అపరాధ పరిశోధన - పార్ట్ 14
- Seetharam Kumar Mallavarapu
- Jun 25
- 6 min read
Updated: 3 days ago
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 14 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 25/06/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు.
దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ ను ఉపయోగించు కోవాలనుకుంటాడు దాము. హంతకుడు రంగా, మునావర్ ను కాంటాక్ట్ చేస్తాడు. మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్.
రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు. దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్ లాగా వస్తాడు జాఫర్. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దీక్షిత్ ను రబ్బర్ బులెట్ తో కాలుస్తాడు జాఫర్. అవి నిజం బులెట్ లు అనుకోని దీక్షిత్ కు అడ్డం వస్తుంది నీతూశర్మ.
ఆమెను తీసుకొని శివరాం శర్మ ఇంటికి బయలుదేరుతాడు దీక్షిత్. దారిలో యాక్సిడెంట్ చేసి, దీక్షిత్ ను చంపాలని ప్లాన్ చేస్తారు. కానీ ఒక బుల్ డోజర్ ను కవర్ గా వాడుకుని తప్పించుకుంటాడు దీక్షిత్. శివరాంశర్మ గారి ఇంటి దగ్గర తులసీనాథ్ అనే వ్యక్తి దీక్షిత్ ను కలవడానికి వస్తాడు.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 14 చదవండి..
దీక్షిత్ కు ఎదురుగా మరో కుర్చీ వేశారు పోలీసులు.
"రండి తులసినాథ్ గారూ! ఇప్పుడే మీ గురించి అడుగుతున్నాను" అన్నాడు దీక్షిత్.
"మీలాంటివారు నా గురించి అడిగారంటే నేను ఏదో క్రైమ్ చేసి ఉంటాను" నవ్వుతూ అంటూ కుర్చీలో కూర్చున్నాడు తులసీనాథ్.
"అదేం లేదండీ. పార్టీలో పెద్ద నాయకుల్లో మీరు ఒకరు కదా.. అందుకని క్యాజువల్ గా కలుద్దాం అనుకున్నాను" అన్నాడు దీక్షిత్.
"నా ముఖం! నేను పెద్ద నాయకుడు ఏమిటి.. ఇంకా సునీల్ వర్మ లాంటి వాళ్లను గురించి ఆ మాట అనవచ్చు. ఎందుకంటే శర్మ గారి తర్వాతి స్థానం వర్మ గారిదే" అన్నాడు తులసినాథ్.
"ఎవరి స్థానం వారిదే.. ఎవరి ప్రయత్నాలు వారివే." తను కూడా నవ్వుతూ అన్నాడు దీక్షిత్.
"ఒకటి మాత్రం నిజం ఎస్పీ గారూ! నిన్న నేనొక పొరపాటు చేశాను" చెప్పాడు తులసీనాథ్.
ఏమిటన్నట్టు చూశాడు దీక్షిత్.
"నిన్న సాయంత్రం శర్మ గారితో 'చెల్లెమ్మ చేతి కాఫీ తాగి చాలా రోజులు అయింది. ఈరోజు మీతో కూడా మీ ఇంటికి వస్తాను' అన్నాను. 'మీ చెల్లెమ్మ, కొడుకులను చూడడానికి భోపాల్ వెళ్ళింది. అయినా పర్వాలేదులే. ఇంటికి రా. నీకోసం నేనే స్వయంగా కాఫీ చేసి ఇస్తాను' అన్నాడాయన.
'వద్దులే, మరొకసారి చెల్లెమ్మ ఉన్నప్పుడే వస్తాను' అన్నాను నేను.
కానీ నేను ఆయనతో పాటు వచ్చి ఉంటే ఆయన్ను పక్కకు లాగడమో లేదా నేను అడ్డుగా నిలవడమో జరిగి ఉండేది. ఆయన్ను కాపాడే అదృష్టం నాకు లేకుండా పోయింది" కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చెప్పాడు తులసీనాథ్.
"బాధపడకండి. జరిగిన దానిని ఎవరమూ మార్చలేము. అసలు నేరస్తుడిని తొందరగా పట్టుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చడమే మనము ఆయనకు ఇచ్చే నివాళి" అన్నాడు దీక్షిత్.
