా. కూరగాయలు కూడా మన ఊర్లో ఉన్నట్టుగా ఉండవు. ఏదో మందువాసన.
అరే ఆ పనిమనిషినే చూడు.. ఇక్కడో కాలు అక్కడో కాలన్నట్టు ధనాధనా గిన్నెలు కడిగి నిమిషంలో బట్టలు ఉతికి పరుగులు పెడుతుంది. ఏమన్న గిన్నెలకు అంట్లు పోతుందా? బట్టలు చూడు చిన్నవాడు బాత్రూం పోయిన బట్టల మరకలు కూడా పోలేదు.
ఏమన్నంటే ఎక్కడ మానివేస్తుందోనని భయం. తనడిగినంత డబ్బిచ్చిన మనమే భయపడడం.. ఆదే మన ఊర్లో అయితే ఎంత కమ్మటి వాసన వస్తాయి బట్టలు. చెరువుకు తీసుకెళ్లి ఉతికి తెస్తారు. ఇదొక్కటే కాదు గానీ ఇంకా కొన్నాళ్ళు మేము అక్కడే ఉంటాము. ఇదిగో ఇలా అప్పడప్పుడు వస్తుంటాము. మీకు వీలున్నప్పుడు అక్కడకు వస్తుంటారు. నా మనవడికేం తల్లి చక్కటి పెంపకంలో నీ దగ్గరనే పెరుగుతాడు, ” అంది మనవడిని ముద్దాడుతూ.
“అబ్బా.. అమ్మా.. ఇక్కడకొచ్చెయ్యడంటే చాటభారతం చెప్పావేగానీ వస్తానని మాత్రం అనలేదు. సరే మీ ఇష్టం. మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే రండి, ” చెప్పాడు ఫణి.
“బాబు .. మేము యాత్రలు తిరిగివద్దామనుకుంటున్నాము, మన ఊరినుండి బస్సు తీస్తున్నార.ట అంతా మాలాంటి వాళ్ళే. అన్ని వాళ్ళే చూసుకుంటారట. భోజనం టిఫిన్ పెడతారట. మనిషికి పదిహేను వేలు తీసుకుంటున్నారు. మేము వెళదామను కుంటున్నాము ఏమంటావు, ” అడిగాడు కొడుకును.
“అదేమిటి అలా అడుగుతున్నావు.. సంతోషంగా వెళ్లండి. డబ్బులు నేను కడతాను. కానీ జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎక్కడా డబ్బులకోసం ఇబ్బందిపడకండి. మీకు ఓపిక ఉన్నప్పుడే కదా వెళ్ళగలుగుతారు.. ఎప్పుడు బయలుదేరుతున్నారు.. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. అమ్మను చేతిపట్టుకుని నడవండి, ” జాగ్రత్తలు చెప్పాడు.
“సరిలేరా. నేనేమన్నా చిన్నపిల్లననుకున్నావా ఏంటి? మీ నాన్నకంటే నేనే బాగా నడవగలను. వచ్చేవారమే వెళదామన్నారు. అందుకే ఒకసారి మనవడిని తృప్తిగా చూసుకుని మీతోపాటు వారంరోజులు కలిసి ఉందామని వచ్చాము. యాత్రలనుండి తిరిగి వచ్చాక ఓపిక ఉంటుందో ఉండదో, మనవడితో మళ్ళి ఇలా ఆడుకుంటామో లేదో అలసిపోయి వస్తాము, ” మనవడికి కితకితలు పెడుతూ నవ్వుతూ అంది.
“అత్తయ్యా ఏమిటా మాటలు .. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలి, చక్కగా ఇక్కడికే వచ్చెయ్యండి. ఇక్కడే విశ్రాంతి తీసుకుందురు, మీకు భయంగా ఉంటే వెళ్లకండి అత్తయ్యా. ఇంట్లో మీరు చేసుకుంటున్న పూజలు సరిపోవా చెప్పండి, మీ మనవడు కొంచెం పెద్దవాడవ్వనివ్వండి అప్పుడందరం కలిసి వెళదాం, ఏమండి మీరు చెప్పండి. అత్తయ్య మామయ్య మనం లేకుండా ఒంటరిగా వెళ్ళడం ఎందుకు, ” అడిగింది ఫణిని, అత్త అలివేలు మాట్లాడిన మాటలు లలితకు ఏవో అపశకునంగా వినిపించి.
