వీభోవరా - పార్ట్ 7
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Jul 8
- 6 min read
Updated: Jul 15
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Veebhovara - Part 7 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 08/07/2025
వీభోవరా - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ.
ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు.
కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. రామశర్మ, మాధవి దంపతులకు ఆడ, మగ కవలలు పుడతారు. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. ఆధ్యాత్మిక గురువుల గురించి, స్వాతంత్య్ర సమర యోధుల గురించి విద్యార్థులకు చక్కగా వివరిస్తారు రామశర్మ గారు.
కాలేజీ చదువుకోసం పిల్లలిద్దరినీ మురళీ మోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 7 చదవండి..
ఆ రోజుకి విజయశర్మ, కాశ్యపశర్మలు కాలేజీలో చేరి పదిరోజులైంది. ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి క్రింద ఇంటి శ్యామల గారు, వారికి మూడు ఉత్తరాలను అందించింది.
వారిరువురికీ ఆ ఉత్తరాలను చూడగానే వ్రాసినది తండ్రి, తల్లి, చెల్లి, తమ్ములని గ్రహించారు. రెండు కార్డులు, ఒక ఇన్‍లాండ్ లెటర్. రెండూ కార్డులను కాశ్యప్, ఇన్‍లాండ్ లెటర్‍ను విజయ్‍లు తీసికొన్నారు.
కాశ్యప్ తండ్రి వ్రాసిన ఉత్తరాన్ని చదవసాగాడు.
"చిరంజీవులు విజయ్, కాశ్యప్‍లను మనసారా దీవించి మీ నాన్న వ్రాయునది.
అయ్యా!... కొత్త వూరు, కొత్త వాతావరణం. జాగ్రత్తగా ఎంతో మర్యాదగా ఇంటి వారి విషయంలో, కాలేజీలో లెక్చరర్లు, తోటి బాలబాలికలతో కలిసి మెలసి వర్తిస్తూ వారందరి అభిమానానికి మీరిరువురూ పాత్రులు కావాలి. ఉదయం ఐదుగంటలకు లేచి కాలకృత్యాదులను తీర్చుకొని స్నానం ముగించి సంధ్యావందనం చేసి అన్నం వండుకొని, మీకు ఇష్టమైన కూరను వండుకొనండి.
కొంతసమయం దైవాన్ని ధ్యానించండి. భోజనం చేసి కరెక్ట్ టైముకు కాలేజీకి వెళ్లండి. అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినండి. నోట్స్ క్లీన్‍గా వ్రాసుకోండి. సాయంత్రం కాలేజీ వదలగానే ఒక గంటసేపు కనీసం కొన్ని ఆటలను ఆడండి. ఆరున్నర కల్లా ఇంటికి వచ్చి, స్నానం చేసి రాత్రికి కావలసిన ఆహారాన్ని తయారు చేసుకొని భోజనం చేసి తిని పదిన్నర వరకూ వ్రాసుకోవడం, చదువుకోవడం సాగించండి.
పదకొండు గంటల లోపల శయనించండి. ఆ దిన చర్యలో ఎలాంటి మార్పు లేకుండా క్రమబద్ధంగా పాటించండి. నేను వచ్చే శని, ఆదివారాలు మీవద్దే ఉండేటట్లుగా వస్తాను. అన్ని విషయాల్లో శ్రద్ధ, జాగరూకత అవసరం. అందరి చేత మంచిపిల్లలు అనిపించుకొనే రీతిగా వర్తించండి. మీ ఇరువురికీ సదా నా శుభాశీస్సులు...."
ఇట్లు....
మీ నాన్న
రామశర్మ
కాశ్యప్ రెండవ ఉత్తరాన్ని చదివాడు. దాన్ని వ్రాసింది వారి తల్లి మాధవి.....
"ప్రియాతిప్రియమైన చిన్నారులకు ఈ మీ తల్లి ఆశీర్వచనములు. అక్కడ ఎవరెవరి విషయంలో ఎలా వర్తించాలో మీ నాన్నగారూ నేను మీకు చెప్పి వచ్చాము. ఇంతకాలంగా నా చుట్టూ తిరుగుతున్న మీరు నా కళ్ళముందు ఇప్పుడు లేనందున నాకు ఎంతో బాధగా వుందిరా!.... సమయానికి తింటున్నారా, త్రాగుతున్నారా, ఎలా ఏం చేస్తున్నారనే మీ తలపులే సదా నా మనస్సు నిండా!...
నాన్నలు!.... జాగ్రత్తరా!.... ఒక లక్ష్య సాధనకు మీరు అక్కడ వుండవలసి వచ్చింది. ఆ విషయాన్ని మనస్సున వుంచుకొని అందరితో అన్యోన్యంగా స్నేహంగా అభిమానంగా వుండండి. పెద్దలను గౌరవించండి. పిన్నలను ప్రీతిగా చూడండి. అందరిచేత మంచి పిల్లలన్న పేరును సంపాదించండి. వేళను తినండి. బాగా చదవండి. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త.
ఇట్లు....
మీ అమ్మ!....
రెండు ఉత్తరాలు చదివేసరికి కాశ్యప శర్మ కళ్ళు చెమ్మగిల్లాయి. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఉత్తరాలని విజయశర్మ చేతికి అందించాడు.
విజయ శర్మ ఇన్‍లాండ్ లెటర్‍ను విప్పాడు.
"అన్నయ్యలూ!..... ఎలా వున్నారు?.... బాగున్నారా!.... మీకు నేను చెప్పేటంతటి వాడిని కాను. కానీ.... అది మన వూరు కాదుకదా జాగ్రత్తగా వుండండి. బాగా చదివి ఉత్తమ స్థాయి విజయాన్ని సాధించండి. మిమ్మల్ని చూచేదానికి ఈసారి నాన్నగారితో వస్తాను. విజయ్ అన్నయ్యా, నాచేత రుద్ర చేత నీవు హోంవర్కు బాగా వివరంగా చెప్పి చేయించేవాడివి కదా, అది తలుచుకొంటే ఏడుపు వస్తూ వుందన్నయ్యా!... ఆ పని ఇప్పుడు అమ్మ చేస్తూ వుంది. పదే పదే ఈ ఇరువురూ గుర్తుకు వస్తున్నారన్నయ్యా!...."
ఇట్లు....
మీ తమ్ముడు భాస్కర శర్మ.
లెటర్ రెండో పేజీలో....
ప్రియమైన విజయ్‍కి.... నీ రుద్రమ వ్రాయునది...
ఇంట్లోవున్నా ప్రతిక్షణం నా మనస్సున నీవే. మరువలేదు. మరువలేను. నీవంటే నాకు ఎంతో ప్రేమ. పిచ్చి. నీ మాటలను తలచుకొంటూ నాలో నేను పిచ్చిదానిలా నవ్వుకొంటాను. అమ్మ ఒకసారి చూచి.... ’ఏంటే నీలో నీవు నవ్వుకొంటున్నావ్?....’ అనడిగింది. వెంటనే జవాబు చెప్పలేకపోయాను. నేను అబద్ధం చెప్పనని నీకు తెలుసుగా, నీవు నేర్పినదే.... నీవు, నీ మాటలు గుర్తుకు వచ్చాయని నిజాన్నే చెప్పాను.
అందుకు అమ్మ ఏమన్నదో తెలుసా!.... ’నా బిడ్డ విజయ్ బంగారు...’ అని ఎంతో ఆనందంగా నవ్వింది. నిన్ను కాలేజీ స్టూడెంటుగా ఎలా వున్నావో చూడాలని ఉంది. ఈసారి అమ్మా నాన్నలతో నేనూ భాస్కర్ కలిసి వస్తాము. మాష్టారూ!.... జాగ్రత్త.... బాగా చదవండి... స్టేట్ ఫస్ట్ గా పాస్ కావాలి. వ్రాస్తూ ఉంటే ఏదేదో వ్రాయాలనిపిస్తూ వుంది. పేజ్ ముగిసింది ఆపేస్తున్నా."
ఇట్లు...
నీ రుద్రమ.
సాంతం చదివేసరికి విజయశర్మ శరీరానికి చెమట పట్టింది. తొట్రుపాటుతో కాశ్యప్ కోసం అటూ ఇటూ చూచాడు. తన చేతినుండి జారి క్రిందపడివున్న రెండు కార్డులను వంగి చేతికి తీసుకొన్నాడు.
’ఈ ఉత్తరాన్ని కాశ్యప్‍కు ఇవ్వాలా వద్దా!..... రుద్రమ భాష భావనలు విపరీతార్థానికి దారి తీస్తున్నట్లు నా భావన. మరి చదివి కాశ్యప్ ఏమంటాడో!.... ఏది ఏమైనా ఉత్తరాన్ని కాశ్యప్‍కు ఇవ్వాలి. అది ధర్మం. జీవితంలో ఎవరి విషయంలోనూ ఎన్నడూ ధర్మాన్ని తప్పకూడదు.’
మేడమీది చేపట్టు గోడను ఆనుకొని కాశ్యప్ ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తున్నాడు. అవి క్రమబద్ధంగా అర్థ చంద్రాకారంతో వాటి గమ్యం వైపుకు పయనిస్తున్నాయి.
విజయ్ కాశ్యప్‍ను సమీపించాడు.
"కాశీ!...."
"అన్నా!...."
"ఏం చూస్తున్నావ్?"
చూపుడు వ్రేలిని ఆకాశం వైపు చూపుతూ.....
"అన్నా!..... ఆ పక్షులను చూడు. ఎంత కలిసికట్టుగా క్రమబద్ధంగా ముందుకు సాగుతున్నాయో!... చాలా ఆనందంగా చూడ అందంగా వుంది కదూ!.... వాటివలే మనం మన లక్ష్యాన్ని సాధించాలన్నా!...." చిరునవ్వుతో చెప్పాడు కాశ్యప్.
"ఇదిగో భాస్కర్, రుద్రమలు వ్రాసిన లెటర్ చదువు!"... అందివ్వబోయాడు విజయశర్మ.
"నీవు చదివావుగా అన్నా!.... విషయం ఏమిటో చెప్పు" క్షణం ఆగి "నేను చెప్పనా?..."
"ఆఁ...."
"బాగా చదువుకోండి మంచి మార్కులు తెచ్చుకోండి. అందరి చేత మంచివారనిపించుకోండి. ఇంతేకదా!..." నవ్వాడు కాశ్యప్.
ఇంటివారి పెద్ద అమ్మాయి గంగ మేడమీదకి వచ్చింది. ఆమెను చూచి ఇరువురూ ఆశ్చర్యపోయారు.
"మా నాన్నగారు మిమ్మల్ని రమ్మన్నారు. ఆఁ..... మీలో విజయ్ ఎవరు? కాశ్యప్ ఎవరు?" ఓరగా నిలబడి ఫోజు పెట్టి అడిగింది గంగ.
"నాపేరు కాశ్యప్. వీరి పేరు విజయ్! మా అన్నయ్య!... మీ నాన్నగారు మాలో ఎవరిని రమ్మన్నారండీ!....." అడిగాడు కాశ్యప్.
"ఇరువురునీ!.... త్వరగా రండి!...." అంటూ అందంగా నవ్వుతూ క్రిందికి వెళ్ళిపోయింది గంగ.
విజయ్ శర్మకు గంగ.... కాశ్యప్‍ల చూపుల్లో ఏదో అనుమానం!.... అదే ఆలోచన......
"అన్నా!..."
తొట్రుపాటుతో "ఆఁ....."
"క్రిందికి వెళదామా!...."
"పిలిచింది ఇంటి ఓనర్ కదా!.... తప్పదు పద....."
ఇరువురూ క్రిందికి దిగారు.
వరండాలో తెలుగు లెక్చరర్ మురళీమోహన్, వారి సతీమణి శ్యామల కుర్చీల్లో కూర్చొని వున్నారు.
కాశ్యప్, విజయ్‍లు చేతులు జోడించారు.
"నమస్కారం సార్!...."
"రమ్మన్నారట!...." మెల్లగా అడిగాడు విజయ్.
"అవునయ్యా!.... రండి కూర్చోండి" చెప్పారు మాస్టారు గారు.
ఇరువురూ తెలుగు పండిట్ గారి ప్రక్కన వున్న కుర్చీల్లో కూర్చున్నారు.
ప్రశ్నార్థకంగా వారి ముఖాల్లోకి చూచారు విజయ్, కాశ్యప్‍లు.
"రేపు శ్రావణ తొలి శుక్రవారం బాబూ!...." అంది వారి ప్రక్కనే నిలబడి వున్న శ్యామల.
"అది ఆడవాళ్ళ పండుగ కదా అండీ!....." మెల్లగా అడిగాడు విజయ్.
"అవునవును... మీ వూర్లో మీ అమ్మగారు ఈ పూజలు పునస్కారాలు చేస్తారా!...."
చిరునవ్వుతో అడిగింది శ్యామల.
"శ్యామలా!.... ఆ వూరి సంగతి మన కెందుకు? నీవు చెప్పాలనుకొన్న విషయాన్ని చెప్పేయి!" అన్నాడు మురళీమోహన్.
"ఆఁ...... చెబుతానండి. ఎందుకు మీకు అంత తొందర!.... చూడండి బాబులూ! మీరిరువురూ రేపు మధ్యాహ్నం మా ఇంట్లో భోం చేయాలి." చిరునవ్వుతో చెప్పింది శ్యామల.
"మేము ఉదయాన్నే భోజనం వండిపెట్టుకొని కాలేజికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి భోంచేస్తామండి" వినయంగా చెప్పాడు విజయ్‍శర్మ.
"రేపు వండకండి బాబూ!..."
"మరి ఉదయం టిఫిన్!...." అడిగాడు కాశ్యప్.
"మా ఇంట్లోనే తినండి." అంది గంగ నవ్వుతూ కాశ్యప్ ముఖంలోకి ఓరకంట చూస్తూ....
చూచేదానికి విజయ్ చాలా సీరియస్‍గా, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు రిజర్వుడ్‍గా వుంటాడు. కాశ్యప్ ఎప్పుడూ నవ్వుతూ ఎదుటి వారిని ఆకర్షిస్తాడు.
ఆ కారణంగా ఆ తల్లి కూతుళ్ళకు విజయశర్మ కన్నా కాశ్యప్ శర్మ బాగా నచ్చాడు. మాస్టారు గారికి వారిరువురిలో ఎవరినో ఒకరిని తన అల్లుడిగా చేసికోవాలని ఆశ.
వారి సతీమణికి తన ఇరువురు కూతుళ్ళను విజయ్, కాశ్యప్ శర్మలకు వారి చదువు పూర్తి కాగానే, రామశర్మ దంపతులతో మాట్లాడి తన ఇరువురికీ కాకపోయినా కనీసం ఒకరికి అంటే కాశ్యప్‍కు తన పెద్దకూతురు గంగను ఇచ్చి పెండ్లి చేయాలనే సంకల్పం.
గంగ చూపుల్లో భావాలను కాశ్యప్ గ్రహించాడు. అతని మనస్సులోనూ గంగ విషయంలో అదే భావన. కారణం గంగ మంచి అందగత్తె. కానీ విజయ్ వారి చూపులను కాని, మాటలను కాని పట్టించుకోడు.
"నేను చెప్పాలనుకొన్న విషయాన్ని మా గంగ చెప్పేసింది. కాబట్టి మీ ఇరువురికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే కాదనకండి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది మాధవి.
కాశ్యప్, విజయ్ ముఖంలోకి చూచాడు. ’ఏం చెప్పాలి అని?’
"సరే మేడమ్! ఇక మేము వెళ్ళిస్తాం. మాష్టారు గారు శలవు" లేచి చేతులు జోడించాడు విజయ్.
వెంటనే కాశ్యప్ కూడా లేచి అదే పనిచేశాడు.
"మంచిది బాబు. వెళ్ళిరండి" అన్నాడు మురళీమోహన్.
ఇరువురులో ముందు విజయ్, వెనకాలే కాశ్యప్ వరండా మెట్లు దిగి తమ పోర్షన్ మెట్లు ఎక్కారు. మిద్దె మీదికి క్రింది పోర్షన్ ప్రక్కనుంచే మెట్లున్నాయి.
"ఏమండీ!...."
"ఆఁ.... చెప్పు!"
"ఇద్దరు పిల్లలూ చాలా ఉత్తములు కదూ!..."
"అవునే!.... మనలో ఏవేవో పిచ్చి ఆశలు. ఆ పైవాడి నిర్ణయం ఎలా వుందో!...."
సాలోచనగా అన్నాడు మురళీమోహన్.
సింహ ద్వారం దగ్గర నిలబడి తల్లీ తండ్రి విజయ్, కాశ్యప్‍ల సంభాషణ విన్న ఆ ఇరువురు సోదరీమణులు ఆనందంగా నవ్వుకొన్నారు.
"కాశీ!...."
"ఏం అన్నయ్యా!...."
"మాస్టారు గారి ఇరువురు కుమార్తెలు చాలా పవరైన బొమ్మలు మనం చాలా జాగ్రత్తగా వుండాలి!...."
క్షణం సేపు కాశ్యప్ విజయ్ శర్మ ముఖంలోకి చూచాడు.
"అర్థం కాలేదా!" అడిగాడు విజయశర్మ.
తొట్రుపాటుతో.... "అయింది అన్నయ్యా!....." చిరునవ్వుతో సౌమ్యంగా చెప్పాడు కాశ్యప్.
"మనం మన ఆశయాలను సాధించాలంటే 3+2+3 ఎనిమిది సంవత్సరాలు దీక్షగా మనం ముందుకు సాగాలి. అప్పుడే మనం IPS పాస్ కాగలము."
"అవునన్నయ్యా!...."
"ఏ విషయంలోనూ మనం ఎవరికీ లొంగిపోయి మన లక్ష్యాన్ని పాడు చేసికోకూడదు. అనేక దుష్టశక్తులు మనలను చుట్టుముట్టవచ్చు. ఎంత జాగ్రత్తగా మనం, లక్ష్యం వైపుకు సాగాలి" గంభీరంగా చెప్పాడు విజయ్.
’అవును....’ అన్నట్లు కాశ్యప్ శర్మ తలాడించాడు. ఇరువురూ వారి పోర్షన్‍లోనికి వెళ్ళారు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments