అతీతుడు కాదతను
- Malla Karunya Kumar
- Jun 24
- 7 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #AtheethuduKadathanu, #అతీతుడుకాదతను, #TeluguHeartTouchingStories, #కొసమెరుపు

Atheethudu Kadathanu - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 24/06/2025
అతీతుడు కాదతను - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“రేయ్ ఎవడ్రా నువ్వు చూసుకొని నడవడం తెలియదా?.” అని తనని గుద్ది, తిరిగి మళ్ళీ తననే దబాయిస్తున్న వ్యక్తి వైపు చూస్తున్నాడు డాక్టర్ విశ్వాస్ కోపంగా.
“ఎవరయ్యా నువ్వు!, నన్నే గుద్ది. మళ్ళీ నాదే తప్పని అంటున్నావా!..” అని పైకి లేస్తూ, తన బట్టలకు అంటుకున్న దుమ్మును దులుపుతూ అన్నాడు విశ్వాస్..
ఇంతలో అక్కడికి కొందరు వచ్చి కోపంతో వున్న డాక్టర్ ను పక్కకు తీసుకు వెళ్ళారు.
“ఎవడు వీడు!, ఇప్పటి వరకు నాకు ఎదురు తిరిగి సమాధానం ఇచ్చిన వాడు ఈ ఏరియాలోనే లేడు?. ఎటువంటి భయం లేకుండా నా మీదకే వస్తాడా!, వీడి సంగతి చూడాలని.” అనుకుంటూ ముందుకు కదిలాడు రుద్రుడు.
తనకు నప్పని పొడవాటి చొక్కా, డొల్ల ప్యాంట్.. బొగ్గులా మారిన ముఖం..పొడవాటి జుట్టు చూస్తుంటే వింతగా కనిపిస్తున్నాడు రుద్రుడు..
“ఇంతకీ ఎవరు అతను?. నన్నే తోసేసి, మళ్ళీ నాతో గొడవపడుతున్నాడు..పైగా ఫుల్ గా తాగి వున్నాడు?.” అని అక్కడ వున్న వాళ్ళతో అన్నాడు డాక్టర్.
“సారూ. అతడే రుద్రుడు.. కాటి కాపరి..పెద్ద మూర్ఖుడు. వాడితో గొడవ పడితే మీకే ప్రమాదమని పక్కకు తీసుకు వచ్చాం.. వీడు కూడా ఇప్పుడున్న ట్రెండ్ కు అలవాటు పడినట్టున్నాడు.. కొత్తగా ఈ మధ్యనే చొక్కా, ప్యాంట్ వేస్తున్నాడు.. ఒకప్పుడు అయితే దుడ్డు పట్టుకొని, ఒక దుప్పటి కప్పుకొని నల్లని బూడిద కలిగిన దేహంతో ఉండేవాడు” అని రుద్రుడు గురించి చెప్పారు వాళ్ళు.
“అంటే అతను అంత ప్రమాదకారుడా!..”అని వెళ్తున్న రుద్రుడు వైపు చూస్తూ అడిగాడు విశ్వాస్..
“వాడి జోలికి పోతే ప్రమాదం.. వాడి గురించి పట్టించుకోక పోతే వాడి వలన ఏ ప్రమాదం వుండదు.. వాడొక మృగం లాంటివాడు..వాడికి మానవులన్నా, మానవ అనుబంధాలు అన్న పరమ అసహ్యం..బహుశా ఆ శవాలను తగులబెట్టి,తగులబెట్టి ఇలా తయ్యారైవుంటాడేమో!..”అని వాడి గురించి వివరంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ జనం.
విశ్వాస్ తన స్నేహితుడు కోరిక మేరకు అక్కడ వున్న తన స్నేహితుడు హాస్పిటల్ లో కొన్ని రోజుల డ్యూటీ చేయడానికి వచ్చాడు. అక్కడ స్టాఫ్ కొరత ఉన్న కారణంగా, స్నేహితుడు మాట కాదనలేక వచ్చాడు. విశ్వాస్ అక్కడే తన స్నేహితుడు ఏర్పాటు చేసిన రూంలో ఉంటున్నాడు.
తాను ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిని చూడలేదు..ఈ రుద్రుడి గురించి విని ఆశ్చర్యపోయాడు విశ్వాస్!..
రోజూ ఏదొక సమయంలో రుద్రుడు, విశ్వాస్ ఎదురుపడుతూనే వుంటారు.. రుద్రుడు విశ్వాస్ వైపు ఉరుముతూ చూడటం.. విశ్వాస్ రుద్రుడు వైపు కోపంగా చూడటం జరుగుతుంది..
ప్రతిరోజూ విశ్వాస్ ఆసుపత్రి నుండి తిరిగి తన రూంకు వస్తున్న దారిలో రుద్రుడు ఒక మర్రి చెట్టు కింద వుండడం చూస్తూ వుంటాడు. అప్పుడు అతను అక్కడ కు చేరిన చాలా మంది కుర్రాల తో సరదాగా నవ్వుతూ వుండడం గమనిస్తూ వుంటాడు..
వాళ్ళందరూ ఏదొక పని చేసి ఆ సాయంత్రం సమయానికి కాలక్షేపం కోసం ఆ పెద్ద మర్రిచెట్టు కిందకు చేరుకుంటారు.. వాళ్ళతో రుద్రుడు సాధారణంగా మాట్లాడటం చూసిన విశ్వాస్ కు ఎందుకో జనాలు రుద్రుడు గురించి తనకి చెప్పింది అబద్దం అనిపిస్తుంది..
ఒకప్పటి రుద్రుడు వేషధారణకి ఇప్పటి వేషధారణ కు మార్పు కి కారణం ఆ యువకులు సాంగత్యం అని తెలుసుకున్నాడు..
ఎందుకో రుద్రుడు విశ్వాస్ కు వింతగా అనిపిస్తుంటాడు.అతను అంటే అందరికీ ఎందుకు భయం?.. అతని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు.
విశ్వాస్ వచ్చి నెలరోజులు గడిచాయి!.. విశ్వాస్ అక్కడ అందరికీ దగ్గర అయ్యాడు ఒక్క రుద్రుడుకు తప్ప.. రోజూ వీళ్ళు కలుసుకుంటూనే వుంటారు కానీ మాట్లాడుకోరు..
ఒకరోజు తాను ఉంటున్న రూం కి ఎదురుగా వున్న గేటు పెద్దగా శబ్ధం కావడం తో, ఉలిక్కి పడి అటువైపు చూసాడు విశ్వాస్.. కంగారుగా గేట్ తీసుకొని రుద్రుడు తన వైపుకు రావడం చూసాడు..
ఒక్కసారిగా తనలో కంగారు మొదలు అయ్యింది..
“వీడేంటి!, ఇక్కడకు వచ్చాడు?..”అని తనలో అనుకుంటూ రుద్రుడు వైపు చూస్తున్నాడు విశ్వాస్..
ఇంతలో విశ్వాస్ దగ్గరకు చేరుకున్నాడు రుద్రుడు..
“ఏ డాక్టరు!..కందిరీగలు ముఖం మీద కుట్టినాయబ్బ..ఒకటే నొప్పి..కాస్త చూడరాదు..”అని అంటూ అక్కడే అరుగు మీద కూలబడ్డాడు ఆ నొప్పి భరించలేక..
మరుక్షణమే లోపలికి వెళ్ళి తన మందుల బ్యాగ్ తో రుద్రుడు దగ్గరకు వచ్చి, పరీక్షించి చూసి తన దగ్గర వున్న అయింట్మెంట్ పూసాడు..నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు..
“మరేం ఫర్వాలేదు..ఈ అయింట్మెంట్ రెండు పూటలు రాయి తగ్గిపోతుంది.”అని అంటూ ఆ అయింట్మెంట్ రుద్రుడుకు అందించాడు..
దాన్ని తీసుకొని విశ్వాస్ ముఖం వైపు చూసి..ఏమి చెప్పాలో తెలియక రెండు చేతులు పైకెత్తి అర్ద నమస్కారం మొహమాటం తో పెట్టి వెనుదిరిగాడు..
మరునాడు సాయంత్రం రుద్రుడు విశ్వాస్ దగ్గరకు వచ్చాడు..
రుద్రుడు రాకని చూసాడు విశ్వాస్ కానీ ఏమి అనలేదు..
“నువ్వు ఇచ్చిన మందు బాగా పనిచేసింది డాక్టరు..నొప్పి కాస్త వున్నా నిన్నటంత పోటు లేదు..”అని అంటూ తన ప్యాంటు జోబిలో చెయ్యి పెట్టి ఐదువందల నోటు తీసి విశ్వాస్ కు ఇవ్వబోయాడు..
అది చూసిన విశ్వాస్..
“ఏమిటిది!. నాకెందుకు ఇస్తున్నావు?..”అని ఆశ్చర్యంతో అడిగాడు విశ్వాస్..
“అదేంటి, డాక్టర్లు ఎవరికీ వూరికే వైద్యం చేయరు కదా..నాతో ఆ కుర్రాడు చెప్పాడు.. నేను పుట్టి బుద్ది ఎరిగిన నుండి ఆసుపత్రి ముఖం ఎరుగను..మా అయ్య అప్పుడు పసరు వైద్యం గురించి చెప్పినాడు..ఏదైనా తేడాగా వుంటే అవే వాడుతాను..ఆరోగ్యం సరైపోతుంది..”అని అన్నాడు రుద్రుడు..
“నాకేమీ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు..”అని అన్నాడు విశ్వాస్..
“ఓహో అర్దం అయ్యింది!.. నా వాలకం చూసి తీసుకోవడానికి సందేహిస్తున్నావా!..డబ్బుకి ఎటువంటి ముట్టు అంటదు కదా డాక్టరు..”అని అన్నాడు రుద్రుడు వ్యంగ్యంగా..
తెలిసి అన్నాడో,తెలియక అన్నాడో తెలియదు కానీ రుద్రుడు చెప్పిన మాటల్లో అక్షర సత్యం అని అనుకుంటూ.. “ నేను నిన్నొక మిత్రుడిలా అనుకొని వైద్యం చేశాను..నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు..”అని అన్నాడు విశ్వాస్..
ఒక్కసారిగా నవ్వాడు రుద్రుడు..రుద్రుడు నవ్వడం తో ఆశ్చర్యపోతూ..
“ఎందుకు నవ్వుతున్నావు..”అని అడిగాడు విశ్వాస్..
“నీ మాట విని నవ్వు వచ్చింది డాక్టరు..ఈ రుద్రుడు ఈ బంధాలకు,అనుబంధాలకు అతీతుడు..”
“ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు!. అసలు ఈ బంధాలు,అనుబంధాలు లేకపోతే ఈ సృష్టి వుంటుందా!..అమ్మ నాన్నల ప్రేమ,స్నేహితుడు..ఇంకా ఒక కుటుంబం ఆప్యాయతలు ఇవన్నీ ఎంత బాగుంటాయి..”అని అన్నాడు విశ్వాస్..
“డబ్బు కోసం చంపుకునే మనుషుల మధ్య ప్రేమలు ఆప్యాయతలా?..”అని ముఖం చిట్లిస్తూ అన్నాడు రుద్రుడు..
“అందరూ అలా వుండరు కదా!..” అంటూ ప్రశ్న సంధించాడు విశ్వాస్. రుద్రుడు మరో మాట మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు..
********
విశ్వాస్ ఆ ప్రాంతానికి వచ్చి మూడు నెలలు గడిచాయి..
మళ్ళీ ఎప్పటిలానే రుద్రుడు విశ్వాస్ ఎదురు పడుతూనే వున్నారు. అయితే ఈ సారి మాత్రం రుద్రుడు విశ్వాస్ వైపు చూసి చిరునవ్వు చిందించాడు..
ప్రతిగా విశ్వాస్ కూడా చిరునవ్వు చిందించాడు.
ఒకరోజు విశ్వాస్ తన రూం కు చేరుకునే సరికి అక్కడ వేచి వున్నాడు రుద్రుడు.
రుద్రుడును చూసిన విశ్వాస్ మళ్ళీ ఏమైనా వైద్యం అవసరం అయ్యిందేమో అనుకుంటూ వేగంగా కదిలాడు.
“ఏమైంది నా కోసం ఎదురుచూస్తున్నావు?.” అని కంగారు పడుతూ అడిగాడు విశ్వాస్..
“ఏమి లేదు డాక్టర్, నీతో మాట్లాడుదాం అని వచ్చాను.”
“సరే కాసేపు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వస్తాను.”అని లోపలికి వెళ్ళాడు.
కొంత సమయం తర్వాత రెండు కప్పులతో టీ తీసుకొని వచ్చి, ఒక కప్పు రుద్రుడు కు అందించాడు విశ్వాస్..
విశ్వాస్ తనకి టీ ఇవ్వడం తో రుద్రుడు లో ఆశ్చర్యం కలిగింది!.. విశ్వాస్ వైపు చూస్తూ ఉండిపోయాడు రుద్రుడు..
“ఏమైంది !..తీసుకో.”అని విశ్వాస్ అనడం తో,
ఒక్కసారిగా ఉలిక్కి పడి ఆలోచనలో నుండి బయటకు వచ్చి “రామయ్య గుర్తుకు వచ్చాడు డాక్టరు..అందుకే ఇలా ఉండిపోయా.” అని టీ గ్లాస్ అందుకుంటూ అన్నాడు రుద్రుడు..
“రామయ్య అతను ఎవరు?..”అని టీ తాగుతూ అడిగాడు విశ్వాస్..
“అతను ఒకప్పుడు ఇక్కడే ఉండేవాడు..నీకు లాగే నాతో బాగా మాట్లాడేవాడు. నన్ను చూసి అందరూ పారిపోయే వారు కానీ అతను నన్ను దగ్గరకు రానిచ్చే వాడు.. నీలా టీ కూడా ఇచ్చేవాడు..ఎప్పుడో కాలం చేశాడు. అందరినీ ఆప్యాయంగా చూసిన అతనికి చివరికి కొడుకులు వదిలేశారు.. ఇవన్నీ చూసి నాకు మానవుల మీద, అనుబంధాలు మీద అసహ్యం ఎక్కువ అయ్యింది. కానీ ఒకటి మాత్రం ఆనందం కలిగింది ఇప్పటి కురాళ్ళు కూడా నాలానే ఆలోచిస్తున్నారు.
బంధాలు,అనుబంధాలు అనకుండా నచ్చినట్టు వున్నారు.. సంతోషంగా తిరుగుతున్నారు. కానీ డాక్టరు నువ్వు కూడా వాళ్ల వయస్సే కలిగి వుంటావు కదా, మరి నువ్వు ఎందుకో నాకు భిన్నంగా కనిపిస్తున్నావు!. నీ ఆలోచనలు, వాళ్ల ఆలోచనలు వేరుగా వున్నాయి?.. ఈ మధ్యన ఎక్కడ విన్నా నీ పేరే వినపడుతుంది. ఈ సమాజాన్ని నమ్మకు మోసం చేస్తారు.. కానీ ఒకటి మాత్రం సత్యం నీ తల్లితండ్రులు అదృష్టమంతులు..” అని అన్నాడు రుద్రుడు టీ తాగడం ముగించి ఆ గ్లాస్ అరుగు మీద పెడుతూ.
అప్పటి వరకు నవ్వుతూ వున్న విశ్వాస్ ఒక్కసారిగా మౌనం వహించాడు. విశ్వాస్ ముఖంలో మార్పులు చూసిన రుద్రుడు..
“ఏమైంది డాక్టరు!..తల్లితండ్రుల గురించి అంటే అలా అయిపోయావు?.. నీ తల్లితండ్రులు నిన్ను బాగా చూడలేదా?..”అని అడిగాడు రుద్రుడు.
“అవును. చూడలేదు..నా తండ్రి ఎవరో నాకు తెలియదు. కానీ నా తల్లి తన శక్తిని ధారపోసి నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది.. బాల్యంలో అమ్మ దగ్గర ఉండాల్సిన నేను అనాథ ఆశ్రమంలో పెరిగాను. మా అమ్మే నన్ను అక్కడ చేర్పించింది..అప్పుడు అమ్మ మీద కోపం వచ్చేది. కానీ తర్వత ఆమె చెప్పిన విషయం విని చాలా బాధకలిగింది అమ్మను తప్పుగా అర్థం చేసుకున్నందుకు. నేను చదువుకోవాలి అంటే తల్లితండ్రుల వివరాలు అవసరం..
నా తల్లికి నా తండ్రి వివరాలు ఏమి తెలియవు..ఎలా తెలుస్తాయి, చేసిందంతా చేసి కడుపులో నేను పడగానే వదిలేసి వెళ్లిపోయాడు కదా.. అందుకే నా చదువుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వుండడం కోసం నన్ను అనాథ ఆశ్రమంలో చేర్పించింది..నన్ను దూరం చేసుకొని ఆమె ఎంత బాధపడిందో నాకు తెలుసు. తర్వాత నా చదువుకు అవసరమైన డబ్బులు ఆమె సమకూర్చింది. నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది..”అని చెప్పాడు విశ్వాస్..
“అలాంటి ఆమెను మోసం చేసినోడు ఎవడు డాక్టరు?..నీలాంటి వాడిని వదులుకున్న వాడు దురదృష్ట వంతుడు!.. అంతే డాక్టరు ఈ సమాజం మోసగొట్టుది..”అని అన్నాడు రుద్రుడు..
“అతను లేకపోతే ఏమి మా అమ్మను నేను బాగా చూసుకుంటున్నాను. మా అమ్మ, నేను సంతోషంగా వున్నాము.. అదుగో మా అమ్మ.”అని లోపల వున్న ఫోటో చూపిస్తూ అన్నాడు విశ్వాస్..
“సరిగ్గా కనించడం లేదు.. డాక్టరు..”
“పదా లోపలికి..”అని రుద్రుడు తో అన్నాడు విశ్వాస్..
ఒక్కసారిగా రుద్రుడు కళ్ళలో నీరు తిరిగాయి..ఇంతవరకు తాను ఎవరి ఇంటిలోకి వెళ్ళలేదు.. విశ్వాస్ తనను ఒక మనిషిలా చూసి ఇంటిలోకి పిలిచాడు అని ఆనందంతో పొంగిపోయాడు..రా, అంటూ విశ్వాస్ రుద్రుడు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకు వెళ్ళాడు..
"ఈవిడే మా అమ్మ.. నా దేవత" అని ఆ ఫోటో చూపిస్తూ అన్నాడు విశ్వాస్..ఆ ఫోటో వైపు చూసిన రుద్రుడు ఒక్కసారిగా రాయిలా వుండి పోయాడు.. ఒక్కసారిగా తన గతం కళ్ళముందు తిరిగింది..
***
“అయ్యా..మనకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు.. నీ మీద నమ్మకం తో నీకు నా సర్వస్వం ఇచ్చాను..మనం పెళ్లి చేసుకొని ఎటైనా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుదాం.”.అని పొన్నమ్మ అంది..
“పెళ్లా!..అది నాకు గిట్టని మాట.. నా కోరిక నువ్వు తీర్చావు, నీ కోరిక నేను తీర్చాను.. అంతే.. ఆ పిండం సంగతి నాకు తెలియదు.” అని రుద్రుడు అన్నాడు.
“నిన్నే నమ్మితే మోసం చేస్తావా?..”అని రుద్రుడు మాటలకు కంగారు పడుతూ అంది.అప్పటి వరకు రుద్రుడు కేవలం నా దేహాన్ని మాత్రమే ఇష్టపడ్డాడు అన్న నగ్న సత్యం తెలిసి ఆమె లో బాధ ఎక్కువ అయ్యింది.
“ఎవడు నమ్మమన్నాడు.”
“అట్టా అనకు అయ్య..”అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ బతిమాలింది ఎక్కడ తనకు పుట్టబోయే బిడ్డ అనాథ అయిపోతాడో అని, రుద్రడు ను నమ్మి పెళ్లి కాకుండా తల్లిని అయిన తనని లోకం చెడు దృష్టితో చూస్తుంది అని భయపడుతూ తన జీవితం చక్కదిద్దుకోవాలని పరితపించింది.
ఒక్క తాపు తన్ని.., “నన్ను విసిగిస్తే చంపేస్తా”అని బెదిరించి వెళ్ళాడు.
ఆ మరుసటి రోజు ఆమె కనిపించలేదు.. పీడ పోయింది అనుకున్నాడు.
***
“రుద్రయ్య, రుద్రయ్య..”అని పిలుపుతో మళ్ళీ ఆలోచనల నుండి బయటకు వచ్చాడు.. కళ్ళలో నుండి నీళ్లు ధారగా వస్తున్నాయి.. ఎదురుగా ఉన్నది తన కొడుకే అని తెలిసి ఆనందం కలుగుతుంది..
“ఏమైంది నీ కళ్ళలో నీరు ఎందుకు వస్తున్నాయి!.” అని అడిగాడు విశ్వాస్..
“ఏదో పడినట్టు వుంది బాబు..” అని కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు నిజం చెప్పలేక.
ఇన్నాళ్ళూ నేను ఈ బంధాలకు,అనుబంధాలకు అతీతుడ్ని అనుకున్నాను కానీ, ఇతను నా కొడుకు అని తెలిశాక నాలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.. ఇన్నాళ్లు మనుష్యుల్ని నమ్మకూడదని అంటుండే వాడిని,కానీ నేను మనిషినే కదా, మరి నేను చేసిన తప్పు నాకెందుకు గుర్తుకు రాలేదు. ఆమెను అలా మోసం చేసాను. కురాళ్ళు నాలానే ఆలోచిస్తున్నారని సంబర పడే వాడిని.. ఈ బాబులా ఆలోచిస్తే ఏ తల్లితండ్రులు కూడా బాధపడరు కదా. నేను ఆమెని వదిలేసినా, కష్ట పడి ఈ బిడ్డకు బ్రతుకు ఇచ్చింది. నిజంగా ఆమె దేవతే కదా అని తన తప్పులు లెక్కేసుకుంటున్నాడు.
“రుద్రయ్య. నీకో విషయం చెప్పాలి.. రేపు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను..”అని అన్నాడు విశ్వాస్..
ఈ మాట విని రుద్రుడు లో ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది.. నేనే నీ తండ్రిని అని చెప్పాలనుకున్నాడు కానీ, అంతకు ముందు విశ్వాస్ తన తండ్రి పట్ల కోపాన్ని ప్రదర్శించడం గుర్తుకు వచ్చి చెప్పలేక పోయాడు. నువ్వు ఈ బంధాలకు అతీతుడువు అని తనలో అంతరంగం ఘోషిస్తుంది.. వాడి చేత తండ్రి అని పిలిపించుకోలేక పోయాను అన్న ప్రేగు బంధం తీపి బాధిస్తుంది.. రుద్రుడు సతమతం అవుతున్నాడు.
ఇన్నాళ్ళు బంధాలకు నేను అతీతుడ్ని అని ఏవేవో మాట్లాడే వాడవి ఇప్పుడు తెలిసిందా బంధం విలువ ఏమిటో, నువ్వే ఎన్నో తప్పులు చేసి చివరికి సమాజాన్ని తిట్టే వాడివి..ఏమైంది చివరికి కొడుక్కి కూడా నువ్వెవరో చెప్పుకోలేని దుస్థితి నీది అని అంతరంగం ఘోషిస్తుంది.
నువ్వు ఈ అనుబంధాలకు బంధీవే అని పుత్ర ప్రేమ హోరెత్తుతోంది.తెలియకుండా వచ్చిన కన్నీళ్లను తుడుచుకున్నాడు.మరో మాట మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోయాడు..
రుద్రుడు ఏమి అనకుండా ముందుకు కదలడం తో..
“ఎందుకు ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు?.” అని అడిగాడు విశ్వాస్..
అయినా సమాధానం చెప్పకుండా ముందుకు సాగాడు రుద్రుడు..
“ఏమిటో ఈ వ్యక్తి అర్దం కాడు..”అని తన పనిలో నిమగ్నం అయ్యాడు విశ్వాస్..
*********
మరుసటి రోజు.. రోజూ తనతో సంభాషించే కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని తెలిసి ఆ కుర్రాడిని చూడడానికి వెళ్ళాడు రుద్రుడు.
రుద్రుడు అక్కడికి రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు..
“రేయ్ కృష్ణా, తల్లితండ్రులు ఓ మాట అన్నారని ఈ విధంగా చేసుకోవడం బాగాలేదు రా. వాళ్ళు తప్పించి మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను చదువుకోమని ఎంతో చెప్పేది, కానీ నేను వినకుండా ఇలా తయ్యారు అయ్యాను.. నువ్వు అలా కాకూడదు మంచిగా వుండాలి రా..” అని ఏడుస్తూ అన్నాడు. రుద్రుడు ఆ విధంగా మాట్లాడటం చూసిన అక్కడున్న జనాలు కొంత సమయం నిశ్శబ్దంగా వుండి పోయారు.
ఇంతలో అక్కడకు వచ్చాడు విశ్వాస్.. విశ్వాస్ రాకతో రుద్రుడు ఆశ్చర్యపోతూ, “బాబు మీరు ఇక్కడ!..” అని అడిగాడు.
“నా స్నేహితుడు క్యాంప్ వెళ్ళాడు. ఒక నెల రోజులు ఇక్కడ వ్యవహారాలు చూసుకోమని చెప్పాడు. అందుకే ఉండిపోవలసి వచ్చింది.” అని అన్నాడు విశ్వాస్..
విశ్వాస్ ఆ మాట చెప్పడం తో రుద్రుడు లో తెలియని ఆనందం వికసించింది. కానీ అయిన వాళ్లకు దూరంగా వుండడం తాను చేసిన పాపానికి శిక్షగా భావించి, తన పాపానికి పరిష్కారం లేదని కుమిలిపోయాడు.
సమాప్తం..
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.
Comments