"నిజమే ఎస్పీ గారూ! మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. నేను మీకు చెప్పగలిగే అంత వాడిని కాను కానీ, ఏ హత్యకైనా మోటివ్ ఉండాలి. ఒక వ్యక్తి మీద చంపేయాలనేంత కక్ష ఉండడమో లేదా అతని మరణం వల్ల లాభం కలుగుతుందని ఆశ ఉండడమో హత్యకు కారణాలు అవుతాయి. ఆ రకంగా ఆలోచిస్తే మీకు హత్య చేయించింది ఎవరో సులభంగా తెలిసిపోతుంది" అన్నాడు తులసినాథ్.
"ఈ హత్య చేయించిన వ్యక్తి మహా మేధావి. ముందు హంతకులు దొరికిపోతే కేసు ముగిసిపోతుందనుకున్నాడు. తరువాత వేరే వాళ్ళ పైకి అనుమానం మళ్ళించాలని ప్రయత్నించాడు. కానీ నా దగ్గర నుండి తప్పించుకునే అవకాశం లేదు. మీ విలువైన సమయాన్ని నాకోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు. మళ్లీ కలుస్తాను" అంటూ పైకి లేచాడు దీక్షిత్.
"ఆల్ ది బెస్ట్. తొందర్లోనే హత్య చేయించిన వాళ్ళని పట్టుకుంటారని ఆశిస్తున్నాను" అని చెప్పి బయటకు నడిచాడు తులసినాథ్.
మేడ పైనుండి కిందకు వచ్చిన దీక్షిత్, నీతూశర్మను అక్కడే ఉంచి, సీఐ మురళితో కలిసి దాము ఉన్న స్థావరానికి బయలుదేరాడు. అది ఒక పాత ఇనుప సామాన్లు భద్రపరిచే రేకుల షెడ్డు. అక్కడ పనిచేసే వాళ్ళ లాగా దాము అనుచరులు ఒక పది మందికి పైగా ఉంటారు. అనుకోకుండా ఎవరైనా దాడి చేస్తే ప్రాణాలకు తెగించి అడ్డుకుంటారు. ఆ షెడ్డు కు వెనక వైపు చిన్న ఇల్లు ఒకటి ఉంది. అందులో హాల్లో మునావర్ ఉంటాడు. వెనుక వైపు గదిలో దాము ఉంటాడు. తన దందా లన్నీ అక్కడి నుంచే నడుపుతాడు దాము.
పోలీస్ కార్ ఆ షెడ్ ముందు ఆగడంతో దాము అనుచరులు అలర్ట్ అయ్యారు. మునావర్కు కాల్ చేసి చెప్పారు. మునావర్ ఆ వార్తను దాముకు చేరవేశాడు.
"ఆ జాఫర్ ను నమ్మి పొరపాటు చేశాను. పనికిమాలిన వెధవ.. అనవసరంగా దొరికిపోయాడు. భయంతో నా పేరు చెప్పి ఉంటాడు. ఇప్పటికిప్పుడు అరెస్ట్ కావడానికి సిద్ధంగా లేను. కొన్ని జాగ్రత్తలు తీసుకొని, శక్తి సార్ తో ఒకసారి మాట్లాడి, ఆ తర్వాత కావాలంటే నేనే లొంగిపోతాను." అన్నాడు దాము.
"అలాగే సార్! మీరు వెనకవైపు డోర్ నుండి వెళ్లిపోండి. నేను పోలీసులతో మీరు రేపు వస్తారని చెబుతాను" అన్నాడు మునావర్.
"కథ ముగింపు కు వస్తోంది. పోలీసులు నిన్ను అదుపులోకి తీసుకుంటారు. టార్చర్ పెడతారు. పైగా నువ్వు లేకుంటే నాకు ఒక చెయ్యి లేనట్లు ఉంటుంది. నువ్వు లేకుండా ఏ పనీ చేయలేను. కాబట్టి మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అన్నాడు దాము.
"అలాగే సార్" అని చెప్పి షెడ్ లో ఉన్న ఒక అనుచరుడికి ఫోన్ చేశాడు.
"మేమిద్దరము ఎస్కేప్ అవుతున్నాము. పోలీసులు అడిగితే 'మాకు ఏమీ తెలియ'దని, 'మేము షెడ్ లో వర్కర్ల'మని చెప్పండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని స్టేషన్కు రమ్మంటే వెళ్లండి. మీకు ఏమీ భయం లేదు. మిమ్మల్ని విడిపించే ఏర్పాటు నేను చేస్తాను" అని చెప్పి కాల్ కట్ చేశాడు మునావర్.
