వీభోవరా - పార్ట్ 18
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Sep 8
- 8 min read
Updated: Sep 14
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

Veebhovara - Part 18 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 08/09/2025
వీభోవరా - పార్ట్ 18 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారు స్వామీజీ.
అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. స్వామీజీ తిరిగి కనబడి మురళీ మోహన్ గారి కూతురు గంగ కారణంగా కాశ్యప్ కు స్దాన చలనం ఉందని చెబుతాడు. గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. విజయ్, కాశ్యప్ ల వివాహాలకి ముహుర్తాలు చూస్తారు విజయేంద్రభూపతి తో వివాహం ఇష్టం లేని సింధూ ఆత్మహత్య చేసుకుంటుంది. విజయ్ శర్మ పైన కక్ష కట్టిన దుర్గారావు అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 18 చదవండి..
సయ్యద్ సోదరుడు డాక్టర్ హుస్సేన్ విజయ శర్మను చాలా జాగ్రత్తగా తన ఇంట్లో వుంచుకొని ట్రీట్‍మెంటు చేయసాగాడు.
రామశర్మ, విజయ్ విషయంలో జరిగిన ఘోరాన్ని మురళీ మోహన్‍కు, శాంత కుమార్‍కు మాధవి సోదరుడు పాండురంగ శర్మకు తెలియజేశాడు.
ఆ సమయానికి కాశ్యప్ IPS ప్రాధమిక ట్రైనింగ్‍లో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీలో వున్నాడు.
ప్రిన్సిపాల్ శాంతకుమార్ విషయాన్ని కాశ్యప్ శర్మకు తెలియజేశాడు.
కాశ్యప్ ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లయింది. హృదయంలో ఆవేదన, కళ్ళల్లో కన్నీరు.
"అన్నా!.. అన్నా!.. నీవు ఏం తప్పు చేశావని ఆ దైవం నీకు ఇలాంటి శిక్ష విధించాడు. భీష్ముల వారి పాలిట సిఖండి దాపురించి వారిని నేలకూల్చినట్లు, నీ పాలిట ఆ సింధూ దాపరించి నిన్ను ఆ స్థితికి గురి చేసింది అన్నా!.. అన్నా!.. " ఎంతగానో విలపించాడు కాశ్యపశర్మ.
తనపై అధికారులకు విషయాన్ని చెప్పి కాశ్యప్ ఎంతో ఆవేదనతో విజయ్ శర్మను చూడవచ్చాడు. అతనితో గంగ కూడ వచ్చింది. శాంతకుమార్ దంపతులు, మురళీమోహన్ దంపతులు, సత్య నారాయణ దంపతులు రుద్రమ వచ్చి విజయశర్మను చూచారు. అందరి కళ్ళు శ్రావణ మేఘాలైనాయి. వాళ్ళల్లో వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు.
రామశర్మ, మాధవి, విజయశర్మను ఓదార్చారు.
సయ్యద్ ఒక స్వఛ్ఛమైన హితుడు. అందరికీ ఓదార్పు మాటలను చెప్పాడు. అతని హృదయంలోనూ విజయ్‍కి అలా జరిగినందుకు ఎంతో బాధ.
విజయ్‍శర్మను గ్రామానికి చేర్చారు.
అందరూ వెళ్ళిపోయారు.
కాశ్యప్ బయలుదేరే ముందు విజయ్ శర్మ మంచాన్ని సమీపించాడు.
"అన్నా!.."
ఏం అన్నట్లు దీనంగా కాశ్యప్ ముఖంలోకి కన్నీటితో చూచాడు విజయ్‍శర్మ.
"అన్నా!.. నీవు దేనికీ భయపడకు. నీకు తోడుగా అండగా నేను నా జీవితాంతం వుంటాను. నా ట్రైనింగ్ ముగిసి పోస్టింగ్ రాగానే నేను నిన్ను నా దగ్గరే వుంచుకొంటాను. నిన్ను.. నిన్ను నా ప్రాణ సమానంగా చూచుకొంటాను అన్నా!.." ఆవేశంగా పలికిన పలుకులు. నయనాల నుండి రాలిన కన్నీటి వర్షధారలు. కాశ్యప్ ఏడిస్తూ విజయ్ తలను తన హృదయానికి హత్తుకొన్నాడు.