“బలేదానివమ్మా వయసు మీద పడుతుంది గాని తగ్గడం లేదమ్మా మాకు, ఆరోగ్యం సహకరించినప్పుడే చేసుకోవాలి ఏదైనా. నడవలేని స్థితిలో ఏం వెళతాము, అడుగు తీసి అడుగు వెయ్యలేము. ముందే మీ అత్తకు మోకాళ్ళ నొప్పులు. ఇంకా నాలుగురోజులు పొయ్యాయంటే ఈ మాత్రం కూడా నడవలేదేమో, మీరేం భయపడకండి. వాళ్ళు దగ్గరుండి అన్ని చూసుకుంటారు. వాళ్ళకిదేం కొత్తకాదు. రెండునెలలకోసారి యాత్ర తీస్తూనే ఉంటారు, లలిత, బాబు.. మీరు జాగ్రత్తగా ఉండండి. మా మీద బెంగపెట్టుకోకండి సరేనా, ” చెప్పాడు రాజశేఖరం.
“అలాగే నాన్న .. ఇదిగో ఈ డబ్బులు దగ్గర పెట్టుకోండి, మీరు వెళ్ళే రెండోరోజుల ముందు మేము వస్తాము నాన్న, ” తల్లి తండ్రుల కాళ్ళకు నమస్కారం చేస్తూ చెప్పాడు ఫణి.
“పరవాలేదు రా. అనవసరంగా ఎందుకు.. చిన్న పిల్లవాడితో శ్రమపడతారు, ఇప్పుడు కలిసాము కదా. ఇంకో నాలుగు రోజులకే కదా వెళ్ళే. మళ్ళి మీరు రావడమెందుకు.. అది సరేగానీ నీకు వీలున్నప్పుడు ఒకసారి ప్రశాంతంగా వస్తే మన పొలం విషయాలు మాట్లాడుకుందాము. ఆ పొలం నీ పేరు మీద చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. ఎప్పుడడగినా ఇదిగో అంటూ దాటవేస్తున్నావు,
గుంటకాడ నక్కలాగా ఎప్పుడు స్వాహా చేద్దామానీ మా అన్నయ్య పిల్లలు ఎదురు చూస్తున్నారు, ” చెప్పడం ఆపాడు రాజశేఖరం.
“అదేంటి నాన్న .. వాళ్ళకేం అవసరం.. అది మన పొలం. వాళ్ళది వాళ్ళకున్నది కదా. మనది ఎందుకు తీసుకుంటారు, మీరనవసరంగా భయపడకండి. ఎక్కడికీ పోదు. మీరు తిరిగి వచ్చాక మీరన్నట్టుగానే చేసుకుందాము. సరేనా, ” తండ్రి భుజం తడుతూ అన్నాడు.
“అయ్యో ఫణి.. నీకు తెలియదురా వాళ్ళకు ఊరంతా తీసుకోమన్నా తీసుకుంటారు. అంత ఆశ మనుషులకు, మన పొలం ఇప్పటికే సగం మూడుపాళ్ళు వాళ్ళ దాంట్లో కలుపుకున్నారు. ఏమన్నంటే ఊర్లో అందరు వాళ్ళ తరుపునా మాట్లాడేవాళ్లే. మీ కొడుకు పట్నంలో మంచిగానే సంపాదిస్తున్నాడు పాపం వాళ్ళకు ఆధారం ఇదే కదా
అంటారు. పోని అంటే ఆ పొలం మొత్తం మీ పెదనాన్న పేరు మీదనే ఉంది. మీ నాన్న అడిగినప్పుడల్లా నా మీద నమ్మకం లేదా నేనేమన్నా నీకు అన్యాయం చేస్తానా అంటాడు. అందుకే మీనాన్న నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నాడు నీ పేరన చేయించుకోమ్మని. మీ నాన్న మంచిగా ఉన్నప్పుడయితేనే మన మాట వింటారు. లేదంటే మొత్తం వాళ్ళే దక్కించుకుంటారు బాబు, ” ఆయాసపడుతూ చెప్పింది అలివేలు.
“అబ్బా నువ్వాపవే అలివేలు. అంతగా ఆయాసపడుతూ చెప్పనవసరం లేదు. వాడు చూసుకుంటాడులే. నువ్వేం బెంగపడకు. పద మనకు సమయం అవుతుంది, ” అంటూ బ్యాగులు తీసుకుని మరోసారి మనవడిని ముద్దాడి బయలుదేరారు. ఫణి కార్లో తీసుకెళ్లి బస్సు ఎక్కించి వచ్చాడు.
***
“ఏమండి .. ఈ సారి ఎలాగైనా సరే మీరు ఊరికి వెళ్ళి ఆ పొలం పనులు ఏదో ఒకటి చేసుకుని వచ్చారంటే మామయ్యకు బెంగపోతుంది, ఇక వాళ్ళు అక్కడున్న ఇక్కడున్న ఒకటే కదా! పెద్దవాళ్లు అవుతున్నారు మనతోపాటుగా ఉంటేనే మంచిది.
పల్లెటూరులో పెద్ద హాస్పిటల్ ఉండదు. ఏ ఇబ్బంది అయినా మనము వెళ్లాలంటే గబుక్కున వెళ్ళలేము. ఎంత లేదన్న రాత్రి వెళితే గానీ ఏ ఉదయమో దిగుతాము.
అందుకని వాళ్లు తిరిగిరాగానే మీరు ఆ పనిలో ఉండండి, ” చెప్పింది లలిత భర్తతో.
తల్లి తండ్రి ప్రేమకు నోచుకోలేదు కనీసం అత్త మామాలతోనైనా కలిసుండాలని కోరిక లలితకు.
“అలాగే లలిత.నువ్వన్నట్టు వాళ్ళు మన దగ్గర ఉండడమే మంచిది, ఇన్నాళ్లుగా నేనాలోచించలేదు గానీ నాన్నను చూస్తుంటే వార్ధక్యం చాయలు బాగానే కనిపిస్తున్నాయి. తొందరలోనే వాళ్ళను పిలుస్తాను ఇక్కడకు, ” చెబుతూ బాబును ఎత్తుకుని ముద్దాడసాగాడు.
“లలిత.. నీకో శుభవార్త. ఫణి ఎక్కడమ్మా, ” ఉత్సాహంతో వచ్చాడు కరుణాకర్.
“ఏంటన్నయ్యా అంత ఆనందంగా ఉన్నావు, ” అడిగింది లలిత.
“నేను చెప్పనా. మీ అన్నయ్యకు పెళ్ళి కుదిరిందేమో కదా బావా, ” అన్నాడు లోపలనుండి నవ్వుతూ వస్తూ.
“సరేలేండి. మీ నోటి పుణ్యమాని మా అన్నయ్యకు పెళ్ళి కుదిరితే మీ నోటి నిండా పంచదార పోస్తాను, ఎంతగా బ్రతిమాలినా పెళ్ళిచేసుకోమంటే ససేమిరా ఒప్పుకోవడంలేదు. అమ్మా నాన్న ఉండి ఉంటే ఎప్పుడో పెళ్ళిచేసి ముగ్గురు పిల్లల తండ్రిని చేసేవారు. నాకా అదృష్టం ఇవ్వరా. నేనే దగ్గరుండి పెళ్ళి చేస్తాను అంటే
ఓ పట్టానా సరే అనడంలేదు. ఇంతకు నువ్వు చెప్పే శుభవార్త ఏంటన్నయ్యా, ”
“ఏది.. మీరు చెప్పనిస్తేనా.. మీరే మాట్లాడుతున్నారు, నాకు పెళ్ళి కుదిరిందమ్మా. రాధ అని మా ఆఫీసులోనే పని చేస్తుంది, ఈ మధ్యనే కొత్తగా వచ్చింది. చూడడానికి
బాగుంటుంది. నెమ్మదస్తురాలు. కాకపోతే రెండో సంబంధం. మొదటిది మోసం చేసి పెళ్ళి చేసుకున్నారట. తరువాత తెలిసి విడిపోయారట. నాకు మాత్రం ఎవరు దొరుకుతారమ్మా చెప్పు ?
మనకు నా వాళ్ళంటూ ఎవరులేరు. ఆస్తిపాస్తులు అంతకన్నా లేవు, వయసు చూస్తే మూడుపదులు దాటింది. తనంత తానుగానే పెళ్ళి విషయం తీసింది. నేను వారం రోజులు సమయం తీసుకుని చెప్పాను. నాకు పరవాలేదనిపించింది. పైగా నువ్వు రోజు పోరు పెడుతున్నావు. నీ ముచ్చట కూడా తీరుతుందనుకున్నాను, ఫణి.. నువ్వు తెలిసినట్టే చెప్పావు. నీకెవరన్నా చెప్పారేంటి మా విషయం, ” ఆశ్చర్యపోతూ అడిగాడు.
“అదేంలేదు బావా. మీ చెల్లెల్ని ఆటపట్టిద్దామని ఊరికే అన్నాను. కానీ అది నిజమనే
సరికి నాకు చాలా సంతోషమేసింది. పోనిలే. ఇప్పటికైనా ఓ ఇంటివాడవు అవుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది. అదిగో మీ చెల్లెల్ని ముఖం చూడు..
వెయ్యి ఓల్టేజి బల్బులా ఎలా వెలిగిపోతుందో, ” లలిత వైపు చూస్తూ చెప్పాడు.
“మరే.. మా అన్నయ్య పెళ్ళంటే ఆ మాత్రముండదేమిటి.. అయినా నన్నంటున్నారు మీకు మాత్రం లేదేమిటి! మంచి మనసుండి నిన్ను మంచిగా చూసుకునే మనిషైతే చాలు. తన గతంతో మనకేంటన్నయ్యా, వదినను మాకు ఎప్పుడు పరిచయం చేస్తావు.. పెళ్ళెపుడనుకుంటున్నావు, ” అడిగింది కరుణాకర్ వైపు ఆప్యాయంగా చూస్తూ.
“మీ అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకోవడమేనా నోరు తీపి చేసేది ఉన్నదా లేదా? ఏదో గొప్పగా చెప్పావే నా నోటి పుణ్యం అని.. ఏది గుప్పెడు పంచాదారా పుణ్యానికి వచ్చిందని
పోస్తానన్నావు.. ప్చ్.. అది కూడా లేదు. ఇప్పుడే నన్ను మరిచిపోతుంది. రేపు పెళ్లిలో నన్నేం పట్టించుకుంటుంది, ” భార్యను వెక్కిరిస్తూ అన్నాడు ఫణి.
“అవును కదూ.. మరిచేపోయాను. ఉండండి గుప్పెడేం కర్మ కిలో పంచదార తెచ్చి మీ నోటినిండా పోస్తాను, ” నవ్వుతూ వెళ్ళబోయింది లలిత.
“లలిత .. నీకా శ్రమక్కరలేదు. ఇదిగో నీకు మీ ఆయనకిష్టమైన పూతరేకులు కలకండా స్వీటు తెచ్చాను. ముందు నన్ను పెట్టనివ్వు. ఫణి నోరు తెరువు ..ముందు నువ్వే తీసుకోవాలి, ఎందుకంటే ఆత్మీయతను అనురాగాన్ని పంచే మా ఇంటల్లుడివి. ఇదిగో చెల్లమ్మా నీకు పూతరేకులు, ” అంటూ ఇద్దరి నోటికందించాడు కరుణాకర్.
“మీరిద్దరు ఒకసారి రాధతో మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను, తరువాత మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాము ఏమంటారు, ” చెల్లి వైపు చూస్తూ అన్నాడు.
“ఆలస్యం ఎందుకు. శుభస్య శీఘ్రం అన్నారు కదా. బాబెలాగు ఇందాకే సిరిలాక్ తిన్నాడు. వాడికి ఆకలి బాధతీరింది, మనం ఇప్పుడే ప్రశాంతంగా వెళ్ళిరావచ్చు కదా లలిత, ” అడిగాడు భార్యను.
“అవునన్నయ్యా. ఆలస్యం ఎందుకు.. ఏమండి.. మీరు బాబుకు చొక్కా మార్చండి. ఈలోగా నేను కాఫీ పెడతాను. తాగి వెళదాము, ” భర్తను పురమాయిస్తూ చెప్పింది లలిత.
“లలితా.. మనం వెళ్లేది పెళ్ళిచూపులకు. కాఫీ అక్కడ తాగుదాము. నువ్వు బాబును తయారుచేసుకుని రా, ” అన్నాడు ఫణి.
“బాగుందండి మీ వరుస. మీకు కాఫీ వద్దంటే అక్కడకి వెళ్ళాకే తాగండి, మా అన్నయ్య నేను కాఫీ తాగి బయలుదేరుతాము, ” అంటూ లోపలికి వెళ్లింది కాఫీ పెట్టడానికి.
“సరే మీ ఇష్టం. నేనేం పాపం చేసాను నేను మీతోపాటే కాఫీ తాగుతాను. పదరా బాబు మనం చొక్కా మార్చుకుందాము, ” బాబును తీసుకుని వెళ్లాడు.
“బాగుందమ్మా మీ చిలిపి తగువులు.. ఈలోపల నేను రాధకు ఫోన్ చేస్తాను మనం వస్తున్నట్టు, ” అన్నాడు నవ్వుతూ కరుణాకర్.
“మా ఇద్దరికి ఇలా చిలిపిగా అనుకుంటేనే సరదాగా ఉంటుందన్నయ్యా, నిజంగా ఫణి చాలా మంచివాడు. నన్ను ఎంతబాగా చూసుకుంటాడో, నాకింతటి అదృష్టం వస్తుందని
ఎప్పుడు ఊహించలేదు. పై లోకాన ఉన్న మన అమ్మానాన్న ఆశీర్వాదమేనేమో అన్నయ్యా, ” అంది తృప్తిగా.
“నిజమేనమ్మా. నువ్వే కాదు నిన్ను చేసుకున్న ఫణి కూడా అదృష్టవంతుడే, మీరిద్దరు సంతోషంగా ఉండడమే నాక్కావలసింది, ” చెప్పాడు కరుణాకర్.
“అన్నయ్యా .. నువ్వు చేసుకునే అమ్మాయి కూడా అర్థం చేసుకుని నిన్ను బాగా చూసుకుంటే అంతకంటే కావలసిందేముంది, ” అంది లలిత.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

@swapnaj8931
• 1 day ago
Bagundi attayya