"తరువాత వెనకవైపు డోర్ తెరుచుకొని అక్కడ సిద్ధంగా ఉన్న బైక్ లో కూర్చున్నారు దాము, మునావర్.
కొంత దూరం రెండు మూడు సందులు తిరిగాక తమనెవరు ఫాలో చేయడం లేదని గమనించి రోడ్డుపక్కగా బైక్ ఆపాడు దాము.
“మునావర్! నువ్వు ఆటోలో వెళ్లి మోనా, లూసీలను తీసుకొని మన హైడింగ్ స్పాట్ కి వచ్చేయి. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను" అన్నాడు దాము.
"ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను దాము సార్. ఇలాంటి సమయాల్లో వాళ్ళు మీతో ఉండడం మీకు, వాళ్లకు కూడా మంచిది కాదు. దొరికిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విషయం కాస్త సద్దుమణిగాక వాళ్లను తీసుకొని వస్తాను" అన్నాడు మునావర్.
"ఈ దాము అలా భయపడుతూ కూర్చోడు. సింహం గుహ దాటి వచ్చినా సింహమే. చెప్పిన పని చెయ్యి" కటువుగా చెప్పి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు దాము.
'ఈ స్త్రీ వ్యామోహమే దాముని నాశనం చేస్తుంది' అని మనసులో అనుకొని అటుగా వెళుతున్న ఆటో ఎక్కాడు మునావర్.
ఆటోలో వెళ్తున్న మునావర్ కు షెడ్ లో ఉన్న ఒక అనుచరుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.
"మునావరన్నా! కార్ లోనుండి ఎస్పీ సార్ మాత్రమే దిగారు. లోపలికి వచ్చి మీ ఇద్దరి గురించి అడిగారు. ఏదో పెళ్లికి వెళ్లారని, రేపు తిరిగి వస్తారని, రాగానే స్టేషన్ కి పంపుతామని చెప్పాను. సరేనని ఆయన వెళ్లిపోయారు" అని చెప్పాడు.
"ఎస్పీ సార్ తో పాటు సిఐ మురళి సార్ రాలేదా?" అని అడిగాడు మునావర్.
లేదని చెప్పాడు అతను. వెంటనే దాము కు కాల్ చేశాడు మునావర్.
"సార్, డ్రైవింగ్ లో ఉన్నారా" అడిగాడు.
"పర్వాలేదులే చెప్పు" అన్నాడు దాము.
"మన షెడ్డు దగ్గరికి ఎస్పి సార్ మాత్రమే వచ్చారట" అన్నాడు మునావర్.
"అయితే ఏమిటి? ఆ సీఐ, శివరాం శర్మ ఇంటిదగ్గర ఉండి ఉంటాడు" అన్నాడు దాము.
"లేదు సార్! నాకు ఎందుకో అనుమానం గా ఉంది.. ఆయన తన మనుషులతో మోనా ఇంటిదగ్గర ఉన్నాడేమో" సందేహం వెలిబుచ్చాడు మునావర్.
"మోనా కాదు మోనా మేడం" హెచ్చరికగా సరి చేశాడు దాము.
"సారీ సార్! తొందరలో అలా అనేశాను. వాళ్లు అక్కడ ఉండి, మమ్మల్ని ఫాలో చేస్తే అందరమూ దొరికిపోతాము. మరొకసారి ఆలోచించండి" అన్నాడు మునావర్.
"ఎందుకు పిరికివాడిలా తయారయ్యావు? అసలు పోలీసులు పట్టుకుంటే ఏమవుతుందట.. ఎన్నిసార్లు మనం స్టేషన్ మెట్లు ఎక్కలేదు.. అనవసరపు ఆలోచనలు పెట్టుకోకు. వాళ్ళని నా హైడింగ్ స్పాట్ దగ్గరికి తీసుకొని రా. నేను లేనప్పుడు పోలీసులు గానీ, మన శత్రువులు గానీ వాళ్లకు ఆపద కలిగించవచ్చు. నువ్వు నేరుగా మోనా ఉన్న ఇంటి దగ్గర దిగకుండా, ఆటో వీధి చివర ఆపు. పరిసరాలు గమనిస్తూ తన ఇంటికి వెళ్ళు" చెప్పి కాల్ కట్ చేశాడు దాము.
బైక్ లో కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న గల్లీలోకి వెళ్ళాడు దాము. ఆ గల్లీ లోకి ఆటోలు కూడా రాలేవు. అక్కడ ఒక పెంకుటింటి ముందు తన బైక్ ఆపాడు. పక్కనే టీ బంక్ లో ఉన్న అతనికి తన బైక్ను వేరేచోట ఉంచమని సైగ చేసి, ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ కొంతమంది ఆడ మగ కూర్చుని బీడీ ఆకులు చుడుతున్నారు. వాళ్లను దాటుకొని వెళ్లి ఒక గది తాళం తీసి, లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ గదికి వెనకవైపు ఒక తలుపు ఉంది. అది తెరిస్తే అవతలి గల్లీలోకి దారి ఉంటుంది.
ఆ గదిలో టేబుల్ డ్రా లో స్విచ్ ఆఫ్ చేసి ఉన్న మొబైల్ ని తీసుకొని ఆన్ చేశాడు. అందులో ఫీడ్ చేసి ఉన్న ఒకే ఒక నంబర్కు కాల్ చేశాడు.
"జాఫర్ దొరికిపోయాడు. నా పేరు చెప్పినట్లు ఉంటాడు. పోలీసులు నాకోసం వెతుకుతున్నారు" అవతలి వ్యక్తి లిఫ్ట్ చేయగానే ఆందోళనగా చెప్పాడు దాము.
"శివరాం శర్మ హత్యతో జాఫర్ కు ఏ సంబంధం లేదు. అతడు ఒకవేళ చెబితే ఎస్పీ మీద హత్యా ప్రయత్నం విషయంలో నీ పేరు చెప్పవచ్చు. నీ దందాలకు అడ్డు వస్తున్నాడని ఎస్పీని బెదిరించమని జాఫర్ ను పంపినట్లు చెప్పు. హత్యా ప్రయత్నంతో నీకు సంబంధం లేదని బుకాయించు. మరీ తప్పని పరిస్థితి వస్తే ఆ శివరాంశర్మ మేనల్లుడు ప్రణవ్ అలా చేయమన్నట్లు చెప్పు" అన్నాడు అవతలి వ్యక్తి.
***
దాము చెప్పినట్లే మోనా ఇల్లు ఉన్న వీధి చివరనే ఆటో ఆపి, దిగాడు మునావర్. పరిసరాలు గమనించుకుంటూ నెమ్మదిగా మోనా ఇంటికి వెళ్ళాడు. బెల్ కొట్టగానే మోనా తలుపు తీసింది. లోపలికి వెళ్లిన మునావర్ "పోలీసులు ఎవరూ రాలేదు కదా?" అని అడిగాడు.
"రాలేదు కానీ.. శివరాం శర్మ హంతకులు నీ పేరు, దాము పేరు బయట పెట్టారా?" అడిగింది ఆందోళనగా.
"లేదు. మరీ బెదిరిస్తే జాఫర్ పేరు చెప్పమని వాళ్లకు ముందే చెప్పానుగా. అయినా ఎందుకలా అడిగారు?" అన్నాడు మునావర్.
ఆమె సమాధానం చెప్పే లోపల, మూసి ఉన్న ఒక గది తలుపులు తెరుచుకుని లూసీ బయటకు వచ్చింది. "నేరం మీరు చేసి నా జాఫర్ ను ఇరికించాలను చూస్తారా" కోపంగా అంది.
మునావర్ మౌనం వహించాడు.
"చెప్పు. మర్డర్ ప్లాన్ చేసింది మీరు కదా?" అంది లూసీ కోపంగా.
"అవుననుకో.. అదంతా తరువాత చెబుతాను" అని మునావర్ అంటూ ఉండగా మూసి ఉన్న మరో గది తలుపులు తెరుచుకుని సీఐ మురళి, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బయటకు వచ్చారు. మురళి తన రివాల్వర్ తీసి మునావర్ కి గురి పెట్టాడు ఒక కానిస్టేబుల్ వెళ్లి డోర్ మూసి గడి పెట్టాడు. ఏం చేయాలో అర్థం కాలేదు మునావర్ కు!
=========================================================
ఇంకా ఉంది
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments