top of page

దెయ్యమంటే భయమే 

#DeyyamanteBhayame, #దెయ్యమంటేభయమే, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #దెయ్యం కథలు, #సస్పెన్స్

Deyyamante Bhayame - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 24/06/2025

దెయ్యమంటే భయమే  - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


పాడేరు ఏజన్సీ ప్రాంతం అది. ఎటుచూసినా దట్టమైన అడవి, పెద్ద చెట్లు, కొండలు, పక్షుల కిలకిలారావాలతో, జంతువుల అరుపులతో భయంకరంగా కనబడుతోంది. 


సాయంకాలమైంది. డ్యూటి పని మీద పాడేరు వచ్చిన సుదర్శనానికి గెస్టుహౌసు చేరేసరికి ఆలశ్యమైంది.. తన లగేజీ వెంట తెచ్చిన వాచ్ మేన్ ముసలయ్య గదంతా చీపురుతో శుభ్రం చేసి కూజాతో నీళ్లు నింపి టేబుల్ పక్కన పెట్టాడు. మంచం మీద దుప్పటి సరిచేసి దిండు ఉంచాడు. 

కిటికీ తలుపులు తెరిస్తే చల్లని గాలి గదంతా వీచింది. 


"తమరు కుర్చీలో కూకొండి, మా గూడెం హోటలు కాడ నుంచి వేడి టీ టిఫిను తీసుకొస్తా”నని సుదర్శన్ ఇచ్చిన యాబై రూపాయల నోటు తీసుకుని ఫ్లాస్కుతో ఎదురుగా

కొద్ది దూరంలో కనబడుతున్న గుడిసెల వైపు వెళ్లాడు వాచ్ మేన్ ముసలయ్య. 


కుర్చీలో కూచుని టేబుల్ పక్కన ఉన్న కూజాలో నీళ్లు గ్లాసుతో తాగుతు గదంతా కలియ చూసాడు సుదర్శనం. గదిలో ఒక వైపు పరుపుపై దుప్పటి తలగడ దిండు మరొక

దుప్పటి మడిచి కాళ్ల వైపున ఉంది. ఇంకోవైపు కిటికీని ఆనుకుని పెద్ద అల్మరా దాని పక్కన కర్ర టేబుల్, ఒక స్టీల్ కంచం బోర్లించి పైన స్టీల్ చెంచా ఉంది. గది మధ్యలో సీలింగ్ ఫేన్, గోడకి ట్యూబ్ లైట్ మరో వైపు నైట్ బల్బ్ ఉన్నాయి. లోపల స్నానానికి బాత్ రూం, ప్లాస్టిక్ బకెట్టు, 

మగ్గు ఉన్నాయి. కిటికీ లోంచి చూస్తే ఎదురుగా గూడెం, చుట్టూ పెద్ద చెట్లు ఆడవారు జుత్తు విరబోసినట్టు విస్తారమైన కొమ్మలతో ఆవరించి ఉన్నాయి. సాయంకాల మైనందున

పక్షులు అరుపులతో సందడి చేస్తున్నాయి. 


గది బయట వరండాలో వాచ్ మేన్ పడుకుంటాడు లాగుంది, ఒక చాప, దుప్పటి మడిచి ఉన్నాయి. 


"బాబూ, ఏడిగా చాయ్ తాగండి. రాత్రి భోజనానికి చపాతీలు, కూర పేకెట్టు కట్టించినాను. ఎంట బ్రెడ్డు కూడా తెచ్చినా. ఈరోజు గూడెంలో అంతా ఇచారంలో ఉన్నారు. మా గుడిసెకి ఆవల గుడిసెలో మొన్న రాత్రి ఒక ఆడది ఉరేసుకుని సచ్చిపోనాది" చెబుతుండగానే సుదర్శనం

కలగ చేసుకుని "ఎందుకు ఉరేసుకుం”దని సంశయం వెలిబుచ్చాడు. 


"అదాండి, ఆడు తిమ్మడున్నాడు సూడండి, ఎప్పుడూ తాగొచ్చి ఆలిని చితక్కొట్టడమే కాదు, బువ్వలో కోడి కూర పెట్టలేదని బూతులు తిడతాడు నాయాలు. రోజూ ఈడు పెట్టే యాతనలు భరించలేక అలిగి చీరతో మొన్న రాత్రి ఉరేసుకు సచ్చిపోనాది ఆ గుంటది. అది అలిగి దెయ్యమై గూడేన్ని భయపెడుతుందని అందరూ రాత్రి కంటి మీద కునుకు లేకుండా ఉన్నాము" అని వాచ్ మేన్ ముసలయ్య చెబుతూ "అయ్యా, ఈ రాత్రికి ఇక్కడ తొంగోలేను. మా యమ్మ పట్నమెల్లినాది. గుడిసెలో మా ఆడది ఒక్కతె తొంగోడానికి భయపడుతోంది. ఉదయం పెందల కాడ వచ్చి తమకి టీ, టిపిను తెచ్చి పెడతా”నని నమస్కారం పెట్టి వెళిపోయాడు ముసలయ్య. 


చేసేది లేక సుదర్శనం లైటు, ఫేన్ ఆన్ చేసి ముసలయ్య తెచ్చిన మషాల గారెలు తిని ఫ్లాస్కులో టీ గ్లాసులో పోసుకుని తాగేడు. కాలక్షేపానికి వెంట తెచ్చుకున్న మేగజైన్లు చదువుతు ఎనిమిదవగానే పేకెట్టు విప్పి చపాతీలు, కూరతో రాత్రి భోజనం కావించి పదవగానే లుంగీ చుట్టి బనీనుతో ట్యూబ్ లైటు ఆర్పి నైట్ బల్బు ఆన్ చేసి దుప్పటి కప్పుకుని మంచం మీద పడుకున్నాడు. 


కొత్త ప్రదేశం, ముసలయ్య చెప్పిన గూడెంలో ఆడామె బలవంతపు మరణం తలుచుకుంటు ఎప్పుడో నిద్ర పట్టింది. ఒక్కసారిగా గాలి విసురుకి కిటికీ తలుపులు కొట్టు కోవడంతో

మెలకువ వచ్చిన సుదర్శనానికి గదంతా చీకటిగా కనిపించింది.

 

కరెంటు పోయినట్టుంది. నైట్ బల్బు, ఫేను ఆగిపోయాయి. సుదర్సనం గుండె గుభేల్మంది. మెల్లగా లేచి కిటికీ తలుపులు మూసి లోపల గడియ పెట్టి మంచం మీద పడుకున్నాడు. 

ఎదురుగా అల్మెరా మీద చీకటిలో ఏవో రెండు చిన్న దీపాల్లా మెరుస్తూ కనిపించాయి. 


సుదర్శనానికి చెమటలు పడుతున్నాయి. ఒక వేళ గూడెంలో ఉరి వేసుకు చనిపోయిన ఆడామె దెయ్యంగా ఇక్కడికి వచ్చిందేమోనని తలుచుకుని వణికి పోతున్నాడు. ఆ దీపాలు ఒక్కొక్కసారి వెలిగి ఆరుతున్నాయి. 


సుదర్శనానికి ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. దుప్పటి మొహం వరకు కప్పుకుని భయంతో బిత్తరి చూపులు చూస్తున్నాడు. అప్పటికే తెల్లవారుతున్నట్టు పక్షులు అరుస్తున్నాయి. ఇంతలో ఒక్కసారిగా కరెంటు వచ్చి నైటు బల్బు వెలిగి ఫేన్ తిరగడం మొదలైంది. బల్బు వెలుగులో వెలిగి ఆరుతున్న దీపాల వైపు చూస్తే అల్మరా మీద నల్లటి గండు పిల్లి కూర్చుని గది నాలుగు వైపుల చూస్తోంది. లైటు కాంతి చూసి నల్ల పిల్లి ఒక్కసారిగా బీరువా మీద నుంచి దూకి బాత్రూం వెనక కిటికీ నుంచి దూకి పారిపోయింది. 


హమ్మయ్య, చీకటిలో కొరివి దెయ్యంలా భయ పెట్టింది ఈ గండు పిల్లనుకుని ధైర్యం తెచ్చుకున్నాడు సుదర్శనం. ఇంతలో వాచ్ మెన్ ముసలయ్య తలుపు తడుతున్నాడు 


తలుపు తీస్తే ఎదురుగా ముసలయ్యను చూడగానే కొండంత ధైర్యం వచ్చింది. రాత్రి జరిగిన సంఘటన విన్న ముసలయ్య "సారూ, ఈరోజు మా అమ్మ గూడేనికి తిరిగి వస్తది. ఇకనుంచి నేనే తమకి సాయంగా ఉంటాను" అని ఫ్లాస్కు తీసుకుని హోటలుకి బయలుదేరాడు. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page