top of page

వీభోవరా - పార్ట్ 5

Updated: 5 days ago

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika


Veebhovara - Part 5 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 27/06/2025

వీభోవరా - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. 

ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. 

కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. 

గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. రామశర్మ, మాధవి దంపతులకు ఆడ, మగ కవలలు పుడతారు. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ,  కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు.


ఇక వీభోవరా - పార్ట్ 5 చదవండి.. 


రామశర్మగారు పదవతరగతి పిల్లలకు కొందరు భారత ప్రముఖులను గురించి చెప్పడం ప్రారంభించారు.


“మనదేశంలో ఎందరో మహనీయులు జన్మించారు. వారిలో కొందరి గురించి ఈనాడు నేను మీకు చెబుతున్నాను.


1. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు:- క్రీ.శ. 788లో దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కాలడి అను చిన్న గ్రామంలో ఆర్యాంబ అను ఉత్తమ ఇల్లాలికి జన్మించారు. వారికి చాలా చిన్న వయస్సులోనే ఆధ్మాత్మిక విషయాలపై మరియు ఈ విశ్వం యొక్క స్వభావంపై తీవ్రమైన ఆసక్తిని కనబరిచారు. వారు పదహారు సంవత్సరాల వయస్సులో ప్రాపంచిక సుఖాలను త్యజించారు. యావత్ భారతదేశాన్ని ఆధ్యాత్మిక చింతనతో సందర్శించారు. 


వారు తన ప్రయాణంలో భారతదేశంలోని వివిధ ఆధ్యాత్మిక సాంప్రదాయాలను గురించి తెలిసికొన్నారు. ఆ సాంప్రదాయాలను ఒకే ఏకీకృత సాంప్రదాయంలో భాగంగా చూడసాగారు. భారతదేశంలోని విభిన్న మత సాంప్రదాయాలను ఒకే గొడుగు క్రింద ఏకం చేయడానికి ప్రయత్నించారు. విభిన్న మతపరమైన సంఘాలను ఏకీకృతం చేయడంలో విజయం సాధించారు. వారు భారతదేశం లోని హైందవులనందరినీ ఏకం చేసిన ఘనతను పొందారు. 

శ్రీ శంకరాచార్యుల బోధనలు అద్వైత (రెండు కాదు ఒక్కటే) వేదాంత భావనాపూరితం. వ్యక్తిగత బేధభావాలు అవాస్తవం. భ్రమ అని శ్రోతలకు అద్వైత తత్వాలను బోధించారు. జనంలో మార్పును తెచ్చారు.


శ్రీ శంకరాచార్యులు హిందూ చరిత్రలో అతి ముఖ్యమైన మహనీయులు. వారు ప్రజలను బాధల నుండి రక్షించేది జ్ఞానము మాత్రమే, అజ్ఞానం అన్ని బాధలకు మూలమని, వారి ప్రసంగాల్లో అందరికీ విశదీకరించారు. వారి ప్రధాన బోధనలు  ..


1. అజ్ఞాని నిజమైన జ్ఞానాన్ని అజ్ఞానంగా తప్పుబడతారు.

2. ’నేనే పుట్టదు చనిపోదు. ఇది (జీవుడు) పుట్టనిది. శాశ్వతమైనది. ఎప్పటికి ఉనికిలో ఉండేది.

3. లోపాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. నిజం తెలిసికోవడం.

4. జీవాత్మే పరమాత్మ. అదే అద్వైతం. వేరు కాదు. మరొకటి లేదు.

5. మానవులందరూ ఒక్కటే. సమానులు అదే అద్వైతము.


శతాబ్దాల క్రిందట (విదేశీ దండయాత్రల కారణంగా) క్షీణత హిందూ మత పునరభివృద్ధికి శ్రీ శంకచార్యులవారు ఎంతగానో కృషి చేశారు. హిందూమత ప్రాధమిక పాఠశాలలో ఒకటైన వేదాంత తత్వం శాస్త్రాన్ని క్రమబద్దీకరించడంలో ముఖ్య పాత్రను పోషించారు.


శ్రీ శంకరాచార్యుల వారు భారతదేశ చరిత్రలో మహోన్నతమైన మహనీయ్యులు. ఎంతో ప్రభావంతమైన తత్వవేత్త మరియు హైందవ మత నాయకులు. వారి బోధనలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పండితుల చేత అధ్యయనం చేయబడుతున్నాయి. వారు..


1. దక్షిణ దేశాన ‘శృంగేరి’ లో (కర్ణాటక) మాత శారద పీఠం

2. కంచిలో కామకోటి పీఠం

3. పడమర ద్వారకలో (గుజరాత్) శ్రీ శారదాదేవి పీఠం..

4. ఉత్తరదేశాన బద్రీనాధ్‍లో (జార్ఖండ్) జ్యోతిష పీఠం.. 

5. తూర్పున పూరిలో (ఒడిస్సా) గోవర్థన పీఠాలను స్థాపించారు. శిష్యులను పీఠాధిపతులుగా నియమించారు.


సర్వకాల సర్వావస్థల యందు, భారతావనిని గురించి, హైందవ అద్వైత ధర్మాలను గురించి అంతే వాసులకు (శిష్యులకు) ప్రజలకు ఉపదేశించారు. వారి 32వ సంవత్సరంలో కేదార్‍నాథ్‍లో పరమపదించారు. వారి సమాధి కేధార్ నాథ్ శివాలయం వెనుక భాగంలో వుంది. హైందవ జాతి అధ్వైత తత్వ అభ్యుదయవాది, అమరులు శ్రీశ్రీ శంకరాచార్యులు జగత్ గురువులు.


2. శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు:- 


భగవానుల వారు తమిళనాడులోని తిరుచ్చుళి అనే గ్రామంలో బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. వారికి ఇద్దరు అన్నలు నాగస్వామి, నాగసుందరం చెల్లెలు అలమేలు. వారి జననం 1879 డిసెంబరు 30వ తేది. వారి నిర్యాణం 1950 ఏప్రిల్ 14వ తేదీన. 


శ్రీ ఆదిశంకరుల వలె అధ్వైతవాది. వారికి 1896లో మరణ భయం కలిగింది (కల). ఆ అనుభవం వలన వారు తనలో తాను జీవితాన్ని గురించి తరచి చూచుకోవడం ప్రారంభించారు. తనలో ఏదో ప్రవాహశక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నారు. అదే ఆత్మ అని వారికి అనుభవం కలిగినది. వారు పదహారు సంవత్సరాల వయస్సులో తండ్రి సుందరం అయ్యర్, తల్లి అళగమ్మ, బంధుమిత్రులకు చెప్పకుండా మోక్ష జ్ఞాన తృష్ణను పొంది, తిరువణ్ణామలై (తమిళనాడు) పర్వతంపై చేరారు. 


సర్వకాల సర్వావస్థల యందు ఆత్మ, శరీరం విచారణ సాగించారు. వారి దీక్ష, సాధన ’నేను ఎవడను?’ అనే అంశం పై తీవ్ర ఆత్మ సాధన మూలంగా వారికి దైవత్వం సిద్ధించింది. ప్రతి జీవిలో ఆత్మ, దైవత్వం ఉందని గ్రహించారు. వారికి సాధనతో అంతరాత్మ సాక్షాత్కారం లభించింది. 


వారి అమూల్యమైన సందేశాలు. భగవంతుడికి నీవు ఎంత దూరం ఉంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉంటుందనుకోవడం పొరపాటు. అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు. 


మనస్సు అణగిన గాఢనిద్రలో అనుభవమవుతున్న సహజ స్వరూపం అయిన ఆనందాన్ని పొందాలంటే ఎవరైనా తన ఆత్మను గురించి తెలుసుకోవాలి. అందరిలో ఉండేది ఆత్మ ఒక్కటే, కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది. నీలో నేను, దేహమన్న దోషభావం తొలగిపోగానే, గురుమూర్తి నీ స్వరూపమే అయిన ఆత్మ అని గ్రహించగలవు. నీ ప్రతి కదలిక ఈశ్వరునిదే. జరిగేది జరుగుతుంది. జరగనిది జరగదు. ఇది సత్యము, కనుక మౌనంగా ఉండడం ఉత్తమం. 


మనస్సులోని తలపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాలనుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేకమేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీలేదు. ఆ విషయాన్ని గ్రహించి వాటిమీద నుంచి దృష్టిని మరల్చితే, వాటంతట అవే కుప్ప కూలిపోక తప్పదు. 


మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా అవి అంతా నీ మనస్సుకు శిక్షణ ఇవ్వటానికి. శరీరం మరణించిన తరువాత, ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చెయ్యడానికి దైవానికి నీమీద ఇష్టంలేక కాదు. నిన్ను బాధపెట్టాలనీ కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చెయ్యటానికి అలా దైవం చేస్తున్నాడు. 


ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. హృదయంలో నా అనుగ్రహం కొరకు ప్రార్థించు, నీకున్న అంధకారాన్ని తొలగించి, వెలుగును చూపుతాను. అది నా బాధ్యత.


శ్రీ భగవానులు ఇలాంటి సుసందేశాలను యింకా ఎన్నింటినో తన శిష్యులకు వివరించారు. సృష్టిలోని ప్రతిజీవి పట్ల ప్రేమాభిమానాలను చూపడం మహోన్నత మానవత్వం. వారు పశుపక్షాదులు. ఆవులు, ఉడతలు, జింకలు, నెమళ్ళు, కోతులకూ ఆత్మబంధువు. వారు వాటన్నింటిలో పరమాత్మను దర్శించారు. సమతావాది. వారు భగవానులు.


3. శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు :- వీరు 1878 సంవత్సరంలో జనవరి 23వ తేదీన ఒడిస్సాలోని కటక్‍లో జానకీనాథ్ ప్రభావతీ బోస్‍లకు జన్మించారు. బ్రిటీషర్ల కబంధ హస్తాలనుండీ భరతమాకు విముక్తి కలగాలంటే అహింసావాదం ఒక్కటే సరిపోదని, సాయుధపోరాటం కూడా అవసరమని బలంగా నమ్మిన కాంగ్రెస్ అతివాదుల్లో శ్రీ నేతాజీ తొలివ్యక్తి. 


సాయుధ పోరాటంతో బ్రిటీషర్లను వణికించిన మరో వీర శివాజీ. వీరు సివిల్ సర్వీస్ చదివి, ఉద్యోగంలో బ్రిటన్‍లో చేరారు. మన భారతదేశంలో బ్రిటీష్ వారు చేయు ఆగడాలను, వారు మనలను నల్లవారని విమర్శించడం, చులకనగా ప్రసంగించడం విని ఉద్యోగం మాని స్వదేశానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఎన్నికైనారు. 

గాంధీగారితో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాలతో ఆ పదవికి రాజీనామా చేశారు.


గాంధీగారి యొక్క అహింసా వాదం మాత్రమే స్వతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని ’ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆకారణంగా దాదాపు పదకొండు పర్యాయములు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్భంధించబడ్డారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయడానికి ఆ సమయాన్ని ఒక సువర్ణావకాశంగా భావించారు. 


ఆ యుద్ధం ప్రారంభం కాగానే వారు ఆంగ్లేయులతో పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో రష్యా, జర్మని, జపాన్ దేశాలను పర్యటించారు. జపాను వారి సాయంతో భారతీయ యుద్ధ ఖైదీలతో, రబ్బరు తోటల కూలీలతో, మరికొందరు ఔత్సాహితులతో, భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 


జపాను ప్రభుత్వం అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‍లో ఏర్పాటు చేశారు. అభిప్రాయ భేదాల వలన గాంధీజీ వర్గం, వీరి వర్గం రెండుగా చీలిపోయింది. వీరు భారత్ జాతీయ సైన్యాధినేత. వీరి జీవిత భాగస్వామి ఎమిలీ షెంకెల్. వీరికి ఒక కుమార్తె అనితాబోస్.


వారి చర్యలు ఆంగ్లేయులకు సింహస్వప్నంగా మారిపోయాయి. 1945 ఆగష్టు 18వ తేదీన తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో శ్రీ సుభాష్ చంద్రబోస్‍గారు మరణించారని ఆంగ్లేయులు ప్రకటించినా, వారు ప్రమాదం నుండి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని పలువురి అభిప్రాయం. వారిని గురించి గాంధీ వర్గం ఎలాంటి సమాచారాన్ని సేకరించ ప్రయత్నించలేదు.


వారి రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్, వారిని శ్రీ వివేకానంద స్వామి వారి బోధనలు గొప్పగా ప్రభావితం చేశాయి. వారు శ్రీ వివేకానంద స్వామి వారిని తన ఆధ్యాత్మిక గురువుగా భావించారు. వారి గురువులు శ్రీ రామకృష్ణ పరమహంస. వారి జననం 1836 ఫిబ్రవరి 18వ తేదీ. నిర్యాణం 1886 ఆగష్టు 16వ తేది. వీరు జగన్మాత ఉపసకులు. వీరి వివాహం శారదాదేవితో జరిగినది. 


జగన్మాతను ఆ శారదా దేవిలో వారు దర్శించారు. వారి మధ్యన సంసారిక జీవితం జరుగలేదు. యోగిగా మారి మాత అర్చనతో ఆమెను దర్శించి, మనసారా ’అమ్మా  .. అమ్మా ..’ అంటూ ఆ తల్లితో మాట్లాడి, మహాజ్ఞానిగా మారిన మహోన్నత గురువులు శ్రీ రామకృష్ణ పరమహంస గారు. శ్రీ వివేకానంద స్వాములు 1893 (సెప్టెంబరు 11 నుండి 27 వరకు) సంవత్సరంలో అమెరికాలోని చికాగో మహానగరంలో జరిగిన ప్రపంచ మత మహాసభలో ప్రసంగించాలని వెళ్ళారు. 


ఆ తెల్లవారికి మన హైందవ అధ్వైత ధర్మాలను సిద్ధాంతాలను ధ్యానం, భక్తి, ముక్తి, రాజయోగాలను గురించి తెలియజేశాను. ఐదు నిమిషాలు చివరి ప్రసంగంగా ప్రారంభమైన శ్రీ వివేకానందుల వారి సుప్రసంగం గంటలో రోజులు కొనసాగింది. వారి సిద్ధాంతపర ప్రసంగాలకు తెల్లవారు తబ్బిబ్బులైపోయారు. కొందరు వారికి శిష్యులైనారు. 


వారు శ్రీరామకృష్ణ మఠాలను అమెరికాలో వారి సహాయంతో, అభిమానంతో ఏర్పరిచారు. వారి జననం 1863 జనవరి 12వ తేది. నిర్యాణం 1902 జూలై 4వ తేది. భరత జాతిరత్నంగా భారతీయుల హైందవ పితామహులుగా వారు అసాధార చరిత్ర నాయకులైనారు.


శ్రీ చిత్తరంజన్ దాస్ గారి కాలం: 1870 నవంబర్ 5వ తేదీన జన్మించారు. నిర్యాణం 1925 జూన్ 16వ తేదీన. వీరి తండ్రి భువన మోహన్ దాస్, తల్లి నిస్తరిణీ. జననం ఢాకా సమీపంలోని విక్రమపురి. వారిది వైద్యుల కుటుంబం. కానీ వారు న్యాయవాది (లండన్‍లో చదివారు) గొప్ప సంఘ సంస్కర్త. స్వాతంత్ర్య సమరయోధులు. వీరికి దేశబంధు అనే బిరుదు కలదు. 

పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు యావత్ భారతావని సంపుర్ణ ప్రపంచ దేశాలూ ఎరిగిన మహోన్నతులు. సర్వులకు ఆదర్శమూర్తులు.


శ్రీ సద్గురువులు ఆదిశంకరుల వారు సనాత అధ్వైత అసమాన తత్త్వ బోధకులు. సర్వకాల సర్వావస్థల యందున సర్వేశ్వర చింతనతో, సధర్మ ఆచరణతో యోగసాధనంతో పరకాయ ప్రవేశ మంత్ర సిద్ధిని సాధించిన మహోన్నతులు. అనేక ధర్మ, హైందవ తత్వ గ్రంథాలను వ్రాశారు.


శ్రీభగవాన్ రమణ మహర్షులు ’నేనెవరు?’  .. అనే జిజ్ఞాసతో నిరంతరం సర్వేశ్వర ఆరాధనను (మనస్సులో) సాగించి, జీవాత్మ పరమాత్మల ఉనికి తెలుసుకొని, అవి రెండూ పయనించే రధమే ఈ మన శరీరమని దానికి చావు వుందని అది అనిత్యమని అచంచల ఆత్మకు జనన మరణాలకు అతీతమని, సన్మార్గ వర్తనుల ఆత్మయే దైవ స్వరూపమని వారి తపోబలంతో గ్రహించి, శిష్యులందరికీ బోధించిన మహనీయులు. 


ఎన్నో అధ్వైత తత్వం రచనలు, పద్యాలను రచించారు. సత్ కర్మాను ష్టాన జన్మ రాహిత్యమే మోక్షం అని విశదీకరించారు శ్రీ నేతాజీ సుభాస్ చంద్రబోస్. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద స్వామీజీల శిష్యుడు. వారి సిద్ధాంతాలను బోధనలను బాగా జీర్ణించుకొన్న మహోన్నతులు. 


దుర్మార్గులైన వైన వర్గాన్ని (ఆంగ్లేయులు) వారు మన జాతిని (భారతీయులను) హింసించే విధానాలను రూపుమాపి, వారిని దేశం నుండి పారదోలాలంటే అహింసావాద శక్తి చాలదని, వారిని ఎదిరించి పోరాడి. పరాజయులను చేసి దేశంనుండి పారద్రోలాలనే ధృడ సంకల్పంతో జర్మని, జపాన్ దేశాలను సందర్శించి ఆ దేశ నాయకులతో తన హేతువాదాన్ని గురించి వివరించి, వారి మిత్రత్వాన్ని సాధించి ఒక మహా సంగ్రామ సన్నాహాలు చేయు ప్రయత్నంలో విమాన ప్రమాదంలో నేలరాలిన పారిజాత పుష్పం వారు. 


వారి దేశభక్తి అనిర్వచనీయం. వారి సంకల్పం కార్యదీక్షా అసాధారణం. ఆ మహోన్నతులు యువతరానికి, యావత్ భారతజాతికి పూజనీయులు  .. ఆదర్శమూర్తులు. చెరగని మహాచరిత్ర నాయకులు."


ఆ తరువాత పిరీయడ్ లెక్కల మాస్టారు లీవులో వున్నందున, ఆ పిరీయడ్‍ను కూడా రామశర్మ గారే నిర్వహించారు. వారు పిల్లలకు చెప్పతలచుకొన్న పై విషయాలను వివరించారు.

విజయశర్మ లేచి నిలబడ్డారు.


"మాస్టారుగారూ!   .."


"ఏమిటి విజయ్!  .."


"నాకు ఒక సందేహం!  .."


"ఏమిటది .. అడుగు!  .."


"మనం ఇప్పుడు సర్వ స్వతంత్రులం కదా!  .. 1947 ఆగష్టు 15న మనకు స్వాతంత్ర్యం లభించింది కదా!  .." 


"అవును  .."


"ఇంగ్లీషువారు దేశాన్ని వదలివెళ్ళిపోయారు కదా!  .."


"పోయారు  .."


"వారు పోతూ పోతూ దేశాన్ని రెండు ముక్కలు చేయడమే కాకుండా!  .. వారి స్వార్థ చింతనలను, నిర్థాక్షిణ్యాన్ని, దోపిడిగుణాన్ని  .. మనవారిలో కొందరికి వారసత్వంగా చేసి, వారు వెళ్ళిపోయారని నా భావన. అది తప్పా రైటా మాస్టారు గారూ!  .." 


రామశర్మ గారు విజయ్ శర్మ ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచారు.

కాశ్యప్ శర్మ లేచి నిలబడి  ..

"మాస్టారు గారూ!  .. విజయ్‍కు కలిగిన సందేహమే నాకూ కలిగింది. దానికి తమరి జవాబు ఏమిటి?" అడిగాడు. 

రామశర్మ ఇరువురి ముఖాలను పరీక్షగా చూచాడు.

’నేను చెప్పింది ఎవరెవరికి ఎంతవరకూ అర్థం అయిందో నాకు తెలియదు. కానీ నా కొడుకు విజయశర్మ, కాశ్యప్ శర్మలకు బాగా బోధపడినట్లుంది. అందుకే వారు ప్రస్తుత సమాజ దృష్ట్యా అలాంటి ప్రశ్నను నన్ను అడిగారు’ వారి పెదవులపై చిరునవ్వు.


"మీ ఇరువురీ భావనలు, అభిప్రాయాలు ఒక్కటే కదా!  .."


అవును అన్నట్లు ఇరువురూ తలలను ఆడించారు.

రామశర్మ మాష్టారు నవ్వుతూ ..

"మీ ఇరువురి ఆలోచనలు సవ్యమైనవి. యదార్థాలు. నేడు కొందరు స్వార్థపరులు మానవులుగా వర్తించేదానికి బదులుగా దానవులుగా మారారు. ఆ దైవం, ఒకనాడు దుష్టశిక్షణ, ధర్మ రక్షణను తప్పక చేస్తాడు." 


స్కూల్ లాంగ్ బెల్ మ్రోగింది. రామశర్మ గారు గదినుండి బయటికి నడిచారు. పిల్లలందరూ పుస్తకాలు సర్దుకొని మాస్టారు గారి వెనుక నడిచారు.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page