అతని కన్నీటితో విజయ్ తల తడిసింది. విజయ్ కళ్ళల్లో కన్నీరు.
కాశ్యప్ విజయ్ ముఖంలోకి చూచాడు.
విజయ్ చేతులు సాచి కాశ్యప్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నాడు.
"కాశీ!.. నన్ను ఓదార్చుతూ నీవు ఏడుస్తున్నావు కదరా!.. నీ ఏడుపు నాకు మరీ బాధ కలిగిస్తూ వుందిరా. పోలిస్ కావాలనుకొన్న నా కల కరిగిపోయింది. నీ ఆ కల నిజం కాబోతూ వుంది. అందుకు నాకు చాలా ఆనందంగా వుంది కాశీ. ఏడవకు.. ఏడవకయ్యా!.." తన చేతులతో కాశ్యప్ కన్నీటిని తుడిచాడు.
"పోలీస్ వృత్తి చాలా కఠినమైనది. ఆ కళ్ళనుండి ఎన్నడూ కన్నీరు రాకూడదు కాశీ!" అనునయంగా చెప్పాడు విజయ్.
"బావగారూ! భవిష్యత్తులో మీరు మాతోనే వుండాలి. వుంటారు. మీరు ఏ విషయానికి కలత చెందకండి బావగారూ. మీకు మేమంతా వున్నాముగా బావగారు!" అనునయంగా చెప్పింది గంగ.
"అన్నా! ఇక మేము బయలుదేరుతాము. జాగ్రత్త" ప్రక్కనే వున్న తండ్రి రామశర్మ, తల్లి మాధవిని సమీపించి..
"అమ్మా! నాన్నా!.. మీరు ఏ విషయానికి బాధపడకండి. ట్రైనింగ్ ముగియగానే మనమందరం ఒకేచోట వుంటాము. మీరు పెద్దవారు. మంచిచెడ్డలను మాకు చెప్పవలసిన వారు ధైర్యంగా వుండండీ. మమ్మల్ని ఆశీర్వదించండి" కాశ్యప్ గంగలు పెద్దవారి పాదాలను తాకారు.
వారు హృదయపూర్వకంగా..
"శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.. " ఇరువురూ ఒకేసారి దీవించారు. మరోసారి అందరికీ చెప్పి గంగ, కాశ్యప్‍లు గుంటూరు వెళ్ళిపోయారు.
సయ్యద్ ఒక చంక క్రింద కర్రతో వచ్చాడు.
"రా సయ్యద్ రా!.." వరండాలో కూర్చొని దినపత్రికను చూస్తున్న రామశర్మ సయ్యద్‍ను ప్రీతిగా ఆహ్వానించాడు.
"చేతిలో ఆ కర్ర ఏమిటి సయ్యద్.. కూర్చో!" అన్నాడు రామశర్మ.
"ఇది స్పెషల్‍గా విజయ్ బాబు కోసం చేయించాను. పైనున్న ఈ పిడి చంక క్రింద వుంచుకొని హాయిగా ముందుకు నడవవచ్చు. భారం ఈ కర్ర మోస్తుంది. హుస్సేన్ అమర్చిన కృత్రిమ మోకాలు పాదం మీద బరువుపడదు. ఇందులో మరో గమ్మత్తైన విషయం కర్రను చూడండి. చంకక్రింద పిడి దిగువన కర్రకు రెండు బటన్స్ వున్నాయి. కర్రను పైకెత్తి పై బటన్‍ను నొక్కితే కర్ర కింది భాగం నుండి వేగంగా రెండు అడుగులు పదునైన కత్తి క్రిందికి జారుతుంది. విరోధుల ఎదుర్కొనవచ్చు. క్రింది బటన్‍ను నొక్కితే ఆ కత్తి కర్ర లోపలికి వెళ్ళిపోతుంది చూడండి.."
సయ్యద్ కర్ర పిడిని చంక క్రింద పెట్టుకొని కర్రను పైకెత్తి, పై బటన్ను నొక్కాడు. క్షణంలో రెండు అడుగుల కత్తి క్రిందికి వచ్చింది. క్రింది బటన్ను నొక్కాడు. కత్తి కర్రలోనికి వెళ్ళిపోయింది. రామశర్మ వింతగా చూచాడు.
"ఎలా వుంది స్వామీ!" నవ్వుతూ అడిగాడు సయ్యద్.
"చాలా అద్భుతంగా వుంది సయ్యద్" చిరునవ్వుతో చెప్పాడు రామశర్మ.
"విజయ్ బాబు ఎక్కడ?"
"లోన వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. పిలుస్తాను" సింహద్వారం వైపు చూచి..
"విజ్జీ!.." కాస్త హెచ్చు స్థాయిలో పిలిచాడు.
కుంటుకుంటూ విజయ్ వరండాలోకి వచ్చాడు.
"సయ్యద్ మామా! నమస్తే. మీరు నాకు పునర్జన్మను ప్రసాదించిన దేవుడు. మీ ఋణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను" చిరునవ్వుతో చెప్పాడు.
"నాదేముంది బాబూ! అంతా ఆ పైవాడి అనుగ్రహం. నేను నిమిత్తమాత్రుణ్ణి" నవ్వుతూ చెప్పాడు సయ్యద్.
తాను తెచ్చిన కర్రను, అది పనిచేసే విధానాన్ని విజయ్‍కు చూపించాడు సయ్యద్.
విజయ్ ముఖంలో ఆనందం. అదే సమయానికి అక్కడికి వచ్చిన మాధవి ఆశ్చర్యపోయింది. ముగ్గురికీ చెప్పి పనివుందని సయ్యద్ వెళ్ళిపోయాడు.
"నాన్నా!" పిలిచాడు విజయ్.
"ఏం నాయనా!.."
"నాకు గంగా - కాశీల వివాహాన్ని చూడాలని వుంది నాన్నా! త్వరగా జరిపించండి" ప్రాధేయపూర్వకంగా కోరాడు విజయ్.
"అలాగే నాన్నా! మురళీ మోహన్‍తో మాట్లాడుతాను."
"చాలా సంతోషం నాన్నా!" క్షణం తర్వాత "మీరు నాకోసం ఎంతో శ్రమించారు. మీ ఋణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను. "
"విజ్జీ!.. ఏమిటా మాటలు? అది మా కర్తవ్యం అయ్యా!.. ప్రతి వ్యక్తి జీవితకాలంలో తన కర్తవ్యాన్ని విధిగా చిత్తశుద్ధితో నెరవేర్చాలి. అదే మేము చేసింది. ఇందులో అతిశయోక్తి లేదు నాన్నా!" అనునయంగా చెప్పాడు రామశర్మ.
మురళీమోహన్‍కు ఫోన్ చేసి గంగా, కాశ్యప్‍ల వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించమని చెప్పాడు.
మురళీమోహన్, శ్యామలలు గుంటూరుకు వెళ్ళి విషయాన్ని శాంతకుమార్, సుభద్రతో చర్చించి, గంగా, కాశ్యప్‍ల వివాహానికి ముహూర్తాన్ని నెలరోజుల తరువాత నిర్ణయించడం జరిగింది. గుంటూరులో గంగ, కాశ్యపశర్మ వివాహాన్ని మురళీమోహన్, వారి అన్న వారి బంధుమిత్రులు ఎంతో ఘనంగా చేశారు. రామశర్మ, మాధవి, విజయ్, భాస్కర్ గ్రామానికి తిరిగి వచ్చారు. దంపతులు కాశ్మీర్‍కు హనీమూన్‍కు వెళ్ళారు.
విజయశర్మ ఎక్కువ సమయం ధ్యానంలో నిమగ్నుడై వుండేవాడు. అతని ఆ స్థితిని చూచి రామశర్మ ఎంతగానో మనస్సున బాధపడేవాడు.
’హే భగవాన్!.. ఆ నా బిడ్డ చేసిన నేరం ఏమిటి? ఎందుకు వాడికి అంగవైకల్యపు శిక్షను విధించావు. ఎలా వుండేవాడు ఎలా అయిపోయాడు? నా బిడ్డ లోలోన కుమిలి పోతున్నాడు. వాడికి బ్రతుకుమీద ఆశను, కర్తవ్యాన్ని తెలియజేయి’ దీనంగా ఆ దైవాన్ని ప్రార్థించేవాడు రామశర్మ.
రామశర్మ ఇల్లాలు మాధవి దైవం ముందు దీపారాధనను వెలిగించి నివేదన జరిపి..
"తండ్రి సర్వేశ్వరా!.. నా బిడ్డ విజయ్ చేసిన నేరం ఏమిటి? ఎందుకు వాణ్ణి వికలాంగుడిగా చేశావు. ఈ తల్లి కాస్త పాలుమాలికతో పడుకొంటే నా కాళ్ళ చెంత చేరి నా పాదాలను తన ఒళ్ళో వుంచుకొని నా కాళ్ళను పిసికేవాడు. చేతులను ఒత్తేవాడు. ’అమ్మా!.. ఎలా వుంది? హాయిగా వుందా!.. నొప్పులు తగ్గాయా?.. కొంచెం గట్టిగా పిసకనా!’ అంటూ ఎంతో ఆరాటంగా నా ప్రక్కన వుంటూ నాకు సేవ చేసిన ఆ బిడ్డను అలా మంచానికి రోగిలా అంకితం చేశావే, నీకు ధర్మమా!
ఊరువాడలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పరుగెత్తుకెళ్ళి వారికి సాయం చేసే నా బిడ్డను అవిటివాడిగా చేశావే అది నీకి ధర్మమా! తండ్రి.. ! వాడికి మనోబలాన్ని ప్రసాదించు. జీవితం మ్మీద ఆశను పెంచు. మామూలు మనిషిగా మార్చు. మా తప్పులను మన్నించు ఆ బిడ్డకు స్వస్థతను చేకూర్చు తండ్రి!" దీనంగా కన్నీటితో మాధవి ఆ రీతిగా జగత్ కర్తను నిత్యం వేడుకొనేది.
మాధవి అన్న సత్యనారాయణతో విజయ్ విషయాన్ని వారి ఇల్లాలు కూతురు సావిత్రితో చర్చించాడు. విజయ్‍లోని గొప్ప లక్షణాలను ఎరిగిన సావిత్రి.. తాను విజయ్‍ను వివాహం చేసికొనేదానికి అంగీకరించింది.
సత్యనారాయణ శర్మ ఆ గ్రామానికి వచ్చి బావ రామశర్మ అక్క మాధవితో తన కూతురు నిర్ణయాన్ని తెలియజేసి వెళ్ళిపోయాడు.
రామశర్మ, మాధవీలకు ఎంతో ఆనందం. వారు విజయ్‍ను సమీపించారు.
"నాన్నా విజయ్!.. "
"ఏమ్మా!.. "
"మామయ్య వచ్చి వెళ్ళాడు చూచావుగా!"
"ఆ నాతోనూ మామయ్య మాట్లాడారు కదమ్మా!"
"ఆ.. అవును. వాడు మాకు ఒక విషయాన్ని చెప్పాడు. "
"ఏమిటమ్మా అది?"
"సావిత్రి!"
"ఆ.. సావిత్రీ!.. "
"నిన్ను వివాహం చేసుకొనేటందుకు అంగీకరించిందట" నవ్వుతూ చెప్పింది మాధవి.
"విజ్జీ! నీ అభిప్రాయం" ఆశగా అడిగాడు రామశర్మ.
విజయ్ మౌనంగా వుండిపోయాడు.
"నాన్నా! నీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది మాధవి.
విజయ్‍శర్మ విరక్తిగా నవ్వాడు.
"జవాబు చెప్పు విజ్జీ!" అడిగాడు రామశర్మ.
"అమ్మా!.. నాన్నా!.. సావిత్రి చాలా మంచి అమ్మాయి. డాక్టర్. ఆమెకు నేను తగను. పైగా నాకు వివాహం మీద ఆశలేదు. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి" మెల్లగా అనునయంగా చెప్పాడు విజయ్.
"అయితే జీవితాంతం ఒంటరిగానే బ్రతుకుతావా!" నిష్టూరంగా అంది మాధవి.
"నేను వంటరివాడిని ఎలా అవుతానమ్మా!.. నాకు మీకు అందరికీ మనకు ఈ జన్మనిచ్చిన ఆ సర్వేశ్వరుడు మన జీవితకాలమంతా అండగా వుండాడు కదమ్మా!.. నేను వైరాగ్య వీధిలో పయనించాలనుకొంటున్నాను. ఆ దారిలో సదా మనశ్శాంతి కదమ్మా!.. అంతకు మించిన మంచి జీవన మార్గం వేరే లేదుగా!" చిరునవ్వుతో అనునయంగా చెప్పాడు విజయ్‍శర్మ.
"నీ భావన నాకు నచ్చలేదు విజ్జీ!" విసుగ్గా అంది మాధవి.
"నాన్నా! స్థిమితంగా ఆలోచించు!" రామశర్మ గారి సందేశం.
విజయ్‍శర్మ మౌనంగా వుండిపోయాడు.
కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది. విజయ్ వారి ఇంటికి వచ్చిన నాటి నుంచి, రామశర్మ చెప్పిన ప్రకారం ఆ దంపతులను అమ్మా, నాన్నా అని పిలిచి వారికి పెద్దకొడూకు అయ్యాడు. చిన్న వయస్సు నుండి తల్లికి ఇంటి పనుల్లో సాయం, తండ్రి వ్యవసాయ పనుల్లో అండగా వుండి వారి దృష్టిలో కాశ్యప్ కంటే ఎక్కువగా వారి ప్రేమాభిమానాలను చూరగొని వారికి పెద్ద బిడ్డగా మారిపోయాడు. అలాంటి ముద్దుల కొడుక్కు కాలు తెగిపోవడం, ఒంటికాలు వాడు కావడం, ఆ దంపతులకు తీవ్రవేదనను కలిగించింది. మరిచి మామూలుగా వుండడానికి వారు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకుండా వుంది.
పైగా విజయ్ వివాహం వద్దని, వైరాగ్య వీధిన పయనించాలనుకొంటున్నానని, అన్నమాట వారికి ఎంతో బాధను కలిగించింది. రాత్రి భోజనానంతరం ముగ్గురూ శయనించారు.
విజయశర్మ మనస్సు తల్లి తండ్రి పాదాలను తాకాలనే ఆశ. మెల్లగా మాధవి మంచాన్ని సమీపించాడు. తన చేతులతో ఆమె పాదాలను తాకాడు.
ఆశ్చర్యంతో మాధవి కళ్ళు తెరిచింది.
"నాయనా విజ్జీ!.. "
"అమ్మా!.. "
"కాళ్ళను కొంచెం జవురు నాన్నా!"
విజయ్ మెల్లగా ఆమె కాళ్ళను జవరసాగాడు.
"హాయిగా వుంది నాన్నా! నిద్ర వస్తూ వుంది. "
"నిద్రపో అమ్మా! నేను కొంతసేపు నీ కాళ్ళు పిసుకుతాను. "
మాధవి ’ఊఁ.. ’ అంది. కళ్ళు మూసుకొంది.
కొంతసేపటిలో మాధవి నిద్రపోయింది.
అది గమనించిన విజయ్ మెల్లగా మంచం దిగాడు. తండ్రి రామశర్మ మంచాన్ని సమీపించాడు. వారి పాదాలను జవరసాగాడు.
"విజ్జీ!.. "
"నాన్నా!.. నిద్రపోలేదా!.. "
"రావడం లేదయ్యా!"
"నేను కాళ్ళు పిసుకుతాను. మీరు నిద్రపోండి. "
కొన్ని నిముషాలు వారి మధ్యన మౌనం..
"నా.. న్నా!.. " రామశర్మ పిలుపు.
"నాన్నా!.. "
"ఒక గ్లాసు నీళ్ళు, అందులో రెండు తులసి దళాలు వేసుకొనిరా తండ్రీ!" ఆయసంతో చెప్పలేక ప్రయాసతో చెప్పాడు రామశర్మ.
వారికి.. గుండెనొప్పి.. నిద్రపోలేక పోతున్నాడు.
విజయ్ వెళ్ళి తులసి కోట నుండీ మూడు దళాలు త్రుంచుకొని గ్లాసు నీళ్లల్లో వేసి తండ్రిని సమీపిమ్చాడు.
రామశర్మ నయనాల్లో చిత్రమైన కదలిక. చూపు నిలబడటం లేదు. నోరు తెరిచాడు. విజయ్ ఉద్ధరిణెతో వారి నోట్లో గ్లాసులోని తులసి నీళ్ళను పోశాడు. మూడు గుటకలు వేశాడు. నాల్గన గుటక స్పూను నీళ్ళను విజయ్ రామశర్మ నోట్లో పోశాడు.
ఆ నీరు లోనికి పోకుండా బయటికి వచ్చింది. రామశర్మ గుండె ఆగిపోయింది. తల ప్రక్కకు వాలిపోయింది.
"నాన్నా!.. నాన్నా!.. " ఆవేదనతో పిలిచాడు విజయ శర్మ.
రామశర్మలో చలనం లేదు. విజయ్ వారి నొసటిని, శరీరాన్ని ఆత్రంగా తాకి చూచాడు విజయశర్మ.
అతనికి విషయం అర్థం అయ్యింది. హృదయంలో వేదన కట్టలు త్రెంచుకొంది.
"నాన్నా!.. నాన్నా!.. " ఏడుస్తూ బిగ్గరగా అరిచాడు.
ఆ అరుపుకు మాధవి ఉలిక్కిపడి లేచి రామశర్మ మంచాన్ని సమీపించింది.
"అమ్మా!.. నాన్న.. నా.. న్న.. " ఏడుపుతో విజయ్ చెప్పలేక పోయాడు.
విషయాన్ని గ్రహించిన మాధవి రామశర్మ గారి పాదాలపై బడి భోరున ఏడవసాగింది.
ప్రక్క గదిలో పడుకొని వున్న భాస్కర శర్మ ఆ ఏడుపుకు ఉలిక్కిపడి లేచి వారు వున్న గదిలోకి వచ్చాడు.
విజయ్ భాస్కర్‍ను దగ్గరకు తీసుకొని..
"భాస్కరా!.. నాన్న.. నాన్నా.. మన నాన్న చనిపోయారయ్యా!" బిగ్గరగా ఏడ్చాడు.
భాస్కర శర్మ అన్నను కౌగలించుకొని భోరున ఏడవసాగాడు.
మాధవి ఏడుపు కొంతసేపటికి ఆగిపోయింది.
ఆ ఏడుపును విని ఇరుగు పొరుగు వారు రామశర్మ ఇంట్లోకి వచ్చారు.
రామశర్మను మంచంపై నుంచి దించి హాల్లో చాపపరిచి దక్షిణపు వైపు తల వుండేలా పడుకోబెట్టారు.
ఆడవారు మాధవిని సమీపించి ఆమెను ఓదార్చేటందుకు తాకారు. శరీరం వారి చేతులకు చల్లగా తగిలింది. వారు మగవారిని పిలిచారు. వారు మాధవిని చూచి.. "తానూ వెళ్ళిపోయింది" విచారంగా అన్నారు.
ఈ మాటను విన్న విజయ్, భాస్కర్‍ల ఆవేదనకు అంతులేదు. పొరుగింటి మగవారు మాధవి శరీరాన్ని, రామశర్మ గారి శరీరానికి ప్రక్కన చేర్చారు.
ఏడ్చి ఏడ్చి తెప్పరిల్లుకొన్న విజయ్.. ఫోన్‍ను సమీపించి సత్యనారాయణశర్మకు, మురళీమోహన్ గారికి, శాంత కుమార్ గారికి భోరున ఏడుస్తూ విషయాన్ని చెప్పాడు. కుప్పలా తల్లిదండ్రుల పాదాల ముందు కూలి ఏడవసాగాడు.
విషయాన్ని విన్న సయ్యద్ పరుగెత్తుకొంటూ వచ్చాడు. భార్యాభర్తలు ఇరువురూ ఏకకాలంలో మరణించినందుకు అతనిలో ఎంతో ఆవేదన.
ఇరుగు పొరుగు వారు సయ్యద్ విజయ్, భాస్కర్‍లను ఎంతగానో ఓదార్చారు. ఆ రాత్రి వారందరి పాలిటా కాళరాత్రి.
దినకరుడు ఉదయించాడు. ముందుగా మురళీమోహన్, శ్యామలా, గౌరి వచ్చారు.
తర్వాత సత్యనారాయణ శర్మ గారి కుటుంబం. మధ్యాహ్నం రెండు గంటలకు శాంత కుమార్ వారి సతీమణి శ్యామల గంగ వచ్చారు.
విషయం తనకు తెలియగానే శాంత కుమార్ ముస్సోరిలో IPS ట్రైనింగ్‍లో వున్న కాశ్యప్‍కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పి కాశ్యప్‍ను వెంటనే పంపవలసిందిగా తన మిత్రుడైన కాశ్యప్ బాస్ రామదాస్‍కు చెప్పాడు.
రామ్‍దాస్ కాశ్యప్‍కు వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చాడు. అంతులేని ఆవేదనతో కాశ్యప్ బయలుదేరాడు.
మరుదినం రెండుగంటలకు కాశ్యప్ గ్రామానికి చేరాడు.
శాశ్వత నిద్రలో వున్న తల్లితండ్రిని చూచి భోరున ఏడ్చాడు. అన్న విజయ్, తమ్ముడు భాస్కర్, చెల్లి రుద్రమలను దగ్గరకు తీసుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. అప్పటికి రామశర్మ, మాదవీలు గతించి నలభై ఎనిమిది గంటలు.
ఐస్ బాక్సులలో వుంచారు.
సమయం సాయంత్రం నాలుగు గంటలు.
రావలసిన వారంతా వచ్చారు, కన్నీరు కార్చారు.
సయ్యద్, మురళీమోహన్, శాంతకుమార్‍లు రామశర్మ, మాధవీల అంతిమయాత్రకు సన్నాహం చేశారు. పూలను తెప్పించారు. స్నానం చేయించారు.
పాడెమీద పడుకోబెట్టారు.
అందరూ ఏడుస్తూ వాత బియ్యాన్ని గతించిన వారి నోట వుంచారు.
ఒక కాలుతో వున్న విజయ్ అగ్ని కుండను చేట పట్టుకొన్నాడు. అతని ప్రక్కనే వుండి అన్య మతస్థుడైన సయ్యద్ విజయ్‍కి సాయం చేశాడు.
మహానుభావుడు, ఎందరికో విద్యాదానం, గొప్పతనాన్ని విడమరిచి చెప్పిన మహోన్నత ఉపాధ్యాయులు రామశర్మ గారు వారికి అర్థాంగిగా బంగారు తల్లిగా అన్నపూర్ణగా అన్ని విధాల భర్త పిల్లలను అభిమానించిన మహాసాధ్విగా పేరు తెచ్చుకొన్న మాధవమ్మ.. ఇరువురూ ఏకకాలంలో తాము నలభై ఐదు సంవత్సరాలు వసించిన ఇంటి నుండి స్మశానం వైపుకు బంధుమిత్రులు ముందు వెనుక విచారంతో హే.. రామ్ హే.. రామ్ అంటూ నడవగా పూల జల్లులతో నిశ్చలంగా శాశ్వత నిద్రలో స్మశానం వైపుకు సాగిపోయారు ఆ దంపతులు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments