top of page

వీభోవరా - పార్ట్ 4

Updated: Jun 29

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika


Veebhovara - Part 4 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 22/06/2025

వీభోవరా - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. 

ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. 

కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. 

గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. రామశర్మ, మాధవి దంపతులకు ఆడ, మగ కవలలు పుడతారు.


ఇక వీభోవరా - పార్ట్ 4 చదవండి.. 


పుట్టిన కవలలు, ఆడబిడ్డకు రుద్రమ అని, మగబిడ్డకు భాస్కర శర్మ అని, నామకరణం చేశారు రామశర్మ.


సుఖప్రసవం, కవలపిల్లలు ఆడా మగా కలగడం, విజయ్ తమ ఇంటికి వచ్చిన మంచి వేళా విశేషం అని, రామశర్మ, మాధవీలు ఎంతగానో సంతోషించారు. కాలగతిలో రెండు సంవత్సరాలు రెండు క్షణాలుగా వారందరికీ ఎంతో ఆనందంగా గడిచిపోయాయి.


ప్రాథమిక పాఠశాల మాధ్యమిక పాఠశాలగా మారిపోయింది. రామశర్మ హెడ్ మాస్టర్ అయినారు. రామశర్మ ఇద్దరు పెద్ద కొడుకులకు, కేవలం చదువు విషయంలోనే కాకుండా అన్ని ఆటలలో శిక్షణను కల్పించారు. వేసవి శలవల్లో రామశర్మ కొందరు విద్యార్థులతో అమరావతిని దర్శించేదానికి బయలుదేరారు. అక్కడ వున్న అమరలింగేశ్వర ఆలయాన్ని దర్శించారు. అమరావతి కృష్ణానది తీరాన కుడివైపున ఉన్న ఒక గ్రామం. గుంటూరు జిల్లా.


 చాలా దూరాన్నించి (నెల్లూరు జిల్లా) ఆ ప్రాంతానికి వెళ్ళిన రామశర్మ, మరో నలుగురు ఉపాధ్యాయులు పాతికమంది పిల్లలను ఆ గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు గారు ఎంతో ఆదరంగా పలుకరించి, ఆలయాన్ని చూపించి ఒక రాత్రి వారంతా ఉండేదానికి బసను ఏర్పాటు చేసి అన్నపానీయాలను సమకూర్చారు. 


కారణం, వారు చాలామంచి మనిషి. చక్కటి ఆశయాలుకల వ్యక్తి. వారి ఆప్యాయత అనురాగాలకు రామశర్మ మిగతా టీచర్లు, పిల్లలూ ఎంతగానో ఆనందించారు.


కొంతకాలం క్రిందట కృష్ణానది పొంగి ఆ ప్రాంతంలోని అనేక పల్లపు ప్రాంతాలను ఇసుక దిబ్బలతో కప్పేసింది. పురాతన వస్తు పరిశోధనా శాఖ వారు త్రవ్విన త్రవ్వకాలలో అక్కడ లభించిన శాసనాల వలన బ్రహ్మి లిపి నుండి తెలుగు లిపి ఏర్పడిన పరిణామ క్రమంలోని తొలి నాలుగు దశలను తెలుపుతాయి. శాసనాలు శిల్పాలు స్థానిక పురావస్తు ప్రదర్శన శాలలో కొన్ని, చెన్నై పురావస్తు ప్రదర్శన శాలలో ప్రాచీన ఆంధ్రుల సంస్కృతిని భద్రపరిచారు.


ఆంధ్రదేశంలో ముఖ్యంగా కృష్ణానది లోయలో బౌద్ధ మతము మౌర్యుల కాలం నుండీ వర్థిల్లినది. అమరావతికి మరో పేరు ధరణకోట. ఇది ప్రాచీనకాలంలో అంటే 2వ శతాబ్దంలో (BCE) శాతవాహనరాజుల ఒక రాజధాని. వారి తర్వాత పల్లవ రాజులు. వారంతా శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని, శ్రీ కృష్ణ మందిరాన్ని, శ్రీ అంబదేవి ఆలయాన్ని అమరేశ్వర శివాలయాన్ని దర్శించారు. పురావస్తు ప్రదర్శనశాలలో భూమినుండి త్రవ్వి తియ్యబడ్డ పురాతన వస్తువులను ఆనందంగా చూచారు.


అందరి మనస్సున ఒకే మాట, మన పూర్వీకులు ఎంతటి నేర్పరులన్నది. 

తరువాత వారు సర్పంచ్ వెంకటేశ్వర రావు గారికి కృతజ్ఞతలను తెలియజేసి.... విజయవాడకు చేరారు.


అందరూ కృష్ణానదిలో స్నానం చేసి ’కనకదుర్గమ్మ తల్లి, దర్శనానికి బయలుదేరారు. ఆ తల్లి ఆలయం కృష్ణానది ఉత్తరపు వైపున ఇంద్రకీలాద్రి పర్వతం పైన వుంది. అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు వుంటుంది. మిరుమిట్లుగొలిపే బంగారు ఆభరణాలు, ఎన్నో పూలతో ఎంతో అందంగా అలంకరింపబడి ఉంటుంది. 


మాతమూర్తికి ఎనిమిది చేతులు వున్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం వుంటుంది. ఇక్కడ మాత స్వయంభువుగా వెలసినదని క్షేత్రపురాణ వివరణ. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ దేశ పర్యటనలో అమ్మవారిని దర్శించి, అక్కడ శ్రీ చక్ర ప్రతిష్టను చేశారని చరిత్ర. రాక్షస బాధను భరించలేక ఇంద్రకీలుడనే మహాఋషి దుర్గామాతను గురించి తపస్సు చేసి, అమ్మవారిని తనపై నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరింది. అర్జునుడు ఈ కొండపై మాత సమక్షంలో శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి.


ఆ దుర్గాదేవి అమ్మవారు ప్రతి సంవత్సరము గొప్పగా నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది అవతారాలతో భక్త జనులకు దర్శనాన్ని ఇస్తారు.

మొదటిరోజు :- స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి

రెండవరోజు :- బాలా త్రిపుర సుందరి దేవి

మూడవ రోజు :- గాయత్రి దేవి

నాల్గవ రోజు :- అన్నపూర్ణా దేవి 

ఐదవ రోజు :- లలితా త్రిపుర సుందరి దేవి. 

ఆరవరోజు :- సరస్వతి దేవి

ఏడవ రోజు :- దుర్గాదేవి

ఎనిమిదవ రోజు :- మహాలక్ష్మి దేవి

తొమ్మిదవ రోజు :- మహిషాసుర మర్ధిని దేవి

పదవ రోజు :- రాజరాజేశ్వరి దేవి


అమ్మవారి ఆరవరోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము, అమ్మవారి జన్మ నక్షత్రంగా ’మూల నక్షత్రం’గా భావిస్తారు.


దేశపు అన్నివైపుల నుండి ఆస్థికులు ఈ మాతను దర్శించుటకు వస్తారు.


రామశర్మ, మిగతా టీచర్లు పిల్లలు ఆ జగన్మాతను దర్శించి తమ తమ విన్నపాలను తెలుపుకొన్నారు. ఎవరికైనా కావలసినది ఇచ్చేది మన అమ్మ. ఆ మాతే కదా!....

మాతదర్శనం అయిన తరువాత అందరూ మండపంలో ఒక ప్రక్కన కూర్చున్నారు. 

ఒక సాధువు మాతను దర్శించి వారిని సమీపించాడు చిరునవ్వుతో వారికి కొంతదూరంలో కూర్చొన్నాడు.


అందరినీ పరీక్షగా చూచాడు.

కాశ్యప్, విజయ్ శర్మలను చూచి చేతితో దగ్గరకు రమ్మని సౌంజ్ఞ చేశాడు.

ఇరువురూ రామశర్మ వైపు ప్రశ్నార్థకంగా చూచారు. 

రామశర్మ నవ్వుతూ "వెళ్ళండి....." అన్నాడు.


కాశ్యప్, విజయ్‍లు వారిని సమీపించారు. గౌరవంగా చేతులు జోడించారు.

సాధువు వారిని కూర్చోమన్నాడు.

ఇరువురూ వారి ముందు కూర్చున్నారు.


వారు.... కాశ్యప్, విజయ్‍ల ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. చిరునవ్వుతో తన కుడి చేతిని ముందు విజయ శర్మ తలపైన వుంచి, చిరునవ్వుతో పలుకులేకుండా దీవించాడు. తరువాత కాశ్యప్ శర్మ తలపై వుంచి ’దుష్ట శిక్షణ ధర్మ రక్షణ.... చేస్తావు విభోవరా" నవ్వుతూ చెప్పాడు ఆ సాధువు.


"మరి నేను స్వామీ!....." ఆత్రంగా అడిగాడు విజయశర్మ.


"నీవు లేనిదే అతడు లేడు స్వామీ!...." నవ్వుతూ చెప్పారు ఆ యోగి.


ఇరువురూ ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు ఆశ్చర్యంతో.

"స్వామీ!...." అప్రయత్నంగా విజయశర్మ పెదాలు కదిలాయి.


"అవునయ్యా!. మీ ఇరువురూ ఘనచరితులౌతారు" తన కుడి చేతితో వారి తలలను తాకాడు.


ఆ సన్నివేశాన్ని చూచి రామశర్మ వారిని సమీపించాడు. డెభ్భై ఐదు సంవత్సరాల ఆ సాధువుకు చేతులు జోడించి నమస్కరించాడు. 

"నేను వీరి....." రామశర్మ పూర్తి చేయకముందే.....

"తండ్రిగారు!...." చిరునవ్వుతో చెప్పారు ఆ యోగి.


"అవును స్వామీ!...."


"ఒకడు రక్త సంబంధం... మరొకరు మానవతావాద సంబంధం. ఇరువురూ నీకు రెండు నయనాల వంటివారు కదూ!...." నవ్వుతూ అడిగాడు సాధువు. 


కొన్ని క్షణాల తర్వాత.....

"అంతా ఆ పైవాడి లీల..... ఎవరిని ఎవరితో ఎందుకు కలుపుతాడో!.... అంతా వారి నిర్దేశం...." అన్నాడు యోగి.


"స్వామీ!..... పిల్లలిరువురూ!...."


"చాలా గొప్పవారు అవుతారు. హైందవరకు, సత్యధర్మాలను, నీతి న్యాయాలకు, దుష్ట శిక్షణ, ధర్మ రక్షణకు నాయకులౌతారు" నవ్వుతూ లేచి రామశర్మను చేయి ఎత్తి ఆశీర్వదించి ముందుకు వేగంగా నడిచిపోయారు ఆ స్వామీజి.


మిగతా టీచర్లు పిల్లలు లేచి వారిని సమీపించారు.

రామశర్మకు ఏదో మైకం.... కళ్ళు మూసికొన్నాడు.

తోటి సీనియర్ మాస్టరు బలరామశాస్త్రి.....

"సార్!...." మెల్లగా పిలిచాడు.


రామశర్మ కళ్ళు తెరిచి వారినందరినీ చూచాడు.

"ఆఁ.... పదండి." తాను ముందుగా మెట్లవైపుకు నడిచాడు.


కాశ్యప్, విజయ్ మాస్టర్లు మిగతా పిల్లలూ వారిని అనుసరించారు.

అక్కడినుండి వారు మంగళగిరికి బయలుదేరారు. ఆలయ ప్రవేశానంతరం రామశర్మ పిల్లలను ఉద్దేశించి ఇలా చెప్పారు.


"మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచినది. అదే గుంటూరు జిల్లాలో వుండి మన దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రశస్తమైన శ్రీ మహా విష్ణువుకు ఎనిమిది పవిత్ర ఆలయాలు వున్నాయి.


ఆ లక్ష్మీ నరసింహ ఆలయాన్ని పాండవ పెద్ద సోదరుడు యుద్ధీష్టరుడు స్థాపించాడని జనవాక్యం. ఆలయ చరిత్ర పురాతన హిందూ మత గ్రంథాలలో ఒకటైన బ్రహ్మ వైవర్త పురాణంలో నమోదు చేయబడి వుంది. ఆ ఆలయాన్ని విజయనగర పాలకులు (రాజులు) పోషించారు. ఆలయాన్ని సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయులు కాలం నాటి శాసనం ఆలయ పరిధిలో ఉంది. ఆలయం యొక్క పదకొండు అంతస్థుల గాలి గోపురాన్ని జమీందారీ పోషకుడు మరియు నరసింహస్వామి భక్తుడైన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించారు శ్రీ మహావిష్ణుమూర్తి మిగతా ఏడు ఆలయాల వివరణ.


1. తిరువనంతపురం (కేరళ) శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం

2. గురువాయూర్ (కేరళ) శ్రీ కృష్ణ దేవాలయం

3. శ్రీరంగం (తమిళనాడు) శ్రీ రంగనాథస్వామి దేవాలయం

4. మైలై (తమిళనాడు) శ్రీ విష్ణు దేవాలయం

5. చెన్నై (తమిళనాడు) శ్రీ పార్థసారధి దేవాలయం

6. తిరుపతి తిరుమల (ఆంధ్ర) శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం

7. సింహాచలం (ఆంధ్రా) శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

8. మంగళగిరి (2) (ఆంధ్రా)

1. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి

2. పానకాల నరశింహస్వామి 

( పై దేవాలయ క్రింది భాగంలో) గండాల నరశింహస్వామి (కొండ శిఖరాన)


ఆయా ఆలయమూర్తుల పేర్లు వేరుగా వున్నా, ఆ నామాలన్నీ శ్రీ హరి విష్ణుమూర్తికి చెందినవే.

"పిలల్లూ! మీరంతా స్వామివారిని భక్తితో దర్శించండి. మీ విన్నపాలను తెలియజేయండి. ఆ జగత్ రక్షకుని కరుణా కటాక్షం మీ అందరికీ లభిస్తుంది. మీరంతా బాగా ఎదిగి పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో ఉన్నతికి రావాలన్నది నా ఆకాంక్ష." రామశర్మ హెడ్‍మాస్టర్ గారు చెప్పడం ఆపేశారు.


విద్యార్థులు టీచర్లు వరుసగా ప్రధాన ఆలయాన్ని, మిగతా రెండు ఆలయాలను దర్శించారు. వారి వారి కోర్కెలను దైవానికి విన్నవించుకొన్నారు. తీర్థ ప్రసాదాలను ఆరగించారు.

ఆనందంగా యాత్రను ముగించుకొని స్వస్థలానికి బయలుదేరారు. 

=======================================================================

ఇంకా వుంది..

వీభోవరా - పార్ట్ 5 త్వరలో